దేశీయ ఆర్యులు

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఆర్యులు భారతీయులే అని చెప్పే సిద్ధాంతం

దేశీయ ఆర్యుల సిద్ధాంతం ప్రస్తుతం పాశ్చాత్యులు ప్రతిపాదించగా సాధారణంగా ఆమోదంలో ఉన్న వేదకాలాన్ని, ఇతర భారతీయ కాలక్రమాన్ని త్రోసిరాజంటూ పౌరాణిక కాలక్రమంపై ఆధారపడిన భారతీయ సాంప్రదాయిక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తూ[1] వేదకాలం మరింత ప్రాచీనమైనదని చెప్పే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం సింధు లోయ నాగరికత చరిత్రను కూడా తన కోణం నుంచి చెప్తుంది. ఈ సిద్ధాంతం దృష్టిలో, "భారతీయ నాగరికత సా.పూ. 7000 - 8000 కాలం నాటి సింధు నాగరికత నాటి నుండి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంప్రదాయం". [2] నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న గడ్డిభూముల (స్టెప్పీలు) నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆ ప్రాంతమే ఇండో-యూరోపియన్ భాషలకు మూలస్థానమనీ ఇండో యూరోపియన్ వలస నమూనా (ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కొత్త రూపం) ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఈ ఇండో యూరోపియన్ వలస నమూనాకు ఈ దేశీయ ఆర్యుల సిద్ధాంతం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.[3] [4] [5]

భారతీయ చరిత్ర, గుర్తింపుకు సంబంధించి సాంప్రదాయిక, మతపరమైన అభిప్రాయాలపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. హిందుత్వ రాజకీయాల్లో ఈ సిద్ధాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. [6] [7] [1] హిందూ మతం, భారతదేశ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రాలకు చెందిన పండితులు ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తారు. [8] [9] [10] ప్రధాన స్రవంతి పండితుల్లో దీనికి అంతగా మద్దతు లేదు.[note 1] దేశీయ ఆర్యులు అనేవారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదని ప్రధాన స్రవంతి పండితులు ఎక్కువగా నమ్ముతారు.

చారిత్రక నేపథ్యం మార్చు

1850 లలో మాక్స్ ముల్లర్, పశ్చిమ ఆర్యులు, తూర్పు ఆర్యులు అనే రెండు అర్య జాతుల భావనను ప్రవేశపెట్టాడు. పశ్చిమ ఆర్యులు కాకసస్ ప్రాంతం నుండి ఐరోపాకు, తూర్పు ఆర్యులు కాకసస్ నుండి భారతదేశానికీ వలస వచ్చారు. ఈ రెండు సమూహాలూ విభిన్నమైనవిగా చిత్రీకరిస్తూ ముల్లర్, పశ్చిమ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యతనూ విలువనూ ఇచ్చాడు. అయితే, "తూర్పుకు వెళ్ళిన ఆర్య జాతి శాఖ, తూర్పున ఉన్న స్థానికుల కంటే శక్తివంతమైనది, వారిని సులభంగా జయించగలిగింది." అని కూడా చెప్పాడు. [11] 1880 ల నాటికి, అతని ఆలోచనలను జాత్యహంకార శాస్త్రవేత్తలు అంగీకరించి స్వీకరించారు.

సింధు లోయ (హరప్పన్) నాగరికత ఆవిష్కరణతో ఆర్యుల "దండయాత్ర" ఆలోచనకు ఆజ్యం పోసినట్లైంది. పాశ్చాత్యులు చెప్పిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం (ఆ.దం.సి) ప్రకారం ఆర్యులు వలస వచ్చే సమయానికి సింధు నాగరికత క్షీణించింది. ఇది విధ్వంసక దండయాత్రను సూచిస్తుంది. ఈ వాదనను 20 వ శతాబ్దం మధ్యకాలంలో పురావస్తు శాస్త్రవేత్త మోర్టిమర్ వీలర్ కల్పన చేసాడు. మొహెంజో-దారోలో పై పొరల్లో కనిపించే సరిగ్గా పూడ్చిపెట్టని శవాలు అనేకం ఈ దండయాత్రల బాధితులేనని అతడు వ్యాఖ్యానించాడు. సింధు నాగరికత నాశనానికి వేద దేవుడైన "ఇంద్రుడే నిందితుడు" అని చెప్పి వీలర్ ప్రఖ్యాతుడయ్యాడు. [12] ఆ తరువాతి కాలంలో పండిత విమర్శకులు, సరిగా పూడ్చని ఈ అస్థిపంజరాలు నరమేధానికి చిహ్నం కాదని, హడావుడిగా చేసిన ఖననాలే అందుకు కారణమని, వీలర్ దాన్ని తప్పుగా చిత్రించాడనీ వాదించారు. [12]

 
కజనాస్ ప్రకారం ఇండో-ఇరానియన్ వలసలు. [13]

ఇండో-అర్యుల వలస సిద్ధాంతం మార్చు

 
ఇండో- అర్య వలసల్లో భాగమైన ఇండో-యూరోపియన్ వలసలు -సా..పూ 4000 నుండి 1000 వరకు. కుర్గాన్ మోడల్ ప్రకారం : ఉర్హైమాట్ ( సమారా సంస్కృతి, స్రెడ్నీ స్టోగ్ సంస్కృతి, తదుపరి యామ్నా సంస్కృతి ) (గులాబీ) ; ఇండో-యూరోపియన్ మాట్లాడే ప్రజలు సా.పూ. 2500 వరకు స్థిరపడిన ప్రాంతం. (ఎరుపు) ; సా.పూ. 1000 వరకు స్థిరపడిన ప్రాంతం (నారింజ) ప్రాంతం. [14] [15]

వలసలు మార్చు

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని 1980 ల నుండి ప్రధాన స్రవంతి పండితులు విసర్జించారు.[16] దాని స్థానంలో వాళ్ళు ఇండో-అర్యుల వలస సిద్ధాంతం అనే మరింత అధునాతన నమూనాలను భుజాలకెత్తుకున్నారు. [17] [note 2] ఇండో-యూరోపియన్- మాట్లాడే ప్రజలు పాంటిక్ స్టెప్పీల్లోని తమ ఉర్హైమాట్ (అసలైన మాతృభూమి) నుండి మధ్య ఆసియా మీదుగా లెవాంట్ ( మిటాన్నీ), దక్షిణ ఆసియా, అంతర ఆసియా (వూసున్, యీఝీ) లలోకి వలస వెళ్ళి ఇండో-అర్య భాషలను దక్షిణ ఆసియాలోకి ప్రవేశపెట్టారు అని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇది కుర్గాన్-పరికల్పన / సవరించిన స్టెప్పీ సిద్ధాంతంలో భాగం. ఈ సిద్ధాంతం, ఇండో-యూరోపియన్ మాట్లాడే ప్రజల వలసల ద్వారా పశ్చిమ ఐరోపాలో ఇండో-యూరోపియన్ భాషల వ్యాప్తి గురించి మరింతగా వివరిస్తుంది

చారిత్రక భాషాశాస్త్రం, ఈ సిద్ధాంతానికి ప్రధాన ఆధారాన్ని అందిస్తుంది. భాషల అభివృద్ధిని, మార్పులనూ విశ్లేషణ చేస్తూ, వివిధ ఇండో-యూరోపియన్ భాషల మధ్య సంబంధాలను ఏర్పరుస్తూ, అవి అభివృద్ధి చెందిన కాలావధులను వివరిస్తూ చారిత్రిక భాషాశాస్త్రం ఈ సిద్ధాంతానికి సహాయపడుతుంది. వివిధ భాషల్లో సామాన్యంగా కనిపించే పదాల గురించి, ఇండో-యూరోపియన్ భాషల్లో ఆ పదాల మూలం ఎక్కడుందో చెబుతూ, ఆ భాష ఏ ప్రాంతానికి సంబంధించినదో చెబుతూ, నిర్దుష్ట ప్రాంతాలకు ఆపాదించవలసిన నిర్దుష్ట పదజాలం గురించిన సమాచారాన్ని అందిస్తుంది. [4] [19] [20] భాషా విశ్లేషణలు, డేటాలకు పురావస్తు డేటా, మానవ శాస్త్ర వాదనలు బలాన్ని చేకూరుస్తాయి. ఇవన్నీ కలిసి, ఒక పొందికైన నమూనాను, [4] విస్తృతంగా ఆమోదం పొందిన నమూనాను అందిస్తాయి. [21]

ఈ నమూనాలో, ఇండో-యూరోపియన్లకు సంబంధించి కనుగొన్న తొట్టతొలి పురావస్తు అవశేషాలు యామ్నా సంస్కృతికి చెందినవి.[4] ఇది తూర్పు వైపు విస్తరించి సింటాష్టా సంస్కృతిని (సా.పూ. 2100–1800) సృష్టించింది. దీని నుండి ఆండ్రోనోవో సంస్కృతి (సా.పూ. 1800–1400) అభివృద్ధి చెందింది. BMAC నాగరికతతో (సా.పూ. 2300–1700) సంపర్కం చెంది ఇండో-ఇరానియన్లు ఉద్భవించారు. ఇది సా.పూ. 1800 లో ఇండో-అర్య శాఖ, ఇరానియన్ శాఖలుగా విడిపోయింది.[22] ఇండో-ఆర్యులు లెవాంట్ వైపుకు, ఉత్తర భారతదేశం వైపుకు, బహుశా అంతర ఆసియాకూ వలస వచ్చారు. [23]

సాంస్కృతిక కొనసాగింపు, అనుసరణ మార్చు

ఉత్తర భారతదేశానికి వలస వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఉండి ఉండకపోవచ్చు; చిన్న చిన్న సమూహాలే వచ్చి ఉంటాయి. [24] బహుశా జాతిపరంగా, జన్యుపరంగా వైవిధ్యాలతో కూడుకుని ఉండవచ్చు. వారు ఈ కొత్త ప్రాంతంలోకి తమ భాషను, తమ సామాజిక వ్యవస్థనూ ప్రవేశపెట్టారు. వీటిని పెద్ద సమూహాలు అనుకరించి, [25] [note 3] [note 4] కొత్త భాషనూ సంస్కృతినీ అవలంబించారు. [29] [30] [note 5] "ఈనాటికీ సింధు మైదానాలకూ, ఆఫ్ఘన్ బలూచీ పర్వతాల మధ్య ఏడాదికోసారి చిన్న చిన్న సమూహాల్లో పరస్పరం వలసలు జరుగుతూంటాయి." అని మైకెల్ విట్జెల్ చెప్పాడు. [27]

ఇండో-అర్యులకు సంబంధించిన పురావస్తు అవశేషాలేమీ లభించనందున జిమ్ జి. షాఫర్, హరప్పా, హరప్పానంతర కాలాల మధ్య దేశీయంగా సాంస్కృతిక కొనసాగింపు జరిగిందని వాదించాడు. [31] [32] హరప్పా నగర సంస్కృతి క్షీణించిన సమయంలో గానీ, ఆ తరువాత గానీ వాయవ్య భారతదేశంలోకి ఆర్యులు వలస వచ్చినట్లు షాఫర్ చెప్పాడు. [32] [note 6]బదులుగా, షాఫర్ "అవి స్వదేశీయం గానే సాంస్కృతిక అభివృద్ధి జరిగేలా వరసగా సాంస్కృతిక మార్పులు జరిగాయ"ని అతడు వాదించాడు.

రెండవ అవకాశం ఏమిటంటే, "ఇటువంటి భాషా సారూప్యతలు, సా.పూ రెండవ మిలీనియం అనంతరం, వాణిజ్యం ద్వారా పశ్చిమంతో ఏర్పడిన సంబంధాల ఫలితంగా వచ్చి ఉండవచ్చు". [33] సామాజిక వ్యవస్థలో కూడా కొత్త మార్గాన్ని స్వీకరించిన వ్యక్తులు దీనిని స్వంతం చేసుకున్నారు. [34] వేదాలలో భద్రపరచబడిన కథనాలను నమోదు చేయడానికి ఈ భాషను ఉపయోగించి ఉండవచ్చు. షాఫర్ ప్రకారం, "ఒకసారి క్రోడీకరించడం జరిగాక, భాషా లక్షణాలను సాహిత్యంలో ఉన్న వివరణలతో స్థిరీకరిస్తే, అప్పుడప్పుడే ఉనికి లోకి వస్తున్న వంశపారంపర్య సామాజిక ఉన్నత వర్గాలవారు తమ సామాజిక స్థితిని మెరుగుపరచుకోడానికి పనికొస్తుంది." [35]

అదే విధంగా, ఎర్డోసీ కూడా వలసలకు ఆధారాలు లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ, "ఇండో-యూరోపియన్ భాషలు వలసల ద్వారా దక్షిణాసియాలో విస్తరించే ఉంటే ఉండవచ్చునేమో గానీ.." [36] ".. ఒక నిర్దుష్ట ఆలోచనా వవస్థ గల నిర్దుష్ట జాతి-భాషా తెగగా ఉన్న ఋగ్వేద ఆర్యులు, స్వదేశీ ప్రజలే అయి ఉండవచ్చు. [37] వారి "ఆలోచనా వవస్థ"యే భారతదేశ మంతటా వ్యాపించి ఉండవచ్చు" అని అన్నాడు [36] [38]

దేశీయ ఆర్యులు మార్చు

ఆ.దం.స చెప్పిన వేదకాలాని కంటే చాలా ముందుకాలానికి చెందిన హరప్పా నాగరికతను కనుగొన్న తరువాత "స్వదేశీయత ఆలోచన" రూపు దిద్దుకోవడం మొదలైంది. (ఉత్తరాది) భారతదేశంలోని ఇండో-యూరోపియన్ భాగానికి, (దక్షిణాది) ద్రావిడ భాగానికీ మధ్య అంతరమేమీ లేదని, [39] ఇండో-యూరోపియన్ భాషలు భారతదేశంలోని తమ మాతృభూమి నుండి ప్రస్తుత ప్రదేశాలకు ప్రసరించాయనీ [40] ఈ ప్రత్యామ్నాయ అభిప్రాయం ప్రకటించింది.

పౌరాణిక కాలక్రమం మార్చు

ఈ ఆలోచనలు పురాణాలు, మహాభారతం, రామాయణంపై ఆధారపడి ఉన్నాయి. ఈ గ్రంథాల్లో భారతదేశపు సాంప్రదాయిక కాలక్రమాన్ని నిర్మించడానికి ఉపయోగించే రాజులు వారి వంశవృక్షాల జాబితాలు ఉన్నాయి. [41] [42] [43] స్వదేశీయత వాదులు "పౌరాణిక ఎజెండా"ను అనుసరిస్తారు అంటూ స్వదేశీయత సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించే విజ్టెల్ రాసాడు. [44] ఈ జాబితాల ప్రకారం భారతియ రాజుల వంశాల కాలక్రమం సామాన్యశకపూర్వం నాల్గవ సహస్రాబ్ది వరకు వెళ్తుంది. సా.పూ 300 పలో ాట్నాలో మౌర్య సామ్రాజ్యంలో గ్రీకు రాయబారి గాఉన్న మెగస్థనీస్ 6042 సంవత్సరాల క్రితానికి (సా.పూ., 3102 లో కలియుగం ప్రారంభాని కంటే ముందు కాలం) చెందిన 153 రాజుల సాంప్రదాయ జాబితా గురించి విన్నట్లు నివేదించాడు. [41] రాజ జాబితాలు శూత గాన సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. మౌఖికంగా వ్యాప్తి చెందుతూ నిరంతరం పునః రూపకల్పన చేయబడుతూ ఉండే జాబితాల నుండి అవి తీసుకోబడ్డాయి. పురాణాలు, మహాభారతం, రామాయణంపై ఇతిహాసాలు మాత్రమే. ఇవి జరిగినట్లుగా ఆధారాలు లేవు.{Sfn|Witzel|2001|p=69}}

ఈ జాబితాలకు సమర్ధనగా ఖగోళ వివరణలు కూడా అనుబంధంగా ఉంటాయి. ఋగ్వేదానికి తేదీని నిర్ధారించేందుకు కోసం కూడా వీటినే ఉపయోగించారు. [45] ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం చెప్పిన తేదీ కంటే ఈ తేదీ బాగా పూర్వానికి పోయింది. దాంతోపాటు చారిత్రక వ్యక్తులు, సంఘటనల తేదీలు కూడా వెనక్కి పోయాయి. దీని ప్రకారం బుద్ధుడు సా.పూ. 1700 నాటికి, (సా.పూ.3139/8 నాటికి కూడా కావచ్చు) చెందిన వాడు. చంద్రగుప్త మౌర్యుడి (సా.పూ.300) స్థానంలో గుప్త రాజు చంద్రగుప్తుడు వచ్చాడు. [46] కోయెన్‌రాడ్ ఎల్స్ట్ ఇలా పేర్కొన్నాడు: [note 7]

1995 ఆగస్టులో దక్షిణ భారత విశ్వవిద్యాలయాల నుండి 43 మంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం (ప్రొఫెసర్ కె.ఎమ్. రావు, డాక్టర్ ఎన్. మహాలింగం, డాక్టర్ ఎస్.డి. కులకర్ణిల చొరవతో జరిగింది) భారత యుద్ధ తేదీని సా.పూ. 3139–38 గా నిర్ణయించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తేదీని భారతీయ కాలక్రమానికి నిజమైన పునాదిగా ("షీట్ యాంకర్") ప్రకటించింది.

వేదిక్ ఫౌండేషన్ 3228 లో ప్రారంభమయ్యే ప్రాచీన భారతదేశపు కాలక్రమాన్ని ఇచ్చింది. ఇది భగవాన్ కృష్ణుడి అవతారం దాల్చడంతో మొదలౌతుంది. మహాభారత యుద్ధం సా.పూ. 3139 నాటిది. వివిధ రాజవంశాల తేదీలు ఒక సహస్రాబ్ది పాటు వెనక్కి జరగగా [note 8] గౌతమ బుద్ధుడు సా.పూ. 1894-1814 నాటి వాడని చెప్పింది.[note 9] జగద్గురు శంకరాచార్య సా.పూ. 509-477 నాటికి చెందినవాడు.[note 10] ఈ ఆలోచనల ప్రకారం భారతదేశంలో నిరంతరమైన సాంస్కృతిక పరిణామం ఉంది. హరప్పా, వేద కాలాల మధ్య ఆటంకం వచిందనడాన్ని ఇది ఖండించింది. [48] [49] కాక్ ప్రకారం,

భారత నాగరికతను సింధు సంప్రదాయం (సా.పూ. 7000 లేదా 8000) నాటి నుండి ఒక నిరంతర నిరాటంకమైన సంప్రదాయంగా చూడాలి. [2][note 11]

"దేశీయ ఆర్యత్వం" అనే ఆలోచన, మత చరిత్రకు సంబంధించి, హిందూ మతానికి ఎంతో ప్రాచీనమైన మూలాలున్నాయనే, వైదిక ఆర్యులు పురాతన కాలం నుండి భారతదేశంలో నివసిస్తున్నారనే సాంప్రదాయిక హిందూ ఆలోచనలకు సరిపోతుందని వేదిక్ ఫౌండేషన్ ఇలా పేర్కొంది:

భారతవర్ష చరిత్ర (దీనినే ఇప్పుడు భారతదేశం అని పిలుస్తారు) అంటే భరతభూమిని తమ ఉనికితో, దైవిమైన తెలివితేటలతో అలరించడమే కాకుండా, లోకం లోని దేహాత్మలకు శాంతి, ఆనందం యొక్క నిజమైన మార్గాన్ని కూడా చూపించిన దైవస్వరూపులది. దేవుని ప్రేమ లోని మాధుర్యాన్ని సన్నిహితంగా రుచి చూడాలని కోరుకునే వారికి ఇది ఈనాటికీ అనుసరణీయమే

స్వదేశీయత ప్రత్యామ్నాయం

ఇండో-అర్య వలస సిద్ధాంతంపై దాడి చేయడానికి "ఆర్యుల దండయాత్ర" అనే పాత భావనను ఉపయోగించుకున్నారు. [50] [note 12] దండయాత్ర సిద్ధాంతాన్ని దానిలో అంతర్లీనంగా ఉన్న జాత్యహంకార, వలసవాద ధోరణి కారణంగా దేశీయత ఆర్య సిద్ధాంతీకులు విమర్శించారని విట్జెల్ చెప్పాడు: [50]

ఇండో అర్య భాష మాట్లాడే ఆర్యుడి వలస ("ఆర్యుల దండయాత్ర") సిద్ధాంతంతో బ్రిటిషువాళ్ళు, భారతదేశంలో తాము చేసిన దురాక్రమణను, తమ వలస పాలననూ సమర్థించుకోవడానికి అవలంబిచిన విధానం గానే చూసారు.: రెండు సందర్భాల్లోనూ, "తెల్ల జాతి" వాళ్ళు స్థానికంగా ఉన్న నల్లరంగు వారిని అణచివేసినట్లుగానే చూసారు.

దేశీయ ఆర్యుల సిద్ధాంతాన్ని సమర్ధించే కోయెన్‌రాడ్ ఎల్స్ట్ ప్రకారం:[51]

భాషా ఆధారాల పరంగా మనం చర్చించబోయే సిద్ధాంతాన్ని విస్తృతంగా "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం" (AIT) అని పిలుస్తారు. కొంతమంది పండితులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నేను ఈ పదాలను నేను వాడతాను. భారతదేశపు భాషా దృశ్యం ప్రకారం చూస్తే రెండే వివరణలు కుదురుతాయి: ఇండో-అర్యులు స్థానికులైనా అయి ఉండాలి లేదా దండయాత్ర ద్వారా దిగుమతి అయి ఉండాలి. [note 13]

దేశీయత్వ వాదనలు మార్చు

దేశీయ ఆర్యత్వ వాదనలు మార్చు

మైఖేల్ విట్జెల్ మూడు ప్రధాన రకాల "దేశీయ ఆర్యత్వ" దృశ్యాలను గుర్తిస్తాడు: [52]

1. ఋగ్వేద ఆర్యులు అరబిందో, దయానంద సంప్రదాయం ప్రకారం భారతీయ ఉపఖండంలోని వాయవ్య ప్రాంతానికి చెందినవారిగా నొక్కి చెప్పే "తేలికపాటి" వెర్షన్ [note 14]

2. భారతదేశాన్ని ప్రోటో-ఇండో-యూరోపియన్ మాతృభూమిగా పేర్కొన్న "అవుట్ ఆఫ్ ఇండియా" సిద్ధాంతం. 18 వ శతాబ్దంలో ప్రతిపాదించబడిన ఈ సిద్ధాంతాన్ని హిందుత్వ సానుభూతిపరుడు [54] కోయెన్‌రాడ్ ఎల్స్ట్ (1999) పునరుద్ధరించాడు. హిందూ జాతీయవాదంలో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. [55] రచన శ్రీకాంత్ తలగేరి (2000) ; [53] [note 15]

3. ప్రపంచంలోని భాషలు నాగరికతలూ అన్నీ భారతదేశం నుండే ఉద్భవించాయి అని చెప్పే సిద్ద్ధాంతం. ఉదా. డేవిడ్ ఫ్రాలే

నికోలస్ కజానస్ నాల్గవ దృశ్యాన్ని చేర్చాడు:

4. ఆర్యులు సా.పూ. 4500 కి ముందే సింధు లోయలోకి ప్రవేశించి, హరప్పన్లతో కలిసిపోయారు. [16]

దేశీయత్వ వాదుల ప్రధాన వాదనలు మార్చు

  • ఇండో-అర్య వలస సిద్ధాంతాన్ని ప్రశ్నించడం:
    • ఇండో-అర్య వలస సిద్ధాంతాన్ని "ఇండో-ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం"గా ప్రదర్శించడం; [50][note 12]
    • భాషాశాస్త్ర పద్ధతిని ప్రశ్నించడం;[57][58]
    • భాషా డేటా పునర్నిర్మాణం, సంస్కృతం యొక్క ప్రాచీనత గురించి, దాని స్వదేశీ మూలాల గురించీ వాదించడం;[59][57][note 16]
    • వాయవ్య భారతదేశంలో ఇండో-అర్యుల పురావస్తు అవశేషాలు లేవు, కాబట్టి స్వదేశీ సాంస్కృతిక కొనసాగింపు కోసం వాదించడం;[57][note 17][note 16]
    • జన్యు ఆధారాలను ప్రశ్నించడం
    • చిన్నచిన్న మానవ సమూహాలు సుస్థిరమైన సంస్కృతినీ భాషలనూ పెద్దయెత్తున ఎలా మార్చగలవని ప్రశ్నించడం;
  • భారతదేశ కాలక్రమాన్ని సమీక్షించి, తిరిగి నిర్ణయించడం, వేద-పురాణ కాలక్రమాన్ని తిరిగి స్థాపించడం: [63]
    • ఋగ్వేదాన్ని, వైదిక ప్రజలనూ సా.పూ. 3 వ సహస్రాబ్దికి లేదా అంతకు ముందు కాలానికి చెందినవారేమో చూసేందుకు డేటింగ్ చెయ్యడం; [39][49][64][65]
    • సా.పూ. 2000 లో ఎండిపోయిన ఘగ్గర్-హక్రా నది, సరస్వతి నది ఒకటేనని గుర్తించడం; [66]
    • హరప్పా నాగరికతతో వైదిక ప్రజలను గుర్తించడం; [40][49]
    • హరప్పా నాగరికత, వైదిక సంస్కృతి, వేద-పురాణ కాలక్రమం సమానమైనవని నిరూపించడం. [67]

"ఆర్యుల" పట్ల అరబిందో దృక్పథం మార్చు

అరబిందో దృష్టిలో, "ఆర్యుడు" ఒక నిర్దుష్ట జాతికి చెందిన వాడు కాదు. అతడు "అంతర బాహ్య అభ్యాసాలు, ఆదర్శాలు, ఆకాంక్షలనూ కలిగిన ఒక నిర్దుష్టమైన స్వంత సంస్కృతిని అవలంబించాడు." [68] అర్యుల సాంప్రదాయిక శక్తినీ, గుణాన్నీ పునరుద్ధరించి భారతదేశ శక్తిని పునరుద్ధరించాలని అరబిందో తలపెట్టాడు. [69] "అర్య ఆక్రమణదారుల"కూ, స్థానిక నలుపు రంగు జనాభాకూ మధ్య భారతదేశంలో జాతి వైరుధ్యాలు ఉండేవన్న చారిత్రికతను అతను ఖండించాడు. అయితే, ప్రాచీన భారతదేశంలో రెండు రకాల సంస్కృతులు ఉండేవని అతను అంగీకరించాడు, ఉత్తర, మధ్య భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉన్న అర్య సంస్కృతి ఒకటి కాగా, తూర్పు, దక్షిణ, పడమర ల్లోని అనార్య సంస్కృతి రెండోది. ఆ విధంగా, ఐరోపా చరిత్రకారులు కల్పన చేసిన జాతి విభజన సిద్ధాంతం లోని సాంస్కృతిక అంశాలను అతను అంగీకరించాడు. [70]

అవుట్ ఆఫ్ ఇండియా నమూనా మార్చు

"అవుట్ ఆఫ్ ఇండియా సిద్ధాంతం" (OIT) ప్రకారం, ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం ఉత్తర భారతదేశంలో ఉద్భవించి, మిగిలిన ఇండో-యూరోపియన్ ప్రాంతానికి ప్రజల వలసల ద్వారా వ్యాపించింది. దీన్ని "భారతీయ ఉర్హైమాట్ (అసలైన మాతృభూమి) సిద్ధాంతం" అని కూడా అంటారు. హరప్పా నాగరికత ప్రజలు భాషాపరంగా ఇండో-ఆర్యన్లు అని అంతర్గతంగా ఇది సూచిస్తుంది. [8]

సైద్ధాంతిక అవలోకనం మార్చు

కోయన్‌రాడ్ ఎల్స్ట్, తన అప్‌డేట్ ఇన్ ది ఆర్యన్ ఇన్వేజన్ డిబేట్లో "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి సంబంధించి వృద్ధిలోకి వస్తున్న వాదనలను" పరిశీలించాడు.. [59] ఎల్స్ట్ ఇలా అన్నాడు: [71]

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, దేశీయ ఆర్యుల సిద్ధాంతం - ఈ రెండూ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న నిరూపణా ప్రమాణాలకు లోబడి నిరూపించబడ్డాయని వ్యక్తిగతంగా నేను భావించడం లేదు. కాకపోతే ఈ రెండు సిద్ధాంతాల్లో ఒకటి మాత్రం ఆ ప్రమాణాలకు దగ్గరవుతోంది. రాజకీయ ప్రేరితమైన భారతీయ పండితులు కొందరు, వారి అమెరికా సమర్ధకులూ చేస్తున్న ఆర్యుల దండయాత్ర సిద్ధాంతపు స్టేట్మెంట్ల లోని లోపాలను ఎత్తి చూపడంలో నేను ఆనందం పొందాను, అది నిజమే. కానీ వారు సమర్థించే సిద్ధాంతానికి ఇంకా కొంత యోగ్యత మిగిలి ఉందనే విషయాన్ని నేను తోసిపుచ్చలేను.

ఎల్స్ట్ నమూనా "సైద్ధాంతిక కసరత్తే"నని ఎడ్విన్ బ్రయంట్ అంటూ ఇలా అన్నాడు: [72]

... పూర్తిగా సైద్ధాంతిక భాషా కసరత్తు […] భారతదేశం మాతృభూమి కాదని ఖచ్చితంగా తేల్చవచ్చో లేదో తెలుసుకోవడానికి చేసిన ప్రయోగం. భారతదేశం మాతృభూమి కాని పక్షంలో, భాషా ప్రాతిపదికన మాతృభూమిగా ఏ ప్రాంతాన్నైనా, ఏనాటికైనా స్థాపించ గలిగే అవకాశం మరింత సమస్యాత్మకమౌతుంది.

"వెలుగు లోకి వస్తున్న ప్రత్యామ్నాయం" మార్చు

కోయెన్‌రాడ్ ఎల్స్ట్ "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా వెలుగు లోకి వస్తున్న సిద్ధాంతాన్ని" ఈ క్రింది విధంగా సంక్షిప్తంగా వివరించాడు. [73]

సా.పూ. 6 వ సహస్రాబ్ది కాలంలో ప్రోటో-ఇండో-యూరోపియన్లు ఉత్తర భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో నివసించేవారు. జనాభా విస్తరణ క్రమంలో వాళ్ళు, బాక్ట్రియా లోకి కాంబోజులుగా విస్తరించారు. పరాదాలు మరింత ముందుకు వెళ్ళి, కాస్పియన్ సముద్ర తీరంలోను మధ్య ఆసియాలో చాలా భాగం లోనూ నివాసాలు ఏర్పరచుకున్నారు. సినాలు ఉత్తర దిశగా వెళ్లి, వాయవ్య చైనాలోని తారిమ్ బేసిన్లో నివాస స్థావరాలను ఏర్పరచుకున్నారు. వీళ్ళే ఇండో యూరపియన్ మాట్లాడే టోకేరియన్ సమూహం. ఈ సమూహాలే ప్రోటో-అనటోలియన్లు (తొలి ఆనటోలియన్లు). సా.పూ. 2000 నాటికి వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తులు తమతో పాటు అత్యంత పురాతనమైన ప్రోటో-ఇండో-యూరోపియన్ భాషను తీసుకువెళ్ళారు. అక్కడ అనటోలియన్, బాల్కన్ ప్రాంత ప్రజల సంపర్కంలో అది ఒక ప్రత్యేక మాండలికంగా మారింది. మధ్య ఆసియాలో నివసించేటప్పుడు వారు గుర్రం ఉపయోగాలను తెలుసుకున్నారు. తరువాత వారు గుర్రాలను వెనక్కి ఉర్హైమాట్‌కు పంపారు. [73] తరువాత వారు, పశ్చిమ ఐరోపాను ఆక్రమించి తద్వారా ఇండో-యూరోపియన్ భాషలను ఆ ప్రాంతానికి విస్తరించారు. [73]

సా.పూ. 4 వ సహస్రాబ్ది కాలంలో భారతదేశంలో నాగరికత రూపుదిద్దుకుంది. అదే ఆ తరువాతి కాలంలో పట్టణీయ సింధు లోయ నాగరికతగా పరిణామం చెందింది. ఈ సమయంలో, ఆదిమ (ప్రోటో) ఇండో యూరపియన్ భాషలు ప్రోటో-ఇండో-ఇరానియన్‌ భాషలుగా అభివృద్ధి చెందాయి. [73] ఈ కాలంలోనే, అంతర్గత శత్రుత్వాలు, సంఘర్షణల ఫలితంగా ఇండో-ఇరానియన్లు విడిపోవటం మొదలైంది. దాంతో ఇరానియన్లు పశ్చిమ దిశగా, మెసొపొటేమియా పర్షియాల వైపు విస్తరించారు. బహుశా వీళ్ళే పహ్లవులు అయి ఉంటారు. వాళ్ళు మధ్య ఆసియా లోకి కూడా విస్తరించారు. ఈ వలసలు ముగిసే సమయానికి భారతదేశంలో, ప్రోటో-ఇండో-ఆర్యులు మిగిలిపోయారు. ప్రౌఢ హరప్పా కాలం చివరిలో, సరస్వతీ నది ఎండిపోవడం ప్రారంభమైంది. దాంతో మిగిలిన ఇండో-ఆర్యులు వివిధ సమూహాలుగా విడిపోయారు. కొందరు పశ్చిమ దిశగా ప్రయాణించి సా.పూ. 1500 నాటికి హురియన్ మిటాన్నీ రాజ్యానికి పాలకులుగా స్థిరపడ్డారు. మరికొందరు తూర్పు వైపు ప్రయాణించి గంగా పరీవాహక ప్రాంతంలో నివసించగా, మరికొందరు దక్షిణ దిశగా ప్రయాణించి ద్రావిడ ప్రజలతో సంపర్కం చెందారు [73]

డేవిడ్ ఫ్రాలే మార్చు

ది మిత్ ఆఫ్ ది అర్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఇండియా, ఇన్ సెర్చ్ ఆఫ్ ది క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ (1995) అనే తన పుస్తకాలలో, భారతీయ చరిత్రకు సంబంధించి 19 వ శతాబ్దంలో వచ్చిన జాతి వివక్షా పూరితమైన విశ్లేషణలను డేవిడ్ ఫ్రాలే విమర్శించాడు. కాకసస్ ప్రాంతం నుండి వచ్చిన ఆర్యులు, స్థానిక ద్రావిడుల మధ్య యుద్ధాలు జరిగాయి అనేది అలాంటి ఒక విశ్లేషణే. [74] పైన ఉటంకించిన రెండవ పుస్తకంలో ఫ్రాలే, జార్జ్ ఫ్యూయర్‌స్టెయిన్, సుభాష్ కాక్ లు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని తిరస్కరించారు. అవుట్ ఆఫ్ ఇండియా సిద్ధాంతాన్ని సమర్ధించారు.

ఫ్రాలే రచన ప్రజారంజకమైన రచనగా బాగా విజయవంతమైందని, ఆ రూపంలో దాని ప్రభావం "ప్రాముఖ్యత లేనిది కానేకాద"నీ అంటూ, ఒక విద్యాపరమైన అధ్యయనంగా దానికి అంత ప్రాముఖ్యత లేదని బ్రయంట్ వ్యాఖ్యానించాడు. [75] ఫ్రాలే "ఒక ప్రతీకాత్మకమైన ఆధ్యాత్మిక నమూనాకు, విమర్శనాత్మకమైన, హేతుబద్ధమైన పరిశీలనాత్మక రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడ"ని బ్రయంట్ అన్నాడు. [76]

కుహనా ఆర్కియాలజిస్టయిన గ్రాహం హాన్‌కాక్ (2002), గత హిమనదీయ కాలం ముగిసేలోపు అభివృద్ధి చెందిన పురాతన నాగరికతలను ప్రతిపాదించినపుడు (భారతదేశం లోని వాటితో సహా) ఫ్రాలే చారిత్రక రచనలను విస్తృతంగా ఉటంకించాడు. [77] క్రెయిస్‌బర్గ్ ఫ్రాలే రాసిన "వైదిక సాహిత్యాన్ని, దాని లోని అనేక రహస్యాల"నూ ఉటంకించాడు. [78]

వలస పాలన, హిందూ రాజకీయాల ప్రాముఖ్యత మార్చు

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి హిందూ జాతీయవాదంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఇది దేశీయ ఆర్యుల వాదనకు అనుకూలంగా ఉంటుంది. [79] వలసవాద నేపథ్యం, తదనంతర భారతదేశంలో జరిగిన జాతి నిర్మాణ నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకోవాలి.

వలస భారతం మార్చు

ఈస్టిండియా కంపెనీ అధికారుల కుతూహలమూ, తాము పాలించే ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వారికున్న కారణమూ 18 వ శతాబ్దం చివరలో వాళ్ళు భారతదేశ చరిత్ర, సంస్కృతిని అన్వేషించడానికి దారితీసాయి. [80] విలియం జోన్స్, సంస్కృతం, గ్రీకు, లాటిన్ల మధ్య సారూప్యతలను కనుగొన్నప్పుడు, ఈ భాషలకూ అవి మాట్లాడే ప్రజలకూ "ఒకే మూలం" (మోనోజెనిసిస్) ఉండి ఉండవచ్చనే ఆలోచన రూపుదిద్దుకుంది. 19 వ శతాబ్దం చివరి భాగంలో భాష, సంస్కృతి, జాతి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయని భావించారు. జీవజాతి భావన వెలుగు లోకి వచ్చింది [81] ఇండో-యూరోపియన్ భాషల జన్మస్థానంగా భావించిన "ఆర్య జాతి", అటువంటి జాతులలో ప్రముఖమైనది. ఈ ఆర్యజాతిని "ఐరోపా ఆర్యులు", "ఆసియా ఆర్యులు" అని రెండుగా విభజించారు. వారికి వారి వారి సొంత మాతృభూమి ఉండేదని కూడా కథనం అల్లారు. [82]

1849-1874 మాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని అనువదించిన సమయంలో, ఆర్యులందరి స్వస్థలం మధ్య ఆసియాలో అని పరికల్పన చేసాడు. అక్కడి నుండి ఉత్తర దిశగా వెళ్ళిన శాఖ ఐరోపాకు, దక్షిణ దిశగా వెళ్ళిన శాఖ భారతదేశం, ఇరాన్ వెళ్ళాయనీ తన పరికల్పనలో చేర్చాడు. ఈ ఆర్యులు తెల్లటి చర్మం కలిగి ఇండో యూరపియన్‌ భాషలు మాట్లాడేవాళ్ళనీ, భారతదేశం వెళ్ళిన ఆర్యులు అక్కడి నల్ల రంగు దాసులను జయించి ఉంటారనీ అతడు చెప్పాడు. భారతదేశంలోని ఉన్నత కులాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు, ఆర్య సంతతికి చెందినవారనీ, దిగువ కులాలు, దళితుల వారసులనీ కల్పన చేసుకుపోయాడు. [83]

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని వలస పాలకులకు రాజకీయంగా బాగా పనికివచ్చేలా రూపొందించారు. భారతీయులకు, వారిని పాలిస్తున్న బ్రిటిషు పాలకులకూ పూర్వీకులు ఒకరేనని ఆ విధంగా చెప్పుకుంటూ, తమ పాలనకు చట్టబద్ధతను న్యాయబద్ధతనూ ఆపదించుకునే ప్రయత్నం చేసారు. కేశవ చందర్ సేన్ భారతదేశంలో ఆంగ్ల పాలనను "విడిపోయిన దాయాదుల పునస్సంగమం" అని వర్ణించాడు. జాతీయ నాయకుడు బాల గంగాధర్ తిలక్ ఋగ్వేదపు ప్రాచీనత సా.పూ. 4500 నాటిదని ఆమోదించాడు. ఆర్యుల మాతృభూమి ఎక్కడో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుందని అతడు అన్నాడు. అక్కడి నుండి, ఆర్యులు హిమనదీయ కాలం తరువాత దక్షిణానికి వలస వచ్చారని భావించాడు. వీరిలో కొందరు ఐరోపా శాఖగా వెళ్ళి అక్కడ బార్బేరియన్లుగా మారారు. రెండవ శాఖ భారతదేశం వైపుకు వచ్చి తమ ఉన్నతమైన నాగరికతను నిలుపుకుంది. [84]

అయితే, జాన్ ముయిర్, జాన్ విల్సన్ వంటి క్రైస్తవ మత ప్రచారకులు మాత్రం దేశం లోని నిమ్న కులాల దుస్థితిని ఎత్తి చూపిస్తూ, వారు ఆర్యుల దండయాత్రల కాలం నుండి కూడా ఉన్నత కులాల చేతిలో అణచివేతకు గురయ్యారని వాదించారు. ప్రముఖ దళిత నాయకుడైన జ్యోతిబా ఫూలే కూడా దాసులు, శూద్రులు స్థానిక ప్రజలనీ, వారే ఈ మట్టికి నిజమైన వారసులనీ, బ్రాహ్మణులు విదేశీయులైన ఆర్యుల వారసులనీ వాదించాడు [85]

హిందూ పునరుజ్జీవనం, జాతీయవాదం మార్చు

ప్రధాన స్రవంతి అభిప్రాయాలకు భిన్నంగా, హిందూ పునరుజ్జీవనాత్మక ఉద్యమాలు ఆర్యులు బయటివారనే సిద్ధాంతాన్ని ఖండించాయి. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి, వేదాలు అన్ని జ్ఞానాలకు మూలమని, అవి ఆర్యులకు లభించాయనీ అభిప్రాయపడ్డాడు. మొట్టమొదటి మనిషి (ఆర్యుడు) టిబెట్‌లో ఉద్భవించాడని, అక్కడే కొంతకాలం ఉన్నాక, కిందికి దిగి భారతదేశంలో నివసించారనీ చెప్పాడు. అప్పటికి భారతదేశం ఖాళీగా ఉండేదని కూడా అతడు చెప్పాడు. [86]

రోమిల్లా థాపర్ వాదన ఇలా ఉంది: భారతదేశానికి హిందూ గుర్తింపును నిర్మించాలనే తహతహతో సావర్కర్, గోల్వాల్కర్ల నేతృత్వంలోని హిందూ జాతీయవాదులు, అసలు హిందువులే ఆర్యులని, వారు భారతదేశానికే చెందినవారని, ఆర్యుల దండయాత్ర అనేది లేనేలేదు, భారత ప్రజల మధ్య ఘర్షణేమీ లేదు, ఆర్యులు సంస్కృత భాష మాట్లాడేవారు. ఆర్య నాగరికతను వారు భారతదేశం నుండి పశ్చిమానికి విస్తరించారు. [87]

"దేశీయ ఆర్యుల" ఆలోచన సావర్కర్, గోల్వాకర్ రచనల్లో ఉందని విట్జెల్ కూడా కనుక్కున్నాడు. ఉపఖండానికి "అర్యులు" వలస వచ్చారనడాన్ని గోల్వాల్కర్ (1939) ఖండించాడు. విట్జెల్ దీన్ని విమర్శిస్తూ ఈ భావన సమకాలీన ఫాసిజం చెప్పే రక్తం, మట్టిని గుర్తుచేస్తోందని చెప్పాడు. ఈ ఆలోచనలు అంతర్జాతీయవాదం పైన, సామాజికత పైనా ఆధార పడ్డ నెహ్రూ-గాంధీ ప్రభుత్వాల కాలంలో ఉద్భవించినందున, అవి అనేక దశాబ్దాలుగా నిద్రాణమై ఉన్నాయనీ,1980 లలో మాత్రమే అవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయనీ కూడా విట్జెల్ చెప్పాడు [88]

వర్తమాన రాజకీయ ప్రాముఖ్యత మార్చు

లార్స్ మార్టిన్ ఫోస్సే "దేశీయ ఆర్యత్వాని"కి ఉన్న రాజకీయ ప్రాముఖ్యతను పేర్కొన్నాడు. [79] హిందూ జాతీయవాదులు తమ భావజాలంలో భాగంగా "దేశీయ ఆర్యత్వాన్ని" చేర్చుకున్నారు. దీంతో ఇది పండితుల సమస్యతో పాటు రాజకీయ విషయంగా కూడా మారిందని అతడు చెప్పాడు. [79] దేశీయ ఆర్యత్వ ప్రతిపాదకులు పాశ్చాత్య ఇండాలజిస్టుల "నైతిక అనర్హత"ను ఎత్తి చూపుతారు. ఇది దేశీయ సాహిత్యంలో పునరావృతమౌతూ ఉండే అంశం. అదే వాదనను ఆర్గనైజర్ వంటి హిందూ జాతీయవాద ప్రచురణలు కూడా ఉపయోగిస్తున్నాయి. [89]

విమర్శ మార్చు

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని సమర్ధించేవారు స్వదేశీ అర్యుల సిద్ధాంతాన్ని సమర్ధించరు.[note 1] మైఖేల్ విట్జెల్, "దేశీయ ఆర్యులు" సిద్ధాంతం అనేది పండితుల భావన కాద"నీ, "అదొక మతపరమైన భావన" అనీ అన్నాడు: [1]

సుధేష్ణా గుహా, ది ఇండో-ఆర్యన్ కాంట్రవర్సీ అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ, ఈ పుస్తకంలో చారిత్రక సాక్ష్యాలు ఏమిటనే ప్రశ్న అడగలేదనీ, ఇందులో తీవ్రమైన పద్ధతి-సంబంధ లోపాలున్నాయనీ పేర్కొంది. [92] ఈ మేథో ప్రక్రియ తిరిగి తలెత్తడానికి "ఈ అపండిత అవకాశవాదం" ఎంతవరకు ప్రేరణ కలిగించిందో ఇది పట్టించుకోలేదు కాబట్టి, ఇది "భిన్నాభిప్రాయాలను ప్రతిబింబించడంలో సమస్యగా మారుతుంది అని ఆమె చెప్పింది. [92][92]

బ్రయంట్ ఇలా చెప్పాడు:[93] భాషా సాక్ష్యాలు చాలా ఊహాజనితమైనవి, అసంబద్ధమైనవీ అని చెబుతూ ఔట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదకులు వాటిని పూర్తిగా విస్మరిస్తారు, కొట్టిపారేస్తారు,.[note 18] లేదా ఏమాత్రం సరిపోని అర్హతలతో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఈ వైఖరి, ఈ నిర్లక్ష్యం కారణంగా అనేక ఔట్ ఆఫ్ ఇండియా ప్రచురణల విలువ గణనీయంగా పడిపోతోంది. [95] [96] [note 19]

దేశీయ సాహిత్యంలో ఉన్న కీలకమైన సైద్ధాంతిక, పద్దతి-సంబంధ లోపాలను ఫోస్ పేర్కొన్నాడు. [97] సేథ్నా, భగవాన్ సింగ్, నవరత్న, తలగేరిల రచనలను విశ్లేషిస్తూ అతడు, వారు ఎక్కువగా ఆంగ్ల సాహిత్యాన్ని ఉటంకిస్తున్నారు, దాన్ని కూడా పూర్తిగా అన్వేషించలేదు. జర్మను, ఫ్రెంచి ఇండాలజీలను అసలే పట్టించుకోలేదు. దీంతో వారి రచనలలో పరిజ్ఞాన లేమి వివిధ స్థాయిలలో కనిపిస్తుంది, దీని ఫలితంగా "పాశ్చాత్య పండితులకు వీరి రచనలు అసమర్థంగా కనబడడంతో, వాళ్ళు ఈ రచనలను నిర్లక్ష్యం చేస్తున్నారు." అని అన్నాడు [98]

ఇవి కూడా చూడండి మార్చు

ఇతర సిద్ధాంతాలు మార్చు

దేశీయ ఆర్య వాదన సమర్ధకులు మార్చు

గమనికలు మార్చు

  1. 1.0 1.1 ప్రధాన స్రవంతి పండితుల మద్దతు లేదు:
    • రోమిలా థాపర్ (2006): "ఈ సమయంలో ఆర్యుల దేశీయ మూలం గురించి తీవ్రంగా వాదించే పండితులెవరూ లేరు".[90]
    • వెండి డోనిగర్ (2017): "ఇండో-యూరోపియన్ భాషలను మాట్లాడేవారు భారత ఉపఖండానికి స్వదేశీయులు అనే వ్యతిరేక వాదనకు విశ్వసనీయమైన పండితుల మద్దతు లేదు. ప్రస్తుతం దీన్ని ప్రధానంగా హిందూ జాతీయవాదులు భుజాలకెత్తుకున్నారు. వారి మతపరమైన మనోభావాలు ఆర్యుల వలస సిద్ధాంతం పట్ల కొంత కటువుగా ఉండేందుకు కారణమయ్యాయి"[web 2]
    • నరసింహన్ తదితరులకు ప్రతిస్పందనగా గిరీష్ షాహనే (2019 సెప్టెంబరు 14). (2019): "అయితే, హిందుత్వ కార్యకర్తలు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని సజీవంగా ఉంచారు, ఎందుకంటే ఇది వాళ్లకు అనుకూలంగా ఉండే దిష్టిబొమ్మ. 'కావాలని తప్పుగా చేసే వాదన, ఎందుకంటే ప్రత్యర్థి చేసే అసలైన వాదన కంటే దీన్ని ఓడించడం తేలిక'. .. అవుట్ ఆఫ్ ఇండియా పరికల్పన హిందూత్వ మనోభావంతోటి, జాతీయవాద అహంకారంతోటీ భాషా, పురావస్తు, జన్యు ఆధారాలను తిప్పికొట్టడానికి చేసే నిష్ఫల ప్రయత్నం. కానీ కాలశరాన్ని వెనక్కి తిప్పడం దాని వల్ల కాదు ... చరిత్ర పట్ల హిందుత్వపు ఆలోచనలను సాక్ష్యాలు అణచివేస్తాయి"[web 3]
    • కోయెన్‌రాడ్ ఎల్స్ట్ (2016 మే 10): "అంతర్జాతీయంగా ఇదొక ప్రత్యామ్నాయ సిద్ధాంతమే. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమే (AIT) ఇప్పటికీ అక్కడ అధికారిక నమూనా. కానీ, భారతదేశంలో దీనికి చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తల మద్దతు ఉంది. వారు ఈ ఆర్యుల వలస ప్రవాహాల జాడను కనుగొనలేకపోయారు. పైపెచ్చు వాళ్ళు సాంస్కృతిక కొనసాగింపును కనుగొన్నారు."[91]
  2. విట్జెల్: "ఇండో-ఆర్యులు, వారికంటే ముందున్న స్థానికులు 'ద్రావిడులు', 'ముండాలు', మొదలైన వారు మొదటి నుంచీ పరస్పరం సంభాషించుకున్నారు. వాస్తవానికి వారిలో చాలామంది రెండు భాషలు మాట్లాడేవారు. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా, కైపెర్ 1955, 1991, ఎమెనియా 1956, సౌత్‌వర్త్ 1979 వంటి భాషా శాస్త్రవేత్తలు, ఆల్చిన్ 1982, 1995 వంటి పురావస్తు శాస్త్రవేత్తలు, ఆర్. థాపర్ 1968 వంటి చరిత్రకారులు ఈ విషయాఅన్ని చెబుతూ వచ్చారు. ఖచ్చితంగా ఎహ్రెట్ నమూనా (1988, cf. డియాకోనాఫ్ 1985) ను అనుసరించారో లేదో గానీ, చిన్నపాటి గుంపుల్లో మాత్రం వెళ్ళారు (విట్జెల్ 1989: 249, 1995, ఆల్చిన్ 1995). పెద్ద పెద్ద సమూహాల్లో కాదు, సామూహిక వలసలు కాదు, సైనిక దండయాత్రలూ కాదు అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. అయితే, భాషా శాస్త్రవేత్తలు, భాషా చారిత్రికులూ ఇప్పటికీ ఒక విషయాన్ని నమ్ముతున్న విషయమేంటంటే (అదీ సకారణం గానే)...ఇండో ఆర్య భాష మాట్లాడే కొన్ని సమూహాలు వాస్తవానికి బయటి నుండి, పశ్చిమ / వాయవ్య దారుల గుండా ఉపఖండం లోకి ప్రవేశించాయి."[18]
  3. డేవిడ్ ఆంథోనీ (1995): "భాషా మార్పును సామాజిక వ్యూహంగా చూస్తే చక్కగా అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యక్తులు, సమూహాలూ ప్రతిష్ట, అధికారం, దేశీయ భద్రత ఉండే స్థానాల కోసం పోటీ పడతాయి […] ఆధిపత్యం మాత్రమే ముఖ్యం కాదు, సమాజంలో పైస్థాయిలకు ఎదగడం, భాషకూ హోదా, అధికారాలకూ మధ్య ఉన్న లింకు […] సాపేక్షంగా చిన్నపాటి ఉన్నత స్థాయి వలస ప్రజలు సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉన్న స్థానికులలో ప్రోత్సాహకాల ద్వారా, శిక్షల ద్వారా విస్తృతమైన భాషా మార్పును రాజ్యేతర లేదా రాజ్య-పూర్వ సందర్భంలో ప్రోత్సహించగలరు. చారిత్రికజాతుల సందర్భాలు […] ఉన్నత వర్గాలకు చెందిన చిన్న సమూహాలు రాజ్యేతర పరిస్థితులలో తమ భాషలను విజయవంతంగా రుద్దాయని నిరూపిస్తాయి."[26]
  4. విట్జెల్: "ఒకే ఒక్క" ఆఫ్ఘన్ "ఇండో ఆర్య తెగవారు పంజాబు లోని తమ శీతాకాలపు స్థావరాల నుండి వసంతం ఋతువులో ఎత్తైన ప్రాంతాలకు తిరిగి రాకుండా ఉంటే చాలు - మైదాన ప్రాంతాలలో తమ 'స్టేటస్ కిట్' (ఎహ్రెట్) కు వ్యాప్తి చేసి తద్వారా తమ సంస్కృతితో ఆ ప్రాంతాన్ని వెల్లువెత్తించడానికి". [27] […] "నిజానికి కచ్చితంగా చెప్పాలంటే అది కూడా అక్కర్లేదు. ఆఫ్ఘను లోని ఎత్తు ప్రాంతాలకు చెందిన వారికీ, సింధు లోయ లోని రైతులకూ మధ్య నిరంతరం జరిగే పరస్పర సంబంధాలు చాలు ఈ మార్పు చోటుచేసుకునేందుకు. సింధు నాగరికత క్షీణించాక, అక్కడి ప్రజలు తూర్పు వైపుగా తరలి పోయినపుడు కొండ ప్రంతపు వారికి ఇండో ఆర్యన్ల పద్ధతిలో పశువులను మేపుకునేందుకు సింధు మైదానాల్లో మరింత సందు దొరికింది. కొన్ని వ్యావసాయిక సమాజాలు (ముఖ్యంగా నదుల వెంట ఉండేవి) మాత్రం అక్కడే కొనసాగాయి. ఋగ్వేదం లోని వ్యావసాయిక పరిభాష దీన్ని సూచిస్తుంది. (కుయ్‌పర్1991, విట్జెల్ 1999a,b). సాంస్కృతీకరణ సందర్భంలో వలస వెళ్ళిన ప్రజల సంఖ్య (చిన్నది) తో నిమిత్తం లేదు: ఈ తొలి గుంపుల (ఇండో ఆర్య పశువుల కాపరులు) నుండి స్థానికులు స్టేటస్ కిట్‌ను తీసుకుని అక్కడి నుండి ఇతరులకు వ్యాప్తి చేస్తే చాలు.[28]
  5. సంస్కృతంలోను, తదనంతర కాలపు భారతీయ భాషలలోనూ ఉన్న ద్రావిడ లక్షణాలకు కారణాలను "శోషణ" ద్వారా వివరించవచ్చని థామసన్, కాఫ్మన్‌లు చెప్పారు. వారు ఎమెనోను ఉటంకిస్తూ: "మనం పరిశీలిస్తున్న తీవ్రమైన భాషా మార్పులకు ప్రధానమైన కారణం శోషణ. స్థానభ్రంశం కాదు."[30] థామసన్, కౌఫ్మన్‌లు ఇలా చెప్పారు: ఒక ప్రాథమిక ఊహ ఏమిటంటే, ద్రావిడులు గణనీయమైన సంఖ్యలో తరలారంటే.., వారు ఇండిక్‌పై తమ సొంత అలవాట్లను రుద్దడమే కాదు, అసలు ఇండిక్ మొత్తాన్నీ ప్రభావితం చేసేంతటి పెద్ద సంఖ్యలో ఉన్నారు.[30]
  6. డేవిడ్ ఆంథోనీ, తన ది హార్స్, వీల్, అండ్ లాంగ్వేజ్ పుస్తకంలో, యూరేషియా స్టెప్పీల్లోను, మధ్య ఆసియా అంతటానూ ఇండో-యూరోపియన్ ప్రజల పురావస్తు బాట గురించి విస్తృతమైన అవలోకనాన్ని అందించాడు.
  7. 2003 లో జరిగిన మరో సమావేశం గురించి ఇండిక్ స్టడీస్ ఫౌండేషన్ రాసింది: "ఖగోళ డేటా ఆధారంగా కురుక్షేత్ర యుద్ధం జరిగిన తేదీని నిర్ధారించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పండితులు మొదటిసారి కలుసుకున్నారు."[web 1]
  8. చూడండి:
  9. Conventionally dated sometime between the sixth and fourth centuries BCE.[47]
  10. సాంప్రదాయికంగా ఈ తేదీ సా.శ. 788–820 అని భావిస్తారు.
  11. See also Kak 1996
  12. 12.0 12.1 "దండయాత్ర" అనే పదాన్ని ఈ రోజుల్లో ఇండో-ఆర్యన్ వలస సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారు మాత్రమే ఉపయోగిస్తున్నారు.[50] "దండయాత్ర" అనే పదం ఇండో-ఆర్యన్ వలసల పట్ల సమకాలీన పండితుల కున్న అవగాహనను ప్రతిబింబించదు;[50] వితండవాదనకు, విషయాన్ని దారిమళ్ళించేందుకూ అదొక సాధనం, అంతే.
  13. Koenraad Elst: "భాషా ఆధారాల పరంగా మనం చర్చించబోయే సిద్ధాంతాన్ని విస్తృతంగా "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం" (AIT) అని పిలుస్తారు. కొంతమంది పండితులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నేను ఈ పదాన్నే వాడతాను. "వలస" అనే పదం కంటే "దండయాత్ర" అనే పదాన్నే నేను ఇష్టపడతాను. ఈ దండయాత్ర అనే పదం ఆర్యన్ యోధుల బృందాలు శాంతియుత సింధు నాగరికతపై దాడి చేసి లొంగదీసుకున్నారనే పాతబడిన, వదిలిపెట్టేసిన సిద్ధాంతాన్ని సూచిస్తుందని వారు వాదిస్తారు. సర్ మోర్టిమర్ వీలర్ ప్రాచుర్యం కల్పించిన ఈ నాటకీయ దృష్టాంతంలో, వాయవ్యం నుండి తెల్లతోలు యోధులు వచ్చి నల్లజాతి ఆదిమవాసులను బానిసలుగా చేసుకున్నారు. తద్వారా హరప్పా నాగరికతను నాశనం చెయ్యడంలో "ఇంద్రుడే నిందితుడ"య్యాడు. (రాజ్ శేకర్ 1987; బిస్వాస్ 1995 చూడండి). అయితే, ఈ ఒక్ఖసారి మాత్రం, ఈ తీవ్రవాదుల వాదనలో ఒక పాయింటుందని నేను నమ్ముతున్నాను. ఉత్తర భారతదేశపు భాషాతత్వ దృశ్యం ప్రకారం చూస్తే రెండే వివరణలు కుదురుతాయి:ఇండో-అర్యులు స్థానికులైనా అయి ఉండాలి లేదా దండయాత్ర ద్వారా దిగుమతి అయి ఉండాలి. వాస్తవానికి, ఈ వలస సిద్ధాంతాన్ని నొక్కి చెప్పే సిద్ధాంతకర్తలలో ఎవరినైనా సరే గిల్లి చూడండి. వారిలో మీకు ఆ పాత దండయాత్ర వాసనలు పోని ఆక్రమణదారుడే కనబడతాడు. ఎందుకంటే వారు ఆర్యుల వలసలకు గుర్రాలను, చువ్వల చక్రాల రథాలనూ (అంటే సైనిక ఆధిపత్యాన్ని) లంకె పెట్టడం అస్సలు మర్చిపోరు.[51]
  14. విట్జెల్ కిందివాటిని ప్రస్తావించాడు:[52]
    • అరొబిందో (మూలాన్నేమీ ఉదహరించలేదు)
    • వరద్‌పాండే, ఎన్.ఆర్., "ఫాక్ట్ అండ్ ఫిక్షన్స్ ఎబౌట్ ది ఆర్యస్స్" : దేవ్, కామత్ 1993, 14-19
    • వరద్‌పాండే, ఎన్.ఆర్., "ది ఆర్యన్ ఇన్వేజన్, ఎ మిత్." నాగపూర్: బాబా సాహెబ్ ఆప్టే స్మారక సమితి 1989
    • ఎస్. కాక్ 1994, "ఆన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండిక్ లాంగ్వేజెస్" భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ 75, 1994a, 185-195.
    • ఎల్స్ట్ 1999, "అప్‌డేట్ ఆన్ ది ఆర్యన్ ఇన్వేజన్ డిబేట్" ఢిల్లీ: ఆదిత్య ప్రకాశన్. p.119
    • తలగేరి 2000, "ఋగ్వేద, ఎ హిఒస్టారికల్ ఎనాలిసిస్." న్యూ ఢిల్లీ, ఆదిత్య ప్రకాశన్, p.406 sqq,[53]
    • లాల్ 1997, "ది ఎర్లియెస్ట్ సిచిలైజేషన్ ఆఫ్ సౌత్ ఏషియా (రైజ్, మెచ్యూరిటీ అండ్ డిక్లైన్)." న్యూ డ్ఃఇల్లీ: ఆర్యన్ బుక్స్ ఇంటర్నేషనల్, p.281 sqq.
  15. ఏ "దేశీయ ఆర్య" వాదనలోనైనా, ఇండో-యూరోపియన్ భాషలను మాట్లాడేవారు తప్పనిసరిగా సా.పూ. 10 వ శతాబ్దానికి ముందే (అస్సిరియన్ రికార్డులలో ఇరానియన్ ప్రజల గురించిన ప్రస్తావన ఉన్న కాలం) భారతదేశం నుండి వలస వెళ్ళి ఉండాలి. ఇది సా.పూ. 16 వ శతాబ్దంలో యాజ్ సంస్కృతి ఆవిర్భావానికి ముందు జరిగి ఉండే అవకాశం ఉంది. దీన్ని ప్రోటో-ఇరానియన్ సంస్కృతిగా భావిస్తారు.[56]
  16. 16.0 16.1 స్వదేశీ సాంస్కృతిక కొనసాగింపు కోసం వాదించే క్రమంలో సంస్కృతానికి పాశ్చాత్య భాషలకూ మధ్య సారూప్యతలను వివరించేందుకు రెండు ప్రత్యామ్నాయ వివరణలు ఇస్తూ షాఫర్, భారతీయేతర మూలాల కోసం వాదించాడు.[62]
    మొదటిది, మెక్‌ఆల్పిన్ ప్రతిపాదించిన విధంగా "ఇరానియన్ పీఠభూమిపై ఎలామైట్‌ను ద్రావిడ భాషనూ కలిపే జాగ్రోసియన్ కుటుంబ భాష" తో భాషా సంబంధం;ఇది సా.పూ. 3 వ సహస్రాబ్ది తరువాత ఉత్తర భారతదేశాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.[33]
    రెండవ అవకాశం ఏమిటంటే, "ఇటువంటి భాషా సారూప్యతలు, సా.పూ రెండవ మిలీనియం అనంతరం, వాణిజ్యం ద్వారా పశ్చిమంతో ఏర్పడిన సంబంధాల ఫలితంగా వచ్చి ఉండవచ్చు".[33] అదే సమయంలో ఓ కొత్త సమాజిక వ్యవస్థను ఏర్పరచుకున్నారు.[34] షాఫర్ ప్రకారం, "ఒకసారి క్రోడీకరించడం జరిగాక, భాషా లక్షణాలను సాహిత్యంలో ఉన్న వివరణలతో స్థిరీకరిస్తే, అప్పుడప్పుడే ఉనికి లోకి వస్తున్న వంశపారంపర్య సామాజిక ఉన్నత వర్గాలవారు తమ సామాజిక స్థితిని మెరుగుపరచుకోడానికి పనికొస్తుంది"[35]
  17. ప్రారంభ ఇండో-ఆర్యులకు చెందిన పురావస్తు అవశేషాలు లేకపోవడాన్ని ఎత్తి చూపేవారిలో బిబి లాల్ తో పాటు జిమ్ జి. షాఫర్ కూడా ఉన్నాడు. "దేశీయంగానే ఏర్పడిన సాంస్కృతిక పరిణామాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక మార్పులు జరిగి ఉంటాయ"ని వాళ్ళు వాదించారు. [60] షాఫర్ ప్రకారం, భాషలో వచ్చిన మార్పును పొరబాటుగా ప్రజల వలసలకు ఆపాదించారు..[61]
    దీనికి విరుద్ధంగా, డేవిడ్ ఆంథోనీ తన ది హార్స్, ది వీల్, ఆండ్ లాంగ్వేజ్ లో, యురేషియా స్టెప్పీలు, మధ్య ఆసియా అంతటా ఇండో-యూరోపియన్ ప్రజల పురావస్తు ఆనవాళ్ళ గురించి విస్తృతమైన అవలోకనాన్ని ఇచ్చాడు.
  18. ఉదా: బ్రయంట్ 2001 లో ఉటంకించినట్లుగా చక్రబర్తి 1995, ఎన్,ఎస్,రాజారామ్ 1995.[94]
  19. విట్జెల్: "దేశీయత్వ సిద్ధాంతాన్ని వెనకేసుకొచ్చే వారు సాధారణంగా భాషా డేటాను నిర్లక్ష్యం చేస్తూంటారు. ఇప్పటివరకు ఉన్న ఏకైక మినహాయింపు భారతీయ భాషా శాస్త్రవేత్త ఎస్.ఎస్. మిశ్రా (1992) రాసిన ఒక సన్నటి పుస్తకం. ఇందులో కూడా దోషాలు తప్పులూ ఉన్నాయి (క్రింద చూడండి). అలాగే ఎల్స్ట్ (1999) చేసిన చర్చ కొంతవరకు అలాంటిదే (కాకపోతే అది అసంపూర్ణంగా ఉంది)." [18]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Witzel 2001, p. 95.
  2. 2.0 2.1 Kak 2001b.
  3. Trautmann 2005, p. xiii.
  4. 4.0 4.1 4.2 4.3 Anthony 2007.
  5. Parpola 2015.
  6. Fosse 2005, p. 435-437.
  7. Ravinutala 2013, p. 6.
  8. 8.0 8.1 Bryant 2001.
  9. Bryant & Patton 2005.
  10. Singh 2008, p. 186.
  11. McGetchin 2015, p. 116.
  12. 12.0 12.1 Possehl 2002, p. 238.
  13. "Kazanas (2013), The Collapse of the AIT" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2020-12-10.
  14. Christopher I. Beckwith (2009), Empires of the Silk Road, Oxford University Press, p.30
  15. Beckwith 2009, p. 30.
  16. 16.0 16.1 Kazanas 2002.
  17. Witzel 2001, p. 311.
  18. 18.0 18.1 Witzel 2001, p. 32.
  19. Witzel 2001.
  20. Witzel 2005.
  21. Mallory & Adams 2006, p. 460-461.
  22. Anthony 2007, p. 408.
  23. Beckwith 2009.
  24. Witzel 2005, p. 342-343.
  25. Anthony 2007, p. 117.
  26. Witzel 2001, p. 27.
  27. 27.0 27.1 Witzel 2001, p. 13.
  28. Witzel 2001, p. 13, note 27.
  29. Hickey 2010, p. 151.
  30. 30.0 30.1 30.2 Thomason & Kaufman 1988, p. 39.
  31. Shaffer 2013.
  32. 32.0 32.1 Shaffer & Lichtenstein 1999.
  33. 33.0 33.1 33.2 Shaffer 2013, p. 87.
  34. 34.0 34.1 Witzel 2001, p. 14.
  35. 35.0 35.1 Shaffer 2013, p. 87-88.
  36. 36.0 36.1 Erdosy 1995, p. 90.
  37. Erdosy 1995, p. 75, 89-90.
  38. Bronkhorst 2007, p. 266.
  39. 39.0 39.1 Trautmann 2005, p. xxviii.
  40. 40.0 40.1 Trautmann 2005, p. xxx.
  41. 41.0 41.1 Witzel 2001, p. 69.
  42. Trautmann 2005, p. xx.
  43. Witzel 2001, p. 69-70.
  44. Witzel 2001, p. 72, note 178.
  45. Witzel 2001, p. 85-90.
  46. Witzel 2001, p. 88 note 220.
  47. Warder 2000, p. 45.
  48. Trautmann 2005, p. xxiiiv–xxx.
  49. 49.0 49.1 49.2 Kak 1987.
  50. 50.0 50.1 50.2 50.3 50.4 Witzel 2005, p. 348.
  51. 51.0 51.1 Elst 2005, p. 234-235.
  52. 52.0 52.1 Witzel 2001, p. 28.
  53. 53.0 53.1 Talageri 2000.
  54. Hansen 1999, p. 262.
  55. Bryant 2001, p. 344.
  56. Roman Ghirshman, L'Iran et la migration des Indo-aryens et des Iraniens(Leiden 1977). Cited by Carl .C. Lamberg-Karlovsky, Archaeology and language: The case of the Bronze Age Indo-Iranians, in Laurie L. Patton & Edwin Bryant, Indo-Aryan Controversy: Evidence and Inference in Indian History (Routledge 2005), p. 162.
  57. 57.0 57.1 57.2 Elst 2005.
  58. Kak 2001.
  59. 59.0 59.1 Elst 1999.
  60. Shaffer 2013, p. 88.
  61. Shaffer 2013, p. 85-86.
  62. Shaffer 2013, p. 86-87.
  63. Trautmann 2005, p. xxviii-xxx.
  64. Kak 1996.
  65. Kak 2008.
  66. Danino 2010.
  67. Kak 2015.
  68. Heehs 2008, p. 255-256.
  69. Boehmer 2010, p. 108.
  70. Varma 1990, p. 79.
  71. Elst 1999, p. $6.2.3.
  72. Bryant 2001, p. 147.
  73. 73.0 73.1 73.2 73.3 73.4 Elst 1999, p. $6.3.
  74. Arvidsson 2006, p. 298.
  75. Bryant 2001, p. 291.
  76. Bryant 2001, p. 347.
  77. Hancock 2002, pp. 137, 147–8, 157, 158, 166–7, 181, 182.
  78. Kreisburg 2012, p. 22–38.
  79. 79.0 79.1 79.2 Fosse 2005, p. 435.
  80. Thapar 1996, p. 3.
  81. Thapar 1996, p. 4.
  82. Thapar 1996, p. 5.
  83. Thapar 1996, p. 6.
  84. Thapar 1996, p. 8.
  85. Thapar 1996, p. 7.
  86. Jaffrelot 1996, p. 16.
  87. Thapar 1996, p. 9.
  88. Witzel 2006, pp. 204–205.
  89. Fosse 2005, p. 437.
  90. Thapar 2006.
  91. Koenraad Elst (May 10, 2016), కోయెన్‌రాడ్ ఎల్స్ట్: "వక్రీకరించిన చరిత్రను సరిచేసే ఆసక్తి ప్రభుత్వం చూపించినట్లు నాకైతే తెలియదు", స్వరాజ్య పత్రిక
  92. 92.0 92.1 92.2 Guha 2007, p. 341.
  93. Bryant 2001, p. 75.
  94. Bryant 2001, p. 74.
  95. Bryant 2001, pp. 74–107.
  96. Bryant 1996.
  97. Fosse 2005.
  98. Fosse 2005, p. 438.

మూలాలు మార్చు

అంతర్జాల మూలాలు మార్చు

  1. "Indic Studies Foundation, Dating the Kurukshetra War". Archived from the original on 2020-02-18. Retrieved 2020-12-10.
  2. Wendy Doniger (2017), "Another Great Story" Archived 2023-05-14 at the Wayback Machine", review of Asko Parpola's The Roots of Hinduism; in: Inference, International Review of Science, Volume 3, Issue 2
  3. Girish Shahane (September 14, 2019), Why Hindutva supporters love to hate the discredited Aryan Invasion Theory, Scroll.in