తాతా రమేశ్ బాబు

తాతా రమేశ్ బాబు(1960 జనవరి 15 - 2017 ఏప్రిల్ 20) తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది.[1]

తాతా రమేశ్ బాబు
Tata rameshbabu.jpg
2015 డిసెంబరులో తాతా రమేశ్ బాబు చిత్రము
జననంతాతా రమేశ్ బాబు
1960 జనవరి 15
గుంటూరు జిల్లా భట్టిప్రోలు
మరణం2017 ఏప్రిల్ 20(2017-04-20) (వయస్సు 57)
గుడివాడ
ఇతర పేర్లుతాతా రమేశ్ బాబు
వృత్తిచిత్రలేఖనోపాధ్యాయులు
ప్రసిద్ధితెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు
మతంహిందూ
భార్య / భర్తజానకి
పిల్లలుఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
జ్ఞాపిక (పెద్దమ్మాయి)
అనామిక (రెండవ అమ్మాయి)
వెంకటేశ్వరరావు (అబ్బాయి)
తల్లిదండ్రులుబసవలింగం, బోలెం లక్ష్మీనరసమ్మ
తాతా రమేశ్ బాబు గారి తల్లిదండ్రులు
తాతా రమేశ్ బాబు వ్రాసిన పుస్తకాలు

జీవిత విశేషాలుసవరించు

తాతా రమేశ్ బాబు గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామంలో 1960 జనవరి 15 వ తేదీన బసవలింగం, బోలెం లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి విద్యా శాఖలో పాఠశాలల తనిఖీ అధికారిగా వుద్యోగిగా ఉండడంవల్ల ఆయన బాల్యం అంతా కృష్ణా జిల్లా లోనే గడచింది. ఆయన ఉయ్యూరు, కైకలూరు, మొవ్వ, అవనిగడ్డ లలో తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నారు. పదవతరగతి మచిలీపట్టణం జైహింద్ హైస్కూల్ లోనూ, ఇంటర్మీడియట్, డిగ్రీలను ఆంధ్ర జాతీయ కళాశాల లోనూ చదువుకున్నారు. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో వుండగా మద్రాసు సినీ పరిశ్రమకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల డిగ్రీ పూర్తి చేయలేక పోయారు. ఆయనకు చిన్ననాటి నుండి లలిత కళలు అన్నా, ఆటలు అన్నా చాలా ఇష్టం.

రచయితగా, చిత్రలేఖకునిగాసవరించు

రంగులు రంగులు రంగులు
రాచిలుక వేసేదా రంగులు
ముక్కుకు ఎరుపు రెక్కకు పచ్చా
చిక్కగా రంగులు పులిమెద నీకు
రంగులు రంగులు రంగులు
ఓ కాకీ పూసేదా రంగులు
అంతా నలుపు కళ్లే తెలుపు
చిక్కగా రంగులు పులిమెద నీకు

అయిదారు తరగతుల్లో ఉన్నప్పుడు ఆయన ఈ బాలగేయం రాశారు, దీన్ని పాడుతూ వారి ఇంటి దగ్గర్లోని తోటలో తిరిగేవారాయన. అప్పట్లో చాలా గేయాలు ఆశువుగా పాడేవారు వాటిని రాసి పెట్టుకోవాలని ఆయనకు తోచలేదు. తర్వాత ఎప్పటికో ఆ పనిచేశారు. ఆ సమయంలోనే "బాలజ్యోతి"లో ఆయన గేయాలు కొన్ని అచ్చయ్యాయి. ఆ వయసులోనే బొమ్మలంటే ఎందుకో చాలా ఇష్టం పెరిగిపోయిందాయనకు. వేద్దామంటే ఇంట్లో కుంచెల్లాంటివి ఏమీ ఉండేవి కావు. ఓ కర్రతో బొమ్మలు గీసేవారు. అలా చిత్రకళపై పట్టు పెంచుకున్నా ఇప్పటి వరకూ ఆధునిక పదచిత్రాలు, సూక్ష్మచిత్రాలు, 'అభినందన సందేశాల చిత్రాలు... అన్నీ కలిపి లక్షల్లో గీశారు. రాత్రి పదింటి నుంచి ఉదయం నాలుగింటి దాకా వేసేవారాయన. వీటిలో చాలా చిత్రాలను కొందరు పెద్ద మొత్తాలకు అమ్మకున్నారు. ఆయనకు రూపాయి దక్కలేదు. దానికి వారెప్పుడూ బాధపడలేదు. చిత్రకళ అంటే ఆయన కిష్టం. బొమ్మలేస్తూనే ఉంటారాయన.[2]

పుస్తకాలుసవరించు

ఆయన పదవతరగతి నుంచే గేయాలురాయటం, నాటకాలు వేయటం మొదలు పెట్టారు. ఆయన రచనలు చాలా దిన, వార పత్రికలలో ప్రచురించబడేవి. ప్రచురింపబడిన ఆయన పుస్తకాలు, అణువు పగిలింది (కవిత్వం), పిడికిలి (దీర్ఘ కవిత), తాతా రమేశ్ బాబు కథలు[3], విప్లవరుతువు (కవిత్వం), తోలిగీతలు, దిద్దు బాటు (బొమ్మలాట), తయారు చేద్దాం (క్రాఫ్ట్ వర్క్), అసలు నిజాం (బొమ్మలాట), నాన్నో పులి (బొమ్మలాట), బొమ్మలాట (బొమ్మలు తయారు చేసి ఆడించటం), శుభాకాంక్షలు (అభినందన పత్రాలు), లయ (ఆకాహవానిసమిక్షలు ), నా దేశం (దీర్ఘ కవిత), తాతా రమేశ్ బాబు చిత్రకళ, బాలబంధు బివి జీవిత చరిత్ర.

సంపాదకునిగాసవరించు

 
జనప్రభ సాహిత్య మాసపత్రిక వెలగా వెంకటప్పయ్య గారితో 1985లో ఆవిష్కరణ

2005వ సంవత్సరంలో మచిలీపట్టణం నుండి వెలువడిన 'జనప్రభ' సాహిత్యమాస పత్రికకు ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. 2006వ సంవత్సరంలో జాతీయ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్య కార్యకర్తగా సేవలను అందించటమే కాక, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో యాభై ఏళ్ళ తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వికాసాల సమీక్షగా వెలువడిన నూట పన్నెండు వ్యాసాల సంకలనం 'తెలుగు పసిడి' గ్రంథానికి ఉప సంపాదకునిగా ఉన్నారు. అలాగే 2007 సంవత్సరంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ముఖ్య కార్యకర్తగా సేవలను అందించారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో వివిధ రంగాలలో తెలుగువారి అరవై ఏళ్ళ ప్రగతి సమీక్షగా వెలువడిన 213 వ్యాసాల సంకలనం 'వజ్ర భారతి ' ఉద్గ్రంధానికి సంపాదక వర్గంలో ఉన్నారు.

నాటకాల్లోంచి జానపదాల్లోకిసవరించు

చిన్నప్పటి నుంచే ఆయనకు నాటకాలంటే ఇష్టం. ఆంజనేయుడి వేషమంటే మరీ ఇష్టం. బడిలో మూతిని బిగబట్టి తోక పెట్టుకుని సరదాగా వేషం వేసేవారాయన. ఆ ఉత్సాహం కొద్దీ, ఫలించని వంచన, ఏక్ దిన్ కా సుల్తాన్, మనుషులోస్తున్నారు జాగ్రత్త, క్రాంతి, తాకట్టు, కీర్తిశేషులు... ఇలా స్టేజి మీద చాలా నాటకాలు వేశారు. రేడియో నాటకాల్లోనూ నటించారు. వాటిలో 'రాంబాబు కాపురం' మంచి పేరు తెచ్చిపెట్టింది. నటన మీద ఇష్టంతో టీవీ ధారావాహికలు, చలనచిత్రాల్లో నటిస్తున్నా ఆయనకు నాటకాలతో అనుబంధం వల్లే జానపద కళల మీద ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా 'పగటివేషాలు' అంటే చాలా ఇష్టం. ఇవి సమాజం నుంచీ, సామాజిక అవసరాల నుంచి, మనుషుల వేదనలు, సంతోషాల నుంచి పుట్టినవే. పగటివేషమంటే పగలు ధరించే మారురూపం. అర్జునుడు బృహన్నలగా, వేంకటేశ్వరుడు ఎరుకలసానిగా మారురూపాలు ధరించి తమ కార్యాలను చాకచక్యంగా నిర్వహించుకున్నారు. చదువురాని 'గొల్లబోయ'. 'వితంతువు' తదితర వేషాలు సామాజిక చైతన్యాన్ని రగిల్చాయి.[4]

రంగస్థల కళాకారునిగాసవరించు

 
పిట్టలదొర నాటకంలో పిట్టలదొరగా నటిస్తున్న తాతా రమేశ్ బాబు

ఆయన రంగస్థలం మీద "ఫలించని వంచన" నాటికలో కథానాయికగా, "ఏక్ దిన్ కా సుల్తాన్"లో మీసాల వెంకటరత్నంగా "మనుషులొస్తున్నారు జాగ్రత్త"లో రెడ్డి గా, "క్రాంతి"లో రామారావుగా, "ది ఇన్సిడెంట్"లో బ్రాహ్మణుడుగా, "తాకట్టు"లో జ్ఞానేశ్‌గా, "కీర్తిశేషులు" నాటకంలో మురారిగా, ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో "రాంబాబు కాపరం"లో రాంబాబుగా, జాతీయ నాటకం నాదయోగిలో రామరాయుడిగా , "అపూర్వ నరకం"లో తమిళ అయ్యరుగా, హైదరాబాద్ దూరదర్శన్‌లో "మొదటికే మోసం" బొమ్మలాటలో పప్పెట్‌గా, "సంసారం సాగరం" మెగా సీరియల్‌లో మంత్రగాడుగా, మినీ మూవీలో గంగిరెడ్డిగా, లయ సీరియల్‌లో వెంకటరావుగా, అబ్బాయి ప్రేమలో పడ్డాడు చలన చిత్రంలో గుండు అనుచరుడుగా నటించారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి తొలి రంగుల సినిమా బొమ్మలాటనూ వివిధ భారతిలో ఇవ్వటం, పగటి వేషాలు, సామాజిక ప్రయోజనం అనే అంశం మీద మూడు వారాల ధారావాహిక ప్రసంగాలు, గుడివాడ నాటక రంగం మీద మూడు వారాల ప్రసంగాలు ఇచ్చారు.

ఉపాధ్యాయునిగా విద్యార్థుల సృజనశిల్పిసవరించు

 
ఆర్థిక సమతామండలి అధ్వర్యంలో విద్యార్థులకు సృజనాత్మక వస్తువుల తయారీలో శిక్షణ యిస్తున్న సందర్భంలో (2004-శ్రీకాకుళం)

గుడివాడ పురపాలక సంఘ పాఠశాల అయిన అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా 1985 నుండి పనిచేస్తున్నారు. సాంకేతిక విద్యలు విద్యార్థులకు నేర్పిస్తూ విద్యార్థులను ఉత్యాహపరుస్తూ నూతన దృక్పథాన్ని ప్రేరేపించారు. ఇందుకు ఆయన తన సొంత డబ్బును సమకూర్చి, స్క్రీన్ ప్రింటింగ్, ఫోటో లామినేషన్, పెయింటింగ్స్, పప్పెటరీ విద్యను బోధిస్తూ, 2002 నుండి నూతనంగా ఒక కొత్త పద్ధతిలో బొమ్మలు వేయడం ద్వారా పిల్లలకు డబ్బు సంపాదించే మార్గాన్ని నేర్పించారు. ఏటా నూతన సంవత్సరంలో గ్రీటింగుల అమ్మకాలు కోట్ల రూపాయల్లో జరుగుతుంటాయి. అలాగే విద్యార్థులతో చిత్రించిన గ్రీటింగ్ కార్డులను ముస్తాబుచేసి, ప్రదర్శనకు, అమ్మకానికి రంగం సిద్ధం చేయించారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు చిత్రించిన గ్రీటింగ్ కార్డులను చూడగానే ముచ్చట గొల్పుతున్నట్లుండేవి. రంగురంగుల్లో ముద్రించిన గ్రీటింగ్ కార్డులు అనేకం దొరుకుతున్నా, విద్యార్థులు స్వయంగా చిత్రించిన గ్రీటింగ్ కార్డులకు ఒక ప్రత్యేక గిరాకీ ఉండవచ్చుననే ఉద్దేశంతో ఆయన నేతృత్వం వహించి విజయవంతంగా నిర్వహించారు.

పిల్లలతో బొమ్మలను తయారు చేసి, పప్పెట్ షోలను ఇవ్వడం ద్వారా కూడా సృజనాత్మకతను తేజోవంతం చేసారాయన. సరైన వనరులు, ఆర్థిక వనరులు స్కూల్ నుంచి కాని, యాజమాన్యం నుంచికాని అందక పోయినా స్వీయధనంతో తాతా రమేష్ బాబు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళల ద్వారా తమ కాళ్ళమీద తాము నిలబడేటట్లు విద్యార్థులను తీర్చిదిద్దారు. స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ షాపును గుడివాడ మునిసిపల్ చైర్మన్ నుగలాపు వెంకటేశ్వరరావు ఎజికె పాఠశాలలో ప్రారంభించారు. స్వతహాగా కవి, కథారచయిత, చిత్రకారుడు, పప్పెటర్ కావడంతో ఈ పనులన్నీ తాతా రమేష్ బాబు సునాయాసంగా చేయగలిగారు.[5]

అంతర్జాతీయ సంస్థ ఆర్థిక సమతా మండలి, శ్రీకాకుళంలో అయిదు సంవత్సరాలుగా కొన్ని వందల మంది బాలబాలికలకు, అంగన్వాడి కార్యకర్తలకు, ఒరగామి, నమూనాలు తయారు చేయటం, స్క్రీన్ ప్రింటింగ్, మొదలయిన అనేక కళలలో సృజనాత్మక శిక్షణ ఇస్తున్నారు.

అయిదు లక్షలకు పైగా అభినందన పత్రాలు, సూక్ష్మ చిత్రాలు, నీటి తైల వర్ణ చిత్రాలు చిత్రించారు.

నటించిన సీరియళ్ళుసవరించు

 
సీరియళ్లలో వివిధ పాత్రలలో తాతా రమేశ్ బాబు
 • ఆడది
 • సంసారం-సాగరం
 • లయ
 • ఎదురీత
 • గంగతో రాంబాలు
 • అడవిపూలు
 • శ్రావణసమీరాలు
 • మూగమనసులు
 • అమ్మనా కోడలా
 • ప్రియమైన శత్రువు
 • అగ్నిపూలు
 • ఆకాశమంత
 • జాబిలమ్మ
 • రాములమ్మ
 • పాపంపద్మనాభం
 • ఇద్దరు అమ్మాయిలు
 • రాణివాసం
 • మనసు-మమత
 • అలకనంద
 • ఇదిఒక ప్రేమకథ
 • రియల్ డిటెక్టివ్స్
 • తాళికట్టు శుభవేళ
 • ఆడువారి మాటలకు అర్థాలు వేరులే

రేడియో నాటికలుసవరించు

ఆయన ఆలిండియా రేడియో - విజయవాడ స్టేషను నుండి పాల్గొన్న నాటికలు

 • రాంబాబు కాపురం
 • నాదయోగి (జాతీయ నాటకం)
 • అపూర్వ నరకం
 • కూటివిద్య
 • యశోధర
 • వసతిగృహం

అవార్డులుసవరించు

 
2007 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ద్వారా సన్మానం

ఆకాశవాణి, దూరదర్శన్, ఇతర టీవీ కార్యక్రమాల్లో నటుడిగా, ప్రయోక్తగా, వక్తగా పాల్గొన్న బహుముఖీన ప్రతిభా విశేషాల్ని కలిగిన రమేశ్ బాబు అనేక సత్కారాలు, సన్మానాలూ పొందారు.

 • చిత్రకళా సంసద్ రాష్ట్ర ఉత్తమ చిత్ర పురస్కారం,
 • యునెస్కో క్లబ్ వారి అంతర్జాతీయ సాంస్కృతిక పురస్కారం,
 • తిలక్ విశిష్ట సాహితీ పురస్కారం,
 • శేషేంద్రశర్మ పురస్కారం
 • రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,
 • ఆం.ప్ర సాంస్కృతిక మండలి కృజి పురస్కారం,
 • ఆం.ప్ర అధికార భాషా సంఘం భాషా సేవా పురస్కారం
 • జానపద కళామిత్ర పురస్కారం
 • తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం
 • విశ్వకళామహోత్సవ పురస్కారం

వంటివి కొన్ని మాత్రమే. ఆయనకు 2015 ఉగాది పురస్కారం చిత్రలేఖనం విభాగంలో లభించింది.[6]

చిత్రమాలికసవరించు

పప్పెట్ షో చిత్రాలుసవరించు

చిత్రించిన చిత్రాల సమాహారంసవరించు

మరణంసవరించు

తాతా రమేశ్ బాబు గుడివాడలోని తన స్వగృహంలో 2017, ఏప్రిల్ 20 తెల్లవారు జామున మరణించారు. ఆయన కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు[7].

మూలాలుసవరించు

 1. "http://www.telugutimes.net/detailsnews/?id=2740". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-28. External link in |title= (help)
 2. తెలుగు వెలుగు, ఏప్రిల్ 2015, 56వ పుట , "పరోపకారమే జానపదాల లక్ష్యం"
 3. కినిగె లో ఆయన పుస్తక వివరాలు
 4. తెలుగు వెలుగు మాసపత్రిక, ఏప్రిల్ 2015, 57వ పుట
 5. వార్త దినపత్రిక, కృష్ణాజిల్లా ఎడిసన్, 9 వ పుట, తేదీ డిసెంబరు 2, 2002, "ఇటు విద్య - అటు ఉపాధి" - నూతన పుంతలు తొక్కుతున్న ఎజికె విద్యార్థుల సృజనాత్మకత
 6. ఆంధ్రభూమి దినపత్రిక,విజయవాడ, ఆదివారం ఎడిషన్, 29 ఏప్రిల్ 2012
 7. కంట్రిబ్యూటర్ (21 April 2017). "సినీ,టి.వి. రచయిత తాతా రమేష్ బాబు మృతి". ఈనాడు (అమరావతి జిల్లా టాబ్లాయిడ్, గుడివాడ నియోజకవర్గం పేజీ). న్యూస్ టుడే. |access-date= requires |url= (help)

ఇతర లింకులుసవరించు