గండికోట యుద్ధం: తెలుగు వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూధర్మ సంరక్షణా తత్పరతకు ప్రతీక గండికోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలచి, విజయనగర రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన పెమ్మసాని నాయకులకు నెలవు గండికోట.

గండికోట

మార్చు
 
గండికోట వద్ద పెన్నానది

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.

పెమ్మసాని చినతిమ్మానాయుడు

మార్చు

విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్క రాయలు క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఈతని అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడు. ధరణికోట సమీపమున గల బెల్లంకొండ వాస్తవ్యుడు. మగ సంతానములేని కారణమున రామానాయుని తదుపరి తిమ్మానాయునికి అధికారము సంక్రమించింది. కలుబురిగె (గుల్బర్గా) యుద్ధములో తిమ్మానాయుని సాహసానికి సంతసించి రెండవ ప్రౌఢ దేవరాయలు క్రీ. శ. 1422లో యాడికి పరగణా వ్రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని గుత్తి, తాడిపత్రి, జమ్మలమడుగు ప్రాంతాలకు విస్తరించాడు. ఈతని తదుపరి వరుసగా పెమ్మసాని రామలింగ నాయుడు, పెదతిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నారసింహ, బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు. చివరి పాలకుడు చినతిమ్మా నాయుని కాలములో గండికోట ముస్లిముల వశమయ్యింది.

మీర్ జుమ్లా

మార్చు

మీర్ జుమ్లా పారశీక (ఇరాన్) దేశానికి చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. గోలకొండ రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి భారతదేశము చేరాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. మచిలీపట్టణములో స్థావరము ఏర్పరచుకొని తెలుగు దేశములోని వజ్రసంపదపై గురిపెట్టాడు[1].

విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న రాయలసీమపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట, జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో సా.శ. 1650లో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రం తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు[2].

యుద్ధం

మార్చు

అనేక దినాల భీకరయుద్ధం తరువాత కూడా కోట వశము కాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారాయి. గండికోట అప్పగిస్తే గుత్తి దుర్గానికి అధిపతి చేస్తానని జుమ్లా బేరసారాలు చేశాడు. మంత్రి చెన్నమరాజు సంధి చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. విజయమో వీరస్వర్గమో రణభూమిలోనే తేలగలదని నాయుని అభిప్రాయం[3]. క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చాడు. ఈ ఫిరంగుల ధాటికి కోట గోడలు బద్దలయ్యాయి. యుద్ధం మలుపు తిరిగింది.

వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ సతీసహగమనము చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణానికి కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరించింది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి, వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేసారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకారు. హతాశుడైన చినతిమ్మ రాయబారానికి తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందం కుదిరింది. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషం ఇప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువుల కప్పగించి రాజ్యము దాటిస్తాడు. తిమ్మానాయుడు విషప్రభావము వల్ల మరణించాడు.[4]

యుద్ధం ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలోనున్న మీర్ జుమ్లాను కలిశాడు. ఆ సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన పుస్తకములో వ్రాశాడు[5].

మీర్ జుమ్లా గండికోటలోని మాధవస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు[6]. కోటను ఫిరంగుల తయారీకి స్థావరంగా మార్చాడు.[7] గండికోటపై సాధించిన విజయంతో మీర్ జుమ్లా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు[8]. ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోటను సందర్శించాడు.

బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ నాయుణ్ణి తమిళదేశానికి తరలించారు. గండికోటలోని అరవయ్యారు ఇంటిపేర్లు గల కమ్మ వంశాలవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోయారు. వీరికే 'గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అనే పేర్లు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు, నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెట్టాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్‌పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.

మూడు శతాబ్దాలు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయాలు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.

మూలాలు

మార్చు
  1. The Life of Mir Jumla, J. N. Sarkar, Rajesh Publications, Delhi, 1979, pp. 4-5
  2. The French in India, Rose Vincent, 1990, Popular Prakashan, p.9, ISBN 0861322592
  3. Dr Ghulam Yazdani Commemoration Volume, H. K. Sherwani, 1966, Dr Abul Kalam Azad Oriental Research Institute, Delhi
  4. గండికోట యుద్ధం, కొసరాజు రాఘవయ్య, 1977, కమ్మజన సేవాసమితి, గుంటూరు
  5. Ball, V. and Crooke,W., Tavernier's Travels in India, 2001, Asian Educational Services, ISBN 8120615670
  6. District Gazetteer, Cuddapah, C. F. Brackenbury, 1915, Government Press, Madras, ISBN 8120614828
  7. గండికోట కైఫీయత్
  8. Asia in the Making of Eurpe: A Century of Advance, Book 2, South Asia, D. F. Lach and E. J. Van Kley, 1998, University of Chicago Press, p. 1077; ISBN 0226467678, 9780226467672