నల్లా నరసింహులు

తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు.

నల్లా నరసింహులు, (1926, అక్టోబరు 21993, నవంబరు 5) తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. తెలంగాణ విముక్తి పోరాటంలో ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి, కోర్టులో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాల చేతనే 'తెలంగాణ  టైగర్', ‘జనగామ సింహం’గా అని పిలువబడ్డాడు.[1]

నల్లా నరసింహులు
నల్లా నరసింహులు
జననం
నల్లా నరసింహులు

(1926-10-02)1926 అక్టోబరు 2
మరణం1993 నవంబరు 5(1993-11-05) (వయసు 67)
వృత్తిచేనేత కార్మికుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణా పోరాట యోధుడు
జీవిత భాగస్వామినల్లా వజ్రమ్మ
పిల్లలుముగ్గురు కుమార్తెలు (అరుణ)
తల్లిదండ్రులు
  • లచ్చయ్య (తండ్రి)
  • లచ్చమ్మ (తల్లి)

జననం, విద్య

మార్చు

నరసింహులు 1926 అక్టోబరు 2న లచ్చయ్య - లచ్చమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండిలో జన్మించాడు. శ్రీరంగాచార్యులు అనే పంతులు దగ్గర ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. వృత్తిరీత్యా చేనేత కార్మికుడు.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

నరసింహులుకు 11 ఎళ్ళ వయసులో అదే గ్రామానికి చెందిన 9 ఏళ్ళ నల్లా వజ్రమ్మతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు. 16 ఏళ్ళ వయసులో తండ్రి లచ్చయ్య అనారోగ్యంతో మరణించగా, కుటుంబ భారం మొత్తం నరసింహులుపై పడింది. టీచర్ ఉద్యోగావకాశాన్ని వదిలిపెట్టి కుల వృత్తి చేపట్టాడు.

తెలంగాణ ఉద్యమం

మార్చు

విసునూరు దేశముఖ్ రేపాక వెంకట రామచంద్రారెడ్డి, అతని తల్లి  జానమ్మ రకరకాల పద్ధతుల్లో రైతుల వద్ద నుండి బలవంతంగా భూమి లాక్కొని వందల ఎకరాలు సంపాదించారు. నరసింహులు భాగస్తులతో కలిసి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. ప్రక్కనున్న ఊరిలో ప్రైవేట్ టీచరుగా పనిచేసి వచ్చిన డబ్బులతో మిగిలిన అప్పు మొత్తం తీర్చాడు. ఆ సమయంలో పిట్టల నర్సయ్య అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర మహాసభతో పరిచయమేర్పడింది. 1944 మే 27, 28 తేదీలలో భువనగిరి పట్టణంలో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో స్వచ్ఛంద సేవకుడిగా పనిచేశాడు. సాహిత్యాన్ని, పోరాట చరిత్రలను చదివి చైతన్యంపొందాడు. తన గ్రామంలోని యువకులను కూడగట్టి, అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చెప్పి, వారిని చైతన్యపరచాడు. గ్రామంలో ఉన్న అన్ని కులాల వారితో సమావేశం ఏర్పాటుచేశాడు. ఆంధ్ర మహాసభ గ్రామ సంఘానికి అధ్యక్షులుగా దావూద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నల్లా నరసింహులు ఎన్నికయ్యారు. అలా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కడవెండి గ్రామం కూడా చేరింది.

కొన్నిరోజులకు నరసింహులుతోపాటు మరికొందరిని విసునూరు పోలీసులు అరెస్టు చేసి, అదేరోజు సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలచేశారు. అది నరసింహులు మొదటి అరెస్ట్. దొడ్డి కొమరయ్య వీరమరణంతో తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. నరసింహులు కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలుచేపట్టగా, అనేక గ్రామాల్లో తిరుగుతూ తప్పించుకోని, చివరికి సూర్యాపేటలో పోలీసులకు దొరికాడు. కొన్నిరోజుల తరువాత మహబూబ్ నగర్ జైలునుండి తప్పించుకొని, విజయవాడలోని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం వెళ్ళాడు. అక్కడ  భీమిరెడ్డి నర్సింహారెడ్డి మొదలైన వారితో కలిసి గెరిల్లా పోరాటంలో శిక్షణ తీసుకున్నాడు. పార్టీ తరపున జనగామ తాలూకాలోని గ్రామాల్లో ప్రజా ఉద్యమాల్లో విస్తృతంగా పాల్గొన్నాడు.

1948 సెప్టెంబరు 13వ తేదీన సైనిక చర్య ప్రారంభమై, సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానమును భారతదేశంలో విలీనమైన తరువాత సైనికాధికారులు లక్ష్మక్కపల్లిలో నరసింహులును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కనీస సౌకర్యాలు లేని పోలీస్ స్టేషన్లో ఉంచి అతి క్రూరంగా హింసించారు. నర్సింహులుపై ఆరోపించబడిన మూడు అక్రమ కేసుల్లో ముగ్గురు జడ్జీల ముందు తన కేసును తనే వాదించుకున్నాడు. రజాకార్ల ఇన్‌ఫార్మర్లను మట్టుబెట్టిన ఘటనలో నరసింహులు అరెస్టవడంతో, ఉరిశిక్ష పడింది. కమ్యూనిస్టు పార్టీ భావజాలాన్ని, దాని ఆవశ్యకతను విశదీకరిస్తూ సుదీర్ఘమైన స్టేట్మెంట్ రాసిచ్చాడు. ఆ స్టేట్మెంటును వాపసు తీసుకుంటే ఉరి శిక్ష విధించమని, యావజ్జీవ శిక్షగా మారుస్తామని న్యాయమూర్తులు చెప్పినప్పటికీ వినలేదు. పార్టీ అధిష్టానంతో సంప్రదించి హైదరాబాదులో హైకోర్టు విచారణ సమయంలో హైకోర్టు నుండి తప్పించుకొని భార్య వజ్రమ్మతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో మళ్ళీ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే వజ్రమ్మ, భీమదేవరపల్లి హాస్పిటల్లో బిడ్డ (అరుణ)ను జన్మనిచ్చింది. భర్త తప్పించుకోవడంలో వజ్రమ్మ పాత్ర ఉన్నదని భావించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.[3]

ఉరిశిక్ష రద్దు

మార్చు

హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించింది. ఈ కాలమంతా నరసింహులు అజ్ఞాతంలోనే ఉన్నాడు. 1955 మార్చి 5న వడ్లకొండలో నరసింహులుతోపాటు మరికొందరిని అరెస్టు చేశారు. ఈ ఉరిశిక్ష పడ్డవారిలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పొలుకు చెందిన నంద్యాల శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా రామానుజాపురానికి చెందిన గార్లపాటి రఘుపతిరెడ్డి, నల్లగొండ జిల్లా మండలం అప్పాజి పేటకు చెందిన ఎర్రబోతు రాంరెడ్డి అనే యువకులు కూడా ఉన్నారు. అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అప్పటి టైమ్ మాగజైన్‌లో బాలుడికి ఉరిశిక్ష అనే సారాంశంతో ప్రచురితం అయ్యింది. దీనినిచూసి చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగిన యువజనోత్సవ సభల్లో 10వేలమంది యువత భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు లండన్ నుంచి డి.ఎన్.ప్రిట్ బృందం కొత్తగా ఏర్పాటైన భారత్ సుప్రీంకోర్టులో తెలంగాణ యోధులకు పడ్డ ఉరిశిక్షలపై సుదీర్ఘంగా వాదించి, అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ను సంప్రదించగా, అతను అంగీరించి ఉరిశిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగారశిక్షగా మార్చాడు. అనంతరం ఏడేళ్ళ సాధారణ జైలు శిక్షను అనుభవించిన నరసింహులును 1959 జనవరి 26న యావజ్జీవ కారాగార శిక్షను రద్దుపరిచి విడుదలచేశారు.[4]

రచనలు

మార్చు

1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవం సందర్భంగా యోధులు తమ అనుభవాలు నివేదించాలన్న కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ‘తెలంగాణ సాయుధ పోరాటం: నా అనుభవాలు’ అనే పుస్తకాన్ని రాశాడు. అది 1989లో ప్రచురితమైంది.[5]

నరసింహులు 1993 నవంబరు 5న మరణించాడు.

నర్సింహులు విగ్రహం

మార్చు

జనగాం కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో ఏర్పాటుచేసిన నర్సింహులు విగ్రహాన్ని 2019 నవంబరు 6న తెలంగాణ రాష్ట్ర పంచాయితీ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సిపిఐ నాయకులు కె. నారాయణ, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూలాలు

మార్చు
  1. "నూరు దెబ్బలు తిన్న జీవితం". Sakshi. 2019-05-27. Archived from the original on 2022-10-02. Retrieved 2022-10-02.
  2. "విప్లవసింహం.. నల్లా నరిసింహం | వేదిక | www.NavaTelangana.com". NavaTelangana. 2018-03-18. Archived from the original on 2022-10-17. Retrieved 2022-10-17.
  3. RJ (2022-10-03). "విప్లవ సింహం నల్లా నరసింహులు". Suryaa.co.in. Archived from the original on 2022-10-03. Retrieved 2022-10-03.
  4. ఈనాడు, ప్రధాన వార్తలు (17 September 2019). "సామాన్యులే సాయుధులై". www.eenadu.net. Archived from the original on 17 September 2019. Retrieved 2022-10-02.
  5. Narasimhulu, Nalla (1989). Telangana Sayudha Poratam Naa Anubhavaalu (in Telugu). Vishalandra: Visalandhra Publishing House. Archived from the original on 2022-10-02. Retrieved 2022-10-02.{{cite book}}: CS1 maint: unrecognized language (link)