కొండపి మురళీకృష్ణ

కొండపి మురళీకృష్ణ కవి, గ్రంథరచయిత, శతాధిక అవధానాలను ప్రదర్శించిన వ్యక్తి.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1963, జూలై 23వ తేదీన ప్రకాశం జిల్లా తాటాకులపాలెం గ్రామంలో వరలక్ష్మమ్మ, వెంకటప్పయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను చందులూరు గ్రామంలో చదివాడు. తరువాత ఇంటర్మీడియట్, బి.ఎస్.సి గుంటూరు హిందూ కళాశాలలో చదివాడు. ఆ తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గణితంలో ఎమ్మెస్సీ డిగ్రీ పొందాడు. బేతవోలు రామబ్రహ్మం, ప్రసాదరాయ కులపతి ఇతని గురువులు. ఇతడు జీవిత భీమా సంస్థలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

అవధానాలు

మార్చు

ఇతడు 114కు పైగా అష్టావధానాలు, ఒక శతావధానం చేశాడు. బొబ్బిలి, విశాఖపట్నం, ఎలమంచిలి, రాజమండ్రి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్ల్లె, నర్సరావుపేట, చిలకలూరిపేట, చేజెర్ల, ఒంగోలు, అద్దంకి, చీరాల, ముండ్లమూరు, కావలి, నెల్లూరు, తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, హైదరాబాదు, వరంగల్లు, మెదక్, సిద్ధిపేట మొదలైన చొట్ల ఇతడు అవధానాలను దిగ్విజయంగా నిర్వహించాడు. కందుకూరులో శతావధానం చేశాడు.

ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని మచ్చుకు:

  • సమస్య:శవమై పోయెను శివుండు పాడగ ప్రశంసాగీతముల్ దేవతల్

పూరణ:

 దివినీ భూస్థలి పైకిదింప తన పాతివ్రత్య మి
మ్మవనిన్ బోధయొనర్పనెంచి యనసూయామాత చూపింప వై
భవ విన్యాసము, శ్రీ రమాధవునితో వాగీశుతో గూడి శై
శవమై పోయెను శివుండు పాడగ ప్రశంసాగీతముల్ దేవతల్

  • సమస్య: ముండాకోరు వసంతమున్ గనగ నిప్పుల్ గ్రక్కు చిత్తమ్మునన్

పూరణ:

చండాంశు ప్రతిభా సమాన విలసత్ చంద్రుండు తా దాచె హృ
ద్భాండమ్మందు విషాద పావక మహాజ్వాలన్ సతిన్ బాసి పా
షండీ భూతము గాగ నీ ప్రకృతి, వాసంతంబ! రాబోకు రా
ముండా కోరు వసంతమున్ గనగ నిప్పుల్ గ్రక్కు చిత్తమ్మునన్

  • దత్తపది: సారా - కల్లు - చికెను - మటను అనే పదాలతో వాణీ స్తుతి.

పూరణ:

ఇంతి! నిన్ మనసార నుతింతునమ్మ
పూలకల్లును బోలు పదాలనిమ్మ
తలచి కెందమ్మి పూల పూజల నొనర్తు
చిమ్మటను నేను, కాంతులనిమ్మ వాణి

  • న్యస్తాక్షరి: మొదటి పాదము మొదటి అక్షరము కా రెండవ పాదము రెండవ అక్షరము ళీ మూడవ పాదము మూడవ అక్షరము దా నాలుగవ పాదము నాలుగవ అక్షరము సు.

పూరణ:

కాళీమాతయె విగ్రహాకృతిని ఆకాశమ్మునే డిగ్గుచున్
నాళీకంబులబోలు హస్తములతో నందించె నాశీస్సు నా
కాళీదాసుని బోలు సత్కవియె భక్తశ్రేష్ఠుడై యుంట నే
లీలన్ భాసుర రమ్యదృశ్యమును వర్ణింతున్ వధానమ్మునన్

రచనలు

మార్చు
  • ప్రతీక్ష
  • ఏకలవ్య
  • ఆనందభారతి
  • సారస్వత మహేంద్రం
  • వసంత విజయం

బిరుదులు

మార్చు
  • అవధాన శిల్పి
  • అవధాన కిరీటి

మూలాలు

మార్చు
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 768–771.