తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2005 సెప్టెంబర్
సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 10
మార్చు- సెప్టెంబర్ 1: నక్సల్స్ సమస్యపై తెరాస నేతల బృందం (MLAలు, MPలు) సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్‌లను కలిసింది. ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. నక్సల్స్ సమస్యపై వారి నుంచి ఆశించిన స్పందన లభించలేదు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని వారిద్దరూ తేల్చిచెప్పారు. సోనియాతో భేటీ నిరాశాజనకంగా మారడంతో కేసీఆర్ అసంతృప్తి చెందాడు. యూపీఏ నుంచి వైదొలగే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించాడు. యూపీఏలో కీలక నేత అయిన ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్ను... తన షెడ్యూలులో లేకపోయినా హుటహుటిన వెళ్లి కలిశడు. లాలుతో కూడా మంతనాలు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ నెల 8న మిత్రపక్షాల నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. ఇంత జరిగినా... మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా అని విలేఖరులు ప్రశ్నించగా కేసీఆర్ మౌనం పాటించాడు.
- విలేకరుల సమావేశంలో కె సి ఆర్ కింది వ్యాఖ్యలు చేసాడు.
- తెలంగాణ గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్న సీఎంను తెలంగాణ కాంగ్రెస్ నేతలెలా భరిస్తున్నారో? తాము ఎటువైపో వాళ్లు తేల్చుకోవాలి. తెలంగాణను తెరమరుగుచేసే వైఎస్‌ను తెరమరుగు చేయడానికి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.
- వైఎస్‌కు చరిత్ర జ్ఞాపకం లేదనుకుంటా. తెలంగాణ అంశాన్ని విస్మరించినవారే తెరమరుగయ్యారు. బ్రహ్మానందరెడ్డి నుంచి చంద్రబాబు వరకు చాలామంది ఇలాగే పోయారు. వైఎస్‌కు తెరమరుగయ్యే కాలం వచ్చింది కాబట్టే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు!
- రాష్ట్ర ప్రభుత్వం కిల్లర్ గ్యాంగ్‌లను పెంచి పోషిస్తోంది. నర్సా కోబ్రాలు.. కాకతీయ కోబ్రాలు... ఎక్కడికి దారితీస్తాయివి?
- సమస్య రాజకీయంతో పరిష్కారం కాదు. రాజనీతిజ్ఞతతో పరిష్కరించాలి. ఇప్పుడు కావాల్సింది అదనపు ఆయుధాలు కాదు. అదనపు వనరులు... ఆలోచనలు.
- శ్రీలంకలో మంత్రిని చంపిన వారంలోపే అక్కడి ప్రభుత్వం టైగర్లను చర్చలకు పిలిచింది. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతాన్ని పాటిస్తోంది.
- నక్సల్స్‌పై ప్రధానితో మాట్లాడతానని సోనియా చెప్పారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని అన్నారు. వైఎస్ వైఖరి అలా ఉంది. ఇక్కడ అభిప్రాయం ఇలా ఉంది. అందుకే యూపీఏ ప్రభుత్వంలో ఉండాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాం.
- సెప్టెంబర్ 2: పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని, సి పి ఐతో పొత్తు పెట్టుకుంటామని తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించాడు. అయితే తెరాసది వన్‌వే ప్రేమ అనీ, వారితో పొత్తు అసాధ్యమని సి పి ఐ నాయకుడు కె నారాయణ వ్యాఖ్యానించాడు.
- "కాంగ్రెసు పార్టీకి ఎవరిపైనా ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. మా శక్తిసామర్ధ్యాలు మాకు తెలుసు. గత ఎన్నికలలో వలెనే మిత్రులందరినీ కలుపుకుపోవాలని భావించాం. ఒంటరిగా పోటీ చేస్తామంటే, అది వారిష్టం" అని ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు కె కేశవరావు వ్యాఖ్యానించాడు.
- సెప్టెంబర్ 3: [[తెరాస]] నేత కె సి ఆర్ హైదరాబాదు లోని చంచల్‌గూడా జైల్లో నిషేధిత విరసం నేతలు వరవరరావు, కళ్యాణరావు లను కలిసాడు. వారు ఒక గంట సేపు మాట్లాడుకున్నారు. మావోయిస్టులపైన, విరసంపైన నిషేధం ఎత్తివేయిస్తే, మావోయిస్టులను చర్చలకు తాను ఒప్పిస్తానని వరవరరావు ప్రతిపాదించినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి.
- కేంద్రమంత్రి హోదాలో ఉండి, ఒక నిషేధిత సంస్థ నేతను జైలుకు వెళ్ళి కలవడం కె సి ఆర్ కు తగదని తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు విమర్శించాడు.
- తెలంగాణలో భారీస్థాయిలో మానవ హక్కుల హననం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం నిర్మిస్తాం. జాతీయస్థాయి చర్చకూ తెరతీస్తాం. ఈ విషయాన్ని ఊరికే వదిలే ప్రసక్తే లేదు అని కె.చంద్రశేఖరరావు పేర్కొన్నాడు.
- సెప్టెంబర్ 4: అవసరమైతే 'దంచుడు'కు కూడా తెలంగాణ జాగరణ సేన (టీజేఎస్) వెనుదీయదని తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు పేర్కొన్నాడు. మంచి మాటకు మంచి మాట, దంచుడుకు దంచుడు మాట... తరహాలో టీజేఎస్ వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశాడు.
- సెప్టెంబర్ 5: "చంద్రబాబు మాదిరిగానే వై.ఎస్. కూడా... ప్రాంతీయ తత్వం, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్‌కు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి" అని [[తెరాస]] నేత ఆలె నరేంద్ర అన్నాడు.
- దీనికి ప్రతిగా ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు కె కేశవరావు ఇలా అన్నాడు: "ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. నరేంద్ర పగటికలలు కంటున్నారు. ఆయనకు తెలివి ఉన్నట్టుగా అన్పించటంలేదు. నరేంద్రకు రాజకీయ పరిజ్ఞానం లేదు."
- సెప్టెంబర్ 6: తనను తెలివిలేనివాడని అన్న కేశవరావు గురించి తెరాస నేత, కేంద్రమంత్రి ఆలే నరేంద్ర ఇలా అన్నాడు: "కేకే ఓ జోకరు, వైఎస్‌కు చెమ్చా, తెలంగాణ మాతృద్రోహి. తెలంగాణేతరుడైన వైఎస్‌కు పాదాక్రాంతుడయ్యాడు"
- సెప్టెంబర్ 7: టీజేఎస్ కరడుగట్టిన తెలంగాణ వాదుల సంస్థే. ఇలా చెప్పుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కె సి ఆర్ అన్నాడు. తెలంగాణవాదాన్ని వాడవాడలా ప్రచారం చేయడమే టీజేఎస్ సైనికుల లక్ష్యమని, ఇందుకోసం వారు ముమ్మాటికీ శాంతియుత పంథాలోనే పయనిస్తారని తెలిపాడు. "ఎవరైనా రెచ్చగొడితే మాత్రం టీజేఎస్ సైనికులు రెచ్చిపోతారు. అవసరమైతే హింసా మార్గంలోకి మళ్లుతారు. ఆందోళనపథంలో తెలంగాణను సాధించాల్సిన పరిస్థితి వస్తే, ఒక్క టీజేఎస్ ఏమిటి తెరాస కూడా వారితో జత కలుస్తుంది. నిజానికి తెలంగాణ ప్రజలంతా ఉద్యమిస్తారు. 1969లో ఇదే జరిగింది" అని అన్నాడు.
- కాంగ్రెసు శాసనసభాపక్షం ఇలా ప్రకటించింది: "కాంగ్రెస్ పుణ్యంతో గెలిచిన నరేంద్రకు కాంగ్రెస్‌నే విమర్శించడం తగదు. దమ్ముంటే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌తో పోటీపడి గెలవాలి."
- సెప్టెంబర్ 10: హైదరాబాదు లోని ఒక ఫంక్షన్ హాల్లో తెలంగాణా జాగరణ సేన శిక్షణ కార్యక్రమాన్ని కె సి ఆర్ ప్రారంభించాడు. "మాకు మేముగా ఎవరి జోలికీ పోబోం. కానీ మంచికి మంచిగా, చెడుకు చెడుగా టీజేఎస్ కచ్చితంగా స్పందిస్తుంది. అది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇటుకలతో దాడి చేసేవారికి రాళ్లతో సమాధానమిస్తుంది. చేతులతో దాడికి దిగేవారిని కర్రలతో ఎదుర్కొంటుంది. ఎలా ఇచ్చినా జవాబు మాత్రం పకడ్బందీగా ఇచ్చి తీరుతుంది. అంతేకాదు.., వైఎస్ వంటి దుర్మార్గుల మోసాలను గురించి ఊరూరా, వాడవాడలా, రచ్చబండలు, కచేరీల దగ్గరా... ఇలా రాష్ట్రమంతటా ప్రచారం చేస్తుంది. ప్రజలను జాగృతపరుస్తుంది." అని ఆయన అన్నాడు.
- తెలంగాణ అంటే ఏంటో టీజేఎస్ మున్ముందు రుచి చూపిస్తుందని తెరాస అగ్రనేత, కేంద్రమంత్రి నరేంద్ర అన్నాడు.
సెప్టెంబర్ 11 - సెప్టెంబర్ 20
మార్చు- సెప్టెంబర్ 11:తెలంగాణ కోసం అవసరమైతే కర్రలే కాదు... తుపాకులు, ఏకే-47లూ పట్టుకుంటాం. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, రెచ్చగొడుతుంటే ఇంకా ఎంతకాలం సహించాలి. సమయం వచ్చింది... తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించే విధంగా ఆ పార్టీని పాతాళానికి తొక్కే పరిస్థితి ఏర్పడింది అని నరేంద్ర మెదక్ జిల్లా సంగారెడ్డిలో అన్నాడు. "జాగరణ సేన చేపట్టిన లాఠీలతో కుక్కలను తరమండని కేశవరావు సూచిస్తున్నారు. మేము తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే కుక్కలనూ కొట్టమంటున్నాం" అంటూ ఘాటుగా పేర్కొన్నారు.
- తెరాసకు ఓటేయటం ద్వారా తమ ఓటును వృథా చేసుకోవద్దని తెలంగాణవాదులకు పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు పిలుపునిచ్చారు. తెలంగాణ అంశాన్ని సోనియాగాంధీకి అప్పగించినందున... కాంగ్రెస్‌ను విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణేతరుల్ని రెచ్చగొట్టేందుకే తెలంగాణ జాగరణ సేన(టీజెఎస్)ను తెరాస ఏర్పాటుచేసిందని విమర్శించారు.
- సెప్టెంబర్ 12: "మీవి డ్రామాలాడే బతుకులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేనూ వస్తున్నా. జనంలోకి పోదాం. వారే నిర్ణేతలు. ఎవరి వల్ల ఎవరు బాగుపడ్డారో అక్కడే తేల్చుకుందాం" అంటూ కె సి ఆర్ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.
- ఒకట్రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమై, ఇతర పార్టీల పొత్తులతో తప్ప గెలవలేని కమ్యూనిస్టులు... తమపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
- ఆంధ్ర వలసవాదులది బిచ్చమెత్తుకు బతికిన చరిత్ర అంటూ ఎద్దేవా చేశారు. జొన్నన్నం తప్ప గతిలేని పల్నాడు దుస్థితినీ, నీటి చుక్కకు కూడా కటకటలాడే పరిస్థితినీ శ్రీనాథ కవి ఎన్నో పద్యాల్లో వర్ణించాడు. కాకతీయులు, రెడ్డిరాజుల హయాంలో గోదావరి జిల్లాల వారు బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చారు. సన్నన్నం తినే మమ్మల్ని... క్రమంగా జొన్నన్నం స్థాయికి దిగజార్చారు. అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని చులకన చేస్తారా? అని కె సి ఆర్ ప్రశ్నించారు.
- "తెలంగాణ అనే అమృత కలశాన్ని కబళించేందుకు ప్రయత్నించే వారిని నల్లతాచుల్లా కాటేయండి. తెలంగాణ తల్లి కొంగుకు నిప్పు పెడుతున్న వ్యతిరేకుల్ని నరికి, వారి రక్తంతో ఆమె పాదాల్ని అభిషేకించండి. ఆంధ్ర వలసవాదుల చేతుల్లోంచి తెలంగాణ సంకెళ్లను తెంచేందుకు సిద్ధం కండి" అంటూ కేంద్రమంత్రి, తెరాస అగ్రనేత నరేంద్ర టీజేఎస్ ప్రేరక్‌లకు పిలుపునిచ్చారు.
- సెప్టెంబర్ 14:నరేంద్ర ఇలా అన్నాడు: "కేసీఆర్‌పై, నాపై కచ్చితంగా దాడులు జరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి వైఎస్, పోలీసులు కలసికట్టుగా సృష్టించిన 'కోబ్రా'లు ఇందుకు పాల్పడవచ్చు."
- కె సి ఆర్ వ్యాఖ్యలు:
- "వరవరరావును జైలులో కలిసినందుకు నన్ను అరెస్టు చేయాలంటున్నారు. అలా చేయాల్సి వస్తే... చర్చల పేరుతో నక్సలైట్లను పిలిచి రాచమర్యాదలు చేసిన వైఎస్‌నే అరెస్టు చేయాలి"
- "మంత్రి పదవులనుంచి మమ్మల్నెవరు బర్తరఫ్ చేసేది? ఢిల్లీ సర్కారే మా దయాదాక్షిణ్యాలపై నడుస్తోంది! ఈ ఎన్నికల్లో గెలిస్తేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లొల్లి ఢిల్లీకి చేరుతుంది. తెలంగాణ దెబ్బ ఏందో మరోసారి యావత్ దేశానికి చాటిచెప్పాలి"
- సెప్టెంబర్ 16: ఉదయం విజయనగరం జిల్లా జంరఝావతి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇలా అన్నాడు - తెరాస నాయకుల మాటలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉందా? వారు అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. వారిచ్చే ప్రకటనల మంచి చెడులను వారికే వదలిపెడుతున్నాను.
- కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగానే పనిచేసేవారు. బయటకు వెళ్లాకే పాడైపోయారు.
- ప్రస్తుతం కేసీఆర్ హెలికాప్టర్‌పైనే తిరుగుతున్నారు. జనంలోకొచ్చే ధైర్యం కోల్పోయారు. రాళ్ళతో కొడతారని భయం.
- మేనల్లుడు హరీష్ మంత్రి పదవి పోయింది. తన పదవి కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ తీరికలేకుండా ఉన్నారు.
- ఢిల్లీ పెద్దలకు హైదరాబాద్ బిర్యానీతో విందులు చేస్తే తెలంగాణా వస్తుందా?
- చంద్రబాబు నాయుడు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో పై విమర్శలు చేసాడు.
- కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెరాస అధినేత కె.చంద్రశేఖరరావుకు చేదు అనుభవం ఎదురయింది. రోడ్‌షో పేలవంగా సాగింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో అర్ధాంతరంగా ప్రచారం ముగించుకుని హెలికాప్టరులో మంచిర్యాల వెళ్ళిపోయాడు.
- సెప్టెంబర్ 17: నిజాం సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు. తెదేపా, భారతీయ జనతా పార్టీ, తెరాస పక్షాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాయి. అయితే ఈ పార్టీల రాష్ట్ర అధ్యక్షులెవరూ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మున్సిపోల్స్ ప్రచారంలో నిమగ్నం కావడమే దీనికి కారణం.
- మహబూబ్‌నగర్‌లో జరిగిన వివిధ ఎన్నికల ప్రచార సభల్లో కెసిఆర్ ఇలా అన్నారు:
- తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. పెద్ద అహంకారి. అహంభావి. అణిచివేతదారు అని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు నిప్పులు కక్కారు. ఇతర ప్రాంతాల కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్న వైఎస్ కనుమరుగుకాక తప్పదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని కేసీఆర్ అంగీకరించారు. అయితే.. అది వైఫల్యం మాత్రం కాదని అన్నారు.అన్ని విషయాల్లోనూ తమను రెచ్చగొట్టేలా వైఎస్ మాట్లాడుతున్నారని, అందుకే తాము స్పందించాల్సి వస్తోందని కేసీఆర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలో తన రోడ్ షోకు జనం రాలేదనడం అవాస్తవమని చెప్పారు. 'నేను అన్ని వార్డుల్లోకీ రావాలనే ఉద్దేశంతో మా స్థానిక నేతలు జనాన్ని వారివారి వార్డుల్లోనే నిలిపి ఉంచారు. ఈ విషయంలో వారి మధ్య సమన్వయం లోపించింది. దాంతో కూడలి వద్ద జనం తక్కువగా కన్పించారు' అని చెప్పారు.
- రాష్ట్రంలో మంత్రి పదవులు వద్దన్న. సోనియాగాంధే పిలిచి.. మీ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో బువ్వ తింటున్నాం. పొత్తు కలిసి గెలిచినం. ప్రభుత్వంలో చేరండి అంది. బలవంతం చేస్తే చేరినం. దానికి ఒకటే లొల్లి. వరంగల్ సభకు లక్షల మంది వస్తే... మేమూ తెలంగాణ అంటూ గులాం నబీ అజాద్ మా ఇంటికి వచ్చిండు. మాయమాటలు చెప్పిండు. మాతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు మోసం చేసిండు. పదేళ్లు అధికారంలో లేని కాంగ్రెస్ తెరాస జెండావల్ల బతికింది. చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయిండు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసోళ్ళు పాలమూరులో తొండి చేసిండ్రు. సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి పోటీకి నిలిపిండ్రు. ఈసారి ఎవరి బలమెంతో తేల్చుకోవడానికి ఒంటరిగా బరిలోకి దూకినం.
- సెప్టెంబర్ 18: అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కండువాతో ప్రచారం చేసి అధికారంలోకొచ్చావు. ఇప్పుడు మేం ఒంటరిగా పోటీ చేస్తుంటే నక్సలైట్లంటున్నావు. ఇదెక్కడి ధర్మం అని ముఖ్యమంత్రి వైఎస్ నుద్దేశించి తెరాస అధినేత చంద్రశేఖర్‌రావు నల్గొండ జిల్లా భువనగిరిలో పురపాలక ఎన్నికల ప్రచార సభలో అన్నాడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసినా. ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ అనగానే నక్సలైటునయిపోయానా? అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునూ నిలదీశాడు.
- కమ్యూనిస్టులు తెలంగాణ వ్యతిరేక ఉన్మాదులని కేసీఆర్ ఆరోపించాడు. వారు తినేది తెలంగాణ తిండి, పాడేది ఆంధ్రపాట అని మిర్యాలగూడలో దుయ్యబట్టాడు. కమ్యూనిస్టులు పొద్దుతిరుగుడు పువ్వులాంటి వారు, పొత్తు ఉంటేనే వికసిస్తారని చురకవేశాడు. గతంలో తెలంగాణకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ కావాలని కోరిన కమ్యూనిస్టులు ఇప్పుడేమీ మాట్లాడకుండా పొయ్యిలో పడుకున్నారని ఎద్దేవా చేశాడు. రాష్ట్రంలో తెదేపాకు ఒక్క మున్సిపాలిటీ దక్కదని జోస్యం చెప్పాడు.
- సెప్టెంబర్ 19: నక్సలిజంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కేంద్ర మంత్రి కె చంద్రశేఖర రావు పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఆయన పార్టీ నక్సల్స్‌తో స్నేహం చేస్తోందని సూటిగా ఆరోపించాడు.
- మావోయిస్టులపై నిషేధం విధించడాన్ని తెరాస నాయకులు బహిరంగంగా విమర్శించారు.
- ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులతో తెరాస స్నేహం ప్రదర్శిస్తోంది. కేంద్ర మంత్రి కేసీఆర్ విరసం నేత వరవరరావును జైలు లో కలుసుకున్నారు.
- అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌ను ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్న నక్సల్స్ తెరాసకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
- టీజేఎస్ పేరిట పాక్షిక మిలిటరీ సంస్థను ఏర్పాటు చేసిన తెరాస... మాజీ ఆరెస్సెస్ ముఖ్యుడితో వారికి శిక్షణ ఇప్పిస్తోంది. నక్సల్స్, మాజీ మిలిటెంట్లు, ఆరెస్సెస్ వారు ఇందులో చేరుతున్నారు. అయితే టీజేఎస్, మావోయిస్టుల మధ్య ఆందోళనకర స్థాయిలో సంబంధాలేవీ లేవు.
- తెరాస నాయకులు రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రకటనలను పత్రికలు, పార్టీలు ఖండించాయి.
- సెప్టెంబర్ 20: దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 19 న జరిగిన సీఎంల సమావేశంలో తాను తెరాసను విమర్శిస్తూ మాట్లాడలేదని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విలేకరులకు వివరించారు. మావోయిస్టుల సమస్యపై ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తెరాసపై నేను ఫిర్యాదు చేయలేదు. నిప్పులు చెరగలేదు. అసలు స్లయిడ్స్ చూపలేదు. చంద్రశేఖరరావు పేరూ ప్రస్తావించలేదు.
సెప్టెంబర్ 21 - సెప్టెంబర్ 30
మార్చు- సెప్టెంబర్ 21: ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్న తెరాస నేతలు నరేంద్ర, కె.చంద్రశేఖర్‌రావులతోపాటు మరో 30 మందిపై ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. పెమ్మరాజు శ్రీనివాస్ అనే విలేకరి బుధవారం నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వద్ద నేరుగా ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని విచారించిన మెజిస్ట్రేట్ గుర్రప్ప తదుపరి చర్యల నిమిత్తం ఫిర్యాదును బంజారా హిల్స్ పోలీసులకు రిఫర్ చేశారు.
- ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు వరంగల్ నగరంలోని కాజీపేటలో కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ తమపై ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో వేసినా , తూటాలు పేల్చినా తమ ఉద్యమం ఆగదని, ప్రాణాలు పోయినా దీనిని ఆరిపోనీయమని అన్నారు.
- సెప్టెంబర్ 22: తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు ఇలా అన్నారు: తెలంగాణ పెట్టిన భిక్షతో కాంగ్రెస్ బతికిందని, తెరాస ఉద్యమాన్ని ఆక్సిజన్‌గా ఉపయోగించుకున్న ఆ పార్టీ, నేడు అన్నం పెట్టిన చేతికే సున్నం చుడుతోంది. ముఖ్యమత్రి వై.ఎస్.కు వణుకుడు పుట్టాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ తెరమరుగువతుందని వై.ఎస్. వ్యాఖ్యానించిన రోజే కేంద్రంలో రాజీనామా చేయాలని నిర్ణయించామని, ప్రధానిని కలిసేందుకు అనుమతి కూడా తీసుకొని రాజీనామా పత్రాలు సిద్ధం చేశామని తెలిపారు. అయితే పవార్ సర్దిచెప్పడంతో వెనుకడుగు వేశామన్నారు.
- తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ ఉద్యమం జావగారకుండా, జబ్బలు జారేయకుండా ఉండటానికే తెలంగాణ జాగరణ సేన్(టి.జె.ఎస్.)ను ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ నినాదానికి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి తెదేపా నేతలు కలిసి రావాలని కేసీఆర్ కోరారు.
- తమ పార్టీ నేత నరేంద్ర సాధారణంగా మాట్లాడే ఊతపదాలను తప్పుగా చూపుతున్నారని, టి.జె.ఎస్. శ్రేణులను ఉత్తేజపరచాలనే లక్ష్యంతోనే ఆయన ఆ పదాలను ఉపయోగిస్తున్నారని కేసీఆర్ వివరించారు.
- తెరాసకు నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితం ఉందని, మా పార్టీ లక్ష్యం, ఆశయం అన్నీ తెరిచిన పుస్తకాలని, తమ పార్టీ ఎక్కడా హింసకు పాల్పడలేదన్నారు. ఇదే విషయాన్ని జడ్జీకి వివరిస్తామన్నారు.
- బీహార్ ఎన్నికల దాకా వేచి చూసి ఆ తరువాత మిత్రులతో సమావేశమై తెలంగాణ రాదనుకున్న క్షణమే రాజీనామా చేసేందుకు వెనుకాడమన్నారు. తెరాస ఎప్పుడూ మానవీయ కోణన్ని వదులుకోదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్ర పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామన్నారు.
- సెప్టెంబర్ 24: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో [[తెరాస]] నిర్ణయాత్మక శక్తిగా అవతరించనుందని, ఆరు మున్సిపాలిటీలు గెలుచుకుంటామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో తెదేపాకు నిండుసున్నాయే గతి. ఒక్క మున్సిపాలిటీనీ సొంతగా గెలుచుకోలేదు. ఇక కాంగ్రెస్ కనాకష్టంగా గద్వాల మున్సిపాలిటీని గెలుస్తుంది..అదీ బొటాబొటీ మెజారిటీతో! అని వ్యాఖ్యానించారు.
- సెప్టెంబర్ 25: "ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి అనుమానాలకు తావిస్తోంది. ఇది నిజం కాదని నిరూపించాలంటే తక్షణం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి" అని కేంద్రమంత్రి, [[తెరాస]] అగ్రనేత ఆలె నరేంద్ర డిమాండ్ చేశారు.
- సెప్టెంబర్ 26: పురపాలక ఎన్నికలలో కాంగ్రెసు ఘనవిజయం సాధించింది. తెలుగుదేశం, తెరాస ఘోరంగా ఓడిపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో [[తెరాస]] నిరాశానిస్పృహల్లో కూరుకుపోయింది. పార్టీ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ముఖం చాటేశారు. మధ్యాహ్నం రెండింటికి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో కేసీఆర్ పాల్గొంటారని తెరాస కార్యాలయం నుంచి ఉదయం సమాచారమందింది. పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడయ్యాక తెరాస కేవలం రెండు మున్సిపాలిటీలకు పరిమితమైన విషయం స్పష్టమైంది. దీంతో కేసీఆర్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పార్టీ అగ్రనేత నరేంద్ర, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డిలను పురమాయించి తాను ఇంట్లోనే ఉండిపోయారు.
- సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సమితిలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయ్! ఇన్నాళ్ళూ నివురుగప్పిన నిప్పులా దాగున్న అసంతృప్తి మున్సిపల్ ఎన్నికల ఘోర పరాజయం నేపథ్యంలో.... ఒక్కసారిగా పెల్లుబికింది. లుకలుకలూ బయటపడుతున్నాయ్! అగ్రనేతలు కేసీఆర్, నరేంద్రలపై ఇద్దరు ఎమ్మెల్యేలు - మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాస రావు - బహిరంగంగా ధ్వజమెత్తారు.
- రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో గళం కలపటమే కాకుండా పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు సీనియర్ నేత ఆలె నరేంద్రపై పార్టీలో దుమారం మొదలైంది. అంతా ఆయన్నే వేలెత్తి చూపిస్తున్నారు. నరేంద్ర భాష వల్లే పార్టీకీ దుస్థితి తలెత్తిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్!
- సెప్టెంబర్ 28: హైదరాబాదులో జరిగిన [[తెరాస]] శాసనసభా పక్ష సమావేశానికి మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు హాజరు కాలేదు. వారిద్దరితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ సమావేశం కె సి ఆర్కు కట్టబెట్టింది.
- సెప్టెంబర్ 29: [[తెరాస]] శాసనసభా పక్ష నేత, మాజీ మంత్రి కె విజయరామా రావు ఇలా అన్నారు:
ఎన్నికలకు ముందు తెలంగాణా జాగరణ సేనను ఏర్పాటు చేయడం వలన పార్టీకి ఎన్నికలలో నష్టం కలిగింది. అయితే దానిని మూసే ఆలోచన లేదు. అనారోగ్యకారణాల వలన టి జే యెస్ నాయకుడు ఉమాకాంత్‌ను మారుస్తున్నాము. సమర్ధుడైన వ్యక్తి దొరికితే మైనారిటీ వ్యక్తికయినా ఈ పదవిని ఇస్తాము.