వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2018)

2018 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

భారతదేశంలోని ఏడు అద్భుతాలు

ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన మానవ నిర్మిత కట్టడాలు మరియు సహజసిద్ధ వస్తువుల పట్టికను రూపొందించేందుకు ప్రపంచ అద్భుతాలుతో కూడిన వివిధ జాబితాలను తరాలుగా సంగ్రహించడం జరుగుతోంది. అయితే, భారతదేశంలోని ఏడు అత్యద్భుతాలను ఎంపిక చేయడం కోసం మొదటిసారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI) వార్తా పత్రిక 2007లో జూలై 21 నుంచి జూలై 31 వరకు ఒక SMS ఎన్నిక ప్రక్రియను నిర్వహించింది, ఇందుకోసం పురాతన లేదా మధ్యయుగ కాలం నాటి 20 ప్రదేశాలను ఒక జాబితాగా రూపొందించిన ఈ వార్తా పత్రిక అందులో నుంచి ఏడు అద్భుతాలను ఎన్నుకోవాల్సిందిగా కోరింది. ఆవిధంగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భారతదేశ ఏడు అద్భుతాలు (ఇందులో నాలుగు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్) టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) పాఠకులచేత ఎన్నిక కాబడినవే. అద్భుతాలుగా పేర్కొంటూ పాఠకులు ఎంపిక చేసిన జాబితాలో ఘనకీర్తి కలిగిన ఏకశిలా విగ్రహం మొదలుకొని ప్రార్థనా మందిరం, ఒక సమాధి మరియు ఒక విశ్వవిద్యాలయం వరకు చోటు చేసుకున్నాయి. స్వర్ణ దేవాలయం మరియు తాజ్ మహల్ మినహా, ఏడు అద్భుతాలన్నీ చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కొలువుదీరినవే. అయితే, పాఠకులు ఎంపిక చేయడం కోసం ముందస్తుగా జాబితాపర్చబడిన ఇరవై స్మారక చిహ్నాల్లో నాలుగు మాత్రం మెట్రో నగరాల్లో కొలువుదీరినవి చోటుచేసుకున్నాయి, ఢిల్లీలోని లోటస్ దేవాలయం మరియు కుతుబ్ మినార్, బాంబేలోని విక్టోరియా టెర్మినస్, కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి.


(ఇంకా…)

2వ వారం

పళని

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని. ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు.


(ఇంకా…)

3వ వారం

తాతా రమేశ్ బాబు

తాతా రమేశ్ బాబు(1960 జనవరి 15 - 2017 ఏప్రిల్ 20) తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది. తాతా రమేశ్ బాబు గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామంలో 1960 జనవరి 15 వ తేదీన బసవలింగం, బోలెం లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి విద్యా శాఖలో పాఠశాలల తనిఖీ అధికారిగా వుద్యోగిగా ఉండడంవల్ల ఆయన బాల్యం అంతా కృష్ణా జిల్లా లోనే గడచింది. ఆయన ఉయ్యూరు, కైకలూరు, మొవ్వ, అవనిగడ్డ లలో తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నారు. పదవతరగతి మచిలీపట్టణం జైహింద్ హైస్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలను ఆంధ్ర జాతీయ కళాశాల లోనూ చదువుకున్నారు. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో వుండగా మద్రాసు సినీ పరిశ్రమకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల డిగ్రీ పూర్తి చేయలేక పోయారు. ఆయనకు చిన్ననాటి నుండి లలిత కళలు అన్నా, ఆటలు అన్నా చాలా ఇష్టం. ఆయన పదవతరగతి నుంచే గేయాలురాయటం, నాటకాలు వేయటం మొదలు పెట్టారు. ఆయన రచనలు చాలా దిన, వార పత్రికలలో ప్రచురించబడేవి.

(ఇంకా…)

4వ వారం

కాల్షియం

కాల్షియం ఒక మెత్తని ఊదారంగు గల క్షార మృత్తిక లోహము. దీని సంకేతము Ca మరియు పరమాణు సంఖ్య 20. ఇది విస్తృత ఆవర్తన పట్టికలో 2వ గ్రూపు, నాల్గవ పీరియడుకు చెందిన మూలకం. దీని పరమాణు భారము 40.078 గ్రా/మోల్. ఇది భూపటలం లో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము మరియు ఇనుము, అల్యూమినియం తరువాత అత్యధికంగా లభ్యమయ్యే మూడవ లోహం. ఇది భూమిపై సాధారణంగా సమ్మేళన రూపంలో కాల్షియం కార్బొనేట్ (సున్నపురాయి) గా లభ్యమవుతుంది. సముద్రాలలో శిలాజరూపంలో ఉన్న జిప్సం, ఎన్‌హైడ్రైట్, ఫ్లోరైట్ మరియు అపాటైట్ వంటివికూడా కాల్షియం యొక్క వనరులే. కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, ఎముకలు మరియు కొన్ని జీవుల(నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది. జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం. చరిత్రకు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14,000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియాన్ని వాడేవారు.


(ఇంకా…)

5వ వారం

తలకోన

తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇది తిరుపతికి 45 కి.మీ దూరంలో శేషాచల కొండల పర్వతశ్రేణుల మధ్యలో ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా అకర్షణీయంగా ఉంటాయి. ఓషధీ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. తలకోనలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఉంది. తలకోన శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు.

(ఇంకా…)

6వ వారం

అపకేంద్ర యంత్రం

అపకేంద్ర యంత్రం (ఆంగ్లం: Centrifuge) అంటే ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను, తక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక యంత్రం. విద్యుత్ మోటారు సహాయంతో అతివేగంగా తన అక్షం చుట్టూ తిరిగే ఒక స్తూపాకార పాత్రలో ఇచ్చిన మిశ్రమాన్ని వేసినపుడు అపకేంద్రబలం వల్ల ఎక్కువ ద్రవ్యరాశి గల కణాలు పాత్ర అంచువైపుకు చేరుకుంటాయి. తక్కువ ద్రవ్యరాశి గల కణాలు పాత్ర మధ్య లోనికి చేరుకుంటాయి. ఈ విధంగా ఎక్కువ ద్రవ్యరాశిగల కణాలు గల పదార్థాన్ని, తక్కువ ద్రవ్యరాశి గల కణాలు కలిగిన పదార్థాలను వేరు చేయవచ్చు. అపకేంద్రబలం కణం ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. ద్రవ్యరాశి పెరిగితే, అపకేంద్రబలం పెరుగును. ద్రవ్యరాశి తగ్గితే అపకేంద్రబలం తగ్గును. అందువల్ల ద్రవ్యరాశి, అపకేంద్రబలం అనులోమానుపాతంలో ఉంటాయి. ఈ కారణంగా తక్కువ ద్రవ్యరాశి గల కణాల పై అపకేంద్రబలం తగ్గి పాత్ర మధ్యలోనికి చేరుతాయి. ఎక్కువ ద్రవ్యరాశి గల కణాలపై అపకేంరబలం పెరుగుట కారణంగా అవి కేంద్రం నుండి దూరంగా పోతాయి. నీరు, బురద మిశ్రమాన్ని తీసుకొని బాగా కలిపి పారదర్శకంగా కన్పించు గాజుపాత్రలో పోసి, అలాగే మరోపాత్రలో నీరుమరియు నూనెలను కలిపి ఈ మశ్రమాన్ని మరో పారదర్శక పాత్రలో పోసి తేర్చుటకై వుంచాలి. కొంత సమయం తరువాత గమనించిన మొదటి గాజుపాత్రలో అడుగుభాగంలో బురద (సాంద్రత ఎక్కువ నీటికన్న), పైన నీరు వుండును.రెండోపాత్రలో అడుగున నీరు (నూనెకన్నసాంద్రత ఎక్కువ) పైన నూనె వుండును.

(ఇంకా…)

7వ వారం

సుష్మాస్వరాజ్

భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నరుగా పనిచేశారు. 1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు. 1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు.


(ఇంకా…)

8వ వారం
అల్లూరి సీతారామరాజు (సినిమా)

అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని ని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు. చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది.


(ఇంకా…)

9వ వారం

రాగి

రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్శించును. రాగి ఎరుపు–నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి.రాగిని ఉష్ణ మరియు విద్యుత్తు వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, ఆభరణము తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరికతలో మార్పులు చోటు చేసుకున్నవి. రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంతపు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం అని పిలిచేవారు.

(ఇంకా…)

10వ వారం

చిదంబరం ఆలయం

చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ ‌కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి. హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, జంబుకేశ్వరం| జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు. ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉన్నది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన మరియు చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.

(ఇంకా…)

11వ వారం

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం. ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. ఇది అక్బర్ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధానిగా ఉండేది. చిత్తోర్ రాన్తంభోర్ మీద విజయం సాధించిన తరువాత అక్బర్ తన రాజధానిని ఆగ్రా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్రీ రిట్జ్ ప్రదేశానికి తరలించాలని అనుకున్నాడు. సూఫీ సన్యాసి సలీం చిష్టి గౌరవార్ధం సిక్రీ రిట్జ్ వద్ద నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అక్బర్ చక్రవర్తి ఈ ప్రదేశంలో కోటగోడలు కలిగిన నగర నిర్మాణం చేయాలని సంకల్పించాడు. రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు, ప్రైవేట్ క్వార్టర్లు మరియు ఇతర ఉపయోగాలకు అవసరమైన భవనాలతో కూడిన కోట నిర్మాణ కార్యక్రమాలు 15 సంవత్సరాల కాలం కొనసాగింది. అక్బరు చక్రవర్తి ఆ నగరానికి ఫతేహబాదు అని నామకరణం చేసాడు. అరాబిక్ పూర్వీకమైన పర్షియన్ భాషలో ఫతేహ్ అంటే విజయం అని అర్ధం. తరువాత అది ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. మొగలుల సంరక్షించబడుతున్న ప్రముఖ నిర్మాణాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. సమకాలీన చరిత్రకారులు ఫతేపూర్ సిక్రీ నిర్మించడానికి అక్బర్ చాలా ఆసక్తి చూపాడని నిర్మాణం రూపకల్పన మరియు నిర్మాణశైలికి కూడా అక్బరు సూచనలు ఇచ్చాడని భావించారు. వారి పూర్వీకుడైన తైమూరును కీర్తిని స్పురింపజేసేలా పర్షియన్ శైలిలో అద్భుతమైన సభామంటపాల నిర్మాణానికి రూపకల్పన చేయబడింది.


(ఇంకా…)

12వ వారం

చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి

జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (మే 20, 1894 – జనవరి 8, 1994) కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68వ వారు. వారు పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో కూడా పిలవబడతారు. ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి. స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి. కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు మే, 20,1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20, 1894 నాడు అనూరాధ నక్షత్రములో (చాంద్రమాసానుసారము) జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు. స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. వారికి 1905లో ఉపనయనము జరిగింది. శివన్ సర్ గా పేరొందిన సదాశివ శాస్త్రిగారు స్వామినాథన్ కి అనుజులు. ఆబాలుడు 13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించాడు.


(ఇంకా…)

13వ వారం

యాగంటి

యాగంటి కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రము. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.

(ఇంకా…)

14వ వారం

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా అన్నది చారిత్రక కారణాలతో వెనుకబడివున్న భారతదేశ రాష్ట్రాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెలుసుబాట్లు కల్పించేందుకు ఏర్పరిచిన హోదా.  రాష్ట్రాలను ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రణాళికా సంఘం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రప్రభుత్వంలోని మంత్రుల సలహా మేరకు ప్రధానమంత్రి అధ్యక్షతలోని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) భౌగోళిక సమస్యలు, జనాభాపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా లోటుపాట్లు, వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో నెలకొనివుండడం వంటి కారణాల ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయాన్ని గ్రాంట్ల రూపంలోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వడం ద్వారానూ, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీలు, రుణాల చెల్లింపు వాయిదాలు వంటివి ఇవ్వడం ద్వారా వాటిని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది. 1969లో 5వ ప్రణాళికా సంఘం సూచనల మేరకు 3 రాష్ట్రాలకు హోదా కల్పిస్తూ ప్రత్యేక హోదా ప్రారంభం కాగా, 2010లో చివరగా చేరిన ఉత్తరాఖండ్‌తో కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉంది. ప్రత్యేక హోదా కల్పించమని బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తూండగా, 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలోనూ, ప్రస్తుత ప్రధాని మోడీ ఎన్నికల సభలోనూ పేర్కొనడం, తర్వాత నిరాకరించడంతో ఆ అంశంపై రాజకీయంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

(ఇంకా…)

15వ వారం

రాహుల్ సాంకృత్యాయన్

రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14) హిందీ యాత్రాసాహిత్య పితామహుడిగా సుప్రసిద్ధులు. ఆయన బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారిగా పేరుపొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు. లోతైన తాత్త్విక చింతన కలిగిన సాంకృత్యాయన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బౌద్ధ భిక్షువుగా మారి అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా పరివర్తన చెందారు. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమంలో కూడా కృషిచేశారు. జాతీయోద్యమానికి అనుకూలంగా, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించారు. విస్తృతమైన అభిరుచులు, లోతైన చింతన, విపరీతమైన సంచార జీవనం వెరసి అపురూపమైన సాహిత్యాన్ని రచించారాయన. 1940వ దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి, కమ్యూనిస్ట్‌ పార్టీలో సభ్యునిగా చేరి, జీవితాంతం కమ్యూనిస్ట్‌గా ఉన్నారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్‌లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీఛార్జిలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలిగింది. రాహుల్జీ ఏక సందాగ్రాహి అని, ఆయన టిబెట్‌ భాషనుండి సంస్కృతానికి అత్యంత వేగంగా అనువాదం చెయ్యగలిగేవారనీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు వివరించారు. ఆయన చేసిన రచనలలో, అనువాదాలలో చాలాభాగం ఇప్పటికీ ప్రచురణ కాలేదు.


(ఇంకా…)

16వ వారం

అరకులోయ

అరకులోయ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖ నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం. ఇది తూర్పు కనుమల లో ఉంది. ఇది విశాఖపట్నం నుండి 114 కి.మీ దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి మరియు సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగము. ఇచట బాక్సైట్ నిక్షేపాలున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ ఇచట ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).  ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉన్నది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది. అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

(ఇంకా…)

17వ వారం

ఎస్. జానకి

ఎస్.జానకి (జ.ఏప్రిల్ 23,1938) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. 1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు.

(ఇంకా…)

18వ వారం

భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము

శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన తాండూరు పట్టణము నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పర్గి, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా విపరీతంగా వస్తుంటారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రెండు రోజులు ప్రధానమైనవి. శని, ఆది వారాల్లో జరిగే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జర్గే రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. ఆదివారం అర్థరాత్రి జర్గే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామలో సుమారు 200 సంవత్సరాల క్రితం భద్రప్ప జన్మించినట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబుతారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఉత్సవాలు జర్గుతాయి.

(ఇంకా…)

19వ వారం

గ్లూకోస్

గ్లూకోస్ ఒక సాధారణ చక్కెర. ఇది జీవరసాయనికంగా చాలా ప్రధానమైనది.జీవకణాలలో జరిగే శక్తి వినిమయ చర్యలలో గ్లూకోస్ ఎక్కువగా పాల్గొంటుంది. దీని అణుఫార్ములా C6H12O6, దీని అణువులో ఆరు కర్బన పరమాణువులు, 12 ఉదజని పరమాణువులు, 6 ఆమ్లజని పరమాణువులూ ఉన్నాయి. గ్లూకోజ్ జంతువుల రక్తంలో బ్లడ్ సుగర్ గా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది సూర్యకాంతి నుండి శక్తిని గ్రహించి నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లతో కలిసి కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఏర్పడుతుంది. కణ శ్వాసక్రియకు ఇది ప్రధానమైన శక్తి వనరు. గ్లూకోజ్ మొక్కలలో స్టార్చ్ రూపంలోను, జంతువులలో గైకోజెన్ రూపంలోనూ ఒక పాలిమర్ గా భద్రపరచబడుతుంది. ఆరు కర్బన పరమాణువులు గల గ్లూకోజ్, హెక్సోజ్ గా వర్గీకరింపబడుతుంది. ఇది మోనోశాకరైడు ఉపవర్గంలోనిది. D-గ్లూకోజ్ పదహారు అల్డోహెక్సోజ్ స్టియరో ఐసోమర్లలో ఒకటి. D- ఐసోమెర్, D-గ్లూకోజ్ లు డెక్స్‌ట్రోజ్ గా పిలువబడతాయి. ఇది ప్రకృతిలో సమృద్ధిగా లభ్యమవుతుంది. కానీ L-ఐసోమెర్, L-గ్లూకోజ్ లు లభ్యం కావు. మిల్క్ సుగర్ (లాక్టోజ్), కేన్ సుగర్ (సుక్రోజ్), మాల్టోజ్, సెల్యులోజ్, గైకోజెన్ వంటి చక్కెరలను జలవిశ్లేషణ చేయడం వలన గ్లూకోజ్ లభ్యమవుతుంది. ఇది సాధారణంగా మొక్కజొన్నపిండి నుండి వాణిజ్యపరంగా తయారవుతుంది.

(ఇంకా…)

20వ వారం

హైదర్ అలీ

హైదర్ ఆలీ దక్షిణాదిన ఉన్న మైసూర్ రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి (సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, మైసూరు ప్రభుత్వంపై పెత్తనాన్ని సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు. అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం మరియు నిజాం హైదరాబాదు వరకు విస్తరించాడు. హైదర్ ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణను సమర్థవంతంగా అడ్డుకున్న కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు స్థావరమైన మద్రాసుకు అతి సమీపానికి రాగలిగాడు. అతను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు. హైదర్ ఆలీ పాలన తన పొరుగువారితో తరుచుగా జరిగే యుధ్ధాలతోను మరియు తన రాజ్యం లోపల జరిగే తిరుగుబాటులతోను కూడిఉంది. ఇది ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. నిజానికి అప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువభాగం సంక్షోభంలో ఉంది. మరాఠా సమాఖ్య మొఘల్ సామ్రాజానికి చెందిన అధికారులతో పోరాడుతున్నది. అతను ఒక మంచి తెలివి గల నేత. తను పాలన చేపట్టినప్పుటి కంటే పెద్ద రాజ్యాన్ని తన కుమారుడు టిప్పు సుల్తానుకు వదిలివెళ్ళాడు. అతను తన సైన్యాన్ని ఐరోపా సైన్యపు పధ్ధతులలో వ్యవస్థీకరించాడు.

(ఇంకా…)

21వ వారం

సేలం

సేలం భారత దేశం, తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న ఒక నగరం మరియు నగరపాలక సంస్థ. ఇది భారత దేశంలో దక్షిణాది రాష్ట్రంలో ఉత్తర మధ్య ప్రాంతంలో ఉంది. సేలం, కొంగు నాడు అనబడే పశ్చిమ తమిళ ప్రాంతం యొక్క విభాగం. ఇది తమిళనాడుకు పడమటి వైపు ఉంది. దాదాపు అన్ని వైపుల కొండలు చుట్టుముట్టి ఉన్న సేలం, ప్రసిద్ధ పర్యాటకుల ప్రదేశమైన ఏర్కాడ్ కొండల దిగువన ఉంది. ఈ కొండలు ఎక్కుతున్నపుడు మరియు పైనుండి చూసేటప్పుడు అతి సుందరమైన మరియు అధ్బుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. కిళియూర్ జలపాతం వంటి కొన్ని సుందరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సరాసరి సముద్ర మట్టం నుండి ఎర్కాడ్ 1600 మీ ఎత్తున ఉంది. ఉత్తరంలో నగరమలై, దక్షిణంలో జరుగుమలై, పశ్చిమలో కంజమలై మరియు తూర్పులో గోడుమలై వంటి ప్రకృతిసిద్దమైన కొండల మధ్యలో ఈ నగరం ఉంది. తిరుమణి ముతూర్ అనే నది ఈ నగర మధ్యలో ఉంది. కోట ప్రాంతమే ఈ నగరము యొక్క అత్యంత పురాతన ప్రదేశం. కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే హాయ్ లేదా శల్య లేదా సయిలం అనే పదాలనుండి సేలం అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో చేర మరియు కొంగు రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడుకు చెందిన కురునిల మన్నర్గళ్ అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు.


(ఇంకా…)

22వ వారం

సురేఖ

సురేఖ అని చూడగానే/వినగానే మహిళ అనిపించే పేరుతో 1958 నుండి వ్యంగ్య చిత్రాలు గీస్తున్న ఇతని అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. "సురేఖ" అన్నపేరు పెట్టుకోవటానికి వెనుక కథ, ఇతనికి మంచి గీతల మీద ఉన్న మమకారం, అప్పటికే పేరు తెచ్చుకున్న బాపు మీద గౌరవం. బాపుకు ఉన్న మరొక కలం పేరు రేఖ. ఆ రేఖను తీసుకుని ఆ పదానికి "సు" తగిలించి, సు + రేఖ = సురేఖగా సంధించి పాఠకుల మీదకు తన వ్యంగ్య చిత్రాలను వదలటం మొదలు పెట్టాడు. సురేఖ అంటే మంచి గీత లేదా శుభ్రమైన గీత అని అర్ధం. తన "కుంచె" పేరును సార్థకం చేసుకుంటూ, మరొక పక్క ఒక పెద్ద బ్యాంకులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తనవంతు సాహిత్య సేవ దశాబ్దాలపాటు కొనసాగించాడు. పదవీ విరమణ తరువాత తనకున్న అనేక అభిరుచులతో పాటు వ్యంగ్య చిత్ర రచనను కూడా కొనసాగిస్తున్నాడు. ఇతను ఒంగోలు పట్టణంలో 1941 మే 28 న జన్మించాడు. ఇతని తల్లితండ్రులు మట్టెగుంట వెంకట సుబ్బారావు, మట్టెగుంట సీతాలక్ష్మి. చదువు బి ఏ వరకు జరిగింది. ఆ తరువాత భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. బాపు అంటే ఉన్న అభిమానం కార్టూనింగ్ నేర్చుకోవటానికి కారణమైంది. బొమ్మలు గీస్తూ, వాటికి మంచి సంభాషణలను అతికిస్తూ ఉండేవాడు. 1958 లో పదిహేడు సంవత్సరాల వయస్సులో ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం ప్రచురితమయ్యింది.


(ఇంకా…)

23వ వారం
రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డి, జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు. రావి నారాయణరెడ్డి తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనారు. నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నారు. 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు. 1930లో బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది.


(ఇంకా…)

24వ వారం

అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు రాశారు. అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు సప్తర్షులలో ఒకడు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది. దక్షిణ ఆసియాలోని దేవాలయాలలో దొరికిన పురాతన శిల్పాలలో అగస్త్యుని విగ్రహం కూడా ఉండడం విశేషం. ఆగ్నేయ ఆసియాలో ఉన్న, ఇండోనేషియాలోని జావా దీవిలో ఉన్న శివాలయంలో ఈ విగ్రహం లభ్యమైంది. పురాతన జావనీస్ గ్రంథం అగస్త్యపర్వ అనేది అగస్త్యుని గురించి రాసిన పుస్తకమే. ఈ పుస్తకంలో అగస్త్యుని గొప్ప మహర్షిగా, గురువుగా వర్ణిస్తూ రాశారు. ఈ పుస్తకం యొక్క 11వ శతాబ్దపు ముద్రణ ఇప్పటికీ లభ్యమవుతోంది. వరాహ పురాణంలోని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కంద పురాణంలోని అగస్త్య సంహితలను రచించాడు అగస్త్యుడు. అగస్త్యుణ్ణి మన, కలశజ, కుంభజ, కుంభయోని, మైత్రావరుణి అని కూడా అంటారు.


(ఇంకా…)

25వ వారం

సరస్వతీ నది

సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము లోని నదిస్తుతిలో చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ (సట్లేజ్) నది ఉన్నాయి. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. సింధు లోయ నాగరికత కాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా నది ప్రాంతములలో లభించినాయి. ప్రస్తుతము సరస్వతి అనే పేరుమీద ఓ చిన్న నది ఉంది. ఇది ఘగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు. సరస్వతీ దేవి మొదట్లో ఈ నదీదేవతా మూర్తిగానే ప్రారంభమైంది, అయితే తర్వాతి కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది. హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగానూ, గంగా-యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందనీ భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని వైదిక సరస్వతీ నదిని ఒకటేనని మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారనీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సీరీస్‌కి సంపాదకుడు అయిన మైఖేల్ విజెల్ భావించాడు. ఋగ్వేదంలోనూ, తర్వాతి వేదాల్లోనూ ప్రస్తుత కాలంనాటి నదులు, ప్రాచీన నదులను స్తుతించడం కనిపిస్తుంది. ఋగ్వేదంలోని నదీస్తుతి మంత్ర భాగం సరస్వతీ నదిని తూర్పున యమున, పశ్చిమాన సట్లెజ్ (శతధృ) నడుమ ఉన్నట్టు వర్ణించింది. తర్వాతి వేద పాఠ్యాలైన తాంద్య, జైమినీయ బ్రాహ్మణాలు, మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టు ప్రస్తావించాయి.

(ఇంకా…)

26వ వారం

విశ్వనాధ్ ప్రతాప్ సింగ్

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడినకులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని. 1969లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సభ్యుడయ్యాడు. అతను 1971 లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ ఉపమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 1976 నుండి 1977 వరకు వాణిజ్య శాఖామంత్రిగా తన సేవలనందించాడు. 1980లో జనతా పార్టీ తరువాత ఇందిరా గాంధీ మరల ఎన్నుకోబడినప్పుడు, ఇందిరా గాంధీ అతనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది.  ముఖ్యమంత్రిగా (1980–82) అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నైఋతి ప్రాంత జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రమైన సమస్య అయిన బందిపోటు దొంగతనాలను తగ్గించే కార్యక్రమాలు చేసాడు. 1983లో వాణిజ్య మంత్రిగా తన పదవిని తిరిగి ప్రారంభించాడు.  1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీని పదవినుంచి తొలగించటానికి, అతనికి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో కలసి ఒక కూటమి ఏర్పాటు చేయడానికి అతను భాద్యత వహించాడు. 1989లో అతని పాత్ర భారత రాజకీయాల దిశను మార్చింది. సింగ్ అధ్వానీ చేసిన రథయాత్రలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా ధైర్యంగా నిలిచాడు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు.

(ఇంకా…)

27వ వారం

కటకము

ప్రకాశ పారదర్శకమై కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత (గోళాకారపు) వక్ర ఉపరితలాలు గలిగిన యానకాన్ని కటకం అంటారు. దీని యొక్క తలం గుండా ప్రవేశించిన కాంతికిరణాలు వక్రీభవనం చెందిన తరువాత కేంద్రీకరణ లేదా వికేంద్రీకరించబడతాయి. సాధారణ కటకం పారదర్శక పదార్థంతో తయాచుచేయబడిన ఒక వస్తువు. సంయుక్త కటకంలో అనేక సాధారణ కటకాలు ఒకే అక్షంపై అమర్చబడి ఉంటాయి. కటకాలను గాజు లేదా ప్లాస్టిక్ తో తయారుచేస్తారు. వాటిని సానపెట్టి, తలాలను పాలిష్ చేసి కావలసిన ఆకారాలను సాధిస్తారు. కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించి ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు కానీ పట్టకం తన గుండా ప్రయాణించిన కాంతి కిరణాలను వక్రీభవనం చెందిస్తుంది కానీ కేంద్రీకరించలేదు. అదేవిధంగా దృగ్గోచరకాంతినే కాకుండా, తరంగాలను వికిరణాలను కేంద్రీకరణం లేదా విక్షేపణం చేయగల పరికరాన్ని కూడా కటకం అనే అంటారు. ఉదా: మైక్రోవేవ్ కటకం, ఎలక్ట్రాన్ కటకం, అకాస్టిక్ కటకం లేదా ఎక్స్‌ప్లోజివ్ కటకం. క కుంభాకార కటకం భూతద్దం లా ఉపయోగపడుతుంది. ఇది సామాన్య సూక్ష్మదర్శినిగా పనిచేస్తుంది. కుంభాకార, పుటాకార కటకాలను దృష్టి దోషాలైన దీర్ఘదృష్టి, హ్రస్వదృష్టి, ప్రెస్బోఫియా, చత్వారం వంటి వాటిని సరిదిద్దడానికి ఉపయోగిస్తారు. పెద్ద కటకాలూ సరిపడినంత శక్తిని అందించడం వలన దాని నాభివద్ద గల వస్తువులను మండించగలవు. అందువలన వీటిని సుమారు 2400 సంవత్సాలనుండి బర్నింగ్ గ్లాసెస్ గా ఉపయోగిస్తున్నారు.

(ఇంకా…)

28వ వారం
హీరాలాల్ మోరియా

హీరాలాల్ మోరియా (జూలై 13, 1924 - అక్టోబరు 13, 2006) పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. మోరియా పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి వచ్చి ఖమ్మంలో స్థిరపడినారు. మోరియా తండ్రిగారు కలప వర్తకులైనా సాహిత్యాభిరుచి కలిగినవారు. ఖమ్మంలో పుట్టి పెరిగిన హీరాలాల్ మోరియా ఏడవతరగతి వరకు ఖమ్మం ఉన్నత పాఠశాలలో చదివారు. వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఉన్నత పాఠశాల నుంచి ‘రెస్టికేట్ చేయగా హైద్రాబాదులోని కేశవ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో చేరి మెట్రిక్ పూర్తిచేశారు. చదువుకునే రోజులనుండే సాహిత్యం పట్ల అభిరుచి కల్గిన మోరియా గార్కి దాశరథి, కవి రాజమూర్తి లాంటి వాళ్ళ స్నేహం కూడా వారి అభిలాషను పెంచగలిగింది. మాతృభాష మరాఠి అయినప్పటికీ తెలంగాణలో అప్పుడు ఉర్దూ ప్రధాన భాషగా ఉండడం వలన ఉర్దూలో ఎనలేని పాండిత్యం సంపాదించారు. స్వయంకృషిలో ఆంగ్లబాషలో కూడా మంచి పట్టును సాధించారు. నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం రోజుల్లో ముఖ్యంగా రజాకార్ల దురంతాలను శక్తివంతంగా ప్రతిఘటించిన స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఆరంభదినాల్లోనే అనగా మోరియా ఇరవై సంవత్సరాల వయసులోనే స్టేట్ కాంగ్రెస్ ఆదేశం ప్రకారం ఖమ్మం జిల్లాలో మొదటి సారిగా సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యారు. మోరియా చక్కటి ఉపన్యాసకుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో మోరియా ఉపన్యాసం ఎక్కడ వున్నా ప్రజలు తండోపతండాలుగా, ప్రభుత్వ నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా గుమిగూడుతుండేవారు. తన ఉపన్యాసాలలో నైజాం నవాబు నిరంకుశ పరిపాలనను గురించి, ఆయనకు తొత్తులైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, జమిందార్ల గురించి- వారి దోపిడి విధానాలను వివరిస్తూ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అరటిపండు వొలిచినట్టు వివరించేవారు.

(ఇంకా…)

29వ వారం
అరుణిమ సిన్హా

అరుణిమ సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం "ఎవరెస్టు" ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్‌ మాజీ క్రీడాకారిణి అరుణిమా సిన్హా చరిత్ర సృష్టించారు. మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇరవై ఐదు సంవత్సరాల సిన్హా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం చేరుకున్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన ఎకో ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్‌లో సభ్యుడు, నేపాల్‌ టూరిజం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాదిలో ఉత్తరకాశీలోని టాటా స్టీల్‌ అడ్వంచెర్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఏఎఫ్ ) లో అరుణిమా సిన్హా చేరారు. సిన్హా, జాతీయ స్థాయి వాలీబాల్ మరియు ఫుట్‌బాల్ క్రీడా కారిణి. అరుణిమా సిన్హా జీవితంలో ఏప్రిల్‌ 12, 2011 చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్‌ కంపార్టుమెంట్‌లో ఆమె ప్రయాణిస్తున్నారు.బరేలీ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగలు రైలు నుంచి కిందకు తోసేశారు. 'నా కలలు ఇక ఎప్పుడూ నెరవేరవు' అని ఆమె గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆమె ఎడమకాలు, తొడ ఎముక తీవ్రంగా దెబ్బతిన డంతో ఆస్పత్రిలో చేర్చారు. మోకాలు కింది భాగాన్ని వైద్యులు తొలగించారు.


(ఇంకా…)

30వ వారం

శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం

శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది. "శ్రీముఖలింగం" పేరులోనే చక్కని అర్ధం ఉంది. "శ్రీముఖలింగం" అనే పదానికి "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని అర్ధం. ఈ దేవాలయం లోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. శ్రీముఖలింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్స్, పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేసారు.

(ఇంకా…)

31వ వారం

కేశవ శంకర్ పిళ్ళై

శంకర్ గా సుపరిచితులైన కేశవ శంకర్ పిళ్ళై(1902 జూలై 31 – 1989 డిసెంబరు 26) ఒక ప్రముఖ భారతీయ కార్టూనిస్టు. ఆయన 1948 లో "శంకర్ వీక్లీ" మరియు పంచ్ అనే పత్రిక ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ మరియు కుట్టి వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఎమర్జెన్సీ సమయంలో ఈ పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపారు. ఆయనకు 1976లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ఆయన 1857లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్టును మరియు 1965లో శంకర్ ఇంటర్నేషనల్ డాల్స్ సంగ్రహాలయం స్థాపించారు. శంకర్ 1902 లో కేరళ లోని కాయంకుళంలో జన్మించారు. కాయంకుళం మరియు మావెలిక్కర ప్రాంతాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న చిత్రం ఆయన వేసిన మొదటి కార్టూన్. ఆ చిత్రాన్ని ఆ తరగతి గదిలోనే వేసారు. ఆ సంఘటన ప్రధానోపాధ్యాయుని ఆగ్రహానికి గురిచేసింది. కానీ ఆయన పినతండ్రి ప్రోత్సాహం మేరకు ప్రసిద్ధ కార్టూనిస్టుగా ఎదిగారు. పాఠశాల విద్య అనంతరం "మావెలికర"లో రవివర్మ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ లో చదివారు. ఆయన నాటకాలు, స్కౌట్స్, రచనా వ్యాసంగాలలో పాల్గొనడానికి ఇష్టపడేవారు. వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కూడా చేసారు. ఆయన చిత్రాలు పేద ప్రజల జీవన చిత్రాలను ప్రతిబించేటట్లు ఉండేవి.


(ఇంకా…)

32వ వారం

తుర్లపాటి కుటుంబరావు

తుర్లపాటి కుటుంబరావు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి. 1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. జూన్ 21, 2010 న ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాడు. తుర్లపాటి కుటుంబరావు ఐదుగురు సహోదరులలో మధ్యముడు. తనకు అక్క, అన్న మరియు తమ్ముడు, చెల్లి ఉండడంతో ప్రతి విషయంలో ఆలోచనలు మధ్యమ మార్గంగా ఉండేవని అన్నాడు. తండ్రి న్యాయవాది కనుక న్యాయవాది కావాలని కోరిక ఉన్నా చివరికి పాత్రికేయుడిగా మారాడు. ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించాడు. తుర్లపాటి కుటుంబరావు పత్రికా రచన 1947 మార్చి నెలలో కేవలం 14 సంవత్సరాలవయస్సులో "స్వరాజ్యంలో స్వరాష్ట్రం" అనే శీర్షికతో మద్రాసు నుండి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికతో ప్రారంభమైంది.


(ఇంకా…)

33వ వారం

లాల్ బహాదుర్ శాస్త్రి

లాల్ బహాదుర్ శాస్త్రి భారత దేశ రెండవ ప్రధానమంత్రి మరియు స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి. శాస్త్రి 1920వ దశకంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలిసి భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. 1965 లో ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. ఆయన సృష్టించిన "జై జవాన్ జై కిసాన్" అనే నినాదం యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత రోజే తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతి పెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక భాద్యత వహిస్తూ రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.

(ఇంకా…)

34వ వారం

హైడ్రోజన్ సల్ఫైడ్

హైడ్రోజన్ సల్ఫైడ్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థము. ఇది రంగులేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన వెలువరించే వాయువు. ఇది విషపూరితమైనది, మరియు మండే స్వభావం కలది. దీని రసాయన ఫార్ములా H2S. హైడ్రోజన్ మరియు సల్ఫర్ మూలక పరమాణువుల కలయిక వలన ఏర్పడుతుంది. సాధారణంగా మురుగు నీటిలో ఆక్సిజన్ రహిత వాతావరణంలో సేంద్రీయ పదార్థాలు విచ్ఛిన్నం అయినప్పుడు, అగ్ని పర్వతాల్లో వెలువడే పదార్థాల్లో, సహజ వాయువు, పాడుబడ్డ బావుల్లో, మానవ శరీర వ్యవస్థ వెలువరించే వాయు మిశ్రమంలో కూడా ఈ వాయువు ఉంటుంది.

ఇది గాలి కన్నా బరువైన వాయువు. పరిశ్రమల్లో ఈ వాయువును సేంద్రియ సల్ఫర్ సమ్మేళనాలు ఉత్పత్తి చేయడానికి, విశ్లేషణ రసాయన శాస్త్రంలో, లోహ సల్ఫైడ్ల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో హైడ్రోజన్ సల్ఫైడ్ ను రసాయన ఆయుధంగా ఉపయోగించారు. హైడ్రోజన్ సల్ఫైడ్ బహుముఖ విష కారిణి. అనగా దేహంలోని పలు వ్యవస్థలపై దాడి చేసి నష్టాన్ని కల్గిస్తుంది, అందులో నాడీ ప్రసార వ్యవస్థ ముఖ్యమైనది.

(ఇంకా…)

35వ వారం

శ్రీశైలం ప్రాజెక్టు

శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తర్వాతి కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు గా మార్చారు. అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోని ప్రవేశించింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉంది. ఈ పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టానికి 0.8 కి.మీ. దిగువన డ్యాము నిర్మించబడింది. ఇది హైదరాబాదుకు 200 కి.మీ., విజయవాడకు 250 కి.మీ., కర్నూలుకు 180 కి.మీ. దూరంలో ఉంది. ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1964లో రూ.39.97 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991నాటికి రూ.567.27 కోట్లయింది. డ్యాము నిర్మాణం క్రెస్టుగేట్లతో సహా 1984 డిసెంబరు నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోని ప్రవేశించింది.

(ఇంకా…)

36వ వారం

కాళోజీ నారాయణరావు

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న" గా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం . కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు మరియు తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గహీత. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ భాషా దినోత్సవం" గా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయనన్ పేరు పెట్టబడింది. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన ఆంధ్రప్రడేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు.

(ఇంకా…)

37వ వారం

బంగారం ఒక విలువైన లోహం, రసాయనిక మూలకం (సంకేతం: Au). దీనిని ముఖ్యంగా నగల్లో, అలంకరణల్లో విరివిగా వాడతారు. స్వచ్ఛమైన బంగారం కొద్దిగా ఎరుపు చాయ కల్గిన పసుపుపచ్చ వన్నె కలిగిన ఎక్కువ సాంద్రత కలిగిన, మెత్తగా ఉండే లోహం. బంగారం ఆవర్తన పట్టికలో 11వ సమూహం (గ్రూప్) కు చెందిన మూలకం. బంగారం యొక్క పరమాణు సంఖ్య 79. బంగారం ఒక భార మూలకం. అనగా బరువైన మూలకాలలో బంగారం ఒక్కటి. స్వల్ప పరిమాణంలో దీనిని ఆయుర్వేద వైద్యంలోనూ, పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. శిలాజ త్రవ్వక నిపుణులు స్పానిస్ లోని 40,000 ఏళ్ల క్రితం పాలియోలిథిక్ కాలానికి చెందిన మానవులు వసించిన గుహలో స్వాభావిక బంగారుముక్కలను గుర్తించారు. క్రీ.పూ.3000 నాటికి పురాతన ఈజిప్టు సిర్కాలోని ఫారోలు మరియు దేవాలయ పూజారులు బంగారాన్ని ఆభరణాలుగా ధరించారని తెలుస్తున్నది. పూర్వ కాలంలో బంగారాన్ని ఎక్కువగా ద్రవ్యంగా వాడేవారు. బంగారంనుండి ఎక్కువగా నాణేలు మరియు ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగిస్తున్నారు. క్రీ.శ.1930నుండి బంగారపు నాణేల చలామణిని నిలిపివేసారు. 2012 నాటికి 174,100 టన్నుల బంగారం ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యింది. ఇందులో 50% నగలతయారీలో, 40% మూల నిల్వ ధనంగాను/మదుపు/పెట్టుబడిగా మిగిలిన 10% పరిశ్రమలలో వినియోగిస్తున్నారు. (ఇంకా…)

38వ వారం

సర్వ శిక్షా అభియాన్ 6–14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక పాథమిక హక్కుగా మార్చడం కోసం భారత కేంద్రప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం. దీనిని భారత రాజ్యాంగంలో 86వ సవరణ ద్వారా అమల్లోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం, విద్యను అన్ని వర్గాలవారికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు. నిరక్షరాస్యతను పారద్రోలి, అక్షరాస్యతను సాధించడం. పాఠశాలైన, ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకూ ఒక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ఓ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి, విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశ్యం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో వుంచి విద్యాస్థాయిని పెంపొందించడం. పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి. దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో, నాగపట్నం జిల్లాలోని సత్యనాథపురం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. (ఇంకా…)

39వ వారం

ఎ. వి. గురవారెడ్డి

గురవారెడ్డి గా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు. హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. అంతకు మునుపు ఇంగ్లండులో పదేళ్ళు, అపోలో ఆసుపత్రిలో కొంత కాలం పనిచేశాడు. కిమ్స్ ఆసుపత్రిని స్థాపించిన వారిలో ఆయన కూడా ఒకడు. ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో పుస్తకం రాశాడు. ఆయన భార్య భవాని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం కుమార్తె. ఆమె కూడా వైద్యురాలే. కుమార్తె కావ్య లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు ఈయనకు తోడల్లుడు. ఆయన గుంటూరులో పుట్టాడు. తల్లి రాజ్యలక్ష్మి. తండ్రి సత్యనారాయణ రెడ్డి బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్యుడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం బాపట్లకు తరలి వెళ్ళింది. ఆయన పదోతరగతి దాకా బాపట్ల మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తయింది. బాపట్ల లోని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనే వైద్యుడి స్పూర్తితో ఆయన కూడా వైద్యుడు కావాలనుకున్నాడు. ఆయన పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచి భాషమీద మమకారం ఉండేది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా సాధించాడు.


(ఇంకా…)

40వ వారం

రఘుపతి వేంకటరత్నం నాయుడు

ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు  విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే. రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1 న మచిలీపట్నంలో సుప్రసిద్ద తెలగ నాయుళ్ళ ఇంట జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, కాకినాడలో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు. మద్యనిషేధం కొరకు శ్రమించాడు. 1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. 


(ఇంకా…)

41వ వారం

మధుమేహం

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది . ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2 మరియు జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్) . అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.  మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది.


(ఇంకా…)

42వ వారం

మెక్‌మహాన్ రేఖ
ఈశాన్య భారతదేశానికి, టిబెట్‌కూ మధ్యన సరిహద్దు మెక్‌మహాన్ రేఖ. దీన్ని 1914 లో జరిగిన సిమ్లా సమావేశంలో హెన్రీ మెక్‌మహాన్ ప్రతిపాదించాడు. చైనా ప్రభుత్వం ఇది చెల్లదంటోంది. చైనా దీన్ని చట్టబద్ధతను వివాదాస్పదం చేసినప్పటికీ ఈ రేఖయే రెండు దేశాల మధ్య సరిహద్దుగా వ్యవహారంలో ఉంది. బ్రిటిషు ప్రభుత్వానికి విదేశాంగ మంత్రిగాను, సిమ్లా సమావేశంలో ప్రధాన వ్యవహర్తగానూ ఉన్న హెన్రీ మెక్‌మహాన్ పేరిట ఈ రేఖను పిలుస్తున్నారు. ఆ ఒప్పందంపై మెక్‌మహాన్‌, టిబెట్ ప్రభుత్వం తరపున లాంచెన్ సాత్రా సంతకాలు చేసారు. ఈ రేఖ పశ్చిమాన భూటాన్ నుండి 890 కి.మీ., తూర్పున బ్రహ్మపుత్రా నది మలుపు నుండి 260 కి.మీ. వరకు విస్తరించి ఉంది. ఎక్కువగా ఈ రేఖ హిమాలయ శిఖరాల మీదుగా సాగుతుంది. సిమ్లా ఒప్పందాన్ని (మెక్‌మహాన్ రేఖతో సహా) భారత ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. 1907 ఆంగ్లో రష్యన్ ఒప్పందానికి ఇది వ్యతిరేకంగా ఉండడం ఇందుకు కారణం. ఈ ఒప్పందం 1921 లో రద్దయింది. అయినా, మెక్‌మహాన్ రేఖను 1935 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. 1935 లో ఒలాఫ్ కారో అనే బ్రిటిషు సివిల్ సర్వీసు అధికారి, మెక్‌మహాన్ రేఖను అధికారిక మ్యాపులపై ముద్రించేలా బ్రిటిషు ప్రభుత్వాన్ని ఒప్పించాడు. మెక్‌మహాన్ రేఖను భారత్ చట్టబద్ధమైన సరిహద్దుగా గుర్తించగా, చైనా మాత్రం సిమ్లా ఒప్పందాన్ని, ఈ రేఖనూ కూడా గుర్తించేందుకు నిరాకరించింది. టిబెట్ సార్వభౌమిక దేశం కాదనీ, దానికి ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం లేదనీ చైనా వాదన.
(ఇంకా…)

43వ వారం

జింకు ఆక్సైడ్

జింకు ఆక్సైడ్ అనునది ZnO ఫార్ములా కలిగిన అకర్బన సమ్మేళనం. ఇది తెల్లని చూర్ణం. ఇది నీటిలో కరుగుతుంది. దీనిని రబ్బర్లు, ప్లాస్టిక్లు, సిరామిక్స్, గాజు, సిమెంటు, కందెనలు, రంగులు, ఆయింట్‌మెంట్లు, జిగుర్లు, పిగ్మెంట్లు, ఆహారపదార్థాలు, బ్యాటరీలు, ఫెర్రైట్లు, అగ్ని నిరోధకాలు, ప్రథమ చికిత్స టేపులు మరియు ఇతర రసాయనాల ఉత్పత్తులలో వాడుతారు. ఇది ప్రకృతిలో "జింకైట్" అనే ఖనిజం ద్వారా లభ్యమవుతుంది. ZnO అనునది II-IV అర్థవాహక వర్గంలో శక్తి అంతరం ఎక్కువగా ఉన్న అర్థవాహకం. దీనిలో ఆక్సిజన్ ఖాళీలు ఉండడం వలన లేదా జింకు మధ్యంతరాలు ఉండడం వలన n-రకం అర్థవాహకాలను తయారుచేయుటకు "మాదీకరణం" (doping) చేస్తారు. ఈ అర్థవాహకాలు అనేక అనుకూల ధర్మాలను కలిగి ఉండి మంచి కాంతి పారదర్శక పదార్థంగా, ఎలక్ట్రాన్ ప్రవాహిగా, ఎక్కువ శక్తి అంతరం కలిగిన పదార్థంగా మరియు గది ఉష్ణోగ్రత వద్ద గట్టి పదార్థంగా ఉంటుంది. ఈ ధర్మాలు అభివృద్ధి చెందుతున్న కొన్ని అనువర్తనాలకు ఉపయోగపడతాయి. అవి ద్రవ స్పటికాలలో పారదర్శక ఎలక్ట్రోడులుగా, విద్యుత్ పొదుపులోనూ, ఉష్ణ నిరోధక కిటికీలలోనూ మరియు ఎలక్ట్రానిక్స్ లో పలుచని ఫిలిం ట్రాన్సిస్టరులుగానూ, కాంతి ఉద్గారక డయోడు (LED) లలో ఉపయోగపడతాయి. స్వచ్ఛమైన ZnO తెల్లని చూర్ణం. కానీ ఇది ప్రకృతిలో అరుదైన ఖనిజమైన "జింకైట్" నుండి లభిస్తుంది. జింకైట్ ధాతువు సాధారణంగా మాంగనీస్ మరియు ఇతర మలినాలను కలిగి ఉండి పసుపు నుండి ఎరుపు రంగులలో ఏదో ఒక రంగుగా కనిపిస్తుంది.


(ఇంకా…)

44వ వారం

దేవులపల్లి కృష్ణశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 1, 1897 - ఫిబ్రవరి 24, 1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురంహైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు. ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి.

(ఇంకా…)

45వ వారం

ఆయిల్‌ పామ్

ఆయిల్‌ పామ్ పామే కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం వాడకంలోనున్న వంటనూనెల్లో, మిగతా నూనెలకన్న తక్కువ ధరలో, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనానికి అందుబాటులో వున్న వంటనూనె పామాయిల్. పామాయిల్‌ను ఆఫ్రికాలో 5 వేల సంవత్సరాల క్రితం నుండే వాడుతున్నట్లు తెలుస్తున్నది. అక్కడి స్థానికులు పామాయిల్‌ పళ్లను వేడి నీళ్లలో బాగా మరగించి, రోకళ్ళ వంటి వాటితో నలగ్గొట్టి, గుజ్జును పిండి, నూనెను వడగట్టి తీసి వాడేవాళ్ళు. ఆయిల్‌పాంకు జన్మస్థానం దక్షిణాప్రికా లోని గునియాలోని వర్షాయుత, ఉష్ణమండల అరణ్యాలు. 14-17 శతాబ్ది మధ్యకాలంలో అమెరికా ఖండానికి, అక్కడినుండి తూర్పుదేశాలకు వ్యాప్తి చెందినదని కొందరి వాదన. 1910 లో స్కాట్మెన్‌ విలియం సిమో అనే ఇంగ్లీష్‌ బ్యాంకరు మలేషియాకు తీసుకెళ్ళాడనీ, అక్కడినుండి ఇండోనేసియా, పశ్చిమ ఆసియా, మరియు దక్షిణ అమెరికాకు వ్యాపించిందని మరి కొందరి వివరణ. కానీ 1870 నాటికే మలేసియా తదితర దేశాలలో పామాయిల్ తోటల పెంపకం మొదలైనదని మరి కొందరి అంచనా. మలేసియా మరియు ఇండోనేసియాలలో పామాయిల్‌ తోటల పెంపకం వలన ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఊహ కందనంతగా అభివృద్ది చెందింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో సగం శాతం ఈదేశాల నుంచే ఉత్పత్తి అవుతున్నది. అభివృద్ధి చెందితున్న దేశాలన్ని ఈ రెండు దేశాల నుండియే అధికశాతం పామాయిల్‌ను తమ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నాయి.

(ఇంకా…)

46వ వారం

ఖండోబా

ఖండోబా, మార్తాండ భైరవ లేదా మల్హరి, భారతదేశంలోని దక్కను పీఠభూమి పై శివుని అవతారంగా భావించబడే ప్రముఖ హిందూ దైవం. ఈయనను ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కర్నాటక రాష్ట్రాలలో ఎక్కువగా కొలుస్తుంటారు. మహారాష్ట్రలో ఆయన ముఖ్యమైన కులదైవం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వ్యవసాయదారులు, పశుపోషకులు వంటి కులాలకే కాకుండా అడవులు మరియు కొండ ప్రాంతాలలో గల గిరిజన, వేటాడే తెగలకు కూడా ఈయన ఆరాధ్య దైవం. ఖండోబా పూజలు హిందూ మరియు జైన మత పద్ధతులలో జరుగుతాయి. ఈ పద్ధతులు కులంతో సంబంధం లేకుండా ముస్లింలతో సహా అన్ని వర్గాలను సమన్వయపరుస్తుంది. ఖండోబా ఆరాధన 2వ మరియు 10వ శతాబ్దాలలో అభివృద్ధి చెందినది. ఈ దేవుని జానపద దైవంగా శివునిగా, భైరవునిగా, సూర్యునిగా మరియు కార్తికేయునిగా కూడా భావిస్తారు. ఈ దేవుని ఒక లింగం రూపంలో లేదా ఒక ఎద్దు లేదా ఒక గుర్రంపై ఒక యోధునిగా ఒక చిత్రం వలె చిత్రీకరిస్తారు. మహారాష్ట్రలోని జిజూరి ఖండోబా ఆరాధనకు ముఖ్య కేంద్రంగా ఉంది. ఇతిహాసాలలో ఖండోబా గురించి మల్హరి మహాత్మ్య గ్రంథంలో మరియు జానపద పాటలలో చెప్పబడింది. "ఖండోబా" అనే పేరు "ఖడ్గ" అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. ఖండోబా ఉపయోగించే ఆయుధం (ఖడ్గం) రాక్షసులను సంహరించడానికి మరియు "బా" అనగా తండ్రి. "ఖండెరాయ" అనగా "ఖండోబా రాజు". మరియొక అర్థం "ఖండేరావు". ఇందులో పరలగ్నం "రావు" అనగా రాజు అని అర్థం.

(ఇంకా…)

47వ వారం

మామిడిపిక్కనూనె

మామిడి టెంకల లోని పిక్కనుండి తీసే నూనెను మామిడి నూనె అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ, ఘనమధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వల్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోస్తారు. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు (స్టియరిక్) ఎక్కువ వుండటం వలన, 38-400C ( మిగతా నూనెలు 23-27° సెంటీగ్రేడు) వద్ద ద్రవీభవిస్తుంది. అందుకే మామిడి పిక్కలనూనెను మామిడి పిక్కలకొవ్వు లేదా మామిడి వెన్న అనికూడా అంటారు. మామిడికి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇవి మాంగిఫెరా ప్రజాతికి చెందిన వృక్షాలు. మామిడి వృక్షశాస్త్ర నామం మాంగిఫెర ఇండికా మామిడి మూల జన్మస్థానం దక్షిణ ఆసియా మరియు తూర్పుభారతదేశ ప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం, మామిడి ఆసియా ఖండం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (నేటి ఇరాన్) వ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడింది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా ఆఫ్రికాకు వ్యాపింపచేయబడింది. ఆఫ్రికన్లచే బ్రెజిల్కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది. అతితక్కువ కాలంలోనే అమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగింది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించింది.

(ఇంకా…)

48వ వారం

శోభారాజు

శోభారాజు ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది. స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. 2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1983 లో అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలో స్థలం మంజూరు చేసింది. దీన్ని అన్నమయ్యపురం అనే ప్రాంగణంగా అభివృద్ధి చేసి సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శోభారాజు 1957, నవంబర్ 30 న చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా వయొలిన్ వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. వాళ్ళు హరికథకులు కూడా. నాలుగేళ్ళ వయసునుంచే స్వంతంగా కూడా పాటలు సాధన చేయడం ప్రారంభించింది.

(ఇంకా…)

49వ వారం

బాబూ రాజేంద్ర ప్రసాద్

రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. ఈయన 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి భాద్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా బాబూ అని పిలిచేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి బీహార్ లో ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. మహాత్మాగాంధీ మద్దతుదారునిగా ఆయన 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తరువాత ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వం కేంద్రమంత్రిగా వ్యవహరించాడు. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాజ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయమైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధికి ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు.

(ఇంకా…)

50వ వారం

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ కుమార్ ముఖర్జీ భారతదేశ రాజకీయనాయకుడు. అతను భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంతో అతను భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా ఉన్నాడు. భారతదేశ కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటుంటాయి. 1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలోస్థానం పొందాడు. 1976 -77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితులలో అతను కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకుల వలెనే నిందితునిగా ఉన్నాడు. అనేక మంత్రివర్గ సామర్థ్యాలలో ముఖర్జీ సేవలు తన మొట్టమొదటి దశలో ముగిశాయి. 1982-84 లో ఆర్థిక మంత్రిగాను, 1980-85 లో రాజ్యసభ నాయకునిగాను ఉన్నాడు.


(ఇంకా…)

51వ వారం

పాదరసము

పాదరసం ఒక రసాయన మూలకము. దీని సంకేతము Hg మరియు పరమాణు సంఖ్య 80. దీనిని క్విక్ సిల్వర్ అంటారు. దీని లాటిన్ నామము "హైడ్రార్జిరం". ఇది ఆవర్తన పట్టికలో "డి" బ్లాకుకు చెందిన మూలకం. ఇది సాధారణ ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం. ఇదే పరిస్థితులలో ద్రవరూపంలో ఉండే మూలకం బ్రోమిన్. గది ఉష్ణోగ్రత కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సీజియం, గాలియం మరియు రుబీడియం మూలకాలు ద్రవరూపంలోనికి మారుతాయి. పాదరసం ప్రకృతిలో "సిన్నాబార్ (మెర్క్యురిక్ సల్ఫైడ్)" రూపంలో ఖనిజంగా లభ్యమవుతుంది. పాదరసం ధర్మోమీటర్లు, బారోమీటర్లు, మానోమీటర్లు, స్పైగ్మో మానోమీటర్లు, తేలియాడే కవాటాలు (ఫ్లోట్ వాల్వులు), మెర్క్యురీ స్విచ్‌లు, మెర్క్యురీ రిలేస్, ఫ్లోర్‌సెంట్ దీపాలు మరియు యితర పరికరాలలో ఉపయోగిస్తారు. పాదరసం మూలకం విషతుల్యం అయినందున దీనిని ధర్మోమీటర్లు, స్పైగ్మోమానోమీటర్లలో వైద్యరంగంలో వినియోగించడం తగ్గించారు. దీని స్థానంలో ఆల్కహాల్ లేదా గాలిన్‌స్టన్ తో నింపబడిన గాజు ధర్మోమీటర్లను మరియు ధర్మిస్టర్ లేదా పరారుణ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నారు. అదే విధంగా మెర్క్యురీ స్పైగ్మోమీటర్ల స్థానంలో మెకానికల్ ప్రెజర్ గేజ్ మరియు ఎలక్ట్రానికి స్ట్రయిన్ గేజ్ లు వాడుకలోనికి వచ్చాయి. పాదరసాన్ని శాస్త్రీయ పరిశోధనలలో మరియు దంతవైద్యంలో "అమాల్గం" గాను ఉపయోగిస్తున్నారు. పాదరసాన్ని మెర్క్యురీ ప్లోర్‌సెంట్ దీపాలకు ఉపయోగిస్తారు.


(ఇంకా…)

52వ వారం

పట్టిసం

పట్టిసం పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామము. నిజానికి ఇది ఒక గ్రామముగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఈ క్షేత్రము కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉంది. చారిత్రకంగానూ, ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యదికంగా చిత్రణ జరిపే మంచి అందాలుగల దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్ధము లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు . వీరభద్రుడిని సృష్టించి, దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' ( పొడవైన వంకీ కత్తి) తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ . పట్టిసీమనీ . పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.


(ఇంకా…)

ఇవి కూడా చూడండి మార్చు