ఇద్దరు

తెలుగు సినిమా

ఇద్దరు 1997లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీని మాతృక తమిళంలో విడుదలైన ఇరువర్ సినిమా. ఇది మణిరత్నం సహరచయితగా, దర్శకునిగా, నిర్మాతగా వ్యవహరించిన రాజకీయ కథాంశం కల చిత్రం. మూలచిత్రమైన ఇరువర్ తమిళనాట రాజకీయాలకు, సినిమాకీ నడుమ ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా. సినిమాలో మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ప్రధానపాత్రలు ధరించగా ఇతర ముఖ్యపాత్రల్లో ఐశ్వర్య రాయ్, టబు, గౌతమి, రేవతి, నాజర్ నటించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో పోషించిన ద్విపాత్రాభినయంతో సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. సినిమాలో అత్యంత విజయవంతమైన బాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం ఎ.ఆర్.రెహమాన్ అందించారు. సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్ వహించారు. మలయాళంలో ఇరువర్ పేరిటనే అనువదించి విడుదల చేశారు.
ఈ సినిమా 1997 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాస్టర్స్ విభాగంలో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలతోపాటు బెల్గ్రేడ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను పొందింది. 2012లో, ఇరువర్ సినిమాను విమర్శకుడు రాచెల్ డ్వెయర్ 2012 బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ 1000 ఆల్-టైమ్ అతిగొప్ప చలనచిత్రాల జాబితాలో చేర్చారు, ఈ జాబితా అత్యంత విలువైన సినిమా పోల్స్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినది.[1]

ఇద్దరు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం మణిరత్నం
తారాగణం ప్రకాష్ రాజ్,
ఐశ్వర్య రాయ్,
టబు
సంగీతం ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం సంతోష్ శివన్
కూర్పు సురేష్ అర్స్
నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్
భాష తెలుగు

చిత్రకథ మార్చు

1950ల నాటి కాలంలో సినిమా ప్రారంభమౌతుంది. ఇబ్బందులుపడుతున్న నటుడు ఆనంద్ (మోహన్ లాల్) సినీరంగంలో ఎదిగే ఒక మంచి అవకాశం కోసం ప్రయత్నిస్తూండడంతో సినిమా ప్రారంభమవుతుంది. అతని మావయ్య సహకారంతో ఒక సినిమాలో హీరో పాత్రకు ఆడిషన్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టూడియోకి వెళ్ళిన ఆనంద్ దర్శకుడు, ఇతర సినిమా బృందం వచ్చేలోగా అక్కడున్న సెట్ ప్రాపర్టీ(కత్తి)తో తన కత్తివిద్య ప్రదర్శన నైపుణ్యాలను పరీక్షించుకుంటూంటాడు. ఇంతలో తన వ్యంగ్య కవితలతో అక్కడికి వచ్చిన రచయిత సమరసూర్యాన్ని(ప్రకాష్ రాజ్) కలిసి, అతనితో చిరు వాగ్వాదం చేస్తాడు. ఈ వాగ్వాదం ఇద్దరి మధ్య పరస్పర గౌరవాన్ని పెంచేందుకు కారణమవుతుంది. సమరసూర్యం నైపుణ్యానికి ఆకర్షించబడ్డ ఆనంద్ తన ఆడిషన్లో చెప్పేందుకు డైలాగులు రాసిపెట్టమని కోరతాడు.

సమరసూర్యం డైలాగుల సహకారంతో ఆనంద్ సినిమా దర్శకుణ్ణి ఆకట్టుకుని, ఆ చిత్రానికి కథానాయకునిగా అవకాశం పొందుతాడు. ఆ కారణంగా ఆనంద్ కి సమరసూర్యంతో స్నేహం అభివృద్ధి చెందుతుంది, ఆనంద్ కి సమరసూర్యం, జయప్రకాశం (నాజర్) నడిపిస్తున్న తన రాజకీయ పక్షాన్ని పరిచయం చేస్తాడు. కాలం గడిచేకొద్దీ ఆనంద్ ఆ పార్టీ సిద్ధాంతాలను స్వంతం చేసుకుంటాడు. ఆనంద్ పల్లెటూరి పిల్ల అయిన పుష్ప (ఐశ్వర్య రాయ్)ని పెళ్ళిచేసుకుంటాడు, పార్టీనాయకుని సమక్షంలో సమరసూర్యం మరో పల్లెటూరి అమ్మాయి (రేవతి)ని పెళ్ళిచేసుకుంటాడు. మద్రాసు తిరిగిరాగానే ఆనంద్ కి ఆర్థిక సమస్యలతో సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోయిందనే చెడ్డవార్త ఎదురొస్తుంది. సమరసూర్యం తమ పార్టీ ఎన్నికల్లో గెలుపొందిందని సంబరపడుతూండగా, నిరుత్సాహంతో ఆనంద్ మళ్ళీ తన పాతపద్ధతిలో సినిమాల్లో ఎక్స్ ట్రా వేషాలు వేస్తూ గడుపుతూంటాడు. ఆ చిన్నవేషాలను, చిన్న భాగాలను కూడా బాగా వేసేందుకు అవసరమైన ప్రేరణ కోల్పోయి, మరింత కింది పాత్రలకు దిగజారిపోతాడు. అలాంటి ఒకానొక షూటింగ్ లో, ఆనంద్ కి అతని మావయ్య, తల్లి కలసివచ్చి పుష్ప తన ఇంట్లో జరిగిన తీవ్రప్రమాదంలో మరణించిందన్న వార్త చెప్తారు. తీవ్రశోకంలో బాధపడుతున్న ఆనంద్ వద్దకు వెళ్ళి సమరసూర్యం ఓదారుస్తాడు.

కొద్దిరోజులకు, ఆనంద్ సహాయకుడు (ఢిల్లీ గణేష్) గతంలో రద్దైన చిత్ర దర్శకుడు (ఆనంద్ ని హీరోగా పెట్టుకున్న దర్శకుడు) తన కొత్త సినిమా ఆడిషన్ కోసం పిలిచాడని సమాచారం ఇస్తాడు. ఆనంద్ చాలా సంతోషంలో సమరసూర్యాన్ని పిలుచుకువెళ్తాడు. సమరసూర్యం ఆనంద్ ఆడిషన్ కోసం డైలాగులు రాసేందుకు, ప్రసవవేదన పడుతున్న గర్భవతియైన భార్యను కూడా విడిచి పరుగుతీస్తాడు. అతను ఆనంద్ కి డైలాగులు మరోసారి రాసిస్తాడు, ఆనంద్ హీరోగా ఆ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమాలో ఆనంద్ కి జంటగా ఎదుగుతున్న కథానాయకి రమణి (గౌతమి) నటిస్తుంది. సినిమా అద్భుత విజయాన్ని అందుకుని, ఆనంద్ కి గొప్ప పేరు సంపాదించిపెడుతుంది. పార్టీ ప్రజల దృష్టిలో పడేందుకు ఆనంద్ ప్రజాదరణను వినియోగించమని సమరసూర్యం ప్రోత్సహిస్తాడు. అతని తర్వాతి సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు, ఆనంద్ రమణిల మధ్య ఆకర్షణ ఏర్పుతుంది, ఆమెపై కన్నువేసిన ఆమె మావయ్య (నిళల్గళ్ రవి) దీనివల్ల ఆమెను కొడతాడు. రమణి అక్కడ నుంచి ఆనంద్ వద్దకు వచ్చేస్తుంది, ఆనంద్ ఆమెను పెళ్ళాడతాడు. ఈ సమయంలో పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుంది. ఎన్నికల ముందు, జయప్రకాశం ఆనంద్ కి ముఖ్యమైన అవకాశం ఇచ్చి, ఎన్నికల్లో పోటీచేసేందుకు సీటు ఇస్తాడు. ఆనంద్ కేవలం సినిమా నటుడని, అతనికి పార్టీపై తగినంత ఆసక్తి లేదని భావించే సమరసూర్యానికి ఇదంతా రుచించదు. కానీ ఎన్నికల ముందు, షూటింగ్ లో పొరపాటున ఆనంద్ గొంతుపై కాల్పులు జరుగుతాయి. ఇది ప్రమాదం కాదని ఆనంద్ ని చంపేందుకు ఎదుటి పక్షం చేసిన కుట్ర అంటూ ప్రచారం చేస్తారు. పార్టీ ఎన్నికల్లో 234 సీట్లకు 155 సీట్లు సాధించి విజయం పొందుతుంది. జయప్రకాశం ముఖ్యమంత్రి పదవిని నిరాకరిస్తాడు, ఆనంద్ గట్టిమద్దతుతో సమరసూర్యం ముఖ్యమంత్రి అవుతాడు. కానీ అప్పటినుంచీ సమరసూర్యం తన పదవికి ఆనంద్ ముప్పుగా భావిస్తాడు. ఆనంద్ ని పార్టీ ప్రతినిధిగా ఉంచుతారు, మంత్రిపదవి ఇవ్వడు. ఆనంద్ స్వయంగా తనకు ఆరోగ్యశాఖ ఇవ్వాలని కోరినా, సినిమాల్లో నటనకు స్వస్తిచెప్పకపోతే మంత్రి పదవి ఇచ్చేది లేదని సమరసూర్యం తెగేసి చెప్తాడు. ఓ కారుప్రయాణంలో తోటి పార్టీనాయకులు, ఆనంద్ పక్షం తీసుకుని సమరసూర్యం ఆనంద్ ని కావాలనే క్యాబినెట్లో చేర్చుకోలేదని అంటారు. ఆగ్రహించిన ఆనంద్ వారందరినీ కారు నుంచి దింపేస్తాడు.

దీనికి ముందు అటు సమరసూర్యం సాహిత్యాన్ని ప్రేమించే ఓ పల్లెటూరి అమ్మాయి (టబు)తో వివాహేతర సంబంధం నెరపుతూంటారు, ఆమెను మొదట పార్టీ ఎన్నికల్లో గెలవకపూర్వం పార్టీ కోసం పోరాడుతూన్నప్పుడు కలుస్తాడు. కవితాత్మకంగా రాసిన ఉత్తరానికి స్పందించి ఆమె తన కుటుంబాన్ని వదులుకుని వచ్చేస్తుంది. అతను ఆమెని రెండు భార్యగా పెళ్ళిచేసుకుంటాడు. మరోవైపు, రమణితో వివాహం అనంతరం, రానున్న సినిమాలో కొత్త హీరోయిన్ కోసం ఆనంద్ ఆడిషన్ చేస్తాడు. నటి కల్పన (ఐశ్వర్య రాయ్) తన మరణించిన భార్య పుష్పని పోలివుండడంతో ఆనంద్ ఇబ్బందిపడతాడు. వేరే హీరోయిన్ ని ఎంచుకుందామనుకుంటూండగా కల్పన చాలా అందంగా ఉందని, మంచి నటి అవుతుందని ఆమెనెందుకు తీసుకోకూడదంటూ రమణి అడ్డుచెప్తుంది. తర్వాత్తర్వాత కల్పన చనువుగా మెలగడంతో ఆనంద్ మరీ ఇబ్బందిపడతాడు. ఆనంద్ కి ప్రమాదవశాత్తూ బుల్లెట్ గాయం అయినప్పుడు ఆ సమయంలో కల్పనని పుష్ప అంటూ తెలియని స్థితిలో పలుమార్లు పిలుస్తాడు. ఈ విషయం పట్టుకుని కల్పన పుష్ప ఎవరంటూ ఆరా తీయడంతో తప్పక తన మొదటి భార్యకీ ఆమెకి ఉన్న పోలికని చెప్పేస్తాడు. ఇది వారిద్దరి నడుమ వివాహేతర సంబంధానికి నాంది అవుతుంది. జయప్రకాశం అనారోగ్యంతో మరణిస్తారు. జయప్రకాశం మరణానంతరం ఆయన సంతాపసభలో ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పొరపాట్లు జరుగుతున్నాయని, స్వార్థం, అవినీతి చోటుచేసుకుందని, ఇలాంటి ప్రభుత్వం కోసమా ఓటేసిందని సామాన్య కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని అంటాడు. దీంతో ఆనంద్ కీ, సమరసూర్యానికీ మధ్య వైరం తారాస్థాయికి చేరుతుంది. పార్టీ వర్కింగ్ కమిటీ, ముఖ్యమంత్రి సమరసూర్యం ఆనంద్ ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంటారు.


తారాగణం మార్చు

నటి-నటులు పాత్ర ఆధారితం
మొహన్ లాల్ ఆనంద్ ఎం. జి. రాంచంద్రన్
ప్రకాష్ రాజ్ సమరసూర్యాన్ని ఎం. కరుణానిధి
ఐస్వర్య రాయ్ పుష్ప, కల్పన జయలలిత
గౌతమి రమణి జానకి రామచంద్రన్
టబు పల్లెటూరి అమ్మాయి
నాజర్ జయప్రకాశం సి. ఎన్. అన్నదురై

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

1995 అక్టోబరులో, మణిరత్నం ఆనందన్ పేరిట ఓ సినిమాని సుహాసిని రచనలో నానాపటేకర్, మోహన్ లాల్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.[2] మొదట్లో ఆ సినిమా ఎల్.టి.టి.ఇ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్, ఆ సంస్థలో కీలకస్థాయికి ఎదిగి, తన నాయకుణ్ణే హతమార్చేందుకు భారత సైన్యం చేసిన విఫలయత్నానికి సహకరించాడన్న ఆరోపణపై చంపబడ్డ మహత్తియల ద్వయాన్ని చూపుతారని భావించారు, ఐశ్వర్యరాయ్ ఇందిరా గాంధీగా నటిస్తారని భావించారు.[3] వెనువెంటనే మణిరత్నం ఏ రాజకీయ నేపథ్యంలోనూ సినిమా ఉండబోదనీ, భారతీయ సినీ పరిశ్రమ నేపథ్యంగానే సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండడంతో పాఠకులను తప్పుదోవ పట్టించేందుకేనని సినిమా అనంతరం తేలింది. కొన్నాళ్ళకు సినిమా పేరు ఇరువర్ (ద్వయం/ఇద్దరు)గా మార్చి, 1980ల తమిళనాడు రాజకీయ నేతలు ఎం.జి.రామచంద్రన్, కరుణానిధిల జీవితాలను, తమిళ సినిమా, ద్రవిడ రాజకీయాలపై వారి ప్రభావంపై ఉంటుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత మలయాళ రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్తో మణిరత్నం సంభాషణలో మెరిసిన ఆలోచనగా దీన్ని పేర్కొన్నారు.[4]

పాటలు మార్చు

lyrics: Veturi 1. ఆదుకొనడం వ్రతమై
2. పూనగవే పూలదీ లేనగవే వాగుదీ
3. హల్లో మిస్టర్
4. కళ్ళకు గంతలు కట్టద్దోయ్
5. శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
6. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
7. వెన్నెలా వెన్నెలా వెళ్ళిరావే

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-19. Retrieved 2015-07-13.
  2. Jayanthi (1995-10-15). "What makes Mani ?". The Indian Express. Archived from the original on 2012-03-20. Retrieved 2011-09-23.
  3. Paneerselvam, A. V. (1996-02-14). "With A Sepia Edge". Outlook. Archived from the original on 2011-02-11. Retrieved 2011-09-23.
  4. Umashankar, Sudha (1998). "Films must reflect the times you live in". The Hindu. Archived from the original on 2012-10-21. Retrieved 2011-09-23.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇద్దరు&oldid=4211877" నుండి వెలికితీశారు