మంత్రి శ్రీనివాసరావు

మంత్రి శ్రీనివాసరావు (జనవరి 1, 1928 - అక్టోబర్ 9, 1974) తెలంగాణ ప్రాంత రంగస్థల నటులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి.[1]

మంత్రి శ్రీనివాసరావు
జననంజనవరి 1, 1928
బచ్చుపల్లి, ఇబ్రహీంపట్నం తాలూకా రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణంఅక్టోబర్ 9, 1974
మరణ కారణంఅస్వస్థత
ప్రసిద్ధిరంగస్థల నటులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి
తండ్రిమంత్రి రామచంద్రరావు
తల్లిరాజ్యలక్ష్మి

జననంసవరించు

తెలంగాణ దేశ్‌ ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రి శ్రీనివాసరావు 1928 జనవరి 1రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లి లో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు.

విద్య - ఉద్యోగంసవరించు

నిజాం కళాశాల లో విద్యాభ్యాసం చేశారు. సమాచార శాఖలో ఉద్యోగం చేశారు.

రంగస్థల ప్రస్థానంసవరించు

1945లో కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావు ఆంగ్ల, తెలుగు నాటకాల్లో నటించడం ప్రారంభించారు. 1946–47లో ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో చెకోవ్‌ ‘ప్రపోజల్‌’ నాటకంతో రంగస్థలం మీద అడుగుపెట్టారు.

అదే సమయంలో అబ్బూరి వరదరాజేశ్వరరావు తో ఏర్పడిన పరిచయం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. ఎ.ఆర్.కృష్ణ తో పరిచయం, సాన్నిహిత్యం 1952లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.

జాతీయ నాట్య సంఘానికి కమలాదేవి ఛటోపాధ్యాయ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో ఈ తొలి నాటకోత్సవానికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నాటకోత్సవంలో బెల్లంకొండ రామదాసు రాసిన ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు మొదలగువారు ప్రదర్శించారు. దీని తరువాత తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి.

అబ్బూరి రామకృష్ణారావు నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట శిక్షణ తరగతులు నిర్వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత జాతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నాట్య విద్యా సంఘాన్ని మంత్రి శ్రీనివాసరావు స్థాపక సభ్యులుగా సేవలందించారు.

'ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌' నాటకంలో తెలుగు-తమిళ యాసతో పోస్ట్‌మాస్టర్‌ పాత్రను శ్రీనివాసరావు పోషించారు. తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లోనూ, గుడివాడ, ఆంధ్ర నాటకకళా పరిషత్‌ లలో ఆ నాటకానికి మంచి పేరు వచ్చింది. 1957లో ఐ.ఎన్‌.టి నాటకోత్సవాల్లో కుందుర్తి రచించిన 'ఆశ' నాటకాన్ని, శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య' వంటి నాటకాలను ప్రయోగాత్మక నాటకాలుగా మలచి ప్రదర్శించారు.

మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ మాండలికంలో 1950–60 మధ్యకాలంలో అనేక రేడియో నాటకాలను అందించి శ్రవ్య నాటకానికి ఒక దారి ఏర్పరిచారు.

నటించిన నాటకాలు - పాత్రలుసవరించు

 1. మాష్టార్జీ -
 2. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ - పోస్ట్‌ మాస్టర్‌
 3. ఆశ -
 4. విదూషకుడి ఆత్మహత్య -
 5. నిచ్చెనలు -
 6. పెద్దమనుషులు -
 7. మృచ్ఛకటికం -
 8. డాలర్‌ -
 9. కన్యాశుల్కం -

శిష్యులుసవరించు

 1. రాళ్ళపల్లి
 2. సాక్షి రంగారావు
 3. వంకాయల సత్యనారాయణ
 4. అత్తిలి కృష్ణారావు
 5. ఎస్.కె. మిశ్రో
 6. కృష్ణచైతన్య
 7. రామవరపు శరత్‌బాబు

మరణంసవరించు

1974 అక్టోబర్ 9 న తన 46వ యేట అస్వస్థతతో విశాఖలో మరణించారు.

మూలాలుసవరించు

 1. ఆంధ్రజ్యోతి (1 January 2017). "నవీన నాటక శిల్పి". డాక్టర్ జె. చెన్నయ్య. Archived from the original on 23 April 2019. Retrieved 1 January 2017.