అల్లూరి సీతారామరాజు (సినిమా)

1974 తెలుగు సినిమా

అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు.

అల్లూరి సీతారామరాజు
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం జి. హనుమంతరావు,
జి. ఆదిశేషగిరిరావు
రచన త్రిపురనేని మహారధి
కథ (జీవిత గాధ)
చిత్రానువాదం త్రిపురనేని మహారధి
తారాగణం కృష్ణ,
విజయనిర్మల ,
కొంగర జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కాంతారావు,
చంద్రమోహన్,
ప్రభాకరరెడ్డి,
బాలయ్య,
త్యాగరాజు,
కె.వి.చలం,
మంజుల (నటి),
జయంతి,
రాజశ్రీ
సంగీతం ఆదినారాయణరావు
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
వి.రామకృష్ణ,
పి.సుశీల,
ఎల్.ఆర్. ఈశ్వరి
గీతరచన శ్రీశ్రీ,
సి.నారాయణ రెడ్డి,
ఆరుద్ర,
కొసరాజు,
ఆదినారాయణరావు
సంభాషణలు త్రిపురనేని మహారధి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
నిడివి 187 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు.

చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది.

సినిమాను ప్రధానంగా హార్సిలీ హిల్స్ ప్రాంతంలో తెరకెక్కించారు. సినిమా స్కోప్లో నిర్మాణమైన చిత్రంగా అల్లూరి సీతారామరాజు పేరొందింది. కృష్ణ 100వ సినిమాగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ఘన విజయాన్ని సాధించి 19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి పొందింది. సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాను సినీ విమర్శకులు కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా పేర్కొంటూంటారు.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. ఆయన గురించి తెలుగునాట నలుచెరగులా బుర్రకథలు, నాటకాలు వ్యాప్తిలో ఉండేవి. వీటిలో బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ బుర్రకథ బాగా ప్రచారంలో ఉండేది. ప్రజల్లో ఆయన గురించి అనేక కథలు, గాథలు వ్యాపించివున్నాయి. ఇంతటి ప్రచారం కలిగిన సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా తీద్దామని ఎన్టీ రామారావు ప్రయత్నించాడు. పడాల రామారావు అల్లూరి జీవితం ఆధారంగా రాసిన "ఆంధ్రశ్రీ" అన్న పుస్తకం ఆధారంగా రామారావు స్క్రిప్టు తయారుచేయించుకున్నా, దాన్ని తీయడంలో అనేక తర్జనభర్జనలు జరిగి కాలం గడిచింది. ఈలోగా కృష్ణ అల్లూరి జీవిత విశేషాలను ఆధారం చేసుకుని కల్పన జోడించి త్రిపురనేని మహారధితో వేరే స్క్రిప్ట్ రాయించుకుని సినిమా నిర్మించాడు.[1] అల్లూరి సీతారామరాజు సినిమాను రామారావు మాత్రమే కాకుండా అప్పటికి ఇతర హీరోలతో తీయాలను పలువురు నిర్మాతలు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. తాతినేని ప్రకాశరావు దర్శకునిగా అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగానూ, డి.ఎల్.నారాయణ నిర్మాణంలో శోభన్ బాబు కథానాయకుడిగానూ తీయాలని ప్రయత్నాలు జరిగినా అవీ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో కృష్ణ దీన్ని స్వీకరించి నిర్మాణం చేశారు.[2]

దేవుడు చేసిన మనుషులు చిత్రం విజయవంతమైన తర్వాత కృష్ణ ఈ చిత్రనిర్మాణం చేపట్టాడు. అప్పటికే వి.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అసాధ్యుడు (1968) చిత్రంలో కృష్ణ ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. దానితో వి.రామచంద్రరావుని దర్శకునిగా కృష్ణ తీసుకున్నాడు.

చిత్రీకరణ

మార్చు

సినిమా చిత్రీకరణను వి.రామచంద్రరావు దర్శకత్వంలో ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ ప్రాంతంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. అయితే కొంత సినిమా తీశాకా రామచంద్రరావు అనారోగ్యంతో మరణించడంతో సినిమా చిత్రీకరణ ఆగింది. కొందరు సన్నిహితుల సలహాతో కృష్ణనే మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించి,సూచించి, కె.ఎస్.ఆర్.దాస్ను దర్శకత్వంలో పోరాట దృశ్యాలను తీయడంతో. సినిమా పూర్తైంది. అల్లూరి సీతారామరాజు సినిమాను కలర్ సినిమాస్కోప్ లో చిత్రీకరించారు, ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ సినిమాగా నిలిచింది.[3] అంతకు ముందు హిందీలో "పాకీజా" చిత్రానికి కమల్ అమ్రోహీ సినిమా స్కోప్ పరికరాలు (కెమెరాలు, కటకాలు) దిగుమతి చేసుకొన్నాడు. వాటినే ఈ సినిమా కోసం కృష్ణ తీ ఈ చిత్రాతీసుకున్నారు. ఈ చిత్రాన్ని విడుదల అయిన చాలా కాలం తరువాత ఎన్ టీ రామారావు గారు చూసి, ఈ చిత్రాన్ని ఇంతకంటే గొప్పగా తీయలేరు, ఆ పాత్రను ఇంతకంటే గొప్పగా పోషించలేరు అని కృష్ణను మెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేము చేయాల్సిన పని లేదు అని అన్నారు.[ఆధారం చూపాలి]

చిత్రకథ

మార్చు

సినిమా కథ ప్రకారం చిన్నతనం నుంచి బ్రిటీష్ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్న అల్లూరి రామరాజు ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగవిద్యను అభ్యసిస్తాడు. దేశమంతా పర్యటించి బ్రిటీష్ పరిపాలనలో ప్రజల కష్టాలు, సమస్యలు అర్థం చేసుకుని, అహింసా విధానాన్ని తిరస్కరిస్తాడు. రామరాజు సీత పరస్పరం ప్రేమించుకుని వివాహానికి పెద్దల అంగీకారాన్ని పొందుతాడు. దేశాటనకు వెళ్ళిన రామరాజు కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వచ్చి తాను అవివాహితుడిగా, సన్యాసిగా ఉండి దేశ దాస్యవిముక్తికి పోరాడతానని సీతకు చెప్పగా ఆమె వేరే పెళ్ళిని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆనాటి నుంచి అల్లూరి రామరాజు సీతారామరాజుగా పేరు మార్పుచేసుకుంటాడు. సీతారామరాజు మన్యం ప్రాంతంలో శ్రమదోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చలించిపోయి, అక్కడి ప్రజల్లో తిరుగుబాటను ప్రోత్సహిస్తాడు. గంటదొర, మల్లుదొర వంటివారి సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్లపై దాడిచేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను చించి, ఆయుధాలు స్వాధీనం చేసుకుంటాడు. బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజును బంధించాలని చేసే యత్నాలు భగ్నమై విప్లవ వీరులు విజయం సాధిస్తారు. అంతర్గత సమస్యలతో విప్లవం బలహీనం కాగా, బ్రిటీష్ కలెక్టర్ రూధర్ ఫర్డ్ మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి, ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటకు రప్పిస్తుంది. రూధర్ ఫర్డ్, ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్య నిష్ఠకీ, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైనా, వృత్తిధర్మంలో భాగంగా సీతారామరాజును కాల్చి చంపుతారు. ఒక్క సీతారామరాజును చంపితే వేలమంది సీతారామరాజులు పుడతారని నినదిస్తూండగా సీతారామరాజు మరణంతో సినిమా ముగుస్తుంది.

చిత్రబృందం

మార్చు

పాత్రలు-పాత్రధారులు

మార్చు
  1. అల్లూరి సీతారామరాజు - కృష్ణ
  2. గంటం దొర - గుమ్మడి
  3. మల్లు దొర - ప్రభాకర్ రెడ్డి
  4. అగ్గిరాజు - బాలయ్య
  5. పడాలు - కాంతారావు
  6. వీరయ్యదొర - రావు గోపాలరావు
  7. గోవిందు - చంద్రమోహన్
  8. కోయరాముడు - కొమ్మినేని శేషగిరిరావు
  9. రూథర్ ఫర్డ్ - జగ్గయ్య
  10. మేజర్ గుడాల్ - రాజనాల
  11. బాస్టియన్ - త్యాగరాజు
  12. బ్రేకన్ - పేకేటి శివరాం
  13. పిళ్లె - కె.వి.చలం
  14. కవర్ట్ - జగ్గారావు
  15. హైటర్ - ఆనంద్ మోహన్
  16. సింగన్న - అల్లు రామలింగయ్య
  17. లింగన్న - సాక్షి రంగారావు
  18. సీత - విజయనిర్మల
  19. రత్తి - మంజుల
  20. గంగమ్మ - జయంతి
  21. సింగి - రాజశ్రీ
  22. ఫ్లారెన్స్ - నందితాబోస్
  23. నారాయణమ్మ - పండరీబాయి
  24. వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

పూర్తి స్థాయి ఇంగ్లీషు పాట ఉన్న తొలి (తెలుగు) చిత్రం ఇదే. ఈ పాట ఆదినారాయణరావు రాయటం విశేషం.

  1. జమైరే జోరు లగాడి - రచన: కొసరాజు - గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి
  2. తెలుగువీర లేవరా...దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా - రచన: శ్రీశ్రీ - గానం: ఘంటసాల, వి.రామకృష్ణ
  3. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు - రచన: అరుద్ర - గానం: ఎస్.పి.
  4. వస్తాడు నారాజు ఈ రోజు రానె వస్తాడు - రచన: సినారె - గానం: పి.సుశీల
  5. విప్లవం మరణించదు వీరుడు మరణించడు - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.
  6. హ్యాపీ హ్యాపీ న్యూ యియర్

అవార్డులు

మార్చు

విడుదల

మార్చు

అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ 100వ సినిమాగా విడుదలై సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. భారీ విజయాన్ని చవిచూసి, 19 కేంద్రాలలో 100రోజులు నడిచింది. సినిమాని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పేరుతో హిందీలోకి అనువదించారు.

మూలాలు

మార్చు
  1. ప్రసాద్, ఎంబీఎస్. "సినీమూలం: అల్లూరి సీతారామరాజు నవల - సినిమా". greatandhra.com. Retrieved 11 January 2018.
  2. "Alluri Seetaram Raju: సంచలనానికి 50 ఏళ్లు.. 'అల్లూరి సీతారామరాజు' తెర వెనక ఎన్ని విశేషాలో." EENADU. Retrieved 2024-05-01.
  3. "CineGoer.com - Box-Office Records And Collections - Krishna's 100th Film Alluri Seetarama Raju". Archived from the original on 2007-06-08. Retrieved 2008-08-28.

బయటి లింకులు

మార్చు