నేతి పరమేశ్వర శర్మ
నేతి పరమేశ్వర శర్మ (1928 - 2022, ఫిబ్రవరి 16) ప్రముఖ రంగస్థల నటుడు, పరిశోధకుడు.
నేతి పరమేశ్వర శర్మ | |
---|---|
జననం | 1928 నంగేగడ్డ, దివి తాలూకా, కృష్ణా జిల్లా |
మరణం | 2022, ఫిబ్రవరి 16 తెనాలి, గుంటూరు జిల్లా |
ప్రసిద్ధి | రంగస్థల నటులు, పరిశోధకులు |
తండ్రి | నిమ్మగడ్డ శ్రీరాములు |
తల్లి | సుబ్బమ్మ |
జననం
మార్చునేతి పరమేశ్వర శర్మ 1928లో నిమ్మగడ్డ శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా, దివి తాలూకా నంగేగడ్డ గ్రామంలో జన్మించాడు. పరమేశ్వర శర్మకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెనాలి గ్రామానికి చెందిన నేతి కమలాంబ, సీతారామశర్మ దంపతులకు దత్తపుత్రుడిగా వెళ్లాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చుపరమేశ్వర శర్మ బాల్యం తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలోని పెదరావూరు లో గడిచింది. స్వాతంత్రోద్యమ సమయంలో పెదరావూరు గ్రామంలో ఊరేగింపులు, సమావేశాలు జరుగుతుండేవి.
ఆ గ్రామంలో జరుగుతున్న నాటకప్రదర్శనలను చూసిన పరమేశ్వర శర్మకు తాను కూడా నాటకంలోని నటుల మాదిరిగా వేషం వేసుకోవాలనిపించి, తన అన్న చలపతిరావు ప్రోత్సాహంతో రేపల్లె లో జరిగిన రంగూన్ రౌడీ నాటకంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర ధరించాడు. కొడాలి గోపాలరావు, పాలడుగు ఆంజనేయులు స్థాపించిన ఆంధ్రా క్రాంతి థియేటర్ లో పరమేశ్వర శర్మ సభ్యునిగా చేరాడు. 1952లో ఆంధ్రా క్రాంతి థియేటర్ కి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. తెనాలి కేంద్రంగా ఆంధ్రా క్రాంతి థియేటర్ పలు కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 35 నుండి 40 రకాల పాత్రలు ధరించాడు.
తెనాలిలో పరమేశ్వర శర్మ ప్రదర్శించిన పునర్జన్మ (నాటకం) చూసిన తెనాలి తాలూకా హైస్కూల్ కమిటీ కార్యదర్శి పరమేశ్వర శర్మకు కొన్ని షరతులతో కూడిన ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం చేస్తూనే నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. 1956లో విజయవాడలో నిర్వహించిన థియేటర్ వర్క్ షాప్ లో మెళకువలను నేర్చుకున్నాడు. 1965లో క్రాంతి థియేటర్ బలహీనపడడంతో, నటరాజ కళామందిర్ అనే సంస్థను స్థాపించి రెండు సంవత్సరాలపాటు నాటిక, ఏకపాత్రాభినయాల పోటీలు నిర్వహించాడు.
తెనాలిలో నాటకరంగం పరిషత్తులకే పరిమితం అవుతుండడంతో, తెనాలిలోని ఇతర సమాజాలవారితో కలిసి ది తెనాలి యునైటెడ్ ఎమెచ్యూర్స్ అనే నాటక సంస్థను ఏర్పాటుచేసి, వాలి సుబ్బారావు గారి దర్శకత్వంలో దొంగవీరుడు నాటకాన్ని టికెట్లు పెట్టి ప్రదర్శించాడు. ఆ సంస్థ ఆగిపోయిన తరువాత కళాభారతి అన్న సంస్థను స్థాపించి పరమేశ్వర శర్మ దర్శకత్వంలో వల్లూరి వెంకట్రామయ్య చౌదరి బాజీ ప్రభువు పాత్రలో, పరమేశ్వర శర్మ హీరోజీ పాత్రలో జై భవాని నాటకాన్ని ప్రదర్శించాడు.
నటించిన నాటకాలు
మార్చు- రంగూన్ రౌడీ
- మాత్సర్యం
- నామాటే నెగ్గింది
- అజాత శత్రువు
- ఆనాడు
- యన్.జి.ఓ.
- పరివర్తన
- ఈనాడు
- కప్పలు
- యుధ్దం
- సందేశం
- అంతార్వాణి
- నేటి నటుడు
- అల్లీముఠా
- తుఫాన్
- మానవుడు చిరంజీవి
- తెలుగు కోపం
- పునర్జన్మ
- ముసుగు వీరుడు
- దొంగవీరుడు
- శాంతి
- పేదపిల్ల
- నా ఇల్లు అమ్మబడును
- నటనాలయం
- రాణీరుద్రమ
- పట్లాలు తప్పిన బండి
- అనుమానం
- విముక్తుడు
- నాటకం
- భయం
- కాపలావానిదీపం
- అలెగ్జాండర్
- ఏ ఎండకాగొడుగు
- జైభవానీ
- పెండ్లిచూపులు
బహుమతులు
మార్చుపునర్జన్మ (ప్రథమ బహుమతి, తిరుపతి)
పదవులు - కార్యక్రమాలు
మార్చు- ఉత్తమ చలన చిత్ర అభిమానుల సంఘం మొదటి అధ్యక్షులు
- తెనాలి పట్టణ కళాకారుల సంఘం మొదటి ఉపాధ్యక్షులు
- అభ్యుదయ కళాసమితి కార్యదర్శి
- 1986లో ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేసి, తెనాలిలో జరిగిన నేక నాటక పోటీల నిర్వాహణ, సన్మాన కార్యక్రమాలు నిర్వహించాడు.
- ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు (1989లో ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా మహాసభలు నిర్వహించాడు)
- 1994లో అభ్యుదయ రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాడు.
సినిమా రంగం
మార్చుడా. పాటిబండ్ల దక్షిణామూర్తితో కలిసి ఉత్తమ చలనచిత్ర అభిమానుల సంఘం ఏర్పాటుచేసి, దానికి మొదటి అధ్యక్షులుగా ఎన్నికై అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్యం మా జన్మహక్కు అనే సినిమాలో నల్లూరి వెంకటేశ్వరరావు, వల్లం నరసింహారావు, ముక్కురాజు, హరీష్, ఆహుతి ప్రసాద్ లతో కలిసి నటించాడు.
పురస్కారాలు
మార్చు- 2008లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[1]
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[2]
మరణం
మార్చుపరమేశ్వర శర్మ 2022, ఫిబ్రవరి 16న తెనాలిలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
- నేతి పరమేశ్వర శర్మ, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 336.