సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

భౌతిక శాస్త్రవేత్త
(ఎస్.చంద్రశేఖర్ నుండి దారిమార్పు చెందింది)

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (తమిళం: சுப்பிரமணியன் சந்திரசேகர்) (అక్టోబర్ 19, 1910ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు (విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్ తో పంచుకున్నాడు). ఈ ఫౌలర్ చంద్రశేఖర్ పి. ఎచ్. డి పట్టా కొరకు చేసిన ప్రయత్నానికి దిశానిర్దేశకుడు కాదు; ఆయన ఆర్. ఎచ్. ఫౌలర్. ఇతని పినతండ్రి ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది.[1]

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
జననం(1910-10-19)1910 అక్టోబరు 19
లాహోర్, పంజాబ్, British India
మరణం1995 ఆగస్టు 21(1995-08-21) (వయసు 84)
చికాగో, అమెరికా
జాతీయతఅవిభక్త భారతదేశం (1910-1947)
భారతదేశం (1947-1953)
అమెరికా (1953-1995)
రంగములుఅంతరిక్ష భౌతిక శాస్త్రం
వృత్తిసంస్థలుచికాగో విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జి
ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
పరిశోధనా సలహాదారుడు(లు)రాల్ఫ ఫౌలర్
డాక్టొరల్ విద్యార్థులుడొనాల్డ్ ఎడ్వర్డ్ ఓస్టర్‌బ్రోక్, Yavuz Nutku
ప్రసిద్ధిచంద్రశేఖర్ అవధి
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1983)
కోప్లే మెడల్ (1984)
నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ (1967)

బాల్యం

మార్చు

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1910 అక్టోబరు 19 - 1995 ఆగస్టు 21) అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది), లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మికి చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ కి పుట్టిన పదిమంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ గా లాహోర్లో పనిచేస్తున్నపుడు చంద్రశేఖర్ జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం తమిళనాడుకు చెందినదే. ఆయన చిన్నతనంలో తల్లి దగ్గర చదువుకున్నాడు. తల్లి హెన్రిక్ ఇబ్సెన్ రాసిన “ద డాల్స్ హౌస్” అనే నాటికని తమిళంలోకి అనువదించిన విదుషీమణి. ఆయన చదువు కోసం కుటుంబం 1922లో చెన్నైకి మారింది.

చంద్రశేఖర్ (ఇటుపైన చంద్ర) పినతండ్రి భౌతిక శాస్త్రంలో, 1930 లో, నోబెల్ బహుమానం అందుకున్న సర్ సి. వి. రామన్! వైణిక విద్వాంసురాలు, సంగీత అకాడమీ అవార్డు గ్రహీత విద్యా శంకర్ ఇతని సోదరి. చంద్రశేఖర్ తాత రామనాథన్ చంద్రశేఖర్, విశాఖపట్నంలోని మిసెస్ ఎ. వి. ఎన్. కాలేజీలో గణిత ఆచార్యుడుగా పని చేసేరు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పుట్టిన సంవత్సరమే ఆయన పరమపదించేరు. తాత వదలిపెట్టిన గణిత గ్రంథాలని చంద్ర ఎంతో అపురూపంగా జీవితాంతం దాచుకున్నారు.

విద్యాభ్యాసం

మార్చు

అభిజాత్యమో, కావేరి నీళ్ల మహిమో తెలీదు కానీ చంద్రశేఖర్ బాల్యంలోనే పరిమళించేడు. చంద్ర చెన్నైలోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో బీయెస్సీ ఆనర్స్ పట్టా పొందాడు. అప్పటికే అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి పుట్టింది. విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు.

పదిహేను సంవత్సరాల పిన్న వయస్సులోనే, ఇంకా విద్యార్థిగా ఉండగానే, తన మొట్టమొదటి పరిశోధనా పత్రం 1929 లోప్రచురించేడు. ఈ పత్రం యొక్క ప్రత్యేకత అవాగాహన అవాలంటే ఆనాటి విద్వత్ వాతావరణం అర్థం కావాలి. కాంప్టన్ ప్రభావం (Compton Effect) అనే దృగ్విషయం 1923 లో ఆవిష్కరించబడింది. అందుకని కాంప్టన్ కి 1927 లో నోబెల్ బహుమానం వచ్చింది. ఒక “కొత్త గణాంక పద్ధతి” అంటూ 1926 లో ఫెర్మీ, డిరాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక పత్రం ప్రచురించేరు. ఈ కొత్త గణాంక పద్ధతిని (ఇప్పుడు దీనిని ఫెర్మీ- డిరాక్ గణాంకాలు అంటున్నారు) వెనువెంటనే ఉపయోగించి, ఆర్. ఎచ్. ఫౌలర్ అనే ఆసామీ ఒక నక్షత్రం కూలిపోయి, శ్వేత కుబ్జ తార (white dwarf) గా ఎలా మారుతుందో 1926 లో భాష్యం చెప్పేడు. ఈ కొత్త గణాంక పద్ధతి వాడి సోమర్ఫెల్డ్ అనే వ్యక్తి లోహాలలో ఎలక్^ట్రానుల ప్రవర్తన మీద ఒక వ్యాఖ్యానం రాసేడు. రాసి, మద్రాసు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చేడు. ఆ ఉపన్యాసం విన్న పందొమ్మిదేళ్ళ చంద్రశేఖర్ ప్రభావితుడై, “కొత్త గణాంక పద్ధతి దృష్టితో కాంప్టన్ ప్రభావం” అనే పరిశోధనా పత్రం ప్రచురించేడు. ఈ పత్రం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫౌలర్ కంట పడింది. ఫౌలర్ సిఫార్సుతో చంద్రశేఖర్ కి ట్రినిటి కాలేజిలో ప్రవేశం లభించింది. ఇటు BSc (Hons) పట్టా పుచ్చుకున్నాడో లేదో అటు పెద్ద చదువులకని 1930 లో - 19 ఏళ్ల ప్రాయంలో) ఇంగ్లండ్ ప్రయాణం అయి వెళ్ళిపోయేడు.

పడవలో ప్రయాణం చేసేవారి కాలక్షేపానికి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. మద్యపానీయాలు, ఆటలు, అమ్మాయిలు - ఒకటేమిటి? తోటి భారతీయ విద్యార్థులు ఈ కాలక్షేపపు వసతులని వినియోగించుకోడానికి ఉబలాట పడుతూ ఉంటే చంద్రశేఖర్ కాగితం, కలం తీసుకుని, నక్షత్రం కూలిపోయి శ్వేత కుబ్జతారగా మారే సందర్భాన్ని వర్ణిస్తూ కొన్ని గణిత సమీకరణాలు రాసి, వాటిని పరిష్కరించి చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ సమీకరణాలు గొంతెత్తి ఒక విషయాన్ని చెప్పేయి ఆయనకి. ఏమిటా విషయం? ఒక శ్వేత కుబ్జతార లోని పదార్థం (లేదా ఆ నక్షత్రపు గరిమ) ఒక అవధిని మించితే ఆ నక్షత్రం తన గురుత్వ ఆకర్షణ శక్తుల ప్రభావానికి కూలిపోయి (gravitational collapse), మరొక రకం నక్షత్రంగా మారిపోతుంది. ఏ రకం తారగా మారిపోతుంది? న్యూట్రాన్ తారగా కానీ, కర్రి బిలం (black hole) గా కాని. ఆ రోజులలో కర్రి బిలం (కృష్ణ బిలం) అనే భావన ఊహామాత్రంగా ఉండడం ఉంది కానీ సిద్దాంత పరంగా కానీ, ప్రయోగికంగా కానీ రుజువు కాలేదు. కనుక గణిత సమీకరణాలు చెబుతున్న వర్తమానం ఆయనకే మింగుడు పడలేదు. గణితాన్ని గుడ్డిగా నమ్మడమా? లేక ….

ఉన్నత విద్య

మార్చు

సమీకరణాలు, సిద్దాంతాలు చెప్పినవి అన్ని ఎలా నమ్మేస్తాం? రుజువు ఉండొద్దూ? ప్రత్యక్ష ప్రమాణం కావాలంటే ఆకాశంలో వెతకాలి. ఎన్నని వెతుకుతాం? ఎక్కడని వెతుకుతాం? తన ఊహ సరి అయినదే అన్న నమ్మకం చంద్రశేఖర్ కి ఉంది కానీ తన గణితం బందోబస్తుగా ఉందో లేదో? ఇంగ్లండు వెళ్లిన తరువాత మరొక మూడేళ్లు శ్రమించి, తన సిద్దాంతానికి, సమీకరణాలకి మెరుగులు దిద్దుతూ, 1933 లో పి. ఎచ్. డి పట్టా సంపాదించేడు. ఈ సమయంలోనే భౌతిక శాస్త్రంలో దిగ్గజాలనదగ్గ డిరాక్, బోర్ ప్రభృతులతో పరిచయాలు కలిగేయి.

దూషణ, తిరస్కార, అవమానాలు

మార్చు

తరువాత చంద్రశేఖర్ కి సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనే వేత్తతో పరిచయం అయింది. అయన సమక్షంలో, ఒక సమావేశంలో తాను సాధించిన ఫలితాలని ప్రకటిస్తున్న సందర్భంలో ఎడింగ్టన్ - అందరి ఎదుట - చంద్రశేఖర్ ప్రతిపాదిస్తున్న అవధిని అవహేళన చేసేడు. ఈ ఫలితం మీద పరిపూర్ణ నమ్మకం లేకపోతే ఆ విషయాన్ని చంద్రశేఖర్ తో ముఖస్థంగా ముచ్చటించటానికి ఎడింగ్టన్ కి అవకాశాలు ఉన్నాయి. కానీ అయన ఆ అవకాశాలని విస్మరించి, చంద్రశేఖర్ ని నలుగురిలోనూ, విద్వత్ సభలో, హేళన చెయ్యడానికే సమకట్టుకున్నాడు.

ఎడింగ్టన్ సామాన్యుడా? అయిన్^స్టయిన్ సిద్దాంతాలని రుజువు చెయ్యడానికి సంపూర్ణ సూర్యగ్రహణం వేళప్పుడు పెద్ద ఎత్తున ప్రయోగం చేసి మన్ననలు అందుకున్న వ్యక్తి. (దరిమిలా ఎడింగ్టన్ చేసిన ప్రయోగంలో ఆర్భాటం పాలు ఎక్కువ, దక్కిన ఫలితాలలో కచ్చితత్వం తక్కువ అని తేలింది, అది వేరే విషయం.) కనుక ఎడింగ్టన్ కి ఎదురు చెప్పి వయస్సులో చిన్నవాడైన చంద్రశేఖర్ ని సమర్ధించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. నలుగురిలోనూ జరిగిన ఈ పరాభవాన్ని తట్టుకోలేక చంద్రశేఖర్ దేశం వదలి, అమెరికా వెళ్లి, చేస్తున్న పరిశోధనాంశాల దిశ మార్చి, చికాగో విశ్వవిద్యాలయంలో భౌతిక విజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. పదవీ విరమణ చేసేవరకూ అక్కడే కొనసాగాడు. 1985లో పదవీ విరమణ అనంతరం విశ్రాంత ఆచార్యుడుగా (ఎమిరిటస్ ప్రొఫెసర్ గా) పనిచేశాడు.

అనుభవాతీతమైనది ఏది చెప్పినా సామాన్యులకి మింగుడు పడదు. కానీ ఇక్కడ చెప్పినవాడు చిన్నవాడు, విన్నవాడు దిగ్గజం లాంటి శాస్త్రవేత్త. ఆయిన్^స్టయిన్ చెప్పినది అనుభావాతీతమైనది అయినా నమ్మి, ప్రయోగాత్మకంగా రుజువు చెయ్యడానికి నడుం కట్టిన సమర్ధుడు. నమ్మశక్యం కాని విషయం సదస్సులోచర్చకి వచ్చినప్పుడు భేదాభిప్రాయాలు వెల్లడించడానికైనా ఒక సభామర్యాద పాటించాలి. కానీ ఇక్కడ భాష్యం చెబుతున్నది ఇంగ్లీషువాడి మోచేతి నీళ్లు తాగుతూ, కాలికింద పడి ఉండవలసిన భారతీయుడు! అందుకని కాబోలు గేలి చేసేడు, హేళన చేసేడు. ఇది జాత్యహంకారం తప్ప మరేమీ కాదని చంద్రశేఖర్ తనంత తానుగా తన జీవితచరిత్ర రాసిన ఆచార్య కామేశ్వర వాలికి చెప్పి బాధపడ్డారు.

బహుమానాలు, గుర్తింపులు

మార్చు

ప్రతి వ్యక్తి జీవితంలోను బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో కూడపరిణామ దశలుంటాయి. వీటిల్లో చెప్పుకోదగ్గ దశలు: అరుణ మహాతార (రెడ్‌జెయంట్‌), శ్వేత కుబ్జ తార ( వైట్‌డ్వార్ఫ్‌), బృహన్నవ్య తార (సూపర్‌నోవా), నూట్రాన్ తార,, కర్రి (కృష్ణ) బిలం (బ్లాక్‌హోల్‌) అనే దశలు ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్‌ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ పొందారు.

సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్‌ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్‌నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ చివరికి బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం) అయిపోతాయి.

ఈ నిజం నిలకడ మీద తేలిన తరువాత ఈ అవధికి “చంద్రశేఖర్ అవధి” అని పేరు పెట్టేరు. ఉదాహరణకి మన సూర్యుడు ఈ అవధి లోపునే ఉన్నాడు కాబట్టి సిద్దాంతం ప్రకారం సూర్యుడు శ్వేత కుబ్జ తారగా కూలడానికి అవకాశం లేదు. తరువాత అమెరికాలో నాసా వారు 1999 లో అంతరిక్షంలోకి పంపిన ఎక్స్-కిరణ వేధశాలకి “చంద్ర” అని నామకరణం చేసేరు. ఏదో “కించిత్ భోగో భవిష్యతి” అన్నట్లు.

చంద్రశేఖర్ కి నోబెల్ బహుమానం ఇచ్చినప్పుడు అయన 1930 దశకంలో చేసిన పనికి ఆ బహుమానం అని ప్రకటించారు. తరువాత నాలుగు దశాబ్దాలపాటు అయన చేసిన ప్రాథమిక పరిశోధనలు, సాధించిన ఫలితాలని మాట వరసకైనా ఉటంకించలేదని కూడా చంద్రశేఖర్ నొచ్చుకున్నారు. అదంతా బూడిదలో పోసిన పన్నీరేనా? నిజానికి చంద్రశేఖర్ అమెరికాలోఉన్న నాలుగు దశాబ్దాల కాలంలో నాలుగు వివిధ దిశలలో పరిపూర్ణమైన సాధికారతతో అపురూపమైన ఫలితాలని సాధించేరు. వీటిలో కనీసం ఒక్క రంగంలో చేసిన పనికైనా ఆయనకి మరొక నోబెల్ బహుమానం ఇవ్వవచ్చని పెద్దల అభిప్రాయం.

1966లో ఆయన అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందుకున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. ఆయన సేవలకుగాను నాసా ఒక పరిశోధన ప్రయోగశాలకు ఆయన పేరు పెట్టారు.

చంద్రశేఖర్ కి రావలసిన గుర్తింపు రాకపోవడం ఒకటైతే, వచ్చిన గుర్తింపు కూడా జీవితంలో చాలా ఆలస్యంగా రావడం మరొకటి. ఈ రెండూ మనస్సుని బాధ పెట్టే విషయాలు. చేసిన పని అంతటికి రావలసిన గుర్తింపు రాకపోవడానికి కారణం కొంతవరకు “స్వయంకృతాపరాథం” అని అనిపిస్తుంది. ఒకటి చంద్రశేఖర్ ఎంపిక చేసుకున్న పరిశోధనాంశాలు ముఖ్యమైనవి, క్లిష్టమైనవే కానీ అవి ఆ కాలానికి “ఫేషనబుల్” అంశాలు కావు. ఫెర్మి, డిరాక్, బోర్, హైజెన్బర్గ్ ప్రభృతులు చంద్రశేఖర్ కి బాగా పరిచయస్తులు. వారు చేస్తున్న ప్రాథమిక పరిశోధనలతో ప్రపంచం దద్దరిల్లిపోతోంది. ఆ ఫలితాలని వాడుకుని దైనందిన అవసరాలకి పనికొచ్చే అనువర్తిత రంగాల్లో కూడా పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని విస్మరించి ఎక్కడో నక్షత్రాలలో ఏమి జరుగుతొందో చేసే పని అంటే ఎంతమంది ఆకర్షితులు అవుతారు? వాటివల్ల ఈ భూలోకంలో ఉన్నవారికి ఏమిటి ప్రయోజనం? అంతే కాకుండా ఆ రోజులలో ఎక్కువ ఆదరణలో ఉన్న గుళిక యంత్రశాస్త్రం (quantum mechanics) లో పనిచేసిన వారికీ నోబెల్ బహుమానాలు ఇచ్చేవారు కానీ, నక్షత్ర భౌతిక శాస్త్రం (astrophysics) వంటి రంగాలలో ఇచ్చేవారు కాదు. దరిమిలా ఈ ఆచారంలో మార్పు వచ్చి నక్షత్ర భౌతిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమానాలు ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత చంద్రశేఖర్ కి రావలసిన గుర్తింపు వచ్చినట్లే కదా అని మనం సంతృప్తి పడాలి.

సంగ్రహం

మార్చు
  • 1929-39 అంతరిక్ష నిర్మాణం. చంద్రశేఖర్ పరిమితి, అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు
  • 1939-43 న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్‌ఫర్, ఋణాత్మక హైడ్రోజన్ ల క్వాంటమ్ సిద్ధాంతం
  • 1943-50 హైడ్రో డైనమిక్. హైడ్రో మాగ్నటిక్ స్థిరత్వం
  • 1950-69 ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతా స్థితి, స్థిరత్వాలు
  • 1971-83 కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం
  • 1980 గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం

నోబెల్ బహుమానానికి కారకాలు

మార్చు

నోబెల్ బహుమానం ఇచ్చినప్పుడు నోబెల్ సంస్థ ప్రత్యేకించి ఎత్తి చూపిన పరిశోధనా పత్రాలు ఈ దిగువ జాబితాలో చూపడం అయింది:

  • 'The highly collapsed configurations of a stellar mass', Mon. Not. Roy. Astron. Soc., 91, 456-66 (1931).
  • 'The maximum mass of ideal white dwarfs', Astrophys. J., 74, 81 - 2 (1931).
  • 'The density of white dwarfstars', Phil. Mag., 11, 592 - 96 (1931).
  • 'Some remarks on the state of matter in the interior of stars', Z. f. Astrophysik, 5, 321-27 (1932).
  • 'The physical state of matter in the interior of stars', Observatory, 57, 93 - 9 (1934)
  • 'Stellar configurations with degenerate cores', Observatory, 57, 373 - 77 (1934).
  • 'The highly collapsed configurations of a stellar mass' (second paper), Mon. Not. Roy. Astron. Soc., 95, 207 - 25 (1935).
  • 'Stellar configurations with degenerate cores', Mon. Not. Roy. Astron. Soc., 95, 226-60 (1935).
  • 'Stellar configurations with degenerate cores' (second paper), Mon. Not. Roy. Astron. Soc., 95, 676 - 93 (1935).
  • 'The pressure in the interior of a star', Mon. Not. Roy. Astron. Soc., 96, 644 - 47 (1936).
  • 'On the maximum possible central radiation pressure in a star of a given mass', Observatory, 59, 47 - 8 (1936).
  • 'Dynamical instability of gaseous masses approaching the Schwarzschild limit in general relativity', Phys. Rev. Lett., 12, 114 - 16 (1964); Erratum, Phys. Rev. Lett., 12, 437 - 38 (1964).
  • 'The dynamical instability of the white-dwarf configurations approaching the limiting mass' (with Robert F. Tooper), Astrophys. J., 139, 1396 - 98 (1964).
  • 'The dynamical instability of gaseous masses approaching the Schwarzschild limit in general relativity', Astrophys. J., 140, 417 - 33 (1964).
  • 'Solutions of two problems in the theory of gravitational radiation', Phys. Rev. Lett., 24, 611 - 15 (1970); Erratum, Phys. Rev. Lett., 24, 762 (1970).
  • 'The effect of graviational radiation on the secular stability of the Maclaurin spheroid', Astrophys. J., 161, 561 - 69

రచనలు

మార్చు

అంతరిక్ష శాస్త్రంలో ఆయన ఎనిమిదికి పైగా గ్రంథాలను ప్రచురించాడు.

వృద్ధాప్యంలో సైతం ఆయన న్యూటన్‌ సిద్ధాంతాలను విశ్లేషిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాసిన 'న్యూటన్‌ ప్రిన్సిపియా ఫర్‌ కామన్‌ రీడర్‌' సైన్స్‌ అభిరుచి ఉన్నవారందరూ చదవవలసిన పుస్తకం. చంద్ర ఎక్స్‌రే వేధశాల, చంద్రశేఖర్‌ సంఖ్య, గ్రహశకలం 1958 చంద్ర అనేవి ఆయన సేవలకు శాస్త్రలోకం అర్పించిన నివాళులకు గుర్తులు.

వివాహం

మార్చు

చంద్రశేఖర్ 1936, సెప్టెంబరులో లలితా దొరైస్వామిని వివాహమాడాడు. ఆమె ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయనకు జూనియర్. వీరికి సంతానం లేదు.

విశేషాలు

మార్చు

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. తారల పరిణామ దశలకు సంబంధించిన పరిశోధనల్లో 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా ఇప్పటికీ ఉపయోగపడుతున్న సిద్ధాంతాలను అందించిన చంద్రశేఖర్‌, ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచాడు.

పదవులు, పురస్కారాలు

మార్చు
  • 1952-71 అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర జర్నల్
  • 1955 న్యూటన్ సిద్ధాంతాల ప్రచురణ
  • 1966 అమెరికా జాతీయ విజ్ఞాన శాస్త్ర మెడల్
  • 1968 పద్మ విభాషణ్ పురస్కారం
  • 1983 భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం
  • 1984 కోప్లే మెడల్

ఆయన 1995 ఆగస్టు 21న షికాగోలో తన 85వ ఏట గుండెజబ్బుతో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. సాక్షి ఫన్‌డే డిసెంబరు 8, 2013 నోబెల్ ఇండియా.

{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}

[[వర్గం:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు]]