తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం

తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని ములుగు పట్టణంలో ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయం.

తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాలోని ములుగు పట్టణంలో ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయం. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసి దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనుంది.[1]

తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం
రకంప్రభుత్వ
స్థాపితం2022
ఛాన్సలర్తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
స్థానంములుగు, ములుగు జిల్లా, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంత
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్

ప్రత్యేకంగా అటవీ విద్యకోసం ఏర్పాటుచేయబడుతున్న దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయమిది.[2] అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతోపాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్దంగా ఉంది.[3]

చరిత్ర

మార్చు

కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్ర్తాల్లో నూతన కోర్సులతోపాటు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేందుకు అటవీ విశ్వవిద్యాలయాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు. 2022 జనవరి 17న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుతోపాటు బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సు చదివిన వారికి అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25%, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో 50%, ఫారెస్టర్స్ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు) కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.[4]

తెలంగాణ ప్రభుత్వం 2016లో ములుగు పట్టణంలో అటవీ కళాశాలతోపాటు పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)ను ఏర్పాటుచేసింది. ఆ సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు 2022 సెప్టెంబరు 12న ‘తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022’ ఈ బిల్లును రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రవేశపెట్టగా, సెప్టెంబరు 13న అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.[5] అదేరోజు శాసనమండలిలో కూడా ఆమోదం పొందింది.

ప్రత్యేకత

మార్చు
  • అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు శాసనసభ, శాసన మండలిలలో ఆమోదంపొందడం దేశ అటవీ విద్యలో ఒక చారిత్రాత్మక ఘట్టం.
  • “అటవీ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ), తెలంగాణ చట్టం, 2022” దేశంలోనే మొట్టమొదటిది.
  • ప్రపంచంలో ఇదే మూడవ అటవీ విశ్వవిద్యాలయం. రష్యా, చైనా తర్వాత మూడవది భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది.[6]

పరిపాలన

మార్చు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాన్స్‌లర్‌గా వ్యవహరించనున్న ఈ అటవీ విశ్వవిద్యాలయానికి తొలి వీసీని చాన్స్‌లర్‌ నియమిస్తాడు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా జరుగుతుంది. స్నాతకోత్సవం కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతనే నిర్వహించాలని బిల్లులో పొందుపరిచబడింది.[7] ప్రస్తుతం ఇందులో 366మంది విద్యార్థులుండగా అదనంగా 360 పెరిగి 726 మందికి చేరుతుంది. ఉద్యోగుల సంఖ్య 118కు అదనంగా 92 పెరిగి 210 కి చేరుతుంది.

విధులు

మార్చు
  • అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణతోపాటు ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధన
  • సంప్రదాయక అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలుగా పరిశోధనలు చేయడం
  • తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం పథకాన్ని మరింత పటిష్ఠంగా నిర్వహించడం

కోర్సులు

మార్చు

ఇందులో పీహెచ్‌డీ, పట్టన అటవీ వనాలు, నర్సరీ మేనేజ్‌మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, క్లైమేట్ స్మార్ట్ ఫారెస్ట్రీ, ఫారెస్ట్ పార్క్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ఉండనున్నాయి.

పీహెచ్‌డీ

2023 ఫిబ్రవరి 10న పీహెచ్‌డీ కోర్సు ప్రారంభమైంది. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్‌ను అసెంబ్లీలోని తన చాంబర్‌లో తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించాడు. సిల్వికల్చర్‌-ఆగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్‌ బయాలజీ-ట్రీఇంప్రూవ్‌మెంట్‌, ఫారెస్ట్‌ రిసో ర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫారెస్ట్‌ ప్రొడక్ట్స్‌ యుటిలైజేషన్‌ విభాగాల్లో అధ్యయనానికి వీలుగా ఈ పీహెచ్‌డీ కోర్సు ప్రారంభించబడింది.[8][9]

ఫారెస్ట్‌ మ్యూజియం

మార్చు

ప్రజలకు దేశంలో అటవీప్రాంతాలు, నేలల రకాలపై అవగాహన కోసం విద్యార్థులు, అధ్యాపకులు రెండేండ్లపాటు వివిధ ప్రాంతాల అడవులను సందర్శించి సేకరించిన వాటితో ఈ ప్రాంగణంలో ఫారెస్ట్‌ మ్యూజియం ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ అటవీప్రాంతాలు, జంతువుల ఆకృతులు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు, రూపాలు, జంతువుల పాదముద్రలు ఉన్నాయి. అడవిలోకి వెళ్లినట్టుగా ఉండేలా వివిధ రకాల జంతువుల బొమ్మలు, చెట్లను ఈ మ్యూజియంలో ఏర్పాటుచేశారు. రాష్ట్ర చిహ్నాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు వాటి చిత్రాలు, శిల్పాలు, ఖనిజాలు, శిలాజాలు, మృత్తికల చిత్రాలు, జంతువుల పాదాల అచ్చులు, 32 రకాల సీతాకోక చిలుకలు, 10 రకాల గొల్లభామలు, మిడతలు, తేనెటీగల చిత్రాలు ఇక్కడి ప్రదర్శనలో ఉన్నాయి.[10]

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-09-13). "తొలి ఫారెస్ట్‌ వర్సిటీకి బీజారోపణ". Namasthe Telangana. Archived from the original on 2022-09-14. Retrieved 2022-09-16.
  2. telugu, NT News (2022-09-27). "ములుగు ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ ప్ర‌పంచంలోనే మూడోది." Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-30.
  3. Sai, Anand (2022-09-13). "Telangana Forest University : తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ కోర్సులు, ఇతర విషయాలు మీకు తెలుసా?". Hindustantimes Telugu. Archived from the original on 2022-09-13. Retrieved 2022-09-16.
  4. "TS News: అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం". EENADU. 2022-01-17. Archived from the original on 2022-01-27. Retrieved 2022-09-16.
  5. "తెలంగాణలో అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-14. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  6. G, Rajesh (2022-09-13). "అటవీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, ముఖ్యమైన అంశాలు ఇవే..." Mango News. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  7. "Telangana news: తెలంగాణలో తొలి ఫారెస్ట్‌ యూనివర్సిటీ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్‌". EENADU. 2022-09-12. Archived from the original on 2022-09-13. Retrieved 2022-09-16.
  8. "అటవీ కళాశాల పీహెచ్‌డీ బ్రోచర్‌ ఆవిష్కరణ". EENADU PRATIBHA. 2023-02-11. Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13.
  9. telugu, NT News (2023-02-11). "ములుగు అటవీ కళాశాలలో పీహెచ్‌డీ". www.ntnews.com. Archived from the original on 2023-02-11. Retrieved 2023-02-13.
  10. telugu, NT News (2022-10-30). "ఆకర్షణీయంగా ఫారెస్ట్‌ మ్యూజియం". www.ntnews.com. Archived from the original on 2022-10-30. Retrieved 2022-11-03.