శాంతి నారాయణ

తెలుగు రచయిత

శాంతి నారాయణ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత.

జీవిత విశేషాలు మార్చు

ఇతడు అనంతపురం జిల్లా, బండమీదపల్లె గ్రామంలో కేశమ్మ, వెంకటస్వామి దంపతులకు 1946, జూలై 1న జన్మించాడు.[1] సింగనమలలో హైస్కూలు విద్యాభ్యాసం ముగించాడు. తిరుపతిలోని ఓరియెంటల్ కళాశాలలో విద్వాన్ చదివాడు. తరువాత ఎం.ఎ., పి.హెచ్.డిలు చేశాడు. విద్వాన్ పూర్తి అయిన పిదప తెలుగు పండితుడిగా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదకొండు సంవత్సరాలు పనిచేసి అదే కళాశాలలో మరో పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్‌గా పనిచేశాడు. తరువాత పదోన్నతి పొంది అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1992 నుండి 2001వరకు పనిచేశాడు. 2001లో కొంతకాలం ప్రిన్సిపాల్‌గా సేవలను అందించాడు. 2001 సెప్టెంబరు నుండి అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి 2004 జూన్ 30వ తేదీన పదవీవిరమణ చేశాడు.

సాహిత్య సేవ మార్చు

ఇతడు విద్వాన్ చదివే సమయంలో పద్యరచనపట్ల ఆకర్షితుడై అవధానాలు చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటి అవధానం 1966లో సింగనమలలో చదువుకున్న పాఠశాలలో చేశాడు. తరువాత కణేకల్, బుక్కపట్నం, కనగానపల్లె, అనంతపురం, రాయదుర్గం మొదలైన ప్రాంతాలలో 1978 వరకు సుమారు 12 అష్టావధానాలు చేశాడు. భువనవిజయ సభలలో అయ్యలరాజు రామభద్రకవిగా, పింగళి సూరనగా పాత్రలను పోషించి సభలను రంజింపజేశాడు. ఆశావాది ప్రకాశరావు, షేక్ దరియా హుసేన్లు ఇతనికి సన్నిహిత సాహితీమిత్రులు. సుమారు ఒక దశాబ్దకాలం పద్యకవిసమ్మేళనాలలో పాల్గొనడం, అవధానాలు చేయడం వంటివి చేశాడు. తర్వాత కథాసాహిత్యం వైపు మొగ్గుచూపాడు. ఇతడు అనేక సాహిత్య సభలు, సమావేశాలలో వివిధ విషయాలపై ప్రసంగాలు చేశాడు. ఆకాశవాణి కడప, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి కేంద్రాలనుండి అనేక ప్రసంగాలు, కథానికలు ఇతనివి ప్రసారం అయ్యాయి. అనంతపురం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, గౌరవాధ్యక్షుడిగా పనిచేశాడు. జాషువా శతజయంతి కమిటీ, సీమసాహితి, రాయలకళాగోష్ఠి, కథావేదిక, సాహితీకళాసమితి, స్పందన సాహిత్య సమితి, దళిత అధ్యయన వేదిక, అధికార భాషా సంఘం (జిల్లా యూనిట్), జన విజ్ఞానవేదిక (జిల్లా యూనిట్), అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం వంటి అనేక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని సంపాదకత్వంలో రాయదుర్గం నుండి కొంతకాలం వెలుగు అనే లిఖితమాసపత్రిక వెలువడింది. ఇతని సాహిత్యంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, గుల్బర్గా యూనివర్సిటీ, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము లలో 7 ఎం.ఫిల్ పరిశోధనలు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పరిశోధన జరిగాయి. ఇతని నవల పెన్నేటి మలుపులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తరగతులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది.

రచనలు మార్చు

ఇతడు వార్త, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఇండియా టుడే, ప్రజాసాహితి, ఉపాధ్యాయ, ఆహ్వానం, రచన, నేత్రం, విపుల, ఉదయం, మాభూమి, సీమసాహితి వంటి దిన, వార, మాసపత్రికలలో కథలు, వ్యాసాలు ప్రచురించాడు.

ఇతడు ప్రచురించిన పుస్తకాలు :

 1. కళ్యాణవాణి (ఆశావాది ప్రకాశరావు వివాహసందర్భంగా వెలువడిన ప్రత్యేక సంచిక) (సంపాదకత్వం)
 2. కొండచిలువ (కథల సంపుటి)
 3. ఇనుపగజ్జెల తల్లి (కథల సంకలనం) (సంపాదకత్వం)
 4. నమ్ముకున్న రాజ్యం (కథల సంపుటి)
 5. నాగలకట్ట సుద్దులు (వార్త దినపత్రికలో ఫీచర్)
 6. పల్లేరు ముళ్లు[2] (కథల సంపుటి)
 7. రక్తపు ముద్ద పిలిచింది (కథల సంపుటి)
 8. వొరుపు (కవితా సంకలనం) (సంపాదకత్వం)
 9. రస్తా (కథల సంపుటి)
 10. పెన్నేటి మలుపులు (నవల)
 11. నడిరేయి నగరం (కవితా సంపుటి)
 12. అనంత కథావికాసం (పరిశోధన)
 13. జక్కన విక్రమార్క చరిత్ర - సమగ్ర పరిశీలన (పరిశోధన)
 14. మాధురి (నవల)
 15. ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి)

సత్కారాలు, పురస్కారాలు మార్చు

 • 1997 - శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారిచే సన్మానం
 • 1999 - విశాల సాహితి అవార్డు[3]
 • 2000 - అనంత ఆణిముత్యం అవార్డు
 • 2000 - స్వర్ణభారతి సాహితీ పురస్కారం
 • 2003 - మాతృభాషాపురస్కారం
 • 2003 - కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం.[4]
 • 2009 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభాపురస్కారం మొదలైనవి.

విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు మార్చు

ఇతడు 2006లో తన భార్య విమల పేరుమీద తన వంతు సాహిత్య సేవా నిర్వహణ కోసం ఈ ట్రస్టును ప్రారంభించాడు. ఆకస్మికంగా మరణించిన తన రెండవ కుమారుడు రజనీకాంత్ పేరు మీద జాతీయస్థాయిలో తెలుగు భాషలో వెలువడిన ఉత్తమ కథా సంపుటానికి, ఉత్తమ కవితా సంకలనానికి శాంతి రజనీకాంత్ స్మారక పురస్కారాలను ఈ ట్రస్టుద్వారా ప్రతియేటా అందజేస్తున్నాడు.[5] ఈ పురస్కారాలు ఇంతవరకు వి.ఆర్.రాసాని, చల్లపల్లి స్వరూపరాణి, జి.ఆర్.మహర్షి, నేతల ప్రతాప్ కుమార్, కె.వరలక్ష్మి, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, జాతశ్రీ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, శశిశ్రీ, కాట్రగడ్డ దయానంద్, ఆశారాజు,[6] ఎ.ఎన్.జగన్నాథశర్మ,[6] వేంపల్లె షరీఫ్, మల్లిపురం జగదీష్ తదితరులకు లభించాయి.

మూలాలు మార్చు

 1. అనంత చైతన్య కేతనం శాంతి నారాయణ - ప్రభాత వార్త కల్చరల్ రిపోర్టర్ - వార్త దినపత్రిక - అనంతపురం జిల్లా ఎడిషన్ - శుక్రవారం 22, జూన్ 2007 - పేజీ 8
 2. రాయలసీమవాసుల దుర్భర బాధలే ఈ గాథలు - ఫాతిమా - బుక్ పాయింట్ - ప్రజాశక్తి ఆదివారం - 11-4-1999
 3. 'అనంత' రచయితకు విశాల సాహితి కథా పురస్కారం - వార్త దినపత్రిక అనంతపురం ఎడిషన్ - అక్టోబర్ 4, 1999
 4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
 5. రచనలో నిజాయితీని, మనిషిలో మంచితనాన్ని నమ్ముతాను - శాంతినారాయణ - నవ్య నీరాజనం - నవ్య వీక్లీ - నవంబర్ 9,2011 - పేజీలు 18-19
 6. 6.0 6.1 సాహితీసేవకు - కవిత్వానికి విమలాశాంతి సాహిత్య పురస్కారాలు - నవ్య వీక్లీ - నవంబర్ 14, 2012 - పేజీలు 35-37

ఇవి కూడా చదవండి మార్చు

 • మాండలిక నిఘంటువు శాంతినారాయణ - కత్తిపద్మారావు - నడుస్తున్న చరిత్ర - మార్చి 2015 - పేజీలు 39-42
 • శాంతినారాయణ కథల్లో వస్తు వైవిధ్యం - జి.శ్రీధరన్ - సాహిత్య ప్రస్థానం - ఆగస్టు 2014 - పేజీలు 26-30
 • కులాన్నే వర్గంగా ప్రతిపాదిస్తున్న నవల పెన్నేటి మలుపులు - రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి - ఆదివారం వార్త - 2002 ఏప్రిల్ 28 - పేజీలు 20-21
 • రాయలసీమ విషాదంలోంచి ఇంకెంతో సాహిత్యం రావాలి - శాంతి నారాయణతో ముఖాముఖి - నాగప్పగారి సుందర్రాజు - ఆంధ్రభూమి దినపత్రిక - 1999 అక్టోబరు 20 - పేజీ 5

బయటి లింకులు మార్చు