పి.సత్యవతి

(పి. సత్యవతి నుండి దారిమార్పు చెందింది)

పి.సత్యవతి ప్రఖ్యాత తెలుగు కథా రచయిత్రి.[1]

పి.సత్యవతి
పి.సత్యవతి
జననంపి.సత్యవతి
1940 జులై
గుంటూరు జిల్లా కొలకలూరు
ఇతర పేర్లుపి.సత్యవతి
ప్రసిద్ధిప్రఖ్యాత కథా రచయిత్రి

జీవిత విశేషాలు

మార్చు

పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలోలో ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. పాఠాలు బోధించడం, ఇంగ్లీషు సాహిత్యం గురించే కావచ్చు కానీ, ఈమె పరిశీలించిన సమాజం తెలుగుది. అందుకే ఈమె రచనలను తెలుగు సాహిత్యంలోనే చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఈమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, అరుదుగానైనా అప్పుడప్పుడూ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు స్పష్టమైన నిదర్శనాలు.

సమాజ గమనాన్ని, సాహిత్య బాధ్యతను గుర్తెరిగిన సత్యవతిగారు కథారచనలో ఒక నిర్దిష్ట గమ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ బాటలోనే 1970 నుంచి కథారచన చేస్తూ తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దారిలో తనకెదురైన పాఠకులను నిరంతరం ప్రమత్తం చేస్తున్నారు. ఆ రంగం వనితాలోకం. ఆ మార్గం మహోన్నత మహిళామార్గం. పితృస్వామ్య సమాజంలో మహిళలకున్న కష్టాలకంటే వారే కొని తెచ్చుకుంటున్న కష్టాలు ఎక్కువైతే, సమాజం వారిమీద బలవంతంగా రుద్దే పీడన, అపచారాలు, అవమానాలకు అంతేలేదు. ఈ ముప్పేట దాడిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే జరుగుతున్న దోపిడీ స్వరూపాన్ని, దోచుకునే విధానాలను ఎండగట్టాలి. వివక్ష విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయాలి. ఆ బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో తలకెత్తుకున్న స్త్రీవాద రచయితలలో పి. సత్యవతి అగ్రగణ్యురాలు.

రాశిలో తక్కువైనా వాసిలో అమోఘమనిపించుకున్న ప్రముఖ స్త్రీవాద రచయిత పి. సత్యవతిగారి సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే ఈమె వెలువరించిన కథా సంపుటాలను పరిశీలించి, పట్టి పట్టి అధ్యయనం చేయాలి. ఆ అంచనాకు మనకున్న గీటురాళ్లు ఏ మాత్రం సరిపోవు. అయితే కొండను అద్దంలో చూపినట్టు ఆ విదుషీమణి సారస్వత కృషిని చూపే ప్రయత్నమిది.

‘మర్రినీడ‘ అనే పెద్దకథ గల సంపుటితో జూన్ 1975లో పి. సత్యవతిని రచయిత్రిగా నవభారత్ బుక్ హౌస్ సాహితీలోకానికి పరిచయం చేసింది. ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ఒక ప్రయోగంగా అందులో ప్రచురించిన కథలపై పెట్టిన సాహితీ బ్యాలెట్ లో అప్పటి పాఠకులు ఈ పెద్దకథను బహుమతికి అర్హమైన కథగా ఎంచుకున్నారు. అప్పటినుంచీ అడపాతడపా బహుమతులు ఎన్నో ఈమె ఇంటి గుమ్మాన్ని తట్టాయి. వాటిలో పేర్కొనదగ్గ అవార్డులుగా 1997లో అందుకున్న చాసో స్ఫూర్తి అవార్డును, అదే ఏడాది లభించిన కొండేపూడి శ్రీనివాసరావు అవార్డును, 2002లో వరించిన రంగవల్లి విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని, 2004లో స్వీకరించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాలను పేర్కొనవచ్చును.

ఆనక డిసెంబరు 1998లో పన్నెండు కథల బంగారం “సత్యవతి కథలు“, మే 1995లో ఇంకో పదిహేను కథలతో “ఇల్లలకగానే…“, తాజాగా సెప్టెంబరు 2003లో మరి పన్నెండు కథల మాగాణిగా “మంత్రనగరి” సంపుటాలు ఈమె సాహితీ క్షేత్రంలో దిగుబడి పంట. మధ్య తరగతి మహిళ మనస్తత్వాన్ని పురుషస్వామ్యం రకరకాల మాయోపాయాలతో బురిడీ కొట్టించడం, స్త్రీలు బాధనంతా పళ్ల బిగువున భరిస్తూ గడపడం మొదటి సంపుటిలో గమనిస్తాం. ఆ క్లిష్టతా చట్రం నుంచి ఒక సంపూర్ణ మానవిగా ఎదగడానికి పడాల్సిన శ్రమ, ఆ క్రమంలో తెంచాల్సిన కట్టుబాట్ల శృంఖలాలు రెండో సంపుటిలో కథనీకరిస్తే, ఈ మొత్తం జెండర్ ఆధిపత్యపు ప్రహసనాన్ని చాపకింద నీరులాగా సమాజం ఎలా నియంత్రిస్తుంటుందో, విషవలయపు విశ్వరూపమెలా వుంటుందో సరికొత్త సాహిత్య టెక్నిక్ (మాజిక్ రియలిజమ్, కొల్లాజ్) తో మూడో సంపుటిలో ఆవిష్కరించారు. రాజకీయాల జోలికి పోకుండా స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం పి. సత్యవతిగారికే చెల్లింది. ఈ కృషిలో ఈమె విజయవంతంగా మరింత ముందుకు పయనిస్తూనేవుంటారు. తరువాత నాలుగవ సంపుటి "మెలకువ" వ్యాస సంకలనం "రాగం భూపాలం " వెలువడ్డాయి. 2016 లో విశాలాంధ్ర పబ్లిషర్స్ 40 కథలతో ఈమె కథా సంకలనం ప్రచురించింది.

కథల జాబితా

మార్చు

ఈమె వ్రాసిన కథలు తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతి, అనామిక, పుస్తకం, ఉదయం, రచన, ఆహ్వానం, విపుల, ఇండియాటుడే, వార్త, చినుకు, భూమిక, ఈనాడు, అరుణతార తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

కథానిలయంలో లభించే ఈమె కథల జాబితా:[2]

  1. ఆదివారం కోసం
  2. ఎర్రంచు సిల్కుచీర
  3. చిరుగాలి
  4. పగిలిన గాజుకప్పు
  5. ఇంటిదీపం
  6. తొణికిన స్వప్నం
  7. నిధి చాలా సుఖమా?
  8. సరిగంచు పరికిణీ
  9. మనలో మాట
  10. పద్మవ్యూహం
  11. కింకర్తవ్యం
  12. భూపాలరాగం
  13. దొంగ
  14. మర్రినీడ
  15. నిజాయితీ
  16. సుడిగాలి
  17. గ్లాసుపగిలింది
  18. మాఘసూర్యకాంతి
  19. పునాది
  20. జబ్బు
  21. ఓ రాజ్యంకథ
  22. సెభాష్...
  23. డాటర్స్ ఆఫ్ ఇండియా
  24. టు హిమ్ విత్ లవ్
  25. సరళరేఖ
  26. డామిట్
  27. మరో మామూలు కథ
  28. రత్నపాప
  29. కన్నతల్లీ-నిన్నుకడుపులో దాచుకోనా...
  30. ఆకాశంబున నుండి
  31. తాయిలం
  32. గోవు
  33. ఇల్లలకగానే
  34. ఇందిర
  35. ముసుగు
  36. చీమ
  37. భద్రత
  38. గణితం
  39. నూనె గానుగ
  40. దేవుడు
  41. గాంధారి రాగం
  42. అరుణ సంధ్య
  43. వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు
  44. పెళ్లిప్రయాణం
  45. బదిలీ
  46. పహరా
  47. గోధూళివేళ
  48. తిమింగల స్వర్గం
  49. శుక్రవారం
  50. ఎచటికి పోతావు రాత్రి
  51. నటనలు చాలునువే
  52. మంత్రనగరి
  53. భక్తి-రక్తి
  54. ఒక వసుంధర
  55. ఆజాదీ
  56. భాగం
  57. ఆత్మలు వాలిన చెట్టు
  58. ఒక రాణీ ఒక రాజా
  59. నేనొస్తున్నాను
  60. నాలుగు దృశ్యాలు
  61. నాన్న
  62. మూడేళ్ల ముచ్చట
  63. పిల్లాడొస్తాడా
  64. పేరులేనిపీల్ల
  65. దమయంతి కూతురు
  66. ఇట్లు మీ ‌స్వర్ణ
  67. శ్రీరామా ఎంక్లేవ్
  68. సమీకరణాలు
  69. అమ్మవడి

నవలలు

మార్చు
  1. పడుచుదనం రైలుబండి
  2. గొడుగు
  3. ఆ తప్పు నీది కాదు

పురస్కారాలు

మార్చు
  • 1997: చాసో స్ఫూర్తి పురస్కారం
  • 1997: కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం.[3]
  • 2002: రంగవల్లి జీవిత సాఫల్య పురస్కారం
  • 2002: తెలుగు యునివర్సిటీ ఉత్తమ కతాపురస్కారం
  • 2008: యగళ్ల ఫౌండేషన్ అవార్డు
  • 2012: సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం
  • 2012: మల్లెమాల సాహిత్య పురస్కారం
  • 2012: గురజాడ పురస్కారం ( సంస్కృతి సంస్థ గుంటూరు)
  • 2014: డా. బోయి భీమన్న ఉత్తమ రచయిత్రి పురస్కారం - లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014
  • 2014: పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం
  • 2015: మాలతిచందూర్ పురస్కారం
  • 2016: తురగా జానకీరాణి పురస్కారం
  • 2017: తానా పురస్కారం
  • బోయి భీమన్న సాహితీ పురస్కారం [4]
  • 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[5][6]
  • కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2019

2020 కువెంపు జాతీయ పురస్కారం

మూలాలు

మార్చు
  1. Sakshi (31 December 2021). "కళ్లు తెరిపించే కథా రచయిత్రి". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  2. కాళీపట్నం, రామారావు. "రచయిత: పి సత్యవతి". కథానిలయం. కా.రా. Retrieved 27 November 2017.
  3. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  4. "నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం". Archived from the original on 2014-09-20. Retrieved 2014-09-21.
  5. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  6. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.

యితర లింకులు

మార్చు