నిమ్మగడ్డ వెంకట కృష్ణ రావు
ఈ వ్యాస విషయం వికీపీడియా జీవిత చరిత్రల విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. (జూన్ 2021) |
నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు గారు, 1909 సెప్టెంబరు 8 న డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రత్తయ్య. కృష్ణారావు గారు, చదువుకునే రోజులలో దేశభక్తి కిరణాలు, ఆయన పై ప్రసరించి స్వాతంత్ర్య సమర ఉద్యమంలో అడుగుపెట్టారు. జిల్లా కాంగ్రెస్ సంఘ కార్యాలయ కార్యదర్శిగా వున్నప్పుడు, ఆయన కాంగ్రెస్ రికార్డులను బ్రిటిష్ పోలీసుల వశం కాకుండా రాత్రికి రాత్రి సురక్షితమైన చోటుకి తరలించారు. 19.6.30 సం. న ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు శిక్ష విధించ బడింది. రాజమండ్రి, తిరుచునాపల్లి జైళ్ళలో శిక్షననుభవించారు. శాసనోల్లంఘనంలో 11.1.1932 న కాంగ్రెస్ కరపత్రాలు పంచుతుండగా, పోలీసులు అరెస్టు చేసి, దారుణంగా చావ గొట్టారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనందుకు, పామర్రు సబ్ జైలులో నిర్బంధించారు. వీరు జాతీయ ఉద్యమంలో పెక్కు సంవత్సరాలు ప్రముఖ పాత్ర వహించారు. వీరికి, ఉత్తర భారత నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆంధ్ర పర్యటనలో, గాంధీజీ విరాళాల నిమ్మిత్తం కౌతరం, డోకిపర్రు గ్రామాలను సందర్శించిన్నప్పుడు గాంధీజీకి కనుమూరి రామిరెడ్డి గారి తోటలో వున్న నారింజ, నిమ్మకాయలు ఇవ్వడంతో, గాంధీజీ,1941 సంవత్సర పర్యటనలో, ప్రత్యేకంగా నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు గారికి 100 నారింజ, 100 నిమ్మకాయలు పంపమని వుత్తరం రాయడం జరిగింది.[1]
1921 నుంచి 1946 మధ్య కాలంలో, గాంధీజీ కృష్ణాజిల్లాలో సుమారుగా 6 సార్లు పర్యటించారు. ఆ పర్యటన ఆద్యంతం నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో రూపొందించబడింది. గాంధీజీ ఆంధ్ర ప్రాంతంలో సేకరించిన విరాళాల మొత్తం విలువ దేశంలో రెండొవ స్థానంలో ఉండేది. మొదటి స్థానం పంజాబ్ రాష్టం. కృష్ణారావు గారు ఖద్దరు వ్యాపారం చేస్తూ, విజయవాడలో ప్రముఖ న్యూస్ పేపర్ ఏజెన్సీని నడిపేవారు. భారత ప్రభుత్వం, నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు గారిని, 'తామ్రపత్రం ' పురస్కారంతో గౌరవించింది.
మూలాలు
మార్చు- ↑ సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. 66, అనుబంధం పేజీ. 4. ISBN 978-93-5445-095-2.