కోవెల సుప్రసన్నాచార్య
కోవెల సుప్రసన్నాచార్య సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, కవి. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[1]
కోవెల సుప్రసన్నాచార్య | |
---|---|
జననం | కోవెల సుప్రసన్నాచార్య 1936 మార్చి 17 వరంగల్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం |
వృత్తి | అధ్యాపకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | శారద |
పిల్లలు | శ్రీనివాస్, సంతోష్ కుమార్, శ్రీవాణి, శ్రీలత |
తండ్రి | వెంకట నరసింహాచార్యులు |
తల్లి | లక్ష్మీనరసమ్మ |
వెబ్‌సైటు | |
http://swadhyaaya.com http://kovelasuprasanna.blogspot.in/ http://samparayam.blogspot.in/ |
జీవిత విశేషాలు
మార్చుఇతడు యువనామ సంవత్సర ఫాల్గుణ కృష్ణ నవమి కి సరియైన 1936, మార్చి 17 వతేదీన వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు.[2] ఇతడి పితామహుడు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహుడు ఠంయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు ఇతనికి సాహిత్య గురువులు. 9 ఏళ్ల వయసులోనే ఇతడు కందపద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. వరంగల్లులోని ఎ.వి.వి.హైస్కూలులో ఉన్నతవిద్య చదివాడు. హైదరాబాదులో బి.ఎ.చేశాడు. 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.చేశాడు. రామరాజభూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి 1962లో పి.హెచ్.డి పట్టా పొందాడు. ఎం.ఎ.పూర్తి చేశాక సిటీకాలేజీ, ఈవినింగ్ కాలేజీలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేశాడు. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్‌హాక్ లెక్చరర్‌గా నియమించబడ్డాడు. 1962 నుండి కాకతీయ విశ్వవిద్యాలయం లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేశాడు. వరంగల్ ఈవినింగ్ కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా, డీన్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా సేవలను అందించాడు. ఇతని మార్గదర్శకత్వంలో 20 పి.హెచ్.డి, 16 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి. విశ్వనాథ సత్యనారాయణ, శ్ర్ అరవిందులు, భగవాన్ రమణ, సద్గురు శివానందమూర్తిల ప్రభావం ఈయన పై ఎక్కువగా ఉంది. ఈయన కుమారుడు సంతోష్ కుమార్ పాత్రికేయుడు. ఇతను రాసిన దేవరహస్యం గ్రంథం తెలుగు నాట ప్రాచుర్యం పొందిన పుస్తకం.
సారస్వత సేవ
మార్చు1954లో సాహితీబంధు బృందం అనే సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1957లో మిత్రమండలి స్థాపించాడు. 1958లో హైదరాబాదులో రసధుని అనే సంస్థను మొదలి నాగభూషణశర్మ, మాదిరాజు రంగారావులతో కలిసి ప్రారంభించాడు. 1960లో కులపతి సమితిని స్థాపించాడు. జాతీయ సాహిత్య పరిషత్తులో జీవిత సభ్యుడిగా, విశ్వనాథభారతి సంస్థలో జీవితసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. పోతన విజ్ఞాన సమితి కార్యదర్శిగా చేశాడు. 1973లో మొదటిసారి అవధానం చేశాడు. తరువాత కరీంనగర్, వేములవాడ, ములుగు, ఘన్‌పూర్, హనుమకొండ తదితర ప్రాంతాలలో సుమారు 60-70 అవధానాలు చేశాడు. గోలకొండపత్రిక, స్రవంతి, తెలుగుదేశం, ప్రభాస, జయంతి, ఆంధ్రప్ర్రభ, ఆంధ్రప్రదేశ్, భారతి, జనధర్మ, జ్యోతి, విమర్శిని, జాగృతి, మూసీ, సాధన మొదలైన పత్రికలలో ఇతని రచనలు ప్రచురింపబడ్డాయి.
శ్రీ సుప్రసన్న సాధకుడు. ఆధ్యాత్మిక భావసంపుటి ప్రధానంగా ఆయన సాహిత్య నిర్మితి, విమర్శ రూపుదిద్దుకున్నాయి. సాహిత్య ప్రక్రియలన్నింటిలో సిద్ధహస్తుడైన మనీషి, గాఢమననశీలి. పద్యం, వచనం, వచనపద్యం, కథ, గేయం ఇవన్నీ అప్రయత్నంగా సిద్ధించినట్లు తెలుస్తుంది. ఆయన మననశీలి, కావున మితభాషి. సత్యం స్పష్టంగా స్ఫురించనిదే, దాని కనుగుణమైన వ్యక్తీకరణ లభించనిదే ఆయన పల్టుడు `సత్యాయ మితభాషిణాం' గుర్తుకువస్తుంది.
కవి మనః కోశ నిర్మాణంలో సమకాలీనమే కాక గతకాలం స్మృతి సంకలనమై వెంటనడుస్తుంది. భవిష్యత్తును గూర్చిన కల్పన కూడా స్వప్నంలాగా దర్శనమిస్తూ ఉంటుంది. అచేతనం, అవచేతనం, సమష్టి అవచేతన, అతీతచైతన్యం ఈ నాల్గు అంశాలు జాగ్రద్దశను అమితంగా ప్రభావితం చేస్తాయి. . . . అతని చైతన్యం హేతుక్రమానికి లొంగి ఉండదు. (దర్పణం)
అందుకే కవి వ్యక్తిగా సమాహరించుకొన్నది కావ్య సాక్షాత్కృతిలో, దర్శనంలో విద్యమానం కాకపోవచ్చు. ``ఈ సృజన బీజభూతమైన తనలో నుండి వచ్చినా, పరిమితమైన తనకంటే విస్తృతంగా భిన్నంగా, తనకే దర్శనమిస్తుంది.'' అన్నారు సుప్రసన్న. వర్తమాన జాగ్రదవస్థకు పరిమితమైన కాలానుభవం సాహిత్య నిర్మాణానికి ప్రధానహేతువు కాదని కవిగా సుప్రసన్న కనుభూతమైన విషయం. మన ప్రపంచం దేశకాలపరిమితం కాగా, సాహిత్య ప్రపంచం ఉపర్యుక్తలక్షణ లక్షితమై తదతీతంగా ఉంటుందని నిర్ధారించడానికి కూడా స్వానుభూతియే కారణం.
శ్రీ అరవిందుల తత్త్వం సుప్రసన్నను బాగా ప్రభావితం చేసింది. అంత శై్చతన్యాన్నీ అవచేతననూ ఆ తత్త్వదృక్కోణం నుంచే పరిశీలించినారు. కళాసృజనల అనుభూతి ప్రపంచంలో వాటి ప్రభావాన్ని సుకుమారంగా సమీక్షించినారు. తద్గత రహస్యాలని మేల్కొలిపే శక్తి కళారూపాలకు ఉందనీ, అస్మితా సమర్పణానుపదంగా అతిమనస్తేజశ్శకలాల అవతరణం కలుగుతుందని ప్రస్తావించినారు. ఇక్కడే మౌలికమైన `విశ్వలయ'ను ప్రతిపాదించినారు. ఇతిహాస మహాకావ్య నిర్వచనం చేసినారు. వ్యక్తి తన అంతస్సుతో, సమాజంతో, ప్రకృతితో, సర్వనియామకమైన దివ్యచైతన్యంతో, సామరస్యం సాధిస్తే ఇతిహాసంలో విశ్వలయ సిద్ధిస్తుంది. తాదృశమైన ఇతిహాసం మానవ చైతన్య విజయయాత్రలో ఒక ప్రధానఘట్టం. ఇతిహాసమహాకావ్య నిర్మాణ మహాయజ్ఞంలో ``కవి తనను తానే ఆహుతి చేసుకుంటున్నాడు.'' ఇది ఎలియట్ వివరించిన extinction of personality కంటె ఉదాత్తమైంది, ఉత్కృష్టమైంది.
కళకి దివ్యమూలావశ్యకతను చెప్పినారు. యజనానికి పూర్వం ధ్యాన మావశ్యక మైనట్లు తద్భావనాభావితంగా కళా సృష్టికి పూనుకోవాలి. ఆ కళారూపం తానై పరిణమించాలని వ్యాఖ్యానిస్తూ, కళారూపాలు ప్రతీకలో, స్ఫురణలో, సంకేతాలో ఔతాయని, దర్శనం `ఋతజాత'మై భద్రంకరమై ఉంటుందని వివరించినారు. భారతీయ కళలకు, ధ్యేయమైన, సుషూప్తిదశాకమైన, అంతఃస్ఫురణభూతమైన ఆనందపర్యవ సాయకమైన స్థితిని ప్రతిపాదించినారు. సంప్రదాయపరమమైన అనుస్యూతినీ కాలాను గతమైన విపరిణామాన్నీ ఇట్లా వ్యక్తం చేసినారు:
ఒక మహావృక్షం యుగయుగాలుగా అలాగే ఉన్నట్లు కన్పించినా మూలం తప్ప ప్రతీదీ మారిపోతున్నది. స్కంధము, శాఖలు, పత్త్ర పుష్పాలు అన్నీ. ఇదీ జీవంతమైన సంప్రదాయం, ఈ జీవంతమైన సంప్రదాయం క్రొత్త దర్శనానికి కారణమౌతున్నది. ప్రతియుగం సత్యాన్ని కొత్త సౌందర్యంతో ఆవిష్కరించుకొని మరల మరల `శివ' శిఖరం వైపుగా అధిరోహింపజేస్తున్నది.
దీన్నే మరింత స్పష్టం చేస్తూ
నిత్య పరివర్తన శీలమైన ఈ సంప్రదాయం పాతబడిన ఆకులను బెరడులను పుష్పాదులను పరిత్యజిస్తుంది. మృత్యులక్షణాలను తొలగించుకొని ప్రాణోద్విగ్నవసంత లక్షణాలతో ప్రకాశిస్తుంది. కవి తన అనుభవాన్ని ధ్యానించి, మనోమయంగా సర్వాంగీణంగా భావించి, అలంకారాది సామగ్రితో అభివ్యక్తీకరించి కావ్యంగా ఆవిష్కరిస్తాడు. కావ్యాన్ని అభివ్యక్తి సామగ్రీ పరిశీలన మారంభంగా అలంకారాదులను వివేచించి మనోమయ విషయభావన చేసి ధ్యానావస్థిత తద్గత మనస్కుడై కవి హృదయా న్నావిష్కరించుకొని సహృదయుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ రహస్యజ్ఞత స్ఫురన్మనీషా లక్షణంగా గోచరిస్తుంది.
సామరస్యంతో సిద్ధించే `విశ్వలయ' భావనయే ఆయనకు సాహిత్య మార్గదర్శనా న్నిచ్చినట్లు చెప్పినారు. నిరంతర సాధన, మననశీలిత హృదయ విస్తృతిని కలిగిస్తుంది. ``భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వసంశయాః'' స్వానుభవంలోని సర్వమార్గ సమన్వయాన్ని ఇలా వివరించినారు:
అది సుప్రసన్న జీవితాన సిద్ధించింది. అవిరోధమన్నది సుప్రసన్న ప్రధానలక్షణము. సర్వతత్త్వములతో సర్వమార్గాలతో అవిరోధం సుప్రసన్న జీవనంలో మార్గదర్శనం చేసింది. అందువల్ల ఏ వస్తువును గురించి రాసినా ఈ సమన్వయమే దర్శనమయింది. ఈ వెలుగు ఆధారం చేసుకుని సుప్రసన్న సాహిత్యం మొత్తం నిర్మాణమయింది. సాహిత్య విమర్శ నిర్మాణం జరిగింది. సుప్రసన్న సాహిత్యక్షేత్రమంతా ఆధ్యాత్మిక ధారాపరిప్లుతమే. జీవితలక్ష్యాన్ని అన్వేషించే సాధనంగా సాహిత్యాన్ని భావించారు. తనపై ప్రభావం చూపిన వివిధ సంప్రదాయాలను వాటి పరిమితులనూ, అవి జీవిత దర్శనంలో ఒకదశలో చేసిన మేలునూ తన వ్యాసాల్లో అక్కడక్కడ వివరించినారు. స్వీయ వ్యక్తివికాసాన్ని అరమరికలు లేకుండా చిత్రించినారు. అనుసరణీయ జీవనమార్గాన్ని సుప్రసన్న భావించారు:
మానవుడి జీవనం సర్వజీవుల జీవనంతో ఇంకా విశ్వము వ్యవహరించే అనంతకాల ప్రవృత్తిలోని `లయ'తో అనుబద్ధమైనది. ఈ జీవనం, జీవుని జడ ప్రవృత్తి నుంచీ ఆనందమయమైన, దేశకాలాతీతమైన దివ్యత్వం వైపుగా సాగే అనంతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఈ బ్రతుకు ఒక మజిలీ. ఇక్కడ జీవుడు తన కర్మ అంతా తన అనంతప్రయాణ లక్ష్యానికి అనుగుణంగా దిద్దితీర్చికోవలసి ఉన్నది. అయితే మన జన్మభూమి భోగభూమి కాదు. కర్మభూమి. ఈశ్వరమయమైన ఈ జగత్తులో అంతా సమాజానికే సమర్పించి తరువాత మిగిలిన దానిని తాను అనుభవించాలి. ధర్మము యదభిముఖముగా చెప్పబడినదో అది తదభిముఖముగా వ్యాఖ్యానింపబడాలి. లేక అపముఖముగా చూస్తే ఈ సర్వధర్మమూ దోష సంకులముగా కానవస్తుంది.
ఆధునికంగా భారతీయ సాహిత్యాన్ని భిన్న సంస్కృతి ప్రమాణాలతో విశ్లేషించి దానికి న్యూనత నాపాదించే పద్ధతికి ప్రచారం విశేషంగా ఉన్నది. సంప్రదాయంతో ప్రాప్తించిన అత్యుదాత్తమైన విలువల్ని విస్మరించడం లేదా వ్యంగ్యంగా వక్రీకరించడం వలన సాధించేదేమీ లేదు. దశలక్షణ యుక్తమైన ధర్మాన్ని సంకుచితపరిధిలో నిర్వచింపలేదు. దాన్ని `సార్వభౌమం' అనే అన్నారు. దేశకాలాదులతో పరిచ్ఛిన్నం కాని యమ నియమాలను పతంజలి `సార్వభౌమం మహావ్రతమ్' అని పేర్కొన్నాడు.
మణిసేతువులో పూచిన పారిజాత పరిమళాలివి.
వెన్నెల లావరించుటయు వేడుక వానల క్రుమ్మరింతలున్
కన్నుల స్వప్న లోకములు కానగ వచ్చుట, లింటివెన్క సం
పన్నిధి గుప్తతల్ విడిచి పైపయి కెక్కుట, లెన్నియైన లో
నున్న అమేయ శాంతికి అణూపమ కేనియు పోలి రావెటుల్
అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టోత్తర శత దివ్యక్షేత్రాలు, భిన్న ప్రకృతులూ ఉన్న మణి ద్వీపమే భారతదేశము. తన మాతృభూమిని జగన్మాతగా దర్శిస్తూ. . .
అఖిల జగముల కాటపటై్టన నిన్ను
అఖిల జగముల నేది కాదైన నిన్ను
ఎటుల కొల్చుట ెుద నిల్పుటెటుల సర్వ
వియదనంత సమావేశ వృక్షమూర్తి
అఖిలమున కాది మూలమైనట్టి నీవు
అంతమున పరిణతి సహస్రారమగుచు
ఆ మణిద్వీపమున రాజ్ఞివౌచు నిలుతు
గుండెలో సూక్ష్మ షట్పద గుప్తమూర్తి
బీజంలో జడంగా నిద్రిస్తున్న చైతన్యమూర్తి, అంకురమై, మొలకై, చెటై్ట, వృక్షమై విశ్వంగా పరిణామం పొందింది.
నేను జీవాన్ని, వృక్షాన్ని, ఫలాన్ని, రసాన్ని
నేను ఆవర్తాన్ని, బుద్బుదాన్ని, తరంగాన్ని
తథాగతము, తథాదృష్టము, తథాభావితము
నిత్యభావం కనిన స్వప్నము, అర్థరాత్రి గర్భంలో పగలు
ఆ తామసీ గర్భంలోనుంచి ఉషశ్శిశువు జన్మనెత్తింది.
గింజ మట్టిని చీల్చేవేళ ఊపిరినంతా బిగగట్టి
పైకి పొడ్చుకువచ్చి ఒకసారి తన్నుతాను ప్రకటించుకునే క్షణం
చివురు విచ్చుకునే వేళ, మొగ్గ కనబడే వేళ
వినబడని మట్టి మూలుగు ఆ లిప్త విశ్వచైతన్య సంవేదన. . .
ఆవ్యక్త బీజంలోనుంచి
నిర్గమించిన అశ్వత్థ వృక్షం జీవ కిసలయితమై
ఆకాశాన్ని కప్పివేసింది సర్గపు తొలి మొలక తాను
స్కంధంలో ఎన్ని ఎన్ని ప్రాణరహస్య కోటరాలు
రచనలు
మార్చు- భావుకసీమ (సాహిత్య వ్యాససంపుటి)
- భావసంధ్య (వ్యాససంపుటి)
- దీపవృక్షం
- అంతరంగం (పీఠికా సంకలనం)
- చందనశాఖి
- ఏకశిలా సాహిత్య సౌందర్యము (ప్రసంగ వ్యాసాలు)
- కావ్యప్రమితి (వ్యాససంపుటి)
- దర్పణం
- సమర్చన
- సమర్పణ
- మణిసేతువు
- కృష్ణరశ్మి
- ప్రీతి పుష్కరిణి
- సాంపరాయం
- శేఫాలిక
- శ్రీ నృసింహ ప్రపత్తి
- వేదసూక్త సౌరభం
- పాండిచ్చేరి గీతాలు పన్నెండు[3]
- హృద్గీత (కోవెల సంపత్కుమారాచార్యతో కలిసి)
- ఆనందలహరి (కోవెల సంపత్కుమారాచార్యతో కలిసి)
- అపర్ణ (కోవెల సంపత్కుమారాచార్యతో కలిసి)
- తేజశ్చక్రము
- అధునా
- సాహిత్య వివేచన
- ఋతంభర
- అగ్నిగర్భ (సంపాదకత్వం)
- పాంచాలరాయ శతకం
- సాహృదయ చక్రం
- శతాంకుర
- స్తుతి ప్రబంధము
- కన్నీటికొలను
- శ్రీనిరుక్తి
- వసుచరిత్ర (సంపాదకత్వం)
- చేతనావర్తం-1 (సంపాదకత్వం)
- హిరణ్యగర్భ (సంపాదకత్వం)
- విశ్వనాథ వాజ్మయ సూచిక (సంపాదకత్వం)
- దూపాటి వెంకటరమణాచార్యుల జీవిత చరిత్రము (సంపాదకత్వం)
- వసుచరిత్ర వైభవము (సంపాదకత్వము)
- విశ్వనాథ (సహసంపాదకత్వము)
- అంగద విజయం (నాటకము)
- శుక్తిమతి (రేడియో నాటిక)
- సౌభద్రునియాత్ర (రేడియో నాటిక)
- తెలుగు ఋతువులు (రేడియో నాటిక)
- అన్నదమ్ములు (రేడియో నాటిక)
- మణికర్ణిక (కావ్య సంపుటి)
- పరిక్రమ
- శివాభిసారిక
- శ్రీకృష్ణోపనిషత్
- ప్రీతి పుష్కరిణి
- అశ్రుభోగ
పురస్కారాలు
మార్చు- తెలంగాణ లిటరసీ ఫోరం ఉత్తమ కవితాపురస్కారం (1955)
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు(1971) సాహిత్యవివేచన గ్రంథానికి
- ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (1987)
- ఉత్తమ పరిశోధన పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం (1997)
- జీవీయస్ సాహిత్యపురస్కారం (2001)
- ఆంధ్ర సారస్వత సమితి ఉత్తమ కవితా పురస్కారం (2002) శ్రీ నృసింహప్రపత్తి గ్రంథానికి
- తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శా పురస్కారం (2001) అధ్యయనం గ్రంథానికి
- సనాతనధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ శ్రీరామనవమి పురస్కారం (2007)
- ఆచార్య గంగప్ప సాహితీ పురస్కారం (2009)[4]
- కేంద్ర సాహిత్య అకాడెమీ ‘టాగూరు సాహిత్య పురస్కారం’ (2010) - అంతరంగం గ్రంథానికి
- హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[5][6]
- 2016లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం
మూలాలు
మార్చు- ↑ Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
- ↑ టి.శ్రీరంగస్వామి (1991). కోవెల సుప్రసన్నాచార్యులు- వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 13 December 2014.
- ↑ కోవెల, సుప్రసన్నాచార్య (ఏప్రిల్ 1975). పాండిచ్చేరి గీతాలు పన్నెండు (1 ed.). నర్సంపేట్, వరంగల్ జిల్లా: అరవింద కేంద్రం.
- ↑ ఎడిటర్ (2009-11-19). "23న కోవెల సుప్రసన్నకు గంగప్ప అవార్డు". ఆంధ్రప్రభ దినపత్రిక. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్. Retrieved 13 December 2014.[permanent dead link]
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
- ↑ ఎడిటర్. "ఈనాడు ప్రతిభ". ఈనాడు దినపత్రిక. ఉషోదయా ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదు. Retrieved 13 December 2014.[permanent dead link]