నంద్యాల శ్రీనివాసరెడ్డి

నంద్యాల శ్రీనివాసరెడ్డి (1918 - ఫిబ్రవరి 20, 2019) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 1962లో సి.పి.ఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[1] సాయుధ పోరాటంలో ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రద్దైన వారిలో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు.[2] సీపీఎం జిల్లా కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.

నంద్యాల శ్రీనివాసరెడ్డి
Nandyala Srinivas Reddy.jpg
జననం1918
కొప్పొలు, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ
మరణంఫిబ్రవరి 20, 2019
ముత్యాలమ్మగూడెం, కట్టంగూర్ మండలం, నల్లగొండ జిల్లా
మరణ కారణంవృద్ధాప్యము
ప్రసిద్ధితెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే.
పిల్లలుహరిందర్, వేణుధర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి (కుమారులు) - వింధ్య (కుమార్తె)
తండ్రిఅప్పారెడ్డి
తల్లిలక్ష్మినర్సమ్మ

జననంసవరించు

శ్రీనివాసరెడ్డి 1918వ సంవత్సరంలో అప్పారెడ్డి, లక్ష్మినర్సమ్మ దంపతులకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పొలు గ్రామంలో జన్మించాడు.[3]

కుటుంబ వివరాలుసవరించు

శ్రీనివాసరెడ్డి సతీమణి పేరు రఘునాథమ్మ. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు వేణుధర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి సీపీఎంలో పనిచేస్తుండగా, అశోక్‌రెడ్డి హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్నాడు. కూతురు వింధ్య బెంగుళూరులో స్థిరపడ్డారు. 1969 నుంచి నంద్యాల శ్రీనివాసరెడ్డి కుటుంబం మిర్యాలగూడలో స్థిరపడి పార్టీ బలోపేతానికి కృషి చేయసాగింది. 2005లో రఘునాథమ్మ మరణించింది. 2008నుండి శ్రీనివాసరెడ్డి కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెంలో ఉంటున్న పెద్దకుమారుడు హరీందర్‌, కోడలు సులోచన వద్దనే ఉంటున్నాడు.

సాయుధ పోరాటంసవరించు

విద్యార్థి వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని దళ కమాండర్‌ స్థాయికి ఎదిగాడు. నిజాంకు వ్యతిరేకంగా పనిచేసి జైలుశిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి తప్పించుకుని వచ్చి అజ్ఞాతం జీవితం గడుపుతూ, వందలాది మందికి శిక్షణ ఇచ్చి నాయకులుగా తయారుచేశాడు.

ఉరిశిక్ష రద్దుసవరించు

సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు శ్రీనివాసరెడ్డికి అప్పటి ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. కేసు విచారణలో ఉండగానే శ్రీనివాసరెడ్డి జైలునుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నందుకు ఆ పోరాట యోధులకు మిలిటరీ ట్రిబ్యునల్ విధించిన ఉరిశిక్షలు అమలు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజలను దోపిడీ నుండి విముక్తి చేయడానికి, స్వతంత్రం కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటయోధులను ఉరి తీయాలన్న ప్రయత్నం అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమై, అంతర్జాతీయంగా ఉన్న మేధావుల దృష్టిని వెళ్ళింది.

ఈ ఉరిశిక్ష పడ్డవారిలో నల్లగొండ జిల్లా అప్పాజీపేటకు చెందిన ఎర్రబోతు రాంరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా రామానుజాపురంకు చెందిన గార్లపాటి రఘుపతిరెడ్డి అనే 15సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. రాంరెడ్డి గురించి తెలుసుకున్న ఒక అమెరికా జర్నలిస్టు జైలుకు వచ్చి రాంరెడ్డిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ ఉరిశిక్ష గురించి ప్రపంచానికి తెలిసింది. దాంతో ఈ ఉరిశిక్షకు వ్యతిరేకంగా ప్రపంచం నలుమూలల నుంచి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అమెరికాకు చెందిన గాయకుడు పాల్‌రాబ్సన్ కూడా ఈ ఉరిశిక్షలను ఖండింయడం జరిగింది. ఉరిశిక్ష పడ్డ తెలంగాణ సాయుధ పోరాటయోధులను రక్షించడానికి ఒక తెలంగాణ డిఫెన్స్ కమిటీ పేరుతో ఒక కమిటీ ఏర్పాటుచేయబడింది.

దేశ స్థాయిలో పేరుగాంచిన లాయర్లు బారిస్టర్ డానియేల్ లతీఫ్, మనోహర్ సక్సేనా మొదలైనవారు ఆ కమిటీ తరఫున ఈ కేసులు వాదించడానికి పూను కున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రిటిష్ బారిస్టర్ డెనిస్ నోవె ల్ ప్రిట్ బృందం ఈ కేసులను వాదించడానికి లండన్ నుంచి వచ్చారు. డి.ఎన్.ప్రిట్ బృందం కొత్తగా ఏర్పాటైన భారత్ సుప్రీంకోర్టులో తెలంగాణ యోధులకు పడ్డ ఉరిశిక్షలపై సుదీర్ఘంగా వాదించి, వారిపై పెట్టిన కేసుల్లోని అసలు నిజాన్ని విజయవంతంగా బయటపెట్టింది. అంతర్జాతీయంగా చెలరేగుతున్న నిరసనలతో, ప్రిట్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం చేసిన డిఫెన్స్ వాదనలతో భారత ప్రభుత్వం దిగివచ్చి, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులకు వేసిన ఉరిశిక్షల ను ఒక్కొక్కటిగా రద్దుచేసి, అందులో కొన్నింటిని యావజ్జీవ కారాగారశిక్ష మార్చింది.[4]

రాజకీయ ప్రస్థానంసవరించు

9వ తరగతి చదువుతున్నప్పటినుండే కమ్యునిస్టు పార్టీతో శ్రీనివాసరెడ్డికి సంబంధాలు ఏర్పడ్డాయి. చిలుకూరు, భువనగిరి, వరంగల్‌, ఖమ్మంలలో జరిగిన ఆంధ్ర మహాసభలలో పాల్గొన్నాడు. తనకు వారసత్వంగా సంక్రమించిన 900 ఎకరాల భూమిని పేదలకు పంచాడు.[5]

మరణంసవరించు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరెడ్డి 2019, ఫిబ్రవరి 20 బుధవారం తెల్లవారుజామున గం. 3.30 ని.లకు నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెంలో పెద్ద కుమారుడు హరిందర్‌ నివాసంలో మృతిచెందాడు.[3][5][6]

ఇతర వివరాలుసవరించు

శ్రీనివాస్‌రెడ్డి కోరిక ప్రకారం ఆయన మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల కోసం అందజేయబడింది.

మూలాలుసవరించు

  1. ఈనాడు, ప్రధానాంశాలు (February 2019). "జీవితమంతా పేదలకే అంకితం". Archived from the original on 25 February 2019. Retrieved 25 February 2019.
  2. నమస్తే తెలంగాణ, సంపాదకీయ వ్యాసాలు (22 February 2019). "ఉరిశిక్షను ధిక్కరించిన యోధుడు". దిలీప్ కొణతం. Archived from the original on 22 ఫిబ్రవరి 2019. Retrieved 25 February 2019.
  3. 3.0 3.1 ప్రజాశక్తి, తెలంగాణ (21 February 2019). "నంద్యాల శ్రీనివాసరెడ్డి కన్నుమూత". Archived from the original on 25 February 2019. Retrieved 25 February 2019.
  4. ఈనాడు, ప్రధాన వార్తలు (17 September 2019). "సామాన్యులే సాయుధులై". www.eenadu.net. Archived from the original on 17 సెప్టెంబర్ 2019. Retrieved 21 September 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  5. 5.0 5.1 TelanganaToday, Nalgonda (20 February 2019). "Veteran Communist leader Nandyala Srinivas no more". Archived from the original on 25 February 2019. Retrieved 25 February 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ తాజా వార్తలు (20 February 2019). "నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 25 February 2019. Retrieved 25 February 2019.