చెఱువు సత్యనారాయణ శాస్త్రి

చెఱువు సత్యనారాయణ శాస్త్రి ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, శతావధాని.

చెఱువు సత్యనారాయణ శాస్త్రి

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1943 ,మార్చి 7న గుంటూరు జిల్లా, తెనాలి పట్టణంలో శేషయ్య శాస్త్రి, లక్ష్మి దంపతులకు జన్మించాడు.[1] సుప్రసిద్ధ పండితుడైన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ఇతని మాతామహుడు.

విద్య మార్చు

ఇతడు బాల్యంలోనే సంస్కృత పంచకావ్యాలు, నైషధకావ్యము, వ్యాకరణ సిద్ధాంత కౌముది, వేదాంత పంచదశి, నాటకాలంకార సాహిత్యం అధ్యయనం చేశాడు. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైన తర్వాత వ్యాకరణ విద్యాప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, భాషాప్రవీణ పట్టాలు పొందాడు. తరువాత సంస్కృతంలో ఎం.ఎ. పట్టా పొందాడు. "సంస్కృత మాఘకావ్యము ఆంధ్రీకృతులు - అనుశీలనము" అనే అంశంపై పరిశోధన గావించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాదించాడు[1].

ఉద్యోగం మార్చు

ఇతడు తెనాలిలోని హయ్యర్ సెకండరీ పాఠశాలలో సంస్కృతోపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. తరువాత తాడికొండ సంస్కృత కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం గుంటూరు సంస్కృత కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశాడు. పిమ్మట ఒంగోలు సంస్కృత పాఠశాలలో ప్రిన్సిపాల్ పదవిని నిర్వహించాడు. చివరగా మరణించే వరకూ తణుకు బాలసరస్వతీ సమాజ ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ఇతడు ఓరియంటల్ కళాశాలల అధ్యాపక సంఘానికి కార్యదర్శిగా, అఖిల భారత సంస్కృత సమితి (కలకత్తా) ఉపాధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ కాన్ఫరెన్సు సభ్యుడిగా, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్సు సభ్యుడిగా సేవలను అందించాడు[1].

సారస్వత రంగం మార్చు

ఇతడు భువన విజయం మొదలైన సాహితీరూపకాలలో ప్రబంధకవుల పాత్రలను పోషించాడు[1]. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా సంస్కృతాంధ్రాలలో అనేక సాహిత్య అంశాలపై ప్రసంగించాడు. తణుకులోని నన్నయభట్టారక పీఠం కార్యదర్శిగా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాడు.

అవధాన రంగం మార్చు

ఇతడు సుమారు 150కి పైగా అష్టావధానాలు చేశాడు. వాటిలో 125 తెలుగు భాషలో చేయగా తక్కినవి సంస్కృత భాషలో నిర్వహించాడు. 1996లో కొవ్వూరులో సంస్కృతంలో సంపూర్ణ శతావధానాన్ని విజయవంతంగా చేశాడు[1].

రచనలు మార్చు

 1. విప్రలబ్ధ
 2. ఉమాకళ్యాణము
 3. బాలచాముండికాస్తవము
 4. కైవల్య శృంగారము
 5. సుబ్రహ్మణ్యతారావళి శతకం
 6. కవితావరణము - మాయికాహ్వానం
 7. సంస్కృత మాఘకావ్యము ఆంధ్రీకృతులు - అనుశీలనము (సిద్ధాంత గ్రంథం)
 8. ఉద్దురు మాలావృతాలు
 9. సమగ్ర సంస్కృత శతావధానమ్‌ (మరణానంతరం ప్రచురితం)

బిరుదులు, సత్కారాలు మార్చు

 • అవధాన విద్యావాచస్పతి
 • అవధాన శిరోమణి
 • విద్యావాచస్పతి మొదలైనవి.

మరణము మార్చు

ఇతడు తన 54వ యేట 1996, నవంబరు 14వ తేదీకి సరియైన ధాత నామ సంవత్సరం, కార్తీక శుక్ల చతుర్థి, గురువారం నాడు మరణించాడు[1].

మూలాలు మార్చు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 రాపాక, ఏకాంబరాచార్యులు (2016-06-01). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యా సర్వస్వము (ప్రథమ ముద్రణ ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. pp. 461–463.