కె ఎల్ రావు సాగర్

కృష్ణా నదిపై పులిచింతల గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్టు
(పులిచింతల ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)

కె ఎల్ రావు సాగర్ కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మించిన సేద్యపు నీటి ప్రాజెక్టు. దీనిని గతంలో పులిచింతల ప్రాజెక్టు అని పిలిచేవారు, ప్రముఖ ఇంజనీరు, రాజకీయనాయకుడు కె.ఎల్.రావు పేరుతో కె ఎల్ రావు సాగర్ అని అధికారిక పేరుపెట్టారు. విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం వజినేపల్లి వద్ద ఉంది.

పులిచింతల ప్రాజెక్టు
కె ఎల్ రావు సాగర్ is located in Andhra Pradesh
కె ఎల్ రావు సాగర్
Andhra Pradesh లో పులిచింతల ప్రాజెక్టు స్థానం
అధికార నామంకె ఎల్ రావు సాగర్
దేశంభారతదేశం
ప్రదేశంపులిచింతల,పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్; సూర్యాపేట జిల్లా తెలంగాణ[1]
అక్షాంశ,రేఖాంశాలు16°45′15″N 80°03′24″E / 16.75417°N 80.05667°E / 16.75417; 80.05667
ఆవశ్యకతసాగునీరు & త్రాగునీరు
నిర్మాణం ప్రారంభం14 నవంబరు 2010
ప్రారంభ తేదీ7 డిసెంబరు 2013
నిర్మాణ వ్యయం₹ 1850 కోట్లు
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నిర్వాహకులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణా
Height42.24 మీ.
పొడవు2,922 మీ.
Width (base)31 m
Spillway typeControlled
Spillway capacity10 లక్ష క్యుసెక్కులు
జలాశయం
సృష్టించేదిపులిచింతల జలాశయం
మొత్తం సామర్థ్యం46 Tmcft
క్రియాశీల సామర్థ్యం36.23 Tmcft
పరీవాహక ప్రాంతం240,732 sq.km
ఉపరితల వైశాల్యం144 sq.km
నిర్వాహకులుTSGENCO[2]
Commission date2016 సెప్టెంబరు 22 (2016-09-22)
హైడ్రాలిక్ హెడ్25 మీ
టర్బైన్లు4 × 30 MW Kaplan turbine
Installed capacity120 MW

కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు వలన వీలవుతుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజీ కెపాసిటీ 36.23 టీఎంసీలు. డ్యామ్ వద్ద 3.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. డిసెంబర్ 7, 2013 న జాతికి అంకితమైంది.[3]

Map

చరిత్ర మార్చు

కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పెద్ద ఆనకట్టలలో నాగర్జునసాగర్ ఒకటి. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ద్వారా దాదాపు 35.14 లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యం కావాల్సి ఉంది. ఇందులో కృష్ణా డెల్టాకు చెందిన 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉంది.

కృష్ణా డెల్టాకు సాగునీరు విజయవాడ వద్దగల ప్రకాశం బారేజి ద్వారా సరఫరా అవుతుంది. ఇక్కడ నది మట్టం సముద్రమట్టానికి 50 అడుగులు ఉంటుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7,36,000 ఎకరాలకు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5,72,000 ఎకరాలకు బారేజి నుండి సాగునీరు సరఫరా అవుతుంది. అయితే బారేజి నీటి నిల్వ సామర్థ్యం అతి స్వల్పం (3 టి.ఎం.సి) కాబట్టి, వచ్చిన నీరు వచ్చినట్లే కాలువలలోకి వదలాలి, లేదా సముద్రం లోకి వదిలెయ్యాలి. అందుచేత డెల్టాకు అవసరమైన సాగునీటి నిల్వ నాగార్జున సాగర్ లోనే చెయ్యడం తప్పనిసరి.

అయితే, కర్ణాటకలో ఆలమట్టి ఆనకట్ట కట్టడం వలనా, 2003, 2004లలో కలిగిన వర్షాభావ పరిస్థితుల వలనా కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నాగార్జున సాగర్ అట్టడుగు నీటి మట్టానికి పడిపోయింది. అయితే నాగార్జున సాగర్కు, ప్రకాశం బారేజికి మధ్య ఉన్న పరీవాహక ప్రాంతం నుండి నదిలోకి వచ్చే నీటిని నిలవజేసేందుకు జలాశయం లేదు. ఈ ప్రాంతంలోనే మున్నేరు, మూసి, పాలేరు నదులు వచ్చి కృష్ణలో కలుస్తాయి. బారేజిలో నిల్వ సామర్థ్యం లేకపోవడం చేత, ఈ నీరు సముద్రం లోకి వదలక తప్పని పరిస్థితి ఉంది. ఈ నీరు 140 టి.ఎం.సి.లు ఉంటుందని అంచనా. ఇందులో 60 టి.ఎం.సి.లు వాడుకోగలిగే వీలు ఉంది. ఈ నీటిని నిల్వ చేసుకునేలా ఒక ఆనకట్టను, జలాశయాన్ని నిర్మించగలిగితే, డెల్టా ఆయకట్టు స్థిరపడటమే కాక, శ్రీశైలం, సాగర్ ల వద్ద నుండి మరింత నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించగలిగే వీలవుతుంది.

ఇతర ఉపయోగాలు మార్చు

1. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో తయారయ్యే సిమెంటును గుంటూరు జిల్లాకు బ్యారేజీపై నిర్మించే బ్రిడ్జి మీదుగా రవాణా చేసే అవకాశం ఏర్పడుతుంది. 2. గుంటూరు జిల్లా నుంచి ఈబ్రిడ్జి మీదుగా హైదరాబాదు వెళ్ళేందుకు సులభతరమవుతంది. తద్వారా కొన్ని ప్రాంతాల నుంచి హైదరాబాదుకు ప్రయాణదూరం తగ్గనుంది. 3. కృష్ణా జిల్లాలోని ముత్యాల, గుంటూరు జిల్లాలోని అచ్ఛంపేటలకు మధ్య మార్గం ఏర్పడుతుండటంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు దగ్గరకానున్నాయి. 4. రాయలసీమ నుంచి ప్రకాశం బ్యారేజి ద్వారా హైదరాబాదు, తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు ఇకనుంచి సత్తెనపల్లి, అచ్ఛంపేట మీదుగా జగ్గయ్యపేట ద్వారా హైదరాబాద్ వెళ్ళేందుకు మరింత మెరుగైన అవకాశం ఏర్పడుతుంది.

అభ్యంతరాలు మార్చు

పులిచింతలకు వ్యతిరేకంగా కింది వాదనలు ఉన్నాయి.

  1. జలాశయంలో మునిగిపోతున్న గ్రామాల ప్రజల పునరావాసానికి సంబంధించిన వాదన.
  2. అసలు సేద్యపు నీటి సరఫరా లేనేలేని తెలంగాణా లోని ప్రాంతాల్లో ప్రాజెక్టులను నిర్మించేవరకు పులిచింతలకు ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం లేదనేది రెండో వాదన.
  3. ఆ ప్రాంతంలోని సున్నపురాయి గనులు జలాశయంలో మునిగిపోతాయన్న మూడో వాదన కూడా ఉంది.

నిర్మాణం మార్చు

1964లో శాసనసభ కమిటీ ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే 1988 వరకు అది చర్చలకే పరిమితమైంది. 1988 నవంబర్ 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసాడు. ఆనాటి అంచనా రూ 269 కోట్లు. శంకుస్థాపన అయినప్పటికీ, పని మొదలు కాలేదు. తిరిగి 2004 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపన చేసాడు.

మైలురాళ్లు
  • 2002 డిసెంబర్ 21: పూర్వ ముఖ్యమంత్రి, రామారావు 1988లో వేసిన శంకుస్థాపన ఫలకాన్ని పీపుల్స్ వార్ నక్సలైట్లు పేల్చివేసారు.
  • 2002 ఫిబ్రవరి 9: పులిచింతల ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాని స్పష్టం చేయాలని తెరాస నేత కె.సి.ఆర్ కోరాడు.
  • 2004 సెప్టెంబర్ 30: ప్రాజెక్టు నిర్మాణం విషయమై ఎస్.ఇ. బాపూజీ, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. నల్గొండ జిల్లా వజినేపల్లి వద్ద అక్టోబర్ 15 న పని మొదలు పెడతామని కంపెనీ చెప్పింది. చైనా ప్రభుత్వ కంపెనీ అయిన చైనా రైల్వే 18 బ్యూరో గ్రూప్ తో కలిసి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని కంపెనీ తెలిపింది.
  • 2004 నవంబర్ 17: పర్యావరణ అనుమతులు ఇంకా పొందనందున ప్రాజెక్టు పనులు ఆపివేయాలని కోర్టు స్టే ఇచ్చింది.
  • 2005 ఏప్రిల్ 29: ప్రాజెక్టు వలన పలనాడు ప్రాంతానికి ఏమాత్రం ఉపయోగం లేకపోగా, అక్కడి గ్రామాలు మునిగిపోతున్నాయని, అంచేత ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అఖిల భారత ప్రజా సంఘర్షణ వేదిక రాష్ట్ర కమిటీ సభుడు కె.రవిచంద్ర పిలుపునిచ్చారు.
  • 2005 జూన్ 9: ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి వచ్చింది.
  • 2005 జూలై 8: తమ భూములకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కోరుతూ, రైతులు పులిచింతల ప్రాక్జెక్టు స్థలం వద్ద సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు.
  • 2005 జూలై 25: పులిచింతల ప్రాజెక్టు స్థలం మార్చము అని, పని యథావిధిగా కొనసాగుతుందని అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
  • 2006 ఫిబ్రవరి 21: పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • 2013 డిసెంబర్ 7: పులిచింతల ప్రాజెక్టు జాతికి అంకితం.[3]

మునిగిపోయిన గ్రామాలు మార్చు

జలాశయంలో 15 గ్రామాలు పూర్తిగాను, 8 గ్రామాలు పాక్షికంగాను మునిగిపోయాయి. మొత్తం 29,760 ఎకరాలు మునిగాయి. ఇందులో 9291 ఎకరాలు అడవి కాగా మిగతాది ప్రజల స్వంత ఆస్తులు.

మూలాలు, వనరులు మార్చు

  1. "K L Rao Sagar". Ap Irrigation Department. 12 January 2013. Retrieved 13 August 2019.
  2. "ఆర్కైవ్ నకలు". 2018-12-11. Archived from the original on 2021-06-25. Retrieved 2021-06-25.
  3. 3.0 3.1 "7న పులిచింతల ప్రారంభం". సాక్షి. 2013-12-06. Archived from the original on 2016-03-06.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు