కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు

కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, అవధాని, బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు గ్రంథ రచయిత.

జీవిత విశేషాలు మార్చు

ఈయన 1937, నవంబరు 7న కృష్ణాజిల్లా కైకలూరు గ్రామంలో అన్నపూర్ణ, వెంకట అప్పారావు దంపతులకు జన్మించారు. ఈయన మచిలీపట్నం హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యలను చదివారు. గుడివాడ ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్ల సాహిత్యం అభిమాన విషయంగా బి.ఎ. చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1962లో సంస్కృతంలో ఎం.ఎ., అగస్త్య పండితుని బాలభారతము అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పి.హెచ్.డి చేశారు. తూర్పుగోదావరి జిల్లా, అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగారు. ఈయన సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషలలో రచనలు చేశారు. హిందీ, ఆంగ్ల భాషలనుండి పలు గ్రంథాలను తెలుగులోనికి తర్జుమా చేశారు. ఈయన అష్టావధానం, నేత్రావధానం మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశారు. ఈయన మంచి చిత్రకారులు కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఈయనకి పేరును తెచ్చిపెట్టాయి. ఈయన అనేక సెమినార్లలో తెలుగు, సంస్కృతాలలో పత్రసమర్పణ చేశారు. ఆకాశవాణిలో సంస్కృతాంధ్రభాషలలో కవిత్వం, దేశభక్తి గేయాలు, నాటికలు ప్రసారం చేశారు. ఈయన పలు స్టేజి, రేడియో నాటకాలలో నటించారు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు[1].

అవధానాలు మార్చు

ఈయన మొదటి అవధానం 1974లో చేశారు.[2] పిమ్మట ఈయన మచిలీపట్టణం, గుడివాడ, కైకలూరు, కాకినాడ, రాజమండ్రి మొదలైన చోట్ల అష్టావధానాలు విజయవంతంగా నిర్వహించారు. ఈయని అవధానాలలో దత్తపది, సమస్య, వర్ణన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగము, కావ్యపఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలు ఉన్నాయి.

అవధానాలలో కొన్ని పూరణలు మార్చు

 • సమస్య: మునికిన్ కోపము భూషణంబగు జనామోదంబు సంధిల్లగన్

పూరణ:

వనికిన్ రాముని బంపి, మమ్మిటుల తా వంచించె నీ రాజి సీ
యని పౌరుల్ రఘువంశ గౌరవము తామందందు నిందించుటల్
విని, కైకన్ దునుమాడ నెంచెడి సువిఖ్యాతుడా రాముత
మ్మునికిన్ కోపము భూషణంబగు జనామోదంబు సంధిల్లగన్

 • సమస్య: పాలను విడి అతడు క్షీరపానము చేసెన్

పూరణ:

బాలుడు చన్నుం గుడుచుట
మేలుగ మాన్పింప చనుల మెలతుక చేదున్
జాలగ పులుమగ ఆ చను
బాలను విడి, అతడు క్షీరపానము చేసెన్

 • దత్తపది: మదనము - వదనము - రథనము - సదనము అనే పదాలతో సీతాకళ్యాణము

పూరణ:

మదన మనోజ్ఞుని రాముని
వదనము తరుణార్క విభవ భాసురము సుశ్రీ
రదనము మధుమయ ఛాంద్రీ
సదనము గని వలచె సీత సరసుని రామున్

 • వర్ణన: నేటి కళాశాల విద్యార్థుల తీరు

పూరణ:

కట్నాల కాశించి కాలేజి చదువకై
     పట్నాలపై నెగబడెడివారు
పెద్దలార్జించిన కొద్ది సొమ్మును గూడ
     వెచ్చబెట్టుటకునై వచ్చువారు
చదువు సంధ్యలు వీడి చవటల జతగూడి
     చెప్పరాని పనులు చేయువారు
సూటుబూటులు వేసి సొగసు చూడ్కులతోడ
      విద్యార్థినుల చూడ వెడలువారు

గురువు నెదిరించుటది యొక పరువటంచు
నెంచి జీవించి చివరకు నేడ్చువారు
నేడు కాలేజి చదువుల నెగడుచుండ
కళలశాలయే కాదది ఖలులశాల

 • ఆశువు:శారదాస్తవము

పూరణ:

తరుణము అస్మదీయ కవితా వనితా మహితానురాగ సం
వరణము కోరివచ్చు గుణవంతుల శాంత హృదంతరాంతరా
హరణము సేయ పద్య సుమహార విహార సమీర పూరమా
వరణము సేతు నాపయిన భారము బేరము నీది శారదా!

నిర్వహించిన పదవులు మార్చు

 • సభ్యులు - జాతీయ పుస్తక సంస్థ 2000-2003
 • అఖిల భారత ఉపాధ్యక్షులు - సంస్కార భారతి
 • సంస్థాపక కార్యదర్శి - ఆంధ్రప్రదేశ్ జాతీయ సాహిత్య పరిషత్

రచనలు మార్చు

ఈయని రచనలలో కొన్ని:

 1. జీవించే దేవాలయం
 2. దేవాలయాలపై బొమ్మలు పరమపద సోపానాలు
 3. భారత్‌లో విగ్రహారాధన ప్రారంభవికాసాలు
 4. భారత మాతృస్తవమ్‌ (సంస్కృతం)
 5. ప్రజాపోరాటం
 6. జీవధార (ఖండకావ్యం)
 7. మాతృపదమంజీరాలు (దేశభక్తి గీతాలు)
 8. ముసునూరి నాయకులు (చారిత్రక నవల)
 9. ధ్వంసమైన దేవాలయాలు
 10. పాంచజన్యం (అనువాదం)
 11. భారతీయ చరిత్రమాల (అనువాదం)
 12. హిందూ విజయదుందుభి
 13. ఆంధ్రశ్రీ (రేడియో నాటిక)
 14. ప్రతిజ్ఞ (రేడియో నాటిక)
 15. బ్రతుకే ఒక నాటకం (నాటిక)
 16. దళారి (నాటిక)
 17. మహిషాసుర మర్దిని (నృత్యనాటిక)
 18. కవన విజయ కాశ్మీరం (నృత్యనాటిక)
 19. ఒరిస్సా తుఫాను (నృత్యనాటిక)
 20. మన భారతము నాడు - నేడు (నృత్యనాటిక)
 21. Agastya andita's Bala Bharata - A critical Study

బిరుదములు మార్చు

 • ఆర్షవిజ్ఞానవిశారద
 • అవధానకళానిధి

మరణం మార్చు

ఈయన తన 79వ యేట 2016, డిసెంబరు 29వ తేదీన విశాఖపట్నంలో మరణించారు[3]. ఈయనకి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు.

మూలాలు మార్చు

 1. హెబ్బార్, నాగేశ్వరరావు (31 December 2016). "ఆర్ష విజ్ఞాన విశారదుడు 'ఘనశ్యామల'". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 3 February 2017.[permanent dead link]
 2. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 422–427.
 3. ప్రధాన, సంపాదకుడు (9 January 2017). "సంస్కార భారతి పూర్వ అఖిల భారత ఉపాధ్యక్షులు ఘనశ్యామల ప్రసాద్‌ అస్తమయం". జాగృతి వార పత్రిక. Retrieved 3 February 2017.[permanent dead link]