మరపురాని కథ
మరపురాని కథ 1967, జూలై 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. 1964లో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా విడుదలైన కై కొడుత్త దైవమ్ తమిళ సినిమా నుండి ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమా 1970లో మలయాళంలో ప్రేమ్ నజీర్, పద్మిని, సత్యన్, జయభారతి ప్రధాన తారాగణంగా పలుంకు పాత్రమ్ అనే పేరుతో, 1971లో అమితాబ్ బచ్చన్, తనూజ జంటగా ప్యార్ కీ కహానీ పేరుతోను రీమేక్ చేయబడింది.
మరపురాని కథ (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
---|---|
కథ | భమిడిపాటి రాధాకృష్ణ |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, డూండీ
- దర్శకుడు: వి. రామచంద్రరావు
- సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ
- పాటలు: ఆరుద్ర, కొసరాజు, సి.నారాయణరెడ్డి, అప్పలాచార్య
- సంగీతం: టి.చలపతిరావు
- నేపథ్యగాయకులు: ఘంటసాల, టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, బి.వసంత
- ఛాయాగ్రహణం: ఎస్.వెంకటరత్నం
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
- కళ: ఎస్.కృష్ణారావు
- నృత్యం:చిన్ని-సంపత్
నటీనటులు
మార్చు- కృష్ణ - రఘు
- వాణిశ్రీ - రాధ, మాధవరావు పెద్ద కూతురు
- చంద్రమోహన్ - రవి
- కాంచన - లత, రవి దగ్గర పనిచేస్తున్న స్టెనోగ్రాఫర్
- చిత్తూరు నాగయ్య - మాధవరావు
- సంధ్యారాణి - శాంతి, మాధవరావు చిన్న కూతురు
- రావి కొండలరావు
- నాగభూషణం - వరహాలు
- చదలవాడ కుటుంబరావు
- బృందావన చౌదరి
- ఎల్.విజయలక్ష్మి
- భానుమతి (జూనియర్)
- జి.ఎస్.ఆర్.మూర్తి - లత తండ్రి
- జానకి
- ఒ.ఎస్.ఆర్.
- విజయబాల
- కె.వి.చలం
- ఎ.వి.సుబ్బారావు (జూనియర్)
- చలపతిరావు
- మోదుకూరి సత్యం
- సీతారాం
- కె.ప్రసాద్
కథ
మార్చుమాధవరావు సంపన్న గృహస్థుడు. ఆయనకు రాధ, శాంతి అనే ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు రవి. రాధ అమాయకురాలు. అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఆమె నిష్కళంక,నిష్కపట ప్రవర్తనను లోకులు అపార్థం చేసుకుని మరికొన్ని కట్టుకథలు చేర్చి ప్రచారం చేశారు. అవి విని రవి కోపంతో ఇల్లు వదలి అమృత్‌సర్ వెళ్లి అక్కడ రఘు అనే స్నేహితునితో కలిసి ఉంటాడు. కుమారుడు దేశాలు పట్టిపోవడం కన్నా కూతురు అపనిందలపాలు కావడం మాధవరావుకు ఎక్కువ ఖేదాన్ని కలిగిస్తుంది. ఈ అపనిందలకు కారణభూతుడైన వరహాలు అనే రౌడీపై కేసు పెట్టాలనుకుంటే స్నేహితుడు, ప్లీడరు సంగీతరావు అది మరింత అల్లరికి కారణమవుతుందని వారిస్తాడు. తాను పనిచేస్తున్న ఆఫీసులోనే పనిచేస్తున్న లతను రవి ప్రేమిస్తాడు. లత కూడా రవిని ప్రేమిస్తుంది. రఘు వీరి సంగతి కనిపెట్టి లత తండ్రిని ఒప్పించి పెళ్ళి చేయిస్తాడు. లత తండ్రి తీర్థయాత్రలకు వెళుతూ లతను, రవిని జాగ్రత్తగా చూస్తూవుండమని రఘుకు చెబుతాడు. లతను తన స్వంత చెల్లిగా భావిస్తానని మాట ఇస్తాడు రఘు. కానీ లోకులు వీరినీ వదలలేదు. వీరిపై వదంతులు వ్యాపింపజేస్తారు. రఘు బాధపడి వెళ్ళిపోబోతాడు. రవి వారించి తాను ఆ ప్రచారాన్ని నమ్మనని చెబుతాడు. రాధను చూడటానికి వచ్చిన పెళ్ళివారు ఆమెపైన ఉన్న అపనిందల సంగతి తెలుసుకుని ఎక్కువ కట్నం అడిగితే రాధ చెల్లెలు శాంతి వారికి టికెట్టు ఇచ్చి సాగనంపుతుంది. రాధకు ఇక పెళ్ళి కాదేమోనన్న బెంగతో మంచం పట్టిన మాధవరావుకు తన స్నేహితుడు పనసయ్య కుమారుడు రఘుతో పెళ్ళికి ఏర్పాటు చేస్తానంటాడు ప్లీడర్. రఘు వచ్చి పెళ్ళికూతురును చూస్తాడు. పెళ్ళి చేసుకోవడానికి తనకు ఇష్టమేనని అయితే ఈ విషయం తన ప్రాణమిత్రునికి చెప్పి అతని ఆమోదం పొందగానే ముహూర్తం నిర్ణయించవచ్చంటాడు. రవికి రాధ ఫోటో పంపిస్తాడు. ఆ పిల్ల మంచిదికాదని పెళ్ళి చేసుకోవద్దని రవి వ్రాసిన ఉత్తరం శాంతికి చూపించి అమృత్‌సర్ వెళ్ళిపోతాడు. ఆ లేఖ వ్రాసింది తన అన్న రవే అని గ్రహించిన శాంతి "నీ మూలంగా అమాయకురాలైన అక్క పెళ్ళి ఆగిపోయింది" అని వ్రాస్తుంది. ఆ ఉత్తరం రఘు చూసి రాధ రవి చెల్లెలని గ్రహిస్తాడు. ఆమె జీవితాన్ని బాగుచేస్తానని బయలుదేరుతాడు. రాధతో రఘు పెళ్ళి రవి ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి? రాధనే పెళ్ళాడాలన్న రఘు పంతం నెరవేరిందా? అన్నది పతాక సన్నివేశంలో తెలుస్తుంది.[1]
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ జె.వి.ఆర్. (30 July 1967). "చిత్రసమీక్ష: మరపురాని కథ" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2022. Retrieved 11 నవంబరు 2022.