కొడాలి కమలాంబ
కొడాలి కమలాంబ (కమలమ్మ) ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు, క్విట్ ఇండియా ఉధ్యమంలో పాల్గొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. సంఘ సంస్కర్త, హేతువాది.[1]
కొడాలి కమలాంబ | |
---|---|
స్థానిక పేరు | కమలమ్మ |
జననం | 1915 గుంటూరు జిల్లా మోపర్రు |
మరణం | 10 జులై 2014 |
ముఖ్యమైన సేవలు | విరామమెరుగని పురోగమనం,స్వీయ చరిత్ర |
భార్య / భర్త | కొడాలి కుటుంబరావు |
పిల్లలు | కుమారుడు ధర్మానందరావు. కుమార్తె సరళ |
తల్లిదండ్రులు | గోగినేని వెంకాయమ్మ, రామకోటయ్య |
బాల్యం, విద్య
మార్చుగుంటూరు జిల్లా మోపర్రులో 1915లో గోగినేని వెంకాయమ్మ, రామకోటయ్య దంపతులకు జన్మించారు. రామకోటయ్య మోపర్రు గ్రామంలోని పొలాలను అమ్మి వేసి చెరుకుపల్లి సమీప నడింపల్లి గ్రామాన పొలాలు కొని వ్యవసాయం చేసేవారు. కమలాంబ గారు నాలుగవ తరగతి వరకు నడింపల్లిలో చదివారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గ్రంథాలయానికి వెళ్లి గాంధీజీ ఆత్మకథ, గౌతమ బుద్ధుడు జీవిత చరిత్రలు చదివారు. వారిని అమితంగా ప్రభావితం చేసిన గ్రంథాలివే. వారికి చదువుకోవలేనని సంకల్పమున్నా సమీపంలో హై స్కూల్ లేకపోవడం వలన చదువు కొనసాగించలేక పోయారు. బాల్యంలో సంగీతం నేర్చుకున్నారు. తన 14 సంవత్సరాల ప్రాయం లోనే గాంధీజీ ప్రభావంతో ఖాదీ ప్రచారోద్యమంలో పాల్గొన్నారు. తరువాత ఆమె హిందీలో ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష లలో ఉత్తీర్ణులైనారు.
వివాహం, కుటుంబం
మార్చుకమలాంబకు పదహారవ సంవత్సరాన 1931లో మోపర్రు చెందిన కొడాలి కుటుంబరావు గారితో వివాహం జరిగింది. ఈమె కొడాలి కుటుంబరావు భార్యగా అందరికీ సుపరిచుతురాలు. ఆనాటి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు కల్లూరి చంద్రమౌళి గారు గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు వీరికి సమీప బంధువులు. వీరి ప్రోత్సాహంతో కమలాంబకు స్వాతంత్ర్య సమరంపై అనురక్తి కలిగింది.
మోపఱ్ఱు గ్రామంలో ఆమె హిందీ చదివి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష లలో ఉత్తీర్ణులైనారు. 1946లో గాంధీజీ నుండి కమలాంబ గారు రాష్ట్ర విశారద పట్టాను పొందారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇద్దరు సంతానం. కుమారుని డాక్టర్ చదివించారు. కుమార్తెను యం.యస్సీ చదివించారు.
స్వతంత్ర సంగ్రామంలో
మార్చుస్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మోపర్రు గ్రామంలో కమలాంబ ఖాదీ ప్రచారోద్యమంలో పాల్గొన్నారు. స్వయంగా రాట్నాలపై నూలు వడకి తయారు చేసి చీరలు నేయించి వాటిని ధరించేవారు. హరిజనవాడలో రాట్నాలు ఏర్పాటు చేయించారు. గ్రామ హరిజనవాడలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. సింగంపల్లి సుబ్బారావు ప్రారంభించిన “జాతి భేద నిర్మూలన “ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
1940లో గాంధీ గారికి ఉత్తరం వ్రాసి అనుమతి పొంది మోపర్రు గ్రామం మధ్యన ఒక నెల రోజుల పాటు హనుమాయమ్మతో పాటు కాంగ్రెస్ జెండాతో వ్యక్తి సత్యాగ్రహం చేశారు. "ఈ క్షణం నుండి ప్రతి భారతీయుడు స్వతంత్రుడు. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి" అనే గాంధీజీ పిలుపు కమలాంబగారిని క్విట్ ఇండియా ఉద్యమం లోకి కదలించింది.
ఆందోళనలో భాగంగా 1942 సెక్టంబర్ 19వ తేదిన తెనాలిలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.గుత్తికొండ రామబ్రహ్మం, కల్లూరి తులశమ్మ. చిట్టూరి అన్నపూర్ణమ్మ, శాంత అనే మహిళలతో కలసి కోర్ట్ వద్ద పికెటింగ్ చేశారు. ఆ ఉద్యమ సమయంలో జరిగిన పోలిసు కాల్పులలో ఎడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. పోలీసులు కేసు నమోదు చేయగా మేజిస్ట్రేట్ కమలాంబ గారికి 16 నెలల కఠిన కారాగార శిక్షను విధించారు, ఆమె రాయవెల్లూరు స్త్రీల కారాగారంలో దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవించారు. చెరసాలలో అధికారుల కళ్ళు గప్పి1943 జనవరి 26 న జాతీయ జెండాను తయారుచేసి దానిని జైల్లో వేప చెట్టుపై ఎగురవేసారు, ఈ చర్యతో ఆమె పొలీసుల ఆగ్రహానికి గురయ్యారు. ఆనాడు ఆమెతో పాటు జైలు జీవితం గడిపిన తోటి ఉద్యమకారులు తుమ్మల దుర్గాంబ, కల్లూరి తులశమ్మ, కంచర్ల మాణిక్యం, బోళ్ళ సీతారావమ్మ గార్ల సహకారంతో ఉద్యమాన్ని కొనసాగించారు. అప్పటి నుండి ఆమెను జండా కమాలమ్మగా పిలిచేవారు.
1945లో విశాఖ పట్నం లోజరిగిన కాంగ్రెస్ సమావేశంలో కల్లూరి చంద్రమౌళి గారితో పాటు వెళ్ళి నెహ్రూ, పట్టాభి వంటి జాతీయ నాయకులతో సమాలోచనలలో జరిపింది.1946లో గాంధీజీ యడ్లపల్లి వచ్చిన్నపుడు వారిని కలసి స్ఫూర్తిని పొందారు. తన వంటిపై ఉన్న బంగారు అభరణాలను అన్ని తీసి స్వరాజ్య సాధనకు గాంధీ గారికి ఇచ్చింది. ఆనాటి నుండి స్త్రీలకు అతి ప్రీతి పాత్రమైన నగలను ధరించటం మానివేసింది. చేబ్రోలు గ్రామంలో మహిళా శిక్షణ నిర్వహించిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి పాఠశాలలో పాల్గొన్నారు. భారతి దేవి రంగా పరిచయంతో నిడుబ్రొలులో ఆచార్య రంగా ఆధ్వర్యంలో నడుస్తున్న రాజకీయ పాఠశాలలోను, కావురు వినయాశ్రమం లోనూ శిక్షణ తీసుకున్నారు.అక్కడనుండి అనేక జాతీయోద్యమ కార్యక్రమాల్లో చురుగా పాల్గొన్నారు.
సంఘసేవలో
మార్చుస్వాతంత్ర్యానంతరం ఆంధ్ర రాష్త్ర ప్రభుత్వం స్వాతంత్ర్య యోధులకు 5 ఎకరాలు మాగాణి లేదా 10 ఎకరాలు మెట్ట భూమిని పంపిణి చేస్తుంటే తాను దేశ స్వాతంత్ర్యం కొరకు నిస్వార్దంగా, నిదారంభంగా పనిచేసానని చెప్పి తృణీకరించింది. అంధ విశ్వాసాలను వ్యతిరేకించింది,
ఆచారం, సాంప్రదాయం అంటూ భర్త చనిపోయిన స్త్రీలను పెద్ద కర్మ రోజున విధవను చేసే పద్ధతి ఉండేది. భర్త పోయిన దుఖంలో ఉన్న స్త్రీలను ఇలా ఆచారాల పేరుతో వేదించడం, మానసికంగా హింసించడం అనాచారమని దానిని ప్రతిఘటించాలని కమలాంబ ఆలోచించారు. ఇటువంటి అనాచారాన్ని మానుకోవాలని పిలుపునిచ్చి, అలాంటి సందర్భాలలో బంధువుల, ఇతరుల ఇళ్ళకు వెళ్ళి వారికి నచ్చజెప్పి ఆ పని మానిపించేవారు. దగ్గరుండి స్నానం చేయించి రంగుచీరెలని ధరింపజేసేవారు.
1972లో ప్రఖ్యాత నాస్తికవాది, స్వాతంత్ర్య యోధుడు గోరా ఆద్వర్యంలో నాస్తిక మహాసభలు జరిగాయి. అందులో పాల్గొన్న ఆమె ఉత్తేజితులై నాస్తిక సిద్దాంతాన్ని స్వీకరించింది. పుట్టపర్తి సత్య సాయిబాబా విజయవాడకు రాగా నిరసన తెలిపితే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిప్పులు మీద నడచి, అది మహత్తు కాదని ప్రాక్టీసనీ చెప్పి ప్రజలలో ఆవగాహన కల్పించారు. సమాజంలో నాస్తిక భావనలను వ్యాప్తిచేయాలనే ఉద్దెశ్యంతో 1994లో ఇంకొల్లులో గోరా నాస్తిక మండలి స్థాపించారు. గోరా జయంతి సందర్భంగా 2007లో గోరా నాస్తికోధ్యమ ప్రచారానికి కేంద్రప్రభుత్వం ఇస్తున్న పించను నుండి లక్షరూపాయలు విరాళంగా అందచేసారు. తన జీవిత చరమాంకం వరకూ ఆమె గోరా ఆశయాలను, గాందీజీ భావాలాను ప్రచరం చేస్తూ గడిపారు.మతపద్ధతిలో పెళ్ళి చేసుకుందని తన సొంత మనుమరాలి పెళ్ళికి వెళ్ళని హేతువాది. కుల నిర్మూలన ఉద్యమాల్లో పనిచేశారు. బ్రహ్మ సమాజం ప్రభావం వల్లన అలా చేయగలిగారు. సహపంక్తి భోజనాలు చేసి కుల పట్టింపులు త్రోసి పుచ్చారు.తన జీవితాన్ని గురించి ప్రచురించిన "విరామమెరుగని పురోగమనం" అనే పుస్తకాన్ని జాషువా కుమార్తె, లవణం భార్య హేమలతకు అంకితం ఇచ్చారు.[2]
మరణం
మార్చుకమలాంబ తన భర్త కుటుంబరావు 1962లో చనిపోగా వాళ్ళ కుమారుడు ధర్మానందరావును డాక్టర్ చదివించింది. అతడు ఇప్పుడు ఇంకొల్లులో వైద్య సేవ చేస్తున్నాడు. ఆమె కుమార్తె సరళ ఎమ్.ఎస్.సి. చదివి గద్దె రామచంద్రరావును పెళ్ళాడి, అమెరికాలో నయాగర వద్ద స్థిరపడ్డారు. సమాజంలో పేరుకు పోయిన అంధ విశ్వాసలను నిర్మూలించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని భావిస్తూ నాస్తికరాలుగా,13వ ఏట నుండి, తుదిశ్వాస విడిచేవరకూ ఖద్దరు ధరించి 99 ఎళ్ళు పరిపూర్ణ జీవనం సాగించి ఇంకొల్లులో 2014 జులై 10న మరణించారు.[3] వారి వీలునామాలో కోరినట్లు భౌతికకాయాన్ని విజయవాడలో సిద్దార్ద వైద్య కళాశాలకు దానం చేసారు. నేత్రాలను స్వేచ్ఛ ఐ బ్యాంకు ఇచ్చారు.
మూలాలు, బయటి లింకులు, వనరులు
మార్చు- ↑ "శ్రీమతి కొడాలి కమలాంబ". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ కొడాలి, కమలాంబ. "విరామమెరుగని పురోగమనం" స్వీయ చరిత్ర.
- ↑ సాక్షీ (2014-07-12). "జండా కమలమ్మ మృతి తీరని లోటు12".
{{cite web}}
: CS1 maint: url-status (link)