జల వనరులు
నీటి వనరులు అంటే జీవజాలానికి ఉపయోగపడే నీటి సహజ వనరులు. నీటి ఉపయోగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ, వినోద, పర్యావరణ కార్యకలాపాలు ఉన్నాయి. అన్ని జీవులకు పెరగడానికి, పునరుత్పత్తికీ నీరు ఆవశ్యకం.
భూమిపై ఉన్న నోటిలో 97% ఉప్పు నీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు; ఇందులోనూ మూడింట రెండు వంతులు హిమానీనదాల్లోను, ధ్రువాల వద్ద ఉన్న ఐసు దుప్పట్లలోనూ ఘనీభవించి ఉంది. [1] మిగిలిన మంచినీరు ప్రధానంగా భూగర్భజలం రూపంలో ఉంది. భూమి పైన, గాలిలోనూ కొద్ది భాగం మాత్రమే ఉంది. [2]
మంచినీరు పునరుత్పాదక వనరే అయినప్పటికీ ప్రపంచంలోని భూగర్భజలం క్రమంగా తగ్గుతోంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలలో ఈ క్షీణత చాలా ఎక్కువగా ఉంది. అయితే, వినియోగమైన జలంలో ఎంత మేరకు సహజంగా పునరుద్ధరణ జరుగుతోంది, పర్యావరణ వ్యవస్థలు ఏ మేరకు ముప్పుకు గురౌతున్నాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. [3] నీటి వినియోగదారులకు నీటి వనరులను కేటాయించే ఫ్రేమ్‌వర్కును (అటువంటి ఫ్రేమ్‌వర్క్ ఉన్న చోట) నీటి హక్కులు అంటారు.
మంచినీటి సహజ వనరులు
మార్చుఉపరితల జలం
మార్చునదులు, సరస్సులు, మంచినీటి చిత్తడి నేలల్లో ఉండే నీటిని ఉపరితల జలంగా పరిగణిస్తారు. ఉపరితల నీరు సహజంగా అవపాతం (వర్షం, మంచు) ద్వారా చేరుతుంది. మహాసముద్రాల్లో కలవడం, బాష్పీభవనం, బాష్పవాయు ప్రేరణ, భూమి లోకి ఇంకడం తదితర విధాలుగా ఉపరితల నీరు తగ్గుతుంది.
ఉపరితల నీటి వ్యవస్థకు సహజమైన వనరు దాని పరీవాహక ప్రాంతం (వాటర్‌షెడ్) లో పడే అవపాతం మాత్రమే అయినప్పటికీ, ఏ సమయంలోనైనా ఆ వ్యవస్థలోని మొత్తం నీటి పరిమాణం అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల్లో సరస్సులు, చిత్తడి నేలలు, కృత్రిమ జలాశయాలలో నిల్వ సామర్థ్యం, ఈ జలాశయాల అడుగున ఉండే నేల యొక్క పారగమ్యత (పీల్చుకునే గుణం -పెర్మీయబిలిటీ), వాటర్‌షెడ్‌లోని భూమి యొక్క ప్రవాహ లక్షణాలు, అవపాతం పడే సమయం, స్థానికంగా ఉండే బాష్పీభవన స్థాయి వగైరాలు ఉన్నాయి. ఈ కారకాలన్నీ నీటిని కోల్పోయే స్థాయిని కూడా ప్రభావితం చేస్తాయి.
మానవ కార్యకలాపాల వల్ల ఈ కారకాలపై పెద్ద ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రభావం వినాశకరంగా ఉంటుంది. మానవులు కృత్రిమంగా జలాశయాలను నిర్మించి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. చిత్తడి నేల నుండి నీటిని పారించి నిల్వను తగ్గిస్తారు. మానవులు నేలను చదును చెయ్యడం, నీరు ప్రవహించేందుకు మార్గాలను ఏర్పరఛడం వలన ప్రవాహ పరిమాణం, వేగం పెరుగుతాయి.
లభ్యమయ్యే నీటి మొత్తం పరిమాణం ఒక ముఖ్యమైన విషయం. కొంతమందికి అడపాదడపాగా నీటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు, చాలా పొలాలకు వసంతకాలంలో పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుంది, శీతాకాలంలో అసలు అవసరమే ఉండదు. అటువంటి చోట్ల పొలాలకు నీరు సరఫరా చేయాలంటే, ఏడాది పొడవునా నీటిని సేకరించి, తక్కువ వ్యవధిలో విడుదల చేసేందుకు వీలుగా పెద్ద నిల్వ సామర్థ్యం ఆవశ్యకం. విద్యుత్ కేంద్రాల వంటి చోట్ల చల్లబరచేందుకు ఏడాది పొడుగునా నీటి అవసరం ఉంది. అటువంటి చోట్ల, విద్యుత్ ప్లాంటు అవసరం కంటే తక్కువ సగటు ప్రవాహం ఉన్నప్పుడు, ఆ లోటును పూరించడానికి సరిపడే కొద్దిపాటి నిల్వ సామర్థ్యం ఉంటే చాలు. ఉదాహరణకు కృష్ణా, గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందించే నాగార్జున సాగర్ జలాశయం నీటి సామర్థ్యం 312 టిఎమ్‌సిలు. ఈ నీటిని సంవత్సరం పొడుగునా సేకరించి పంటల కాలమైన మూడునెలల్లో పూర్తిగా వాడేస్తారు. అందుచేతనే నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంతుంది. కానీ, విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ సామర్థ్యం ఇందులో నూరో వంతు కూడా లేదు - 3.07 టిఎమ్‌సి మాత్రమే.[4] అక్కడి నార్ల తాతరావు తాప విద్యుత్ కేంద్రానికి చల్లబరచే నీటిని పంపించేందుకు ఈ మాత్రపు నీటి నిల్వ సరిపోతుంది.
ఏదేమైనా, పరీవాహక ప్రాంతంలో పడే సగటు వర్షపాతం, ఆ పరీవాహక ప్రాంతం నుండి వాడగల సగటు నీటి పరిమాణానికి పరిమితిగా నిలుస్తుంది.
కాలువ ద్వారా గానీ, పైప్‌లైను ద్వారా గానీ మరొక పరీవాహక ప్రాంతం నుండి నీటిని దిగుమతి చేసుకోవడం ద్వారా ఉపరితల నీటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఇతర వనరుల నుండి కూడా దీన్ని కృత్రిమంగా పెంచుకోవచ్చు గానీ, ఆచరణలో ఈ పరిమాణాలు చాలా తక్కువ. మానవులు కాలుష్యం ద్వారా కూడా ఉపరితలంపై ఉన్న నీటిని "పోగొట్టుకుంటారు" (అంటే నిరుపయోగంగా చేసుకోవడం).
ప్రపంచంలో మంచినీరు అత్యధికంగా బ్రెజిల్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రష్యా, కెనడాలు ఉన్నాయి . [5]
నదీ ప్రవాహం కింద
మార్చునదుల ద్వారా దిగువకు ప్రవహించే మొత్తం నీటి పరిమాణంలో పైకి కనిపించే నీటి ప్రవాహంతో పాటు, నది అడుగున ఉండే రాళ్ళు, అవక్షేపాల ద్వారా ప్రవహించే నీరు కూడా గణనీయమైన భాగం. దీన్ని హైపోరిక్ జోన్ అంటారు. పెద్ద లోయల గుండా ప్రవహించే అనేక నదుల్లో, కనిపించని ఈ ప్రవాహమే కనిపించే ప్రవాహం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ హైపోరిక్ జోన్, ఉపరితల జలాలకూ భూగర్భజలాలకూ మధ్య వారధిగా ఉండి, భూగర్భ జలాశయాల్లోకి నీటి చేరికకు, వాటి నుండి నీరు వెనక్కి నదుల్లోకి పోవడానికీ వాహికగా ఉంటుంది.
భూగర్భజలం
మార్చుభూగర్భజలం అంటే, ఉపరితలం కింద మట్టి, రాళ్ళ సందుల్లో ఉండే మంచినీరు. భూగర్భజల మట్టానికి క్రింద ఉండే భూగర్భ జలాశయాల్లో ప్రవహించే నీరు కూడా ఇందులో భాగమే. ఉపరితల జలంతో దగ్గరి సంబంధంలో ఉండే భూగర్భ జలానికీ, లోతైన భూగర్భ జలాశయాలకూ (కొన్నిసార్లు దీన్ని "శిలాజ జలం" అని కూడా పిలుస్తారు) మధ్య ఉన్న తేడాను గమనించాలి..
నీటి చేరిక, నీటి విడుదల, నిల్వ వంటి విషయాలకు సంబంధించి భూగర్భజలాలను కూడా ఉపరితల నీటితో సమానంగా పరిగణించవచ్చు. క్లిష్టమైన వ్యత్యాసం ఏమిటంటే, భూగర్భజల నిల్వ సామర్థ్యం ఉపరితల నీటి నిల్వ కంటే చాలా ఎక్కువ. అందువల్లనే, వాడేసిన నీటి స్థానంలోకి కొత్తగా నీరు చేరక పోయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు భూగర్భజలాలను అందుతూనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ, ఉపరితలం నుండి లోపలికి ఇంకే వార్షిక నీటి పరిమాణమే, ఏటా ఎంత భూగర్భ జలం వాడుకోవచ్చు అనేదానికి పరిమితి విధిస్తుంది.
ఉపరితలం నుండి ఇంకే నీరే భూగర్భజలాలకు సహజమైన నీటి వనరు. సముద్రాల్లో కలవడం, ఊటలు మొదలైనవి ప్రకృతి సహజంగా జరిగే నీటి విడుదలలు.
ఉపరితల నీటి వనరు గణనీయమైన స్థాయిలో ఆవిరవుతూ ఉంటే, భూగర్భజలాలు ౘవ్వగా మారిపోయే అవకాశం ఉంది. ఎండోరిక్ జలాశయాల (ఈ జలాశయాల్లోకి నీరు చేరడమే గానీ బయటికి పోవడం ఉండదు. కేవలం ఆవిరి ద్వారానే వీటి నుండి నీరు బయటికి పోతుంది) క్రింద ప్రకృతి సహజం గానూ, వ్యవసాయ భూముల క్రింద కృత్రిమంగానూ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. తీరప్రాంతాల్లో, భూగర్భజల వనరులను తోడేయడం వల్ల సముద్రం నుండి ఉప్పు నీరు అక్కడికి చేరి ఉప్పదనానికి కారణమౌతుంది. కాలుష్యం ద్వారా కూడా మానవులు భూగర్భజలాలను "పోగొట్టుకుంటారు" (అంటే నీరు నిరుపయోగంగా మారడం). జలాశయాలను, వాటర్‌షెడ్లనూ నిర్మించడం ద్వారా మానవులు భూగర్భజల వనరులలోకి నీటి చేరికను పెంచవచ్చు.
ఘనీభవించిన నీరు
మార్చుమంచుకొండలను నీటి వనరుగా ఉపయోగించుకోవటానికి అనేక పథకాలు ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు ఇది పరిశోధనలకే పరిమితమైంది. హిమానీనదాల నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని ఉపరితల నీరుగా పరిగణిస్తారు.
"ప్రపంచపు పైకప్పు"గా పిలిచే హిమాలయాల్లో, హిమానీనదాలు, శాశ్వత మంచు ప్రాంతాలూ ఉన్నాయి. ఆసియాలోని అతిపెద్ద నదులలో పది అక్కడే ఉద్భవిస్తున్నాయి. అవి, వంద కోట్లకు పైగా ప్రజలకు జీవనోపాధి కలిగిస్తున్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరుగుతున్నాయి. నేపాల్‌లో, గత దశాబ్దంలో ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్సియస్ పెరిగింది, అయితే ప్రపంచవ్యాప్తంగా, భూమి గత వంద సంవత్సరాల్లో సుమారు 0.7 డిగ్రీల సెల్సియస్ మాత్రమే వేడెక్కింది.
నిర్లవణీకరణ
మార్చునిర్లవణీకరణ అనేది ఉప్పునీటిని (సాధారణంగా సముద్రపు నీటిని ) మంచినీటిగా మార్చే కృత్రిమ ప్రక్రియ. స్వేదనం, రివర్స్ ఓస్మోసిస్ అనేవి అత్యంత సాధారణ నిర్లవణీకరణ ప్రక్రియలు. చాలా ప్రత్యామ్నాయ నీటి వనరులతో పోలిస్తే నిర్లవణీకరణ ఖరీదైనది. మొత్తం మానవ నీటి వినియోగంలో చాలా తక్కువ భాగం మాత్రమే నిర్లవణీకరణ ద్వారా అందుతోంది. ఇది సాధారణంగా పొడి ప్రాంతాల్లో, గృహ పారిశ్రామిక ఉపయోగాల వంటి విలువైన అవసరాల కోసం మాత్రమే ఈ పద్ధతి ఆర్థికంగా ఆచరణాత్మకంగా ఉంటుంది. అయితే, సాగు కోసం సింగపూర్, కాలిఫోర్నియా వంటి అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో నిర్లవణీకరణ పెరుగుతోంది. పెర్షియన్ గల్ఫ్‌లో ఈ పద్ధతిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
నీటి వినియోగాలు
మార్చుప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగంలో 70% వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారని అంచనా వేసారు. 15-35% సాగునీరు పునరుత్పత్తి అవడం లేదు. [6] ఒక వ్యక్తికి ఒక రోజుకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు సుమారు 2,000 - 3,000 లీటర్ల నీరు అవసరమౌతుంది. [7] తాగడానికి రెండు నుండి ఐదు లీటర్ల మాత్రమే అవసరమౌతుంది. దీన్నిబట్టి సాగునీటి అవసరం ఎంత గణనీయమైనదో తెలుస్తుంది. భూమ్మీద నివసించే 700 కోట్ల మందికి ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి - పది మీటర్ల లోతు, 100 మీటర్ల వెడల్పు, 2100 కిలోమీటర్ల పొడవు గల కాలువలో పట్టేటన్ని నీళ్ళు అవసరం.
నీటి కొరత పెరుగుతోంది
మార్చుసుమారు యాభై సంవత్సరాల క్రితం, నీరు అనంతమైన వనరు అనే అభిప్రాయం ఉండేది. అప్పటి జనాభా, ప్రస్తుత జనాభాలో సగం కంటే తక్కువ ఉండేది. ఆనాడు ప్రజలు, ఈ రోజు ఉన్నంత ధనవంతులు కాదు. తక్కువ కేలరీలు తినేవారు. తక్కువ మాంసం తినేవారు. కాబట్టి వారికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి తక్కువ నీరు అవసరమయ్యేది. ప్రస్తుతం నదుల నుండి తీసుకుంటున్న నీటి పరిమాణంలో మూడవ వంతు మాత్రమే అప్పట్లో అవసరమయ్యేది. నేడు, నీటి వనరుల కోసం పోటీ పెరిగింది. 2020 నాటికి భూమ్మీద 700 కోట్ల మంది ప్రజలున్నారు. నీటిని మింగేసే మాంసం, కూరగాయల వినియోగం పెరుగుతోంది. పరిశ్రమల నుండి, పట్టణీకరణ, జీవ ఇంధన పంటలు, నీటి ఆధారిత ఆహార పదార్థాలు మొదలైనవి నీటి కోసం పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో, ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఇంకా ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఎందుకంటే 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు పెరుగుతుందని అంచనా. [8] అదనంగా 250 - 300 కోట్ల మంది ప్రజలు, తక్కువ తృణధాన్యాలు, ఎక్కువ మాంసం, ఎక్కువ కూరగాయలూ తినడం.., ఈ కారణాల వలన పైన పేర్కొన్న ఊహా కాలువను మరికొన్ని వేల కిలోమీటర్లు పొడిగించాల్సి రావచ్చు.
వ్యవసాయ రంగంలో నీటి నిర్వహణ గురించి 2007 లో శ్రీలంకలోని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక సమీక్ష నిర్వహించింది. [9] ఇది ప్రపంచవ్యాప్తంగా సాగునీటి లభ్యతను అంచనా వేసింది. నీటి కొరతతో బాధపడుతున్న ప్రదేశాలను గుర్తించింది. ప్రపంచంలోని ఐదవ వంతు ప్రజలు, 120 కోట్లకు పైగా, తమ అవసరాలన్నిటినీ తీర్చడానికి తగినంత నీరు లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారని తేల్చింది. మరో 160 కోట్ల మంది, నీటి లభ్యత ఉన్నా ఆర్థిక వనరుల కొరత కారణంగా నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ నీటి కోసం పెట్టుబడి పెట్టక పోవడం వల్ల గానీ, మానవ సామర్థ్యం సరిపోకపోవడం వల్ల గానీ ప్రభుత్వాలు తమ ప్రజల నీటి అవసరాలను తీర్చలేక పోతున్నాయి. వీటికి తోడు, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి (230 కోట్ల మందికి) స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. భవిష్యత్తులో అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది గానీ, ఈనాటి ఆహార ఉత్పత్తి, పర్యావరణ పోకడలను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సంక్షోభాలు తలెత్తుతాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచ నీటి సంక్షోభాన్ని నివారించడానికీ, ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికీ రైతులు ఉత్పాదకతను పెంచడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే పరిశ్రమలు, నగరాల్లో నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే మార్గాలను అనుసరించాలి. [10]
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో, ఏ పంటను పండించాలన్నా నీరు అవసరం కాగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ లాభదాయకమైన పంటలను పండించడానికో, దిగుబడి పెంచడానికో వీలు కలుగుతుంది. పంట దిగుబడి, నీటి వినియోగం, పరికరాలూ నిర్మాణాల మూలధన వ్యయాల పైన వివిధ నీటిపారుదల పద్ధతులు ఆధారపడి ఉంటాయి. చాళ్ళ (నేలను నాగలితో దున్నినపుడు ఏర్పడే చిన్నపాటి కాలువ) ద్వారానూ, ఓవర్ హెడ్ స్ప్రింక్లర్ల ద్వారానూ చేసే నీటిపారుదల సాధారణంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే గానీ, నీరు ఎక్కువగా ఆవిరైపోవడం వలన, పారడం వలన, వేర్ల కంటే దిగువకు ఇంకిపోవడం వలన ఈ పద్ధతులు అంత సమర్ధవంతమైనవి కావు. బిందు సేద్యం, ఉప్పెన సాగు, నేల బారుగా పనిచేసే స్ప్రింక్లర్ వ్యవస్థల వంటివి మరింత సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు. ఈ రకమైన వ్యవస్థలు ఖరీదైనవే గానీ, ప్రవాహం ద్వారా, అవిరవడం ద్వారా, ఇంకిపోవడం ద్వారా జరిగే నీటి దుబారాను తగ్గిస్తాయి. ఏ వ్యవస్థ అయినా సరిగ్గా నిర్వహించక పోతే, నీరు వృధా అవుతుంది. పరిస్థితులకు, అవసరాలకూ తగినట్లుగా నీటిపారుదల సమయాన్ని, పద్ధతినీ అనుసరించి సరిగా నిర్వహిస్తే ఏ వ్యవస్థ అయినా మెరుగైన సమర్ధత కలిగి ఉంటుంది.
ప్రపంచ జనాభా పెరిగేకొద్దీ, ఆహారానికి డిమాండ్ పెరిగేకొద్దీ, నీటిపారుదల [11] పద్ధతులు,[12] సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగుపరచుకోవడం ద్వారా, మెరుగైన సాగు నీటి నిర్వహణ, పంట రకాలు, నీటి యాజమాన్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతుల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పరిశ్రమలు
మార్చుప్రపంచవ్యాప్తంగా మొత్తం నీటి వినియోగంలో 22% పరిశ్రమల్లో వాడుతున్నారని అంచనా. [6] ప్రధాన పారిశ్రామిక వినియోగదారులలో జలవిద్యుత్ ఆనకట్టలు, శీతలీకరణ కోసం నీటిని వాడే తాప విద్యుత్ కర్మాగారాలూ ఉన్నాయి. ఖనిజాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయన ప్రక్రియలలో నీటిని ఉపయోగిస్తాయి. నీటిని ద్రావకం వలె ఉపయోగించే తయారీ కర్మాగారాలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు నీటిని పెద్దమొత్తంలో వాడతాయి. కానీ, మొత్తమ్మీద పరిశ్రమల్లో నీటి వినియోగం సాధారణంగా వ్యవసాయం కంటే చాలా తక్కువగా ఉంటుంది.
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో నీటిని ఉపయోగిస్తారు. ఈ ప్లాంట్లలో ఎత్తు నుండి కిందికి దూకే నీటి లోని శక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్యరహిత, పునరుత్పాదక ఇంధన వనరు. అంతిమంగా, ఒక జలవిద్యుత్ ప్లాంట్‌లోని శక్తి సూర్యుని నుండే వస్తుంది. సూర్యురశ్మి వలన నీరు ఆవిరైపోయి, అధిక ఎత్తులో వర్షంగా కురిసి పల్లం వైపు ప్రవహిస్తుంది. ఈ నీటి నుండే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. పంప్డ్-స్టోరేజ్ జలవిద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఇవి విద్యుత్తు డిమాండు తక్కువగా ఉన్నప్పుడు నీటిని పైకి పంపు చేస్తాయి. డిమాండు ఉన్నప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఈ నిల్వ చేసిన నీటిని ఉపయోగిస్తాయి.
జలవిద్యుత్ ప్లాంట్లకు పెద్ద కృత్రిమ జలాశయం అవసరం. ఈ జలాశయం ఉపరితల వైశాల్యం ఎక్కువ అవడం చేత దీని నుండి ఆవిరయ్యే నీరు నది నుండి ఆవిరయ్యే దాని కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ నీటి వినియోగం జరుగుతుంది. టర్బైన్లు, సొరంగాలు లేదా పైపుల ద్వారా నీటిని పంపే ప్రక్రియలో కూడా సహజ వాతావరణం నుండి తాత్కాలికంగా నీరు తగ్గుతుంది. పవర్ ప్లాంట్ రూపకల్పనపై ఆధారపడి వన్యప్రాణులపై ఈ తగ్గుదల ప్రభావం ఉంటుంది.
వాటర్ బ్లాస్టింగ్, వాటర్ జెట్ కట్టర్లలో నీటిని అధిక పీడనంతో ఉపయోగిస్తారు. అలాగే, కచ్చితమైన కోత కోసం కూడా చాలా అధిక పీడనం గల వాటర్ గన్స్‌ను ఉపయోగిస్తారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, సాపేక్షంగా సురక్షితం, పర్యావరణానికి హానికరం కాదు కూడాను. వేడెక్కడం నివారించడానికి లేదా సా బ్లేడ్లు వేడెక్కకుండా నిరోధించడానికి యంత్రాల శీతలీకరణలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇతర వినియోగాలతో పోలిస్తే ఇందులో నీటి వినియోగం చాలా తక్కువ.
గృహ వినియోగం
మార్చుప్రపంచవ్యాప్త నీటి వినియోగంలో 8% గృహావసరాల కోసం అని అంచనా. [6] వీటిలో తాగునీరు, స్నానం, వంట, టాయిలెట్ ఫ్లషింగ్, శుభ్రపరచడం, లాండ్రీ, తోటపని ఉన్నాయి. తోటలకు నీటిని మినహాయించి, రోజుకు వ్యక్తికి 50 లీటర్ల చొప్పున అవసరమని పీటర్ గ్లీక్ అంచనా వేసాడు. త్రాగునీరు అంటే తక్షణ లేదా దీర్ఘకాలిక హాని కలిగే ప్రమాదం లేకుండా వాడదగ్గ నాణ్యత గల నీరు. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో, గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సరఫరా చేసే నీరు, తాగడానికి, వంటకూ వాడేది చాలా స్వల్పభాగమే అయినప్పటికీ, తాగునీటి ప్రమాణం లోనే ఉంటుంది.
వినోదం
మార్చువినోదం కోసం వాడే నీరు మొత్తం నీటి వినియోగంలో చాలా తక్కువ భాగం. కాని దీని శాతం పెరుగుతోంది. వినోద నీటి వినియోగం ఎక్కువగా జలాశయాలతో ముడిపడి ఉంటుంది. ఒక జలాశయం లోని నీటి మట్టాన్ని అవసరమైన దాని కంటే ఎక్కువగా ఉంచినట్లైతే, ఆ ఎక్కువగా ఉన్న భాగాన్ని వినోదార్థం ఆని భావిస్తారు.
మామూలుగా వినోదార్థం వాడే నీరు ఖర్చైపోదు. గోల్ఫ్ కోర్సులు అధిక మొత్తంలో నీటిని వాడేస్తున్నాయని ఆరోపణలు ఉంటూంటాయి -ముఖ్యంగా పొడి ప్రాంతాలలో. అనేక గోల్ఫ్ కోర్సులు శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని ఎక్కువగా గానీ, పూర్తిగా గానీ వాడుతూంటాయి. ఇది త్రాగునీటి లభ్యతపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మొత్తమ్మీద, వినోద వినియోగం (ప్రైవేట్ తోటలు కూడా ఇందులో భాగమే) నీటి వనరులపై గుర్తించదగినంత ప్రభావాన్ని చూపుతుందా అనేది అస్పష్టంగా ఉంది.
పర్యావరణం
మార్చుపర్యావరణం వాడే నీరు కూడా మొత్తం నీటి వినియోగంలో చాలా తక్కువ. కానీ ఈ శాతం పెరుగుతోంది. పర్యావరణ నియంత్రణలో భాగంగా నీటి ప్రవాహాల్లో నిలువ ఉంచే నీరు ఈ వినియోగంలో భాగం. [13] సహజమైన లేదా కృత్రిమ చిత్తడి నేలలకు విడుదల చేసే నీరు, వన్యప్రాణుల ఆవాసాలను సృష్టించడానికి ఉద్దేశించిన కృత్రిమ సరస్సులు, చేపల నిచ్చెనలు, చేపల వృద్ధి కోసం విడుదల చేసే నీరు పర్యావరణ వాడకంలో భాగం [14]
వినోద వినియోగంలో లాగానే, పర్యావరణ వినియోగంలో కూడా నీరు ఖర్చైపోదు. కాని దీనివలన నిర్దుష్ట సమయాల్లో, నిర్దుష్ట ప్రదేశాలలో ఇతర వినియోగదారులకు నీటి లభ్యత తగ్గుతుంది. ఉదాహరణకు, చేపల వృద్ధి కోసం ఒక జలాశయం నుండి నీటిని విడుదల చేస్తే ఎగువన ఉన్న పొలాలకు నీరు అందక పోవచ్చు. జలమార్గాలను కాపాడుకునేందుకు నదిలో నీరు నిలిపేస్తే దిగువ ప్రాంతాల వారికి నీరు అందదు.
నీటి కోసం ఆరాటం
మార్చునీటి కోసం వత్తిడి అనే భావనను అర్థం చేసుకోవడం చాలా సులభం: వరల్డ్ కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ వారి ప్రకారం వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాలకు తగినంత నీరు లేని పరిస్థితుల్లో నీటి కోసం వత్తిడి అనే భావన తలెత్తుతుంది. తలసరి అందుబాటులో ఉన్న నీటి పరంగా ఒత్తిడి పరిమితులను నిర్వచించడం క్లిష్టమైన విషయం. ఏదేమైనా, వార్షిక తలసరి పునరుత్పాదక మంచినీటి లభ్యత 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆయా దేశాల్లో నీటి కోసం ఒత్తిడి మొదలౌతుందని ప్రతిపాదించారు. 1,000 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ ఉంటే, నీటి కొరత ఆర్థికాభివృద్ధికి, మానవ ఆరోగ్యానికి, శ్రేయస్సుకూ హాని కలిగిస్తుంది.
జనాభా పెరుగుదల
మార్చు2000 లో, ప్రపంచ జనాభా 620 కోట్లు. 2050 నాటికి మరో 350 కోట్ల మంది చేరుతారని ఐరాస అంచనా వేసింది. ఈ పెరుగుదలలో సింహభాగం ఇప్పటికే నీటి ఒత్తిడికి గురవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉంటుంది. [15] అందువల్ల, నీటి సంరక్షణ రీసైక్లింగ్‌లలో పెరుగుదల లేకపోతే నీటి కోసం డిమాండు పెరుగుతుంది. [16] ఐరాస సమర్పించిన డేటాను తయారుచేసే క్రమంలో ప్రపంచ బ్యాంకు, [17] ఆహారోత్పత్తి కోసం నీటిని అందించడం రాబోయే దశాబ్దాల్లో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో ఒకటని చెప్పింది. వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ, సామాజిక చరరాశుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, నీటి సరఫరలను నిల్వలనూ సవ్యంగా నిర్వహించాలి.[18] నీరు ఈ రోజుల లో పెద్ద సమస్య
వ్యాపార కార్యకలాపాల విస్తరణ
మార్చుపారిశ్రామికీకరణ నుండి పర్యాటకం, వినోదం వంటి సేవల వరకూ వ్యాపార కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ విస్తరణకు అవసరమైన నీటి సరఫరా, పారిశుధ్యం రెండూ పెరగాలి. దీనివలన నీటి వనరుల పైన, సహజ పర్యావరణ వ్యవస్థ పైనా మరింత ఒత్తిడి కలుగుతుంది.
వేగవంతమైన పట్టణీకరణ
మార్చుపట్టణీకరణ వేగవంత మవుతోంది. తక్కువ జనసాంద్రత కలిగిన సమాజాలలో సరిపోయే చిన్న బావులు, సెప్టిక్ ట్యాంకులు అధిక సాంద్రత గల పట్టణ ప్రాంతాల్లో సరిపోవు. నీరు సరఫరా చేయడానికి, వ్యర్థజలాలను ప్రాసెస్ చేయడానికీ పట్టణాల్లో నీటి మౌలిక సదుపాయాలలో గణనీయమైన పెట్టుబడి అవసరం. ఈ కలుషితమైన, అపరిశుభ్రమైన నీటికి శుద్ధి చెయ్యకపోతే, ప్రజారోగ్యానికి చేటు చేస్తాయి.
100,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఐరోపా నగరాల్లో 60% భూగర్భజలాలను తిరిగి నింపగలిగే దానికంటే వేగంగా వాడేస్తున్నారు. [19] ఒకవేళ కొంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, దానిని పట్టుకోవటానికి ఎక్కువ ఖర్చు అవుతోంది .
వాతావరణ మార్పు
మార్చువాతావరణం, జల చక్రం మధ్య సన్నిహిత సంబంధాల కారణంగా వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బాష్పీభవనం పెరుగుతుంది, తద్వారా వర్షపాతం పెరుగుతుంది. అయితే, వర్షపాతంలో ప్రాంతీయ వైవిధ్యాలు ఉండవచ్చు. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమయాల్లో కరువులు, వరదలు సంభవించవచ్చు. పర్వత ప్రాంతాలలో హిమపాతం లోను, మంచు కరగడంలోనూ అనూహ్యమైన మార్పులు సంభవించవచ్చు. అధిక ఉష్ణోగ్రతల వలన, ఇంకా బాగా అర్థం కాని పద్ధతుల్లో కూడా నీటి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వాతావరణ మార్పు వలన సాగునీటికి, గార్డెన్ స్ప్రింక్లర్లు, బహుశా ఈత కొలనులలో నీటికి కూడా డిమాండు పెరుగుతుంది. పెరిగిన హైడ్రోలాజిక్ వైవిధ్యం, వాతావరణంలో మార్పు ప్రపంచ, ప్రాంతీయ, బేసిన్, స్థానిక వంటి వివిధ స్థాయిల్లో నీటి చక్రం, నీటి లభ్యత, నీటి డిమాండు, నీటి కేటాయింపుల ద్వారా నీటి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనే దానికి ఇప్పుడు తగిన ఆధారాలు ఉన్నాయి. [20]
భూగర్భ జలాశయాల క్షీణత
మార్చుపెరుగుతున్న మానవ జనాభా కారణంగా, నీటి కోసం పోటీ పెరుగుతోంది. తద్వారా ప్రపంచంలోని అనేక ప్రధాన భూగర్భ జలాశయాలు అడుగంటుతున్నాయి. దీనికి నేరుగా మానవులు వినియోగించే నీరే కాకుండా, భూగర్భజలాల ద్వారా వ్యవసాయం కూడా కారణమే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పంపులు భూగర్భ జలాలను తోడేస్తున్నాయి. ఉత్తర చైనా, నేపాల్, భారతదేశం వంటి పొడి ప్రాంతాలలో సాగునీటికి భూగర్భజలాలే ప్రధాన వనరు. తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో ఇక్కడ నీటిని తోడేస్తున్నారు. భూగర్భ జల మట్టం 10 - 50 మీటర్లు తగ్గిన నగరాల్లో మెక్సికో సిటీ, బ్యాంకాక్, బీజింగ్, చెన్నై, షాంఘైలు ఉన్నాయి. [21]
కాలుష్యం, నీటి సంరక్షణ
మార్చుఈ రోజు ప్రపంచంలోని ప్రధాన ఆందోళనలలో నీటి కాలుష్యం ఒకటి. అనేక దేశాల ప్రభుత్వాలు ఈ సమస్యను తగ్గించడానికి పరిష్కారాలను కనుగొనటానికి కృషి చేశాయి. చాలా కాలుష్య కారకాలు నీటి సరఫరాకు చేటు కలిగిస్తున్నప్పటికీ, చాలా విస్తృతమైన కారణం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, మురుగునీటిని శుద్ధి చెయ్యకుండా సహజ జలాల్లోకి విడుదల చేయడం. మురుగునీటిని పారవేసే ఈ పద్ధతి అభివృద్ధి చెందని దేశాలలో సర్వసాధారణమైన పద్ధతే గానీ, కానీ చైనా, భారతదేశం, నేపాల్, ఇరాన్ వంటి పాక్షికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇది ప్రబలంగా ఉంది. మురుగునీరు, బురద, చెత్త, విషపూరిత కాలుష్య కారకాలు కూడా నీటిలో కలుస్తున్నాయి. మురుగునీటిని శుద్ధి చేసినా కూడా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మురుగునీటిని శుద్ధి చేసాక, మడ్డి, బురద తయారౌతాయి. వీటిని పల్లపు ప్రదేశాలను పూడ్చేందుకు వాడవచ్చు, నేలపై పరచవచ్చు, కాల్చివేయవచ్చు లేదా సముద్రంలో పడవేయనూ వచ్చు. [22] మురుగునీటితో పాటు, వ్యవసాయ ప్రవాహం వంటి నాన్-పాయింట్ సోర్స్ కాలుష్యం కూడా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన కాలుష్య కారకంగా ఉంది. పట్టణ ప్రాంత వర్షపు నీటి ప్రవాహం, పరిశ్రమలూ ప్రభుత్వాలూ పారవేసే రసాయన వ్యర్ధాలు కూడా కాలుష్యానికి కారణాలు.
నీటి కోసం పోరాటం
మార్చునీటి కోసం పోటీ విస్తృతంగా పెరిగింది. మానవ వినియోగం, ఆహార ఉత్పత్తి, పర్యావరణ వ్యవస్థలు, ఇతర ఉపయోగాలకు నీటి అవసరాలను తీర్చడం కష్టంగా ఉంది. నీటి నిర్వహణలో తరచూ సంక్లిష్టమైన సమస్యలు ఎదురౌతున్నాయి. ప్రపంచవ్యాప్త వార్షిక నీటి లభ్యతలో సుమారు 10% మానవ అవసరాలకు ఖర్చౌతోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోతూంటే, మరికొన్నిచోట్ల మానవ జీవితం దుర్భరమైన స్థాయిలో నీటి ఎద్దడి ఉంటోంది. జనాభా, అభివృద్ధి పెరిగేకొద్దీ, నీటి డిమాండు పెరుగుతుంది. తద్వారా దేశంలో అంతర్గతంగాను, దేశం వెలుపలా సమస్యలు తలెత్తుతాయి.
గత 25 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, పాత్రికేయులూ భవిష్యత్తులో నీటి వివాదాలు యుద్ధాలకు దారితీస్తాయని ఊహిస్తూ వచ్చారు. కొందరి వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి: ఈజిప్టు మాజీ విదేశాంగ మంత్రి, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్ ఘాలి, "మధ్యప్రాచ్యంలో తదుపరి యుద్ధం రాజకీయాలపై కాకుండా నీటి కోసమే జరుగుతుంది" అని అంచనా వేశాడు; ఐరాసలో అతని వారసుడు, కోఫీ అన్నన్, 2001 లో, "మంచినీటి కోసం ఏర్పడే తీవ్రమైన పోటీ, భవిష్యత్తులో సంఘర్షణలకు, యుద్ధాలకూ మూలం కావచ్చు" అని అన్నాడు. ప్రపంచ బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్, "పరిపాలనలో గణనీయమైన మార్పులు సంభవించకపోతే వచ్చే శతాబ్దంలో జరిగే యుద్ధాలు నీటి కోసమే జరుగుతాయి" అన్నాడు. సింధు, జోర్డాన్, నైలు వంటి దేశాల సరిహద్దులు దాటి ప్రవహించే నదులపై గతంలో చేసిన పరిశోధనలలో నీటియుద్ధ పరికల్పనలకు మూలాలు ఉన్నాయి. నీటి సంబంధ వివాదాలను ఎదుర్కొన్నందున ఈ నదులపై దృష్టి పెట్టారు. జోర్డాన్ నది హెడ్ వాటర్లను మళ్లించడానికి సిరియా చేసిన ప్రయత్నాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం, నైలు నది ఎగువన ఆనకట్టలు నిర్మించ దలచిన దేశాలను ఈజిప్ట్ బెదిరించడం దీనికి ఉదాహరణలు. అయితే, కొన్ని ఘర్షణలకు నీటి వివాదం కారణమైనప్పటికీ, అన్నిటికీ అదే కారణమని అనుకోరాదు.
సుమేరియన్ దేశాలైన లగాష్, ఉమ్మా ల మధ్య క్రీ.పూ 2500 - 2350 మధ్య జరిగిన ఘర్షణ, నీటి కోసం జరిగిన యుద్ధాలకు ఏకైక ఉదాహరణ. [23] నీటి ఒత్తిడి చాలా తరచుగా స్థానిక, ప్రాంతీయ స్థాయిలో విభేదాలకు దారితీసింది. [24] జాతీయ సరిహద్దులను దాటి ప్రవహించే నదుల దిగువ ప్రాంతాలలో ఉద్రిక్తతలు తలెత్తుతూంటాయి. ఉదాహరణకు, చైనా లోని యెల్లో నది, థాయ్‌లాండ్‌లోని చావో ఫ్రేయా నదుల దిగువ ప్రాంతాలు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నీటితో సంబంధం లేకుండా జనించే ఘర్షణలు, రాజకీయ ఉద్రిక్తతలను నీటి ఒత్తిడి మరింత పెంచుతుంది. మంచినీటి నాణ్యత, పరిమాణాలు క్రమంగా తగ్గడం వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం, ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలగడం, ఘర్షణలు తీవ్రతరమవడం వంటివి జరిగి, అస్థిరత పెరుగుతుంది. [25]
నీటి కొరత
మార్చువనరులు పరిమితంగా ఉండడం, జనాభా వేగంగా పెరగడం వలన మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని బీద దేశాల్లో 2025 నాటికి నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. అప్పటికి, పెద్ద పట్టణ, ఉప పట్టణ ప్రాంతాలకు సురక్షితమైన నీరు, తగినంత పారిశుధ్యం అందించడానికి కొత్త మౌలిక సదుపాయాలు ఆవశ్యకమౌతాయి. ప్రస్తుతం మానవులు ఉపయోగించే నీటిలో ఎక్కువ భాగాన్ని వినియోగిస్తున్న సాగునీటి రంగం లోని వినియోగదారులతో విభేదాలు పెరగవచ్చని ఇది సూచిస్తోంది.
సాధారణంగా ఉత్తర అమెరికా, ఐరోపా లలోని అభివృద్ధి చెందిన దేశాలకు, రష్యాకూ 2025 నాటికి నీటి సరఫరాలో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. సాపేక్షికంగా అవి సంపన్న దేశాలవడమే కాకుండా, అందుబాటులో ఉన్న నీటి వనరులతో సరిపెట్టుకోవడం కూడా ప్రజలకు అలవాటు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఉత్తర చైనాలు చాలా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి. నీటి లభ్యత తక్కువగా ఉండడం మాత్రమే కాక, అందుబాటులో ఉన్న నీరు భరించగలిగే జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండడం కూడా ఇందుకు కారణమే. అధిక జనాభా పరిస్థితి కారణంగా దక్షిణ అమెరికా, సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణ చైనా, భారతదేశాల్లో చాలా వరకు ప్రజలు 2025 నాటికి నీటి కొరతను ఎదుర్కొంటాయి. ఈ ప్రాంతాల్లో కొరతకు కారణాలు - సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఆర్థిక పరిమితులు, అధిక జనాభా.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Earth's water distribution". United States Geological Survey. Archived from the original on 2012-06-29. Retrieved 2009-05-13.
- ↑ "Scientific Facts on Water: State of the Resource". GreenFacts Website. Retrieved 2008-01-31.
- ↑ Gleeson, Tom; Wada, Yoshihide; Bierkens, Marc F. P.; van Beek, Ludovicus P. H. (9 August 2012). "Water balance of global aquifers revealed by groundwater footprint". Nature. 488 (7410): 197–200. doi:10.1038/nature11295. PMID 22874965.
- ↑ "APWRIMS". apwrims.ap.gov.in. Retrieved 2021-03-23.
- ↑ "The World's Water 2006–2007 Tables, Pacific Institute". Worldwater.org. Retrieved 2009-03-12.
- ↑ 6.0 6.1 6.2 "WBCSD Water Facts & Trends". Archived from the original on 2012-03-01. Retrieved 2009-03-12. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "WBCSD Water Facts & Trends" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ UN Water – Coping with Water Scarcity 2007. fao.org
- ↑ United Nations Press Release POP/952, 13 March 2007. World population will increase by 2.5 billion by 2050
- ↑ Molden, D. (Ed.) (2007) Water for food, Water for life: A Comprehensive Assessment of Water Management in Agriculture. Earthscan/IWMI.
- ↑ Chartres, C. and Varma, S. (2010) Out of water. From Abundance to Scarcity and How to Solve the World’s Water Problems FT Press (USA).
- ↑ "Water Development and Management Unit – Topics – Irrigation". FAO. Retrieved 2009-03-12.
- ↑ "FAO Water Unit | Water News: water scarcity". Fao.org. Retrieved 2009-03-12.
- ↑ National Water Commission (2010). Australian environmental water management report. NWC, Canberra
- ↑ "Aral Sea trickles back to life". Silk Road Intelligencer. Archived from the original on 2011-12-05. Retrieved 2011-12-05.
- ↑ "World population to reach 9.1 billion in 2050, UN projects". Un.org. 2005-02-24. Retrieved 2009-03-12.
- ↑ Foster, S. S.; Chilton, P. J. (2003-12-29). "Groundwater – the processes and global significance of aquifer degradation". Philosophical Transactions of the Royal Society of London. Series B, Biological Sciences. 358 (1440): 1957–1972. doi:10.1098/rstb.2003.1380. PMC 1693287. PMID 14728791.
- ↑ "Water". World Bank.
- ↑ "Sustaining water for all in a changing climate: World Bank Group Implementation Progress Report". The World Bank. 2010. Retrieved 2011-10-24.
- ↑ "Europe's Environment: The Dobris Assessment". Reports.eea.europa.eu. 1995-05-20. Archived from the original on 2008-09-22. Retrieved 2009-03-12.
- ↑ "Water and Climate Change: Understanding the Risks and Making Climate-Smart Investment Decisions". World Bank. 2009. Retrieved 2011-10-24.
- ↑ "Groundwater in Urban Development". Wds.worldbank.org. 1998-03-31. p. 1. Retrieved 2009-03-12.
- ↑ Ocean dumping of sewage sludge is prohibited in the United States by the Marine Protection, Research, and Sanctuaries Act (MPRSA).
- ↑ Rasler, Karen A.; Thompson, W. R. (2006). "Contested Territory, Strategic Rivalries, and Conflict Escalation". International Studies Quarterly. 50 (1): 145–168. doi:10.1111/j.1468-2478.2006.00396.x.
- ↑ Wolf, Aaron T (2001). "Water and Human Security". Journal of Contemporary Water Research and Education. 118: 29.
- ↑ Postel, S. L.; Wolf, A. T. (2001). "Dehydrating Conflict". Foreign Policy. 126 (126): 60–67. doi:10.2307/3183260. JSTOR 3183260.