తెలంగాణ పరిచయం

ఆంధ్రప్రదేశ్ లోని భౌగోళిక విభాగాలలో ఒకటైన తెలంగాణ ప్రాంతం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని కలిగియుంది. షొడస మహాజనపదాలలో దక్షిణభారతంలోని ఏకైక జనపదం అశ్మక జనపదం వర్థిల్లిన ప్రాంతమిది. ఆ తర్వాత మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కందూరి చోడులు ఈ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల కాలంలో మహోన్నతంగా ఈ ప్రాంతం వర్థిల్లింది. ఆ తర్వాత కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు పాలించగా 1947లో బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిననూ హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నిజాంల అధీనంలో ఉండేది. ఎందరో పోరాటయోధులు, సమరయోధుల సాహసోపేత పోరాటం మూలంగా 1948, సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి, నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారులు ఈ ప్రాంతము గుండా వెళ్ళుచున్నవి. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరోసారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నియమించబడింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. డిసెంబరు 5, 2013న కేంద్ర మండలి తెలంగాన రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లును ఆమోదించి రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. పార్లమెంటు బిల్లును ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం లభించగానే ఇది దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించనుంది. (మొత్తం వ్యాసం చూడండి)


వ్యాసం
గణపతి దేవుడు

కాకతీయ రాజులలో గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు. సింహాసనం అధిష్టించడానికి ముందు దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడుచే మూడు సంవత్సరాలు బందీగా ఉండి, అసమాన తెలివితేటలతో జైత్రపాలునిచే బంధవిముక్తి కాబడి, సింహాసనం అధిష్టించి క్రీ.శ.1199 నుంచి 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. పృథ్వీశ్వరునితో ప్రారంభించి పలు దండయాత్రలు చేసి తెలుగు ప్రాంతాన్నంతా తన ఏలుబడిలోకి తెచ్చుకొని "ఆంధ్రదేశాధీశ్వర"గా ఖ్యాతిచెందాడు. దివిసీమను ఆక్రమించి, పాలకుడికి మళ్ళీ రాజ్యాన్ని అప్పగించి అతని కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను వివాహం చేసుకొని, బావమరిది జాయపసేనానిని తన గజసాహిణిగా నియమించుకున్నాడు. తనకు పురుష సంతానం లేకుండుటచే తన కూతురు రుద్రమదేవిని కాకతీయ చక్రవర్తిగా పీఠంపై ఎక్కించాడు. ఒక్క ముత్తుకూరు యుద్ధం మినహా గణపతిదేవుడు మరే యుద్ధంలోనూ ఓటమి చెందలేడు. తన పాలన కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తిచేయుటయే కాకుండా స్వయంభూదేవాలయం, రామప్పదేవాలయం తదితర గొప్ప కట్టడాలను కూడా తన హయంలోనే నిర్మింపజేశాడు. (పూర్తివ్యాసం చూడండి)


ఈ వారం చిత్రం
మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో ఉన్న గొల్లత్తగుడి వద్ద బయల్పడిన మహావీరుని తలలేని విగ్రహం
తెలంగాణ వర్గాలు

మీకు తెలుసా?

మార్చు, పాతభండారము