తెలుగు సినిమా పాట
1971-1978
మార్చుఈ కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సి.నారాయణరెడ్డి మొదలైన సాహితీ ప్రముఖులు సినిమా పాట విలువను పెంచారు. వీరికి తోడుగా వేటూరి, మల్లెమాల, జాలాది, గోపి మొదలైన కొత్త కవులు చిత్రరంగ ప్రవేశం చేశారు.
దేవులపల్లి శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ చిత్రానికి నా దారి ఎడారి, నా పేరు బికారి అనే గీతం, ఆరుద్ర ముత్యాలముగ్గు చిత్రం కోసం ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ వంటి తెలుగుతనం నిండిన పాటని రచించారు. దసరా బుల్లోడు, ప్రేమనగర్ చిత్రాల పాటలు అపూర్వ విజయం సాధించి ఆత్రేయకు తెలుగు సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు లభించాఅయి. సామాన్యునికి అర్థమయ్యే భాషలో "మనసుగతి యింతో మనిషి బ్రతుకింతే" లాంటి భావుకత కలిగిన మనసుకవి ఆత్రేయ ఈకాలంలో రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడని పేరుపడ్డారు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం తెలుగువీర లేవరా పాటను రచించిన శ్రీరంగం శ్రీనివాసరావు జాతీయ స్థాయిలో మొదటిసారిగా తెలుగు పాటకు గుర్తింపు తెచ్చాడు. తొలిసారిగా సినీ గేయరచయితగా ప్రవేశించిన జాలాది రాజారావు ప్రాణం ఖరీదు సినిమా కోసం "ఏతమేసి తోడినా ఏరు ఎండదు అంటూ సందర్భోచితమైన పాటను రచించారు. వీరు జానపద, సామాజిక తాత్త్విక భావాలతో నిండిన పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇదే కాలంలో రాజశ్రీగా ప్రవేశించిన ఇందుకూరి రామకృష్ణంరాజు కురిసింది వాన నా గుండెలోన అనే గీతంతో పాటు ఉన్నతమైన డబ్బింగ్ చిత్రాలకు సాహిత్య విలువల్ని చేర్చి వాటిని ప్రధానబరిలోని సినిమాలతో సమానంగా సినీ సాహిత్యాన్ని కూర్చారు.
1979-1991
మార్చుఈ మధ్యకాలాన్ని డాక్టర్ పైడిపాల తన సినిమా పాట చరిత్ర అనే పరిశోధన గ్రంథంలో అయోమయంగా వివరించారు. అడవి రాముడు, యమగోల చిత్రాలు సాధించిన విజయాలతో పాట స్వరూపం మారిపోయింది. పాటల రచయితల సంఖ్య పెరిగింది. ఈకాలంలో వేటూరి సుందరరామమూర్తి రాసిన గీతాలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఇదే కాలంలొ సిరివెన్నెల చిత్రానికి పాటలు రాసి తెలుగు సినిమా పాటకు ఎంతో మంచిపేరు తెచ్చిన సీతారామశాస్త్రి, తన తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా చేసుకొని నేటికీ సాహిత్యసౌరభాలతో కూడిన పాటల్ని రచించి సినీ ప్రేమికుల్ని అలరిస్తున్నారు.
"విరించినై విరచించితిని ఈ కవనం" అంటూ రాసిన శాస్త్రిగారు "బోటనీ పాఠముంది మేటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పరా" అనే యూత్ ను ఊగించారు. అదే సమయంలో వెన్నెలకంటి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మొదలైన గీత రచయితలు సినీరంగ ప్రవేశం చేశారు. "గువ్వ గోరెంకతో అడిందిలే బొమ్మలాట" అనే పాటతో ఖైదీ నం. 786 చిత్రం ద్వారా భువనచంద్ర ప్రవేశించారు.ఆకాలంలో వచ్చిన సినిమా పాటల్ని పరిశీలిస్తే అనేక ధోరణులు కనిపిస్తాయి. బాణీలకు సరిపోయే పదాల సమతూకంతోనే ఎక్కువగా పాటల రచన జరిగేది.
1992-ప్రస్తుతం
మార్చు1992 తర్వాత ఎందరో కొత్త గీత రచయితలు సినీరంగ ప్రవేశం చేసారు. వీరిలో చంద్రబోస్, పోతుల రవికిరణ్, భాస్కరభట్ల రవికుమార్ మొదలైన వారున్నారు.
చంద్రబోస్ తాజ్ మహల్ చిత్రానికి తొలిసారిగా "మంచుకొండల్లోన చంద్రమా మళ్లీ మళ్లీ వచ్చిపో" అని రాశారు. తర్వాత స్టూడెంట్ నంబర్ 1, పరదేశి పాటలు ఎంతో విజయవంతమయ్యాయి. నా ఆటోగ్రాఫ్ సినిమాకు రాసిన "మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది" ఎంతో సందేశాత్మకంగా సాగుతుంది.
వీరు కాకుండా తక్కువైనా చక్కని గీతారు రాసిన రసరాజు ఒకరు. వీరు అసెంబ్లీ రౌడీ కోసం రాసిన "అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె" ఒక చక్కని గీతం.
మూలాలు
మార్చు- తెలుగు సినిమా పాట తీరు-తెన్నులు, ఆచార్య పల్లికొండ ఆపదరావు, వెయ్యేళ్ళ తెలుగు వెలుగు, సంపాదకులు: ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, 2009, పేజీలు: 251-272.