వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2008)

ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

పండ్లు చెట్టు నుండి లభించే తిను పదార్ధాలు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలంలోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి పట్టే సమయం కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.

ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్ లో పుష్పాసనం, జీడిమామిడి లో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు. నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు.

చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు. పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు. కొన్ని పండ్లనుండి పానీయాలు తయారుచేసి తాగుతాము. ... ...పూర్తివ్యాసం: పాతవి

2వ వారం

నక్సలైటు లేదా నక్సలిజం భారత కమ్యూనిష్టు ఉద్యమములో వచ్చిన 'సైనో-సోవియట్ చీలిక'తో ఉద్భవించిన తీవ్రవాద, తరచూ హింసాత్మక, విప్లవాత్మక కమ్యూనిష్టు వర్గాల యొక్క వ్యవహారిక నామము. సైద్ధాంతికంగా వీరు అనేక అనేక రకాల మావోయిజానికి చెందుతారు. తొలుత, ఈ ఉద్యమం పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనది. తరువాత కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) వంటి గొరిల్లా అండర్ గ్రౌండు వర్గాల యొక్క కార్యకలాపాలతో, ఉద్యమం ఛత్తీస్‌ఘడ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ వంటి అంతగా అభివృద్ధి చెందని మధ్య మరియు తూర్పు భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది.


నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామము పేరు మీదుగా వచ్చింది. 1967లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సి.పి.ఐ (ఎం)) లోని ఒక వర్గము, అధికారిక సిపిఐ (ఎం) నాయకత్వానికి వ్యతిరేకముగా విప్లవాత్మక విపక్షాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నంగా, చారు మజుందార్ మరియు కానూ సన్యాల్ నేతృత్వంలో ఒక హింసాయుత పోరాటం ప్రారంభించింది. ఈ తిరుగుబాటు మే 25, 1967న నక్సల్‌బరి గ్రామములో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనునిపై దాడి చేయడంతో ప్రారంభమైంది. 1970లలో ఉద్యమము అనేక పరస్పరం విభేదించే చిన్న వర్గాలుగా చీలిపోయినది. 1980 నాటికి దాదాపు 30 క్రియాశీలక నక్సలైటు వర్గాలు మొత్తం 30,000 మంది సభ్యులతో పనిచేస్తున్నవని అంచనా. గతకొద్ది సంవత్సరాలలో తిరుగుబాటుదారులు నక్సల్ ప్రభావాన్ని తొమ్మిది రాష్ట్రాలలోని 76 జిల్లాల నుండి 12 రాష్ట్రాలలో 118 జిల్లాలకు వ్యాపింపజేశారు. రెండు ప్రముఖ నక్సలైటు వర్గాలైన 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్ వార్'(పి.డబ్లు.జి) మరియు 'మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా' (ఎం.సి.సి.ఐ) ఏకమై సెప్టెంబరు 21, 2004న 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)' ఏర్పడింది....పూర్తివ్యాసం: పాతవి

3వ వారం
దస్త్రం:Antarvedi 1.jpg

అంతర్వేది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం ఉంది. ఒకప్పుడు శివుని పట్లఅపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి , యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదిక గా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.


మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు కొపనాతి కృష్టమ్మ. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా(నడవా) మాదిరి నిర్మించి మద్యమద్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానది కి దగ్గరగా విశాలమైన ఖాళీ స్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు.


అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్ర తీరమునకు దగ్గరగా వశిష్టాశ్రమము కలదు. దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా లైట్ హౌస్ కలదు. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రదాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ....పూర్తివ్యాసం: పాతవి

4వ వారం

ఆఫ్ఘనిస్తాన్, ఆసియా ఖండం మధ్యలో ఉన్న ఒక దేశము. ఈ దేశం ఆధికారిక నామం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. దక్షిణ ఆసియా, మధ్య అసియా, నైరుతి ఆసియా లను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా సిల్క్ వాణిజ్య మార్గం లో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు ఊ దేశం తరచు గురయ్యేది. అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు.

ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇతర దేశాలతో చుట్టబడిన (సముద్ర తీరం లేని) దేశం. ఎక్కువ భాగం పర్వత మయం. ఉత్తరాన, నైరుతి దిశన మైదాన ప్రాంతం. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం నౌషాక్ (సముద్ర మట్టం నుండి 7,485 మీటర్లు లేదా 24,557 అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువ. ఎక్కువ భాగం పొడి ప్రదేశం.

1970 దశకంనుండీ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. 2001 తరువాత నాటో జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం అమెరికా సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. దేశం పునర్నిర్మాణం జరుగుతున్నది కాని అనేక సమస్యలతో ఆఫ్ఘనిస్తాన్ సతమతమవుతున్నది. పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, దేశమంతటా ఉన్న ల్యాండ్ మైనులు (భూమిలో పాతబడి ఉన్న బాంబులు), ప్రేలుడు పదార్ధాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేకంగా సాగుతున్న గంజాయి పెంపకం, రాజకీయ అంతర్యుద్ధాలు, తాలిబాన్ల దాడులు, మిగిలి ఉన్న అల్-కైదా ప్రభావం, (ప్రత్యేకించి ఉత్తరభాగంలో ఉన్న) అనిశ్చితి - ఇవి కొన్ని సమస్యలు. ....పూర్తివ్యాసం: పాతవి

5వ వారం

సత్య సాయి బాబా 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు. ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు. అయితే సత్య సాయిబాబాను గురించి ఇందుకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు కూడా బహుళంగా ఉన్నాయి. అతను ఒక 'సామాన్య వ్యక్తి' అన్న భావం నుండి 'ప్రజలను పెడమార్గం పట్టిస్తున్నాడు' అన్నంత వరకూ వ్యాఖ్యలు ఉన్నాయి.

తనను గురించి సాయిబాబా స్వయంగా చెప్పిన కొన్ని వాక్యాలు - నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు. ....మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. ..... నేనేదో మహిమలు చేస్తున్నాననీ, ఇదీ అదీ సృష్టించి ఇస్తున్నాననీ విని ఉంటారు. అది ముఖ్యం కాదు. సత్వ గుణమే ముఖ్యం. మీకు నేను ఆరోగ్యైశ్వర్యాదులను నేను ప్రసాదించేది మీ అవరోధాలను తొలగించి ఆధ్యాత్మ సాధనపై మనసు లగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతోనే.

సత్యసాయి బాబా , సత్యనారాయణ రాజుగా, 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ వ్యవసాయ కుటుంబంలో, అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించాడు. ....పూర్తివ్యాసం: పాతవి

6వ వారం

సిక్కిం భారత దేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా). 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఈ చిన్న రాష్ట్రానికి పశ్చిమాన నేపాల్, తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది.


సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతము, వజ్రయాన బౌద్ధము ప్రధానమైన మతాలు. చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.


సిక్కిం ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారింజకాయలు, యాపుల్పళ్ళు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానము. ఇటీవలి కాలంలో పర్యాటక రంగంపై శ్రద్ధ, పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు సిక్కింలో ఎన్నో ఆకర్షణలున్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి

7వ వారం

అల్ఫ్రెడ్ టెన్నిసన్ (ఆగస్ట్ 6, 1809 - అక్టోబర్ 6, 1892) బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి. టెన్నిసన్ లింకన్‌షైర్ (Lincolnshire) నందలి సోమర్స్‌బై లో (Somersby) ఒక రెక్టర్ (ఓ విధమైన మతాధికారి) 12 మంది సంతానంలో నాల్గవ కుమారునిగా జన్మించినాడు. టెన్నిసన్ మొదట లౌత్ గ్రామర్ స్కూల్ (లౌత్ వ్యాకరణ పాఠశాల) నందు నాలుగు సంవత్సరాలు చదివినాడు (1816 - 1820). ఆ తరువాత స్కైట్‌క్లిఫ్ పాఠశాల(Scaitcliffe School), ఎంగిల్‌ఫీల్డ్ గ్రీన్ (Englefield Green) మరియు లౌత్ నందలి ఆరవ ఎడ్వర్డ్ రాజు వ్యాకరణ పాఠశాల నందు చదివినాడు. 1828న కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో ప్రవేశించినాడు. ఇక్కడ ఉండగా కేంబ్రిడ్జ్ అపోస్తలులు అను రహస్య సంస్థనందు చేరినాడు.

టెన్నిసన్ పలు విధాలయిన విషయాలపై కవితలు వ్రాసినారు. మధ్య యుగపు గాథల నుండి మొదలుకొని పౌరాణిక కథల వరకూ, ప్రాంతీయ స్థితిగతుల నుండి ప్రకృతి విషయాల వఱకూ!, ఇతని బాల్యానికి ముందు, బాల్యంలోనూ ప్రచురించిన జాన్ కీట్స్, మరియు ఇతర సరస కవుల ప్రభావం ఇతనిపై బహుమెండు. ఇతని కవితల్లోని భావావేశము, సాహిత్యంలోని చిక్కదనము ఈ విషయాన్ని దృవపరుస్తున్నాయి. ఇతను లయ (rythm)మీద కూడా చక్కని పట్టు సాధించినాడు. ఉదాహరణకు Break, Break, Break అని ఒకే పదాన్ని పలుమార్లు లయబద్ధంగా వాడి చెప్పదలచుకున్న విషయంలోని విషాదాన్ని, అందులోని తీవ్రతను పాఠకులకు అందేలా చేయడంలో టెన్నిసన్ దిట్ట.

....పూర్తివ్యాసం: పాతవి

8వ వారం

మైదాన హాకీ అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ, దీనిని పురుష స్త్రీలిరువురూ అడతారు. దీని అధికారిక పేరు ఉత్త హాకీ మాత్రమే, భారతదేశంతో సహా పలు చోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు. దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన ఇతర రకములైన హాకీల నుండి గుర్తంచడానికి మైదాన హాకీ గా వ్యవహరిస్తారు. అదే కారణం చేత వివిధ విజ్ఞానసర్వస్వములు కూడా దీనిని మైదాన హాకీగా వ్యవహరిస్తారు. హాకీలో తరచుగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, వేసవి ఒలింపిక్స్, నాలుగేళ్ళకోసారి జరిగే ప్రపంచ కప్ హాకీ, వార్షికంగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు జూనియర్ ప్రపంచ కప్ హాకీ.

1980 వరకూ జరిగిన ఐదు ప్రపంచ కప్పు హాకీలలో భారతదేశపు మరియు పాకిస్థాన్ దేశపు జట్లు నాలుగు సార్లు విజయాన్ని కైవసంచేసుకున్నాయి. కానీ ఆ తరువాత గడ్డినుండి ఆశ్ట్రో టర్ఫుకు హాకీ మైదానాన్ని మార్చి నప్పుడు వేరే జట్లు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. వాటిలో కొన్ని నెథెర్లాండ్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లాండు మరియు దక్షిణ కొరియా. ఈ క్రీడను అంతర్జాతీయ హాకీ కూటమి (FIH) నియంత్రిస్తుంది. అందులో భాగంగా హాకీలోని నిబంధనలు కూడా వివరింపబడతాయి. పలు దేశాలలో హాకీని క్లబ్లు క్రీడగా తీర్చిదిద్దారు, కానీ వాటికి ఉండవలసినంత ఆధరణ లేక కొందరు మాత్రమే హాకీని వృత్తిగా చేసుకొనగలిగారు. ఇక ఉత్తర అమెరికా, మరియు అర్జెంటినాలలో దీనిని ఎక్కువగా ఆడవారి క్రీడ గా పరిగణిస్తారు.

....పూర్తివ్యాసం: పాతవి

9వ వారం

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.


1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు. 1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. తెలుగేతరులకు తెలుగు నేర్చుకోవడం ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826 లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. ....పూర్తివ్యాసం: పాతవి

10వ వారం

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.


1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు. 1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. తెలుగేతరులకు తెలుగు నేర్చుకోవడం ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826 లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. ....పూర్తివ్యాసం: పాతవి

11వ వారం

తట్టు లేదా పొంగు అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో మీజిల్స్ అని పిలుస్తారు. ఈ అంటు వ్యాధి ప్రధానంగా పిల్లలలో వస్తుంది. ఇది మార్‌బిల్లీ వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. తట్టు ప్రపంచములొ ఉన్నట్లుగా క్రీ.పూ.600 సంవత్సరము నుండి ఆధారాలు ఉన్నాయి. తట్టు గురించి శాస్త్రీయమైన విశ్లేషణ 860-932 సంవత్సరాల మధ్య పర్షియా వైద్యుడు ఇబిన్ రాజీ (రాజెస్) చేశాడు. రాజెస్ ఆటలమ్మకు తట్టుకి గల వత్యాసాలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. మొట్టమొదటిసారిగా తట్టుని కలిగించే ఈ వైరస్ 1954వ సంవత్సరములో అమెరికాలో డేవిడ్ ఎడ్‌మాన్‌స్టన్ వర్ధనం చేశాడు. డేవిడ్ ఈ వైరస్ వేరు చేసి కోడి గుడ్డు భ్రూణం (చిక్ ఎంబ్రియో)లో వ్యాప్తి చెందేటట్లు చేశాడు. ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి. 1963 సంవత్సరములో తట్టు వ్యాధి నిరోధక టీకా తయారి జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జెర్మన్ మీజిల్స్ అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది.

తట్టు సంబంధించిన వైరస్ సాధారణంగా శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువ ఉన్నప్రదేశాలలో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. తట్టు వ్యాధి సమాజములొ కనిపించిన వేంటనే ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని నివేదంచాలి. వారు ఆ ప్రదేశములొ ఆ వ్యాధి ప్రబలకుండా ఆ వ్యాధి గ్రస్తులను ఒకచోట వేరు చేసి ఉంచుతారు. సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు ఊపిరిత్తుతులకు నిమ్ము చేరి న్యుమోనియా రావచ్చు. కొద్దిగా అతిసారం జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు మెదడువాపు (ఎన్‌సెఫలైటిస్) , మెనింజైటిస్ అరుదుగా రావచ్చు. ....పూర్తివ్యాసం: పాతవి

12వ వారం
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి)

బ్రాహ్మణగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము. ఇది నిడదవోలు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామం చాగల్లు మండలం లోని ఒక ప్రముఖ పంచాయతి. ఈ ఊరి జనాభా సుమారుగా 12,000 వరకూ ఉంటుంది. పూర్వం "బాపన్న" అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి మొదట నివాసం ఏర్పరుచుకున్నాడు. అతని పేరుమీదుగానే "బాపన్నగూడెం" అని పిలుస్తూ ఉండేవారు. కాల క్రమేణా అది బ్రాహ్మణగూడెంగా మార్పు చెందినది.


వూరిలో అధిక జనం వ్యవసాయం మీద అధారపడి జీవిస్తున్నారు. ఊరి వ్యవసాయం కోసం 3 చెరువులు ఉన్నాయి. అవి: ఉప్పుగుంట చెరువు, ప్రత్తిపాటి చెరువు, రావుల చెరువు. గ్రామీణ గ్రంథాలయం, 3 కమ్యూనిటి హాళ్ళు ,పశు వైద్యశాల, త్రాగునీటి అవసరాల కోసం 3 రక్షిత మంచినీటి టాంకులు కలవు. ఊరికి పాసింజరు బళ్ళకోసం చిన్న హాల్ట్ రైల్వే స్టేషన్ కలదు. బస్టాండ్ కలదు. 6 పెద్ద రైస్ మిల్లులు, 3 భారీ పౌల్ట్రీ ఫారంలు, 2 కోకోనట్ ప్రోసెసింగ్ యూనిట్లు, 1 ఇంజనీరింగ్ కంపెనీ, 1 ఎగ్ ట్రే తయారీ యూనిట్ ఉన్నాయి. 3 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 4 ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళు ఉన్నాయి.


ఇక్కడి ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది.ఊరి చుట్టూ చెరువులు, చెట్లు,గట్లూ చాలా అందంగా కనిపిస్తాయి. కనుకనే ఇ.వి.వి.సత్యనారాయణ లాంటి దర్శకులు ఇక్కడ సినిమాలు తీశారు. నువ్వంటే నాకిష్టం అనే తెలుగు సినిమా చాలా భాగం ఈ ఊరిలోనే చిత్రీకరించారు .. ....పూర్తివ్యాసం: పాతవి

13వ వారం

శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కధా నాయకుడు. అధికంగా కుటుంబ కధా భరితమైన ఉదాత్త పాత్రలలో రాణించాడు. జనవరి 14, 1937న జన్మించాడు. హైస్కూల్లో చదివేరోజుల్లో నాటకాలలో నటించాడు. మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైగల ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు.


దైవబలం, భక్త శబరి ఇతను నటించిన తొలి చిత్రాలు. కొన్ని సినిమాలలో సహాయ పాత్రలు పోషించాడు. వీరాభిమన్యు, లోగుట్టు పెరుమాళ్ళకెరుకలు హీరోగా నటించిన తొలి చిత్రాలు. ఆ తర్వాత మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమయిన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు!

అతనికున్న బిరుదులు: నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు, నంది అవార్డు, సినీగోయెర్స్ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డువంటి పెక్కు అవార్డులు అందుకొన్నాడు. శోభన్ బాబు భార్య కాంత కుమారి. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. శోభన్ బాబును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండేవాడు. వృత్తికంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు. వ్యక్తిగా నిరాడంబరుడు. డబ్బును పొదుపు చేయడంలో మరియు మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా ప్రచారం చేయించుకోలేదు.

ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడుదలైన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపాడు. 2008, మార్చి 20న మరణించాడు ....పూర్తివ్యాసం: పాతవి

14వ వారం
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. ఈ స్తోత్రం మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.

యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము. విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో పూర్వ పీఠిక, సంకల్పము, ధ్యానము, స్తోత్రము, ఉత్తర పీఠిక, ఫలశృతి వంటి విభాగాలున్నాయి.

ఈ పారాయణకు కుల, మత పట్టింపులు లేవు. పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు, ఖర్చు అవసరం లేదు. శ్రద్ధ ఉంటే చాలును. ఫలశృతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి. పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి, ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం గృహస్తులకు అనుకూలమైన పూజా విధానం.. ....పూర్తివ్యాసం: పాతవి

15వ వారం

ఉర్దూ ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశం లో జన్మించింది. ఖరీబోలి, లష్కరి, రీఖ్తి, హిందూస్తానీ దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బృజ్ భాష (హిందీ), పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ప్రపంచంలో దాదాపు 35 కోట్ల మంది మాట్లాడే భాష. భారతదేశపు 23 అధికారిక భాషల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో 2వ అధికారిక భాష.


13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాష గా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాను కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూ గా స్థిరమయినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది.


ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను (అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు. ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలున్నాయి - దక్కని, పింజారి, రీఖ్తా మరియు ఖరీబోలి. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో మరియు లాహోర్ లలో తనముద్రను ప్రగాడంగా వేయగల్గింది. ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది. ....పూర్తివ్యాసం: పాతవి

16వ వారం

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక భాగమైన మిన్నసోటా రాష్ట్రానికి రాజధాని. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరాలను జంట నగరాలుగా వ్యవహరిస్తారు. 2006 జనాభా లెక్కలను అనుసరించి ఈ జంట నగరాల జనాభా 35,00,000 అంచనా. ఈ నగరాలు మిసిసిపీ, మిన్నసోటా మరియు సెయింట్ క్రాయ్ నదీతీరాలలో విస్తరించి ఉన్నాయి. జంటనగరాలుగా గుర్తించబడిన ఈ నగరాలు స్వరూపస్వభావాలు, రూపురేఖలలో మాత్రం పరస్పర విరుద్ధతలు కలిగి ఉంటాయి. మిసిసీపీ నదీతీరంలో ఇరువైపులా సహజసిద్ధంగా ఉన్న రాళ్ళు బండలు ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా చేశాయి. లాంబర్ట్‌స్ లాండింగ్ చుట్టూ సెయింట్ పాల్ విస్తరించింది. మిన్నియాపోలిస్ ప్రాంతం మిల్లుల నగరంగా పేరు పొందింది.


మధ్య ప్రాచ్య ప్రాంతానికి ఈ జంటనగరాలు కళా కేంద్రంగా పేరు పొందాయి. ప్రదర్శనలను ఆదరించడంలో ఇక్కడి ప్రజలు ప్రథమ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ఆధారిత అంచనా. ఈ నగరం సరస్సులకు ప్రసిద్ధి. ది గ్రేట్ రివర్ బైసైకిల్ ఫెస్టివల్, ది ట్విన్ సిటీస్ మారథాన్ మరియు యు.ఎస్ పాండ్ హాకీ ఛాంపియన్ షిప్ పోటీలు నగర ప్రజలకు వినోదం అందించే విషయాలలో కొన్ని. నగరంలో యూదులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ భారతీయులు కూడా చెప్పుకోతగినంత మంది ఉన్నట్లు అంచనా. 2006లో జంట నగరాల సరిహద్దు ప్రాంతమైన మేపుల్ గ్రోవ్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని తెరిచారు. ఇక్కడ మసీదులుకూడా చాలానే ఉన్నాయి.


మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరం అత్యధిక శీతల వాతావరణం కలిగిన నగరపాలిత ప్రాంతం. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరాలలో స్టార్ ట్రిబ్యూట్ మరియు సెంట్ పాల్ పయనీర్ ప్రెస్ అనేవి రెండూ ప్రధాన వార్తా పత్రికలు. ఇవి కాకుండా యూనివర్శిటీ ఆఫ్ మిన్నసోటా విద్యార్ధులచే నడపబడే మిన్నసోటా డైలీ జంటనగరాలకు సమీప ప్రజలకు ఉచిత సేవలందిస్తుంది. సెయింట్ పాల్‌ 90,000 నివాసాలకు వాసులకు ఉచిత సేవలందించే ఈస్ట్ సైడ్ రివ్యూ , కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితమైన సిటీ పేజస్ జంట నగరవాసులకు వార్తలనందిస్తున్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి

17వ వారం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఐఐటీలు భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులనూ మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఏడు ఐఐటీలు ఖరగ్‌పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ లో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం బీహార్,ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఐఐటీలు స్థాపిస్తే మొత్తం సంఖ్య 10కి చేరుకుంటుంది. అన్నీ సంస్థలకూ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉండటం వలన వాటి సిలబస్ అవే రూపొందించుకుంటాయి.

ఐఐటిల పరిపాలనా వ్యవస్థలో భారత రాష్ట్రపతి క్రింద ఐఐటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖా మంత్రి, మరి కొందరు ముఖ్యమైన విద్యా సాంకేతిక నిపుణులు, ప్రభుత్వాధికారులు ఉంటారు. ఐఐటీ కౌన్సిల్ క్రింద ప్రతి ఐఐటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీరి క్రింద సంస్థ యొక్క డైరెక్టర్ ఉంటాడు. అన్ని ఐఐటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE) ద్వారా బ్యాచిలర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. ప్రతియేటా సుమారు 3,50,000 మంది పరీక్షకు హాజరయితే అందులోంచి కేవలం 5,000 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. అన్ని ఐఐటీలలో కలిపి సుమారు 15 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 12 వేలమంది పోస్టు గ్రాడ్యుయేట్లు, మరియు పరిశోధనా విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. అన్ని ఐఐటీలు విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ, పరిశోధనా విద్యార్థులకూ క్యాంపస్ లోపలే వసతి సౌకర్యాలు కల్పించబడతాయి.

ఐఐటీలపై ప్రధాన విమర్శ మేధో వలస. ఇంకా కొద్దిమంది విమర్శకులు స్త్రీ శాతం తక్కువగా ఉండటం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతుంటారు.. ...పూర్తి వ్యాసం: పాతవి

18వ వారం

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు.

అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టర్‌లకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టర్ ప్రకాశంను కూడా బారిస్టర్ అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీలాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టర్ అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.

1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు....పూర్తి వ్యాసం: పాతవి

19వ వారం

భారత సైనిక దళం ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహుద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. భారత దేశంలో స్వచ్ఛదంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యముగా శాంతి పరిరక్షణలో భారతీయ సైనికదళం పాలు పంచుకొంది.

1948లో జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో భారతసైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టడం మొదటియుద్ధం. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది. హైదరాబాద్ విమోచనం, గోవా-డామన్-డయ్యు ఆపరేషన్ భారతీయ సైన్యం అంతర్గతంగా సాగించిన రెండు మిలిటరీ ఆపురేషన్లు.

1965లో చైనాతో జరిగిన యుద్దంలో ఓడిపోయిన భారత్ మరో యుద్దానికి సిద్దం కాలేదు కాని అనతి కాలంలోనే కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో 1965లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌‌లో యుద్ధానికి కారకుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్ధంలోనే అత్యధికంగా యుద్ద ట్యాంకులను ఉపయోగించారు.

1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగుబాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశాని రావడంతో భారత్-పాక్ యుద్దం మొదలయింది. తూర్పు పాకిస్తాన్‌కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్‌కు అన్ని విధాలా శ్రేయస్కరమయింది. 1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి కార్గిల్ ప్రాంతాలు ఆక్రమించుకుంది. భారతీయ సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది.

డివిజన్, బ్రిగేడ్, బెటాలియన్, కంపెనీ, ప్లటూన్, సెక్షన్ అనేవి కొన్ని సైనిక విభాగాలు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సైన్యం - 13,00,000; రిజర్వ్ సైన్యం - 12,00,000; సైన్యం వనరులలో ప్రధాన యుద్ద ట్యాంకులు - 5000+; ఫిరంగులు - 12,800; బాల్లిస్టిక్ మిస్సైళ్ళు - 100; ఎయిర్ మిస్సైళ్ళు - 90,000; యుద్ద విమానాలు/వాహకాలు - 1130 ఉన్నాయి.....పూర్తి వ్యాసం: పాతవి

20వ వారం
అడోబీ ఫోటోషాప్ లేక ఫోటోషాప్, ఛాయా చిత్రాలు మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. దీనిని ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ది చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్. ప్రపంచములో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్ మరియూ ఫోటోఎడిటర్లకు ప్రామాణికమైన ఇమేజ్ ఎడిటింగ్ పరికరంగా ప్రసిద్ది చెందింది. ఏప్రిల్ 16, 2007న విడుదల చేయబడిన అడోబీ ఫొటోషాప్ సిఎస్3, ప్రస్తుతం లభ్యమవుతున్న తాజా వెర్షను.


1987లో అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో థామస్ నోల్ అనే పరిశోధనా విద్యార్థి, తన మ్యాకింటాష్ ప్లస్ కంప్యూటరులో, గ్రే స్కేల్ చిత్రాలను మొనోక్రోం (నలుపు తెలుపు రంగులు మాత్రమే) తెరపై కనిపించేలా ఒక ప్రోగ్రాం వ్రాయటం మొదలు పెట్టాడు. "డిస్ప్లే" అనే ఈ ప్రోగ్రామును థామస్ నోల్, మరియు అతని తమ్ముడు జాన్ నోల్ పూర్తి స్థాయి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్టువేరుగా మార్చి 1988లో "ఇమేజ్ ప్రో" అనే మొదటి ఎడిటింగ్ సాఫ్టువేరును తయారు చేసారు. దానిని ఫోటోషాప్ గా పేరుమార్చి, స్కానర్లు తయారు చేసే ఒక కంపెనీతో వారి స్కానర్ పరికరంతో పాటుగా పంపిణి చేసేట్టు ఒప్పందం కుదుర్చుకుని 200 ఫోటోషాప్ కాపీలు అమ్మగలిగారు. సెప్టెంబరు, 1988లో అడోబీ సంస్థ, ఫోటోషాప్ పంపిణీ హక్కులను కొనుక్కుంది.


తరువాత కొన్ని సంవత్సరములపాటు ఫొటోషాప్ ప్రోగ్రాముకు పనితీరుకు మరిన్ని హంగులను జోడించి, దానిని అభివృద్ధి పరుస్తూ కొత్త కొత్త వెర్షన్లను వుడుదల చేశారు. 2003 ఫిబ్రవరిలో, విడుదల చేసిన కెమెరా రా 1.x ప్లగిన్‌తో, వాడుకరులు తమ డిజిటలు కెమెరాల నుండి నేరుగా ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాన్ని కల్పించారు.


2004 అక్టోబరులో, ఈ ప్రోగ్రాముకు అడోబీ ఫొటోషాప్ CS అనే కొత్త పేరు పెట్టారు. అడోబీ సంస్థ విడుదల చేస్తున్న అడోబీ క్రియేటీవ్ స్యూట్‌లో ఫొటోషాప్ కూడా ఒక భాగం. ఫొటోషాప్‌ను సీ++ ప్రోగ్రామింగు భాషలో రూపొందించారు. అడోబి కంపెనీ వారు ఈ మధ్యనే ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్ పేరుతో ఆన్ లైన్ ఫోటో ఎడిటింగ్ సౌకర్యం కలిగించారు. ....పూర్తివ్యాసం: పాతవి

21వ వారం

శ్రీశైలము ప్రసిద్ధ శైవ క్షేత్రము. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. ఎందరో రాజులు, పురాణ పురుషులు సేవలు చేసిన మహాక్షేత్రం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.


శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు. క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి శ్రీశైల దేవాలయ ప్రాంతము, సున్నిపెంట ప్రాంతము, మండపాలు, పంచమఠాల ప్రాంతము, అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు. శ్రీమల్లికార్జునుని దేవాలయము అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. మనోహర గుండము తప్పకుండా చూడవలసిన వాటిలో ఒకటి. చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది.


శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. సాక్షి గణపతి ఆలయము ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు. శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ....పూర్తివ్యాసం: పాతవి

22వ వారం

చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానములను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. చలం 1894మే 18న మద్రాసు నగరంలో జన్మించాడు. చలం తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తన తాతగారు గుడిపాటి వేంకటరామయ్య దత్తత తీసుకోవడంతో, ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా పేరొందాడు.


చలం రచనలలో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. కాని, సమాజం అతన్ని అపార్థం చేసుకున్నది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథలలో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలను బహిరంగంగా చదవటానికి భయపడిన రోజులవి. ఆసక్తి గల పాఠకులు, చలం పుస్తకాలని దాచుకుని చదివేవారట. చలం తన కథలు, నవలలో వ్రాసిన విషయాలు అప్పటి సమాజం తట్టుకోలేక పోయినది. అతను సంఘంలో ఒక "విపరీత వ్యక్తి"గా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.


మైదానం, దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడ ఉన్నాయి కాని, అందులో వ్యంగ నాటికలు ఎక్కువ. చలం, శ్రీ శ్రీ వ్రాసిన మహాప్రస్థానంకు ముందుమాట వ్రాసాడు. మహాప్రస్థానంలొని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. ....పూర్తివ్యాసం: పాతవి

23వ వారం

శాతవాహనులు దక్షిణ మరియు మధ్య భారతదేశం ను ధరణికోట మరియు జున్నార్ ల నుండి పరిపాలించారు. వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది. ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ. 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది. పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర బృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.

ఆంధ్రులు మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత మరియు నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం. మౌర్య వంశ సామంతులుగా రాజకీయజీవితం ప్రారంభించిన శాతవాహనులు క్రీ.పూ. 232లో అశోకు ని మరణము తర్వాత స్వాతంత్ర్యము ప్రకటించుకొన్నారు. 'ఆంధ్ర' యొక్క ప్రస్తావన అల్ బెరూని (1030) వ్రాతలలో కూడా ఉన్నది. ఈయన దక్షిణ భారతదేశం లో మాట్లాడే భాష "ఆంధ్రి" అని వ్రాశాడు. ఈయన గ్రంథం కితాబుల్ హింద్ ఆనాటి ఆంధ్రదేశములోని కొన్ని ఆచారవ్యవహారాలను, సాంప్రదాయాలను వర్ణిస్తుంది.


క్రీ.పూ 230 ప్రాంతములో శాతవాహనులు స్వతంత్ర రాజులైన తర్వాత, వంశ స్థాపకుడైన శిముక మహారాష్ట్ర, మాల్వా మరియు మధ్య ప్రదేశ్ లోని కొంత భాగమును జయించాడు. ఈయన తర్వాత ఈయన సోదరుడు కన్హ (లేదా కృష్ణ) పాలన చేపట్టి రాజ్యాన్ని పశ్చిమాన మరియు దక్షిణాన మరింత విస్తరింప జేశాడు. కన్హ క్రీ.పూ 207 నుండి క్రీ.పూ 189 వరకు పరిపాలించాడు.

కన్హుని వారసుడైన మొదటి శాతకర్ణి ఉత్తర భారతదేశంలో శుంగ వంశము ను ఓడించి, అత్యంత వ్యయముతో అశ్వమేధం తో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈయన సమయానికి శాతవాహన వంశము సుస్థిరమై, మహారాష్ట్రలోని ప్రతిష్ఠానపురం (పైఠాన్ రాజధానిగా తన బలాన్ని దక్షిణభారతదేశమంతా వ్యాపించింది. పురాణాలు ఈ వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా ఇస్తున్నవి. అందులో చాలామంది వాళ్లు ముద్రింప జేసిన నాణేలు మరియు శాసనాల వల్లకూడా పరిచితులు.

....పూర్తివ్యాసం: పాతవి

24వ వారం

కొండా వెంకటప్పయ్య (1866-1949) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు. 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. తరువాత దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించాడు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాలకోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదానికేతన్‍కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పది వేల రూపాయల విరాళం ప్రకటించాడు.

1912 మే నెలలో నిడదవోలు రాజకీయ మహాసభలో కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు. 1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు ప్రధమాంధ్ర మహాసభ బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార వర్గంలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరు లో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించాడు. 1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే. కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయాడు.

కడలూరు జైలులో వున్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని రచించాడు. కొండా వెంకటప్పయ్య ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. స్వాతంత్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి ఆయన మహాత్మా గాంధీకి ఇలా రాసాడు. "మనం మనస్ఫూర్తిగా కోరుకొన్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధులలో నీతి నియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెసు అవినీతికి ఆలవాలమైపోతున్నది. .." ....పూర్తివ్యాసం: పాతవి

25వ వారం

కమ్యూనిజం ఒక రాజకీయ , సాంఘిక మరియు ఆర్థిక సిద్ధాంతం. కమ్యూనిజం అనే పదం 'అందరికీ చెందిన' అనే అర్థం వచ్చే కమ్యూనిస్ట్ అనే లాటిన్ పదం నుండి వచ్చినది. కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం వర్గ, ఆర్థిక మరియు సామాజిక తారతమ్యాలు లేని ఒక నూతన సమాజ స్థాపన. ఉత్పత్తికేంద్రాల మరియు వనరుల ఉమ్మడి యాజమాన్యం అనేది కమ్యూనిజం మూలసూత్రం. కమ్యూనిజం అనునది సోషలిజం యొక్క అత్యుత్తమ దశ అని కూదా ఒక అభిప్రాయం ఉన్నది. ఇది ఒక జీవన విధానమని చెప్పవచ్చును. మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నిక అయిన సభ్యులు ప్రాన్స్ దేశానికి చెందినవారు. అలా ఎన్నికయిన కమ్యూనిస్ట్ ప్రతినిధులు, శాసన సభలో స్పీకరుకు ఎడమ వైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటయునది. అసమానతలను పొగొట్టె అవకాశాలను పొందుపరిచి తద్వారా మానవుడి సంఘ జీవన విధానాన్ని 'సంస్కరించే' ప్రయత్నమే కమ్యూనిజం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నంలో కావలిసిన మార్పులు 'ప్రజా విప్లవం' ద్వారానే సాధ్యం అని కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు అభిప్రాయపడతారు.


శతాబ్దాలనుండి అనేక మంది తత్వవేత్తలు, సంస్కర్తలు ఉమ్మడి యాజమాన్యం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లాంటి సామ్యవాద ఆదర్శాల గురించి విస్తృతంగా వ్రాశారు చర్చ చేశారు. ఈ భావాలన్నింటినీ జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్1848లో రచించిన కమ్యూనిష్టు ప్రణాళికలో మొట్టమొదటిసారి వెల్లడించారు. సంతోషకరమైన, సామరస్య పూర్వకమైన సమాజాన్ని నిర్మించుటకు శ్రామికులను విప్లవోన్ముఖులను చేయటమొక్కటే మార్గమని మార్క్స్ యోచించాడు. సామ్యవాద విజయం అనివార్యమని మార్క్స్ విశ్వసించాడు. చరిత్ర కొన్ని స్థిరమైన నియమాలను అనుసరించి ఒక దశనుండి తరువాత దశకు పురోగమిస్తుంది అని బోధించాడు. ప్రతి దశ సంఘర్షణల మయమై వాటిద్వారానే ఉన్నతదశలకు చేరుకుని అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో సామాజిక అభివృద్ధి యొక్క అత్యున్నత మరియు ఆఖరి దశ సామ్యవాదం అని మార్క్స్ ప్రకటించాడు. పాలక వర్గం తనంతట తానుగా ఎప్పుడూ తన అధికారాన్ని వదులుకోదు కనుక సంఘర్షణ, హింస అనివార్యం. శ్రామిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థ మీద తిరగబడి పరిశ్రమలను, ప్రభుత్వాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటుంది.


ఈ ప్రతిపాదనలనుండి, రష్యాకు చెందిన వి.ఐ.లెనిన్, కమ్యూనిజం ను ఒక రాజకీయ ఉద్యమముగా విప్లవ రూపాన్ని అభివృద్ది చేశాడు, తద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతమును సామాన్య ప్రజల స్తాయికి తీసుకుని వెళ్ళడంలో సలీకృతుడయ్యాడు. ....పూర్తివ్యాసం: పాతవి

26వ వారం

యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము. ఒకప్పుడు ఎల్లయ్య అనే పశువుల కాపరి అక్కడ పశువులు మేయడానికి మంచి గడ్డి దొరుకుతుందని కనుగొన్నాడు. అలా అక్కడ జనులు స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది. ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్థులు చెప్పుకుంటారు.

1946 ముందే చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, పెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో కూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉన్నాయి. 1946 తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.

గ్రామములోని వివిద ప్రాంతాలు - చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం(యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం(రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ, చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్,మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు.

1933, డిసెంబర్ 30న మహాత్మా గాంధీ, 1935, నవంబర్ 12న బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ వూరిని సందర్శించారు.. ...పూర్తివ్యాసం: పాతవి

27వ వారం

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా.


హిందూ మతంపై శంకరుని ప్రభావం అసమానమైనది. శంకరుడు సాధించిన ప్రధాన విజయాలు: (1) బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. (2) ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. (3) శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి. (4) గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.


నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరుడు జన్మించాడు. కాలడి ఇప్పటి త్రిచూర్ సమీపంలో ఉంది. తల్లి అంగీకారం తీసుకుని శంకరుడు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులను దర్శించాడు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నాడు. తరువాత దేశమంతటా పర్యటించి పండితులను వాదనలో ఓడించి తన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడాన్ని "శంకర దిగ్విజయం" అంటారు. అనంతరం కాష్మీర దేశం శారదా మందిరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాడు.


శంకరుడు స్థాపించిన మఠాలను చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, వందల సంవత్సరాల నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఏ ప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించాడో తెలుస్తుంది. ......పూర్తివ్యాసం: పాతవి

28వ వారం

హామ్ రేడియో ఒక అభిరుచి. ఖాళీ సమయాలలో తమకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞావంతో, స్వయంగా రేడియో ట్రాన్సీవరు - తయారు చేసి, తమలాంటి ఇతరులతో ఆ రేడియో ద్వారా సంభాషించటమే ఈ అభిరుచి. ప్రారంభ కాలంలో, స్వయంగా సెట్ తయారు చేసుకోగలిగేవారు మాత్రమే ఈ అభిరుచి చూపగలిగేవారు. కాలక్రమేణా ఇతరులు తయారు చేసిన సెట్లు లేదా మార్కెట్‌లో కొనుక్కొని ఈ అభిరుచిని కొనసాగించటం మొదలు పెట్టారు. హామ్ (H A M) అనే పదం ఎలా వచ్చిందో అన్న విషయం మీద చాలా రకాల వివరణలు ఉన్నయి - Home Amateur Mechanic కు పొడి అక్షరాలే HAM అని ఒక వివరణ. అలాగే సుప్రసిద్ద రేడియో సాంకేతిక నిపుణులు, శాస్త్రజ్ఞులు అయిన Hertz, Armstrong (చంద్రుడిమీద దిగిన ఆయన కాదు) మరియు Marconi ల పేర్లలో మొదటి అక్షరాలతో HAM అని వచ్చిందని మరొక వాదన.


హామ్‌లు తమ రేడియో తయారీ, వారున్న ప్రదేశంలో వాతావరణం వంటి విషయాలు మాట్లాడుకుంటారు. సాంకేతిక అనుభవాలు పంచుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు - తుఫాన్లు, భూకంపాలు మొదలగునవి- సంభవించినప్పుడు, సాధారణ సమాచార సాధనాలు పనిచేయని పరిస్తితులలో హామ్ రేడియో ద్వారా సమాచారం ఒక చోట నుండి మరొకచోటికి పంపటం తేలిక. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం "హామ్ క్లబ్ స్టేషన్" లను ఏర్పరిచి ప్రోత్సహిస్తున్నది. రాజకీయాలు, మత సంబంధ విషయాలు, డబ్బుల గురించి, వ్యాపార సంబంధమయిన విషయాలు, అసభ్య విషయాల గురించి మాట్లాడటం హామ్‌లో పూర్తిగా నిషేధం.


ఎక్కువ ఫ్రీక్వెన్సీ (HF) సుదూర ప్రాంతాలతో మాట్లాడేందుకు వాడతారు. అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ (VHF) స్థానికంగా 20-30 కిలోమీటర్ల పరిధిలో వాడతారు. రేడియోలో సంభాషించటానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వంలోని కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ వారు పరీక్ష నిర్వహించి, అందులో ఉతీర్ణులైన వారికి, పోలీసు దర్యాప్తు తరువాత ఒక లైసెన్సు ఇస్తారు. హామ్ లైసెన్సులో ఆ హామ్‌కు ఇవ్వబడ్డ ప్రత్యేక సంకేతనామము ఉంటంది. ప్రపంచములోని అన్ని దేశాలూ కూడా ఒక ఒప్పందమునకు వచ్చి, దేశములన్నిటికి కూడా ఒక నిర్దిష్ట సంకేత నామమును ఇచ్చుకొన్నారు. తెలుగు వారిలో హామ్‌లు చాలామంది, పట్టణాలలోనే కాకుండా చిన్న ఊళ్ళలో కూడా ఉన్నారు. వీరిలో అధికంగా తమ సొంత సెట్లు తయారు చేసుకొని "బ్యాండు లోకి" (హామ్ పరిభాషలో ఈ హాబీలోకి వచ్చి ఇతరులతో సంభాషణ మొదలుపెట్టటం) వచ్చినవారే. ......పూర్తివ్యాసం: పాతవి

29వ వారం

యానాం విమోచనోద్యమం - 'యానాం, గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరితో అనుసంధానింపబడి ఉంటుంది. పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానాంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954లో స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి. యానాం విమోచనం జూన్ 13, 1954న చర్చల ద్వారా, అహింసాయుత పద్దతుల ద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటి నాలుగు ఫ్రెంచి కాలనీలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమే.


ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది ఫ్రెంచి పాలనా దాశ్య సృంఖలాలనుండి విముక్తమై స్వాతంత్ర్య భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహోద్యమము. భారత ప్రభుత్వము యానాం విమోచనాన్ని స్వాగతించదగిన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది. భారత ప్రభుత్వం తన దేశ భక్తులతో చేయించిన ముట్టడిగా దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది. యానాం నాయకులు ఆంధ్రా ప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానాం విమోచనం చెందిందని ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు.


ఈ మహత్కార్యాన్ని భుజాన వేసుకొన్న నాయకులు ఈ ఉద్యమాన్ని శాంతియుత, ప్రజాస్వామ్యయుతంగా నడిపించిన తీరు అనన్యమైనది. వారి దార్శనికత అత్యంత ఉన్నతమైనది. ఫ్రెంచి ప్రభుత్వం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే తన మూడు సూత్రాలకు అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ప్రజలు ఫ్రెంచి వారి పట్ల మమకారాన్ని ఏర్పరచుకున్నారు. తమ పొరుగు ప్రాంతంలో బ్రిటీష్ వారు సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారిపట్ల ప్రేమను బలోపేతం చేసింది. అందుచేత తరతరాలుగా జీర్ణించుకున్న "సంస్కృతి" వలన ఉన్నపళంగా బయటకు వచ్చేయడం అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని కొంతమంది తమ ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మద్య సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ......పూర్తివ్యాసం: పాతవి

30వ వారం

రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఒక చిన్న ద్వీపం, దేశం, నగరం కూడాను. 704 చదరపు కిలోమీటర్లతో దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది జాలర్లు నివసించు గ్రామం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాను ఆక్రమించింది, 1945 సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.


స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా మెరుగుపడింది. ఒక ఆధునిక ఆర్ధికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. ధనవంతమైన జీవన శైలి ప్రకారముఆసియాలో అతి ఉత్తమమైనది, ప్రపంచములో 11వ స్థానంలో ఉంది. సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు, మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీనివాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజంగా సంభవిస్తూ ఉంటాయి


సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్ధిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. పర్యాటకులకు నైట్ సఫారీ , పక్షుల పార్క్, వంటి ఎన్నో ఆకర్షణలున్నాయి. సెంటోసా ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. ఇక్కడ చూడవలసిన వాటిలో ఆండర్ సీ వరల్డ్, లిటిల్ ఇండియా, చైనాటౌన్, సారంగన్ రోడ్ కూడా ప్రధానమైనవి. ......పూర్తివ్యాసం: పాతవి

31వ వారం

క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని వేంగి రాజ్యం అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని వేంగి నగరం లేదా విజయవేంగి అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం పెదవేగి అనే చిన్న గ్రామం. ఇది పశ్చిమగోదావరి జిల్లా లో ఏలూరు పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.


వేంగి రాజ్యం ఉత్తరాన గోదావరి నది, ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన కృష్ణానది మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. చిలుకూరు వీరభద్రరావు, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, డి.సి.సర్కార్, Dr.Hultzsch, Dr.Fleet, Col.Todd, మల్లంపల్లి సోమశేఖర శర్మ, డా.గోపాలాచారి వంటి ప్రముఖ చరిత్రకారులు వేంగి రాజ్యం చరిత్రను అధ్యయనం చేశారు.


బృహత్పలాయనులు, ఇక్ష్వాకుల తరువాతి కాలం (క్రీ.శ.300)లో వేంగినగరం లేదా ఏలూరు లేదా దెందులూరు రాజధానిగా పాలించారు. శాలంకాయనులు క్రీ.శ. 300 420 మధ్యకాలంలో వేంగినగరం రాజధానిగా ఏలారు. విష్ణుకుండినులు క్రీ.శ. 375 - 555 - వీరి రాజధాని "శ్రీపర్వత ప్రాంతం"లో ఉండేది. తరువాత వేంగి సమీపంలోని "దెందులూరు" . తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి 1160 వరకు పాలించారు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగు భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా (కొన్ని యుద్ధాలలో వేంగి ప్రాంతాన్ని కోల్పోవడం వలన) తూర్పు చాళుక్యుల చివరి రాజులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు. చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. వేంగి, ధరణికోట, యనమదల, కంభం, నెల్లూరు వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి ......పూర్తివ్యాసం: పాతవి

32వ వారం

నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకమునుపు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇతను జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయనను గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు.


ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్ధులనుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్ధన లభించింది.


మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే వూరిలో 18 జూలై 1918న జన్మించాడు. మండేలా తండ్రి "గాడ్లా" కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. గాడ్లా 3వ భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని పేరు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం "ఉమ్జీ"లో అధికంగా గడచింది. ......పూర్తివ్యాసం: పాతవి

33వ వారం

రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్ధిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.


సుమారు ఆరు కోట్లమంది మృతికి కారణమయిన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్త సిక్తమయినదిగా పేరొందింది. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో మూడింట రెండు వంతులు సాధారణ పౌరులేనని ఒక అంచనా. వీరిలో సుమారు ఒక కోటిమంది వరకూ తూర్పు ఐరోపాలోనూ సోవియెట్ యూనియన్ లోనూ నాజీ జర్మనీ జరిపిన యూదు జాతి నిర్మూలన కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. (దీనికే హోలోకాస్ట్ అని పేరు). ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం కలిగించిన ఆర్ధిక నష్టం సుమారు పది లక్షల కోట్ల అమెరిన్ డాలర్లు (1944 నాటి డాలరు విలువ ప్రకారం) ఉంటుందని అంచనా.


1945లో మిత్ర రాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ సమాఖ్య యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో రెండు అగ్ర రాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగి, 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమయింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. కాగా, ఈ యుద్ధం రగిల్చిన స్వతంత్ర కాంక్ష కారణంగా అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఐరోపా వలస వాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచి ఆయా దేశాలు అనతి కాలంలోనే స్వాతంత్ర్యాన్ని పొందాయి. ......పూర్తివ్యాసం: పాతవి

34వ వారం

ముల్లా నస్రుద్దీన్, ఒక సూఫీ, కవి, పండితుడు మరియు హాస్యభరితమైన విద్వాంసుడు. ఇతడు మధ్య యుగంలో 13వ శతాబ్దంలో అక్సెహీర్ మరియు కోన్యా లలో సెల్జుక్‌ల కాలంలో జీవించాడు. కానీ దగ్గరి తూర్పు దేశాలు, మధ్యప్రాచ్యము, మరియు మధ్య ఆసియా దేశాలు, ఉజ్బెగ్ లు ముల్లా నస్రుద్దీన్ తమ వాడేనంటూ చెప్పుకొంటారు. ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి - "హోద్జా", ముల్లాహ్ లేదా ఎఫెందీ వంటివి. ఉయిఘుర్ టర్కీ ప్రజలలో జానపద హీరో. చైనా లో కూడా ఆఫందీ లేదా ఎఫెంటీ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ముల్లా నస్రుద్దీన్ అనటోలియా లో జీవించాడు; 13వ శతాబ్దంలో 'సివ్రీహిసార్' లోని 'హోర్తూ' గ్రామంలో జన్మించాడు. తరువాత, అక్సెహీర్ లో స్థిరనివాసమేర్పరచుకొన్నాడు, తరువాత 'కోన్యా' కు తన నివాసాన్ని మార్చి అక్కడే మరణించాడు.


నస్రుద్దీన్ పనులను చూసి ఎవరైనా ఇతనికి పిచ్చివాని క్రింద జమకట్టేవారు. కాని ఇతని చేష్టల హేతువులను చూసి పండితులు సైతం ముక్కు మీద వేలేసుకొనేవారు. ఇతను తను చేసే ప్రతి పనినీ లేదా సంభాషణనూ హేతువుతోనూ తర్కంతోనూ చేసేవాడు. సాదా సీదా జీవనం గడిపిననూ వేదాంతిగా, హాస్యరసజ్ఞుడిగా, ఛలోక్తులు విసిరేవాడిగా, విమర్శకులను సైతం మాటలుడిగేలా చేసేవాడు. ఆధునిక కాలంలో ఇతని గురించి అనేక కథలూ, వివిధ తరగతులలో పాఠ్యాంశాలలోనూ చూడవచ్చును. తెలుగులోనూ అనేక కథలు చూడవచ్చును. ఇతని పాత్ర చిత్రణ వివిధ భాషలలో, జానపదాలలోనూ, కథలలోనూ, హాస్య సాహిత్యాలలోనూ చూడవచ్చును. నస్రుద్దీన్ కథలు ప్రపంచ మంతటా ప్రసిద్ధి, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో. నస్రుద్దీన్ కథలు వ్యంగమునకు వ్యంగోక్తులకు, హాస్యమునకు, తర్కము మరియు విజ్ఞానానికి మచ్చు తునకలు. కడుపుబ్బ నవ్వించే ఇతని కథలు, ముల్లా దో పియాజా, బీర్బల్ , తెనాలి రామకృష్ణ లను గుర్తుకు తెస్తాయి.


"అంతర్జాతీయ నస్రుద్దీన్ హోద్జా ఉత్సవాలు" అక్సెహీర్ లో ప్రతి సంవత్సరము జూలై 5-10 వరకూ జరుగుతాయి. ఇతడి కథలలో సూఫీతత్వము, వేదాంతము కానవస్తుంది. ఈ కథలకు చెందిన అతిప్రాచీన వ్రాత ప్రతి 1571 లో కనుగొనబడింది. ఇతని గౌరవార్థం, యునెస్కో వారు 1996-1997 వ సంవత్సరాన్ని, "అంతర్జాతీయ నస్రుద్దీన్ సంవత్సరం" గా ప్రకటించారు. ......పూర్తివ్యాసం: పాతవి

35వ వారం

తాండూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మండలము. పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు మరియు వ్యవసాయపరంగా కందులకు ప్రసిద్ది. 2001 జనాభా లెక్కల ప్రకారం తాంఢూరు పట్టణం జనాభా 57,943. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 50 వేలు జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడ వస్తుంది. తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కాగ్నానది ఉంటుంది, ఇది మూసీ నదికి ఉపనది. ఈ నది నుండి మహబూబ్ నగర్లోని కోడంగల్ మున్నగు ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు.


నల్లరేగడి భూముల్లో పెరిగే కంది పంటకు ఇక్కడి భూములు అనువుగా ఉండటంతో పంట ఉత్పత్తి బాగుగా ఉంటుంది. పూర్తిగా ఎండని, కాయ దశలోనే ఉన్న కంది కాయలను రైతులు మార్కెట్ లో తెచ్చి అమ్మడం, దాన్ని ఉప్పు వేసిన నీటిలో ఉడకబెట్టి దాని విత్తులను తినడం ఇక్కడ మాత్రమే కన్పించే అపురూప దృశ్యం. కల్తీ లేని స్వచ్ఛమైన కందులకు ఇక్కడి మార్కెట్ ప్రసిద్ధి. పరిసర ప్రాంతాలలో కూడ తాండూరు కందికి విపరీతమైన డిమాండు ఉంది.

ఇక్కడి నుండి భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు వాడే నాపరాయి షోలాపూర్, ముంబాయి, హైదరాబాదు మున్నగు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. గనుల నుంచి ముడి రాళ్ళను తీయడం ఒక ఎత్తయితే దానికి మెరుగులు దిద్ది భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు అనువైన రీతిలో మలచడం మరో ఎత్తు. తాండూర్ పట్టణములోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా ఈ పరిశ్రమ విస్తరించి ఉన్నది. సిరిగిరిపేట్, ఓగిపూర్, మల్కాపూర్, కరణ్‌కోట్, బషీరాబాద్‌ ప్రాంతాలలో నాపరాతి గనులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. తాండూరులో రెండు సిమెంటు కర్మాగారాలున్నాయి.

1953 కు పూర్వం ఇది నిజాం రాష్ట్రం లో భాగంగా ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1953 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాదు జిల్లాలో కలిసింది. 1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో భాగమై 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. 1978 లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంతో ఇది ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది.

......పూర్తివ్యాసం: పాతవి

36వ వారం

స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. ఇతను 1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.


1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. అప్పుడు NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.


ఆపిల్ డైరక్టర్లు NeXTను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పటి ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగాడు.


1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. పిక్సర్-డిస్నీ సహయత్నంగా మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ గొప్ప లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి. ......పూర్తివ్యాసం: పాతవి

37వ వారం

భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు భారత క్రికెట్ జట్టు అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది. భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్ లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించినది. 1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ మరియు దులీప్ సింహ్ జీ. 1926లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. 1932లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ సి.కె.నాయుడు నేతృత్వంలో ఇంగ్లాండుతో ఆడింది.


టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు తొలి విజయం 1952లో ఇంగ్లాండుపై చెన్నైలో లభించింది. ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ పై తొలి సీరీస్ విజయం సాధించింది. 1950 దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. 1970 దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట రాఘవన్ లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్లు (సునీల్ గవాస్కర్ మరియు గుండప్ప విశ్వనాథ్ లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. 1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు మరియు వెస్ట్‌ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.


1971లో వన్‌డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. 1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది. ......పూర్తివ్యాసం: పాతవి

38వ వారం

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.


పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పటమటపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.


మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును వ్యతిరేకించాడు. ......పూర్తివ్యాసం: పాతవి

39వ వారం

స్వామీ వివేకానంద, (జనవరి 12, 1863 - జూలై 4, 1902), ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.


భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం(పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిదేళ్ళ వయసు లోనే మరణించాడు.


వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని బోధనల ప్రకారం అద్వైత వేదాంతము తత్త్వ శాస్త్రములోనే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. "దరిద్ర నారాయణ సేవ" అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అతని సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతని జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది. ......పూర్తివ్యాసం: పాతవి

40వ వారం

టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912 లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 15, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అతి దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.


దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ అది మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఆతరువాత కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వం లో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.

టైటానిక్ నౌక మొట్టమొదట మరియు చిట్టచివరి ప్రయాణం ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్.జె.స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. ఆరోజు దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. రాత్రి సమయంలో టైటానిక్ నౌక పర్వతాన్ని గుద్దుకోవడంలో నౌక కుడి వైపు 300 అడుగుల పొడవు మేరకు రాపిడికి గురై రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లు ఉన్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపడలేదు. ......పూర్తివ్యాసం: పాతవి

41వ వారం

బంగాళదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము. 17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారత దేశమునకు బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.


బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చినది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఇంకా పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది. ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది. వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం.......పూర్తివ్యాసం: పాతవి

42వ వారం

మక్కాహ్ ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంది. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) ఉంది. ఈ మస్జిద్ లోనే పరమ పవిత్రమైన కాబా గృహం ఉంది. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. నగరం జనాభా 1,294,167. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్రకొరకు ఈనగరానికి విచ్చేస్తారు. ముస్లిమేతరులకు ఈనగరంలోని కాబాలో మాత్రం ప్రవేశం నిషిద్ధం. ఈనగరంలో వేలాది ముస్లిమేతరుల కుటుంబాలు నివశిస్తున్నాయి.


హజ్ మరియు ఉమ్రా కొరకు గల రవాణాసౌకర్యాలు పెద్దవి. మక్కాలో విమానాశ్రయం లేదు. జెద్దాలోని '[[కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం' ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చును. మక్కాలో జనసాంద్రత ఎక్కువ. అతిప్రాచీన జనావాసం పాతబస్తీలో ఉంది. ఎక్కువమంది హజ్ పరిశ్రమ లో పనిచేసేవారే. వీరెప్పుడూ హజ్ కొరకు తయారుగా వుంటారు. ప్రతియేటా దాదాపు 40 లక్షలమంది ముస్లింలు హజ్ కొరకు మక్కా సందర్శిస్తారు


కాబాగృహం చతురస్రాకారపు నిర్మాణం, దీనిచుట్టూ మస్జిద్-అల్-హరామ్ ఉంది. దీని నిర్మాణం దాదాపు హిజ్రీ పూర్వం 3000 జరిగినది. పూర్వం కాబా గృహంలో దాదాపు 360 విగ్రహాలుండేవి. ఈ విగ్రహాలలో లాత్, మనాత్, హుబల్ మరియు దులిల్ లు ప్రసిధ్ధి. మక్కా మరియు సౌదీ అరేబియాలోగల సంచార జాతులన్నీ ఈ విగ్రహారాధన చేసేవి. 360 విగ్రహాలలో ఈసా మరియు మరియమ్ విగ్రహాలు కూడా ఉండేవని ప్రతీతి. .......పూర్తివ్యాసం: పాతవి

43వ వారం

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్. తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇంటివద్దనే క్రమశిక్షణతో లెక్కలు, చరిత్ర, భూగోళ శాస్త్రం, చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు, సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొన్నాడు. మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు. ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు.

రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవంత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. "విశ్వకవి" అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి.

రవీంద్రుడు ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా రచన ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు వంటి నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు. రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖ నేర్పర్చిన వాడు రవీంద్రుడు.. .......పూర్తివ్యాసం: పాతవి

44వ వారం

మహబూబ్‌ నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో విస్తీర్ణం పరంగా అతిపెద్దది. 18,432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. అమ్రాబాదు గుట్టలు జిల్లా ఆగ్నేయాన విస్తరించాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35 లక్షలు. ఈ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. డిసెంబరు 4, 1890న అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.


ఈ జిల్లాలో 1,553 రెవెన్యూ గ్రామాలు, 1,347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 13 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు (పునర్విభజన ప్రకారం 14 స్థానాలు) ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం తక్కువ. పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. అక్ష్యరాస్యత కూడా తక్కువ. సామాజికంగా, ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందవలసి ఉంది.


తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణ సమీపాన సుమారు 700 సంవత్సరాల వయస్సు కల్గిన ఒక మహావృక్షం ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ ఎంపికైనది. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. .....పూర్తివ్యాసం: పాతవి

45వ వారం

అమరావతి, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన ఉన్నది. అమరావతికి సమీపంలోని ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ఆ కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. అప్పటి అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ స్తూపము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.


స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు - ఒక వేదిక, దానిపైన అర్ధ గోళాకృతి అండము, అండముపై ఒక హర్మిక, దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము, అండము, హర్మికల మధ్య గళము, చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు. మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిధిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 1700 నాటికి స్తూపము శిధిలావస్థకు చేరుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. "దీపాలదిన్నె" గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.


ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. అమరావతి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట. అమరావతి శిల్ప కళారీతి శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని విర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం. .....పూర్తివ్యాసం: పాతవి

46వ వారం

అబ్‌ఖజియా కాకస్ పర్వతాల ప్రాంతంలో ఉన్న ఒక భూభాగం. ఇది దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగిన గణతంత్ర దేశం. కాని అంతర్జాతీయంగా దీనికి దేశంగా గుర్తింపులేదు. ఒక్క జార్జియా దేశం మాత్రం అబ్‌ఖజియాను గుర్తించింది. అబ్‌ఖజియా దేశం పూర్తిగా జార్జియా సరిహద్దుల లోపల ఉన్నది. పశ్చిమాన నల్ల సముద్రం, ఉత్తరాన రష్యా అబ్‌ఖజియాకు సరిహద్దులు. ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు అబ్‌ఖజియాను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు.


1992-1993 మధ్యకాలంలో జార్జియా నుండి జరిగిన వేర్పాటు ఉద్యమంలో జార్జియా మిలిటరీ ఓడిపోయింది. అబ్‌ఖజియా ప్రాంతంనుండి ఇతర జాతులవాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. 1994లో యుద్ధవిరమణ జరిగింది. అయినా ఇప్పటికీ వివాదం పరిష్కారమవలేదు. రష్యా అండ ఉన్న వేర్పాటువాదులు మొత్తం భూభాగంలో 83%పై అధిపత్యం కలిగిఉన్నారు (de-facto Government). మిగిలిన 17% భూభాగంపై అధిపత్యం కలిగి ఉన్న పార్టీలు 'కొడోరి లోయ'నుండి తమ పాలన సాగిస్తున్నారు. ఈ (17% పాలన) సముదాయానికే అబ్‌ఖజియాలో న్యాయపరమైన పాలకులుగా గుర్తింపు ఉన్నది. (de-jure Government). ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ కమ్యూనిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు అబ్‌ఖజియాను జార్జియా దేశంలో ఒక అంతర్గత భాగంగా మాత్రమే గుర్తిస్తున్నాయి. జార్జియా, అబ్‌ఖజియాలు తమ మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొని తమ స్థితిని స్పష్టం చేయాలని ఐ.రా.స. కోరుతున్నది.


మొత్తం 8,600 చ.కి.మీ. వైశాల్యం గల అబ్‌ఖజియా దేశం ప్రధానంగా పర్వతమయమైనది. కాకస్ పర్వతాలలో విస్తరించి ఉన్నది. చాలా పర్వత శిఖరాలు 4,000 మీటర్లు పైబడి ఎత్తు గలవి. నల్ల సముద్రం తీరాన మైదాన ప్రాంతాలనుండి ఉత్తరాన శాశ్వత హిమమయమైన లోయలవరకు వైవిధ్యం గల భౌగోళిక స్వరూపం ఉన్నది. మైదాన ప్రాంతాలలో సాగు అయ్యే తేయాకు, పొగాకు, ద్రాక్ష, ఇతర పండ్ల తోటలు అబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలు. కాకస్ పర్వతాలనుండి సముద్రంలోకి ప్రవహించే చిన్న చిన్న నదులు వ్యవసాయానికి ప్రధానమైన నీటివనరులు. అబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థ రష్యాతో గాఢంగా ముడిపడి ఉంది. .....పూర్తివ్యాసం: పాతవి

47వ వారం

మొసలి సరీసృపాల జాతికి చెందిన ఒక జంతువు. ఇది "క్రోకడైలిడే" అనబడే కుటుంబానికి చెందినది. స్థూలంగా దీనిని క్రోకడీలియా అనే క్రమంలో వర్గీకరస్తారు. crocodiles, alligators, caimans, gharial అనే జంతువులు ఈ "క్రోకడీలియా" అనే క్రమంలోకే చెందుతాయి. మొసళ్ళు ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఉష్ణమండలపు తేమ ప్రాంతాలలో ఉండే పెద్ద జలచరాలుగా జీవించే సరీసృపాలు. అధికంగా ఇవి సరస్సులు, నదులు వంటి మంచి నీటి స్థలాలలోను, అరుదుగా ఉప్పునీటి కయ్యలలోను ఉంటుంటాయి. మొసళ్ళు భూమిమీద 200 మిలియన్ సంవత్సరాల క్రితంనుండి ఉన్నాయని అంచనా. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. బ్రతికి ఉన్న మొసళ్ళలో అతి పెద్దది ఒరిస్సాలో "భైతర్కనికా వన్యప్రాణి సంరక్షణావనంలో ఉంది. దీని పొడవు 7.1 మిటర్లు (25.3 అడుగులు). ఇది జూన్ 2006లో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది.


కొద్ది దూరాల ప్రయాణంలో మొసళ్ళు వేగంగానే కదలగలవు. వాటి దవడలు చాలా శక్తివంతమైనవి. వాటి నోటికి అందిన జంతువులను పటపట విరిచేసే శక్తి ఈ దవడల ద్వారా వాటికి లభిస్తుంది. అన్ని జంతువుల కంటే మొసళ్ళ దవడల బలం చాలా ఎక్కువ. దాని నోటిపట్టు చదరపు అంగుళానికి 5,000 పౌండుల బలాన్ని కలిగిస్తుంది. మొసళ్ళ పళ్ళు చాలా పదునైన రంపాలలాగా ఉంటాయి. చేపలను ముక్కలు ముక్కలుగా చేయడానికి వీలైనవి. పరిణామ క్రమంలో వేటను ఇంత బలంగా పట్టుకోవడానికి రూపొందిన మొసళ్ళ దవడ కండరాలకు నోటిని తెరిచేప్పుడు లభించే శక్తి మాత్రం చాలా తక్కువ. వాటి నోరు గట్టిగా మూసి పట్టుకొంటే అవి నోరు తెరువలేవు.


పెద్ద జాతి మొసళ్ళు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. వాటి "నడక" వేగం కంటే మెరుపులా మీదపడే లక్షణం వల్ల మనుషులకు తప్పించుకొనే అవకాశం చాలా తక్కువ. వీటిలో ఉప్పు నీటి మొసలి మరియు నైల్ మొసలి యేటా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో వందలాది మనుషుల మరణాలకు కారణమవుతున్నాయి. మగ్గర్ మొసలి మరియు నల్ల కెయ్‌మన్ కూడా చాలా ప్రమాదకరమైనవి. అమెరికన్ ఎలిగేటర్ అంత ప్రమాదకరమైనది కాదు. రెచ్చగొడితే తప్ప తనంత తనుగా ఇది మనుషులపై దాడి చేయదు. .....పూర్తివ్యాసం: పాతవి

48వ వారం

అంజు బాబీ జార్జ్ ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు. అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం మరియు పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీ లో జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది. నేపాల్‌లో రజత పతకం సాధించింది. 2001లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ కాంస్యపతకం గెల్చింది. ఆ తర్వాత బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది.


2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2005లో దక్షిణ కొరియాలో 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008లో దోహాలో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు. .....పూర్తివ్యాసం: పాతవి

49వ వారం

చికాగో అమెరికాలోని ఇల్లనోయ్ రాష్టంలో ఒక నగరం. అమెరికాలో 3వ అతిపెద్ద నగరం. ఇల్లనోయ్, విస్‌కాన్‌సిన్ మరియు ఇండియానా లతో కలిపి చికాగో నగరపాలిత ప్రాంత జనాభా 9.7 మిలియన్లు. అంతర్జాతీయంగా చికాగోకు కల ప్రాముఖ్యత, ఈ నగరాన్ని అల్ఫా వరల్డ్ సిటీ జాబితాలోకి చేర్చింది. 1837 నుండి చికాగో నగరాల జాబితాలోకి చేరింది. మిసిసీపీ నది తీరాన ఉండటం వలన వ్యాపారానికి అనువైన జలమార్గాలు, సరస్సులు మొదలైన నీటి వనరులు చికాగోను అతి త్వరిత గతిని అభివృద్ధి పధానికి నడిపాయి. మిడ్‌వెస్ట్ (మద్య పశ్చిమ ప్రాంతం)కు ప్రస్తుతం చికాగో రవాణాకు, ఆర్ధిక రంగానికి మరియు సాంస్కృతికంగా ప్రముఖ కేంద్రం.

చికాగో ఆర్ధికాభివృద్ధి మిచిగాన్ సరసుతో ముడిపడి ఉంటుంది. చికాగో నగర జలరవాణా ఎక్కువగా చికాగో నదిపై జరుగుతున్న కాలంలో,ఇప్పటి పెద్దసంస్థ అయిన లేక్ ఫ్రైటర్స్ మాత్రం నగరానికి దక్షిణ తీరంలో ఉన్న లేక్ కల్మెట్ హార్బర్‌ ని వాడుకుంటూ వచ్చింది. సరసు కారణంగా చికాగో వాతావరణం అనుకూలంగా కొంత హాయిని కొల్పేదిగా ఉంటుంది. చికాగో నగరం ఎదుర్కొన్న భయంకర అగ్ని ప్రమాదం నగరంలో అత్యంత అధునాతన భవన నిర్మాణ విప్లవవానికి నాంది పలికింది. చరిత్ర జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసిన ఈ అగ్ని ప్రమాదం దేశం గర్వించదగిన భవనాలు ఈ నగరంలో రూపుదిద్దుకోవడానికి దోహదమైంది.

చికాగో నగరం విధ విధమైన వంటకాలకు ప్రసిద్ది. ఇక్కడ స్థిరపడిన ప్రజల విభిన్న జాతీయతే ఇందుకు కారణం. చికాగోలో దేశమంతా ప్రబలమైన డీప్ డిష్ పీజా ఎంత ప్రసిద్దమో చికాగో నగర ప్రత్యేకమైన తిన్‌క్రస్ట్ పీజా కూడా అంత ప్రసిద్దమే. ప్రపంచంలో ధనిక నగరాలలో చికాగో 10 వ స్థానంలో ఉంది. వాణిజ్య కేంద్రాలలో ప్రంచంలో చికాగో 4 వ స్థానంలో ఉంది. .....పూర్తివ్యాసం: పాతవి

50వ వారం

తెలుగులో సినిమా 1931 సంవత్సరంలో మొదలయినప్పటి నుండినేటి వరకూ అనేక వందల సినిమాలు తియ్యబడ్డాయి. అలా తీయబడ్డ సినిమాలు, ఆ సినిమాలు తీసిన దర్శకులు, అందులో నటించిన నటీనటులు-కథా నాయకీ నాయకులు, ప్రతినాయకులు, హాస్య నటులు, బాల నటులు-సంగీతాన్ని కూర్చిన సంగీత దర్శకులు, పాటలు పాడిన గాయనీగాయకులు, తెరమీద కనిపించినవారు, కనబడనివారు, అనేక మంది కృషితో ఇప్పుడు మన సినీ ప్రపంచం రకరకాల అంద చందాలతో అలరారుతోంది. ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో అనేక మైలు రాళ్ళు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి.


తొలి పాక్షిక టాకీ చిత్రం లక్ష్మీ (1930), తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931), తొలి జానపద చిత్రం చింతామణి (1933), తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936), తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937), తెలుగు నుండి పర భాషలోకు అనువదింపబడిన (డబ్బింగ్) తొలి చిత్రం కీలు గుర్రం (1949) తమిళంలో మాయ కుదిరై పేరుతో విడుదలైంది)


తొలి ద్విపాత్రాభినయ చిత్రం అపూర్వ సహోదరులు (1950 - రంజన్), తొలి త్రిపాత్రాభినయ చిత్రం కులగౌరవం (1972-యన్‌.టి.రామారావు), ఏకైక పంచపాత్రాభినయ చిత్రం శ్రీమద్విరాట పర్వము (1979 - యన్.టి.రామారావు), ఏకైక నవపాత్రాభినయ చిత్రం నవరాత్రి (1966- అక్కినేని నాగేశ్వరరావు). తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు - అల్లు రామలింగయ్య (1003 చిత్రాలు), తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో- కృష్ణ (326 చిత్రాలు) -

మైలురాళ్ళకెల్ల మైలురాయి గిన్నీస్ బుక్. మన చలన చిత్ర నటీనటులు, దర్శకులు మరి ఇతర సాంకేతిక నిపుణులు, వారివారి నైపుణ్యంతో, ప్రతిభతో గెన్నీస్ బుక్ లోకి ఎక్కారు - విజయనిర్మల - ప్రపంచంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు, దాసరి నారాయణరావు - ప్రపంచంలో 20 సంవత్సరాల నిడివిలో 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు. రామానాయుడు - ప్రపంచంలో ఎక్కువ సినిమాలు (100+) నిర్మించిన నిర్మాత., రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో. బ్రహ్మానందం అత్యధిక హాస్య పాత్రలు పోషించాడు. ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసంలో చదువవచ్చును. .....పూర్తివ్యాసం: పాతవి

51వ వారం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటైంది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. విక్రం సారాభాయ్ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో హోమీ బాబా పర్యవేక్షణలో Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పరిచాడు. కేరళలో త్రివేండ్రం వద్ద Thumba Equatorial Rocket Launching Station (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ అనతికాలంలోనే స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించారు. 1969లో ఇస్రో, అనగా Indian Space Research Organisation (ISRO), 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.


భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరికోటలో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహం. 1987, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.

.....పూర్తివ్యాసం: పాతవి

52వ వారం

శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము మరియు ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ ఉండే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.


సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన ధూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారు. క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.


ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఇక్కడి అనేక శివలింగాలు బహు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. .....పూర్తివ్యాసం: పాతవి

53వ వారం
వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 53వ వారం


ఇవి కూడా చూడండి

మార్చు