గాడ్గే బాబా

సంఘ సంస్కర్త, సంచార సాధువు

దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్ (ఫిబ్రవరి 23, 1876డిసెంబర్ 20, 1956) సంత్ గాడ్గే మహరాజ్‌గా, గాడ్గే బాబాగానూ(హిందీ: गाडगे बाबा) సుప్రఖ్యాతుడైన సాధువు, సంఘసంస్కర్త. సంచార భిక్షువు. మహారాష్ట్రవ్యాప్తంగా వున్న తన భక్తుల సహకారం తీసుకుని వారంవారీ పండుగలు నిర్వహించేవారు. గ్రామాలలో శుభ్రత, తోటివారికి సాయపడే లక్షణం, సేవ వంటివాటిని ప్రచారం చేస్తూండేవారు. భారతదేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలూ, సేవాసంస్థలు ఆయనను స్ఫూర్తిగా స్వీకరిస్తూన్నారు.[1]

సంత్

గాడ్గే బాబా

మహరాజ్
Gadge baba.jpg
సంత్ గాడ్గే బాబా
జననం
దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్

(1876-02-23)1876 ఫిబ్రవరి 23
షేన్‌గావ్, అంజన్‌గావ్ తాలూకా, అమరావతి జిల్లా, మహారాష్ట్ర
మరణం1956 డిసెంబరు 20(1956-12-20) (వయస్సు 80)
సమాధి స్థలంవాల్‌గావ్, అమరావతి జిల్లా, మహారాష్ట్ర
20°59′56″N 77°42′23″E / 20.99889°N 77.70639°E / 20.99889; 77.70639
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుసంత్ గాడ్గే బాబా,
సంత్ గాడ్గే మహరాజ్,
దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్
పౌరసత్వంభారతీయుడు
విద్యనిరక్షరాస్యుడు
వృత్తిసాధువు
సుపరిచితుడుసంఘసంస్కరణ,
ఆధ్యాత్మిక చైతన్యం,
స్వచ్ఛతా ఉద్యమం,
కులనిర్మూలన,
విద్యాదానం
ఉద్యమంపరిశుభ్రత, అంటరానితనం నిర్మూలన
తల్లిదండ్రులుజింగ్రాజీ
సక్కుబాయి

వ్యక్తిగత జీవితంసవరించు

ఆయన అసలుపేరు దేవీదాస్ దేబూజీ. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. వారు రజక కులంలో జన్మించినా తండ్రితాతల కాలం నుంచే ఉన్న భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు. తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు. మేనమామ కూడా మంచి భూవసతి కలిగినవాడు కావడంతో దేబూజీ ఆయన పశువుల్ని చూసుకుంటూ, పొలంపనులు చేస్తూ కుటుంబంలో మంచిపేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచీ భజనమండళ్ళలో కీర్తనలు, పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రఖ్యాతిపొందారు. ఆయన సన్యాసాశ్రమ పూర్వపు జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. షావుకారు తన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకోబోగా దానిని సహించలేక ఎదురుతిరిగారు. షావుకారు గూండాలను పంపితే దేబూజీ ఒక్కడే వారందరినీ తన్ని తరిమేశారు.[1]
దేబూజీ తన 29వ ఏట ఫిబ్రవరి 5, 1904న కుటుంబాన్ని అర్థరాత్రివేళ విడిపెట్టి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయనకు తల్లి, తాత, భార్య, పిల్లలు ఉన్నారు. అప్పటికే ఆయన ఇద్దరు బిడ్డల తండ్రి కావడంతోపాటుగా భార్య గర్భవతిగా ఉంది. అనంతరకాలంలో ఆయన సన్యాసం స్వీకరించి, గాడ్గేబాబాగా సుప్రసిద్ధులయ్యారు. తర్వాతి కాలంలో ఆయన కుటుంబం అనుసరించగా వారిని ఎప్పటిలాగానే సామాన్యమైన పూరిల్లులో ఉంచారు.[1]

సన్యాసిగాసవరించు

దేవూజీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాకా రంగురంగుల పీలికలను కలిపికట్టుకునేవారు. ఆయన భిక్షను స్వీకరించే మట్టిపాత్ర(మరాఠీలో గాడ్గే) తలపై పెట్టుకుని తిరుగుతూండడంతో ఆయనను గాడ్గే బాబాగానూ, గాడ్గే మహరాజ్ గానూ పిలిచేవారు. గ్రామాల్లో సంచరిస్తూ భిక్షను స్వీకరించడమే కాక వారికి స్వయంగా రచించిన కీర్తనలను ఆలపిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక సాంఘిక విషయాల పట్ల చైతన్యం రేకెత్తించేవారు.

సేవాకార్యకలాపాలుసవరించు

గాడ్గే బాబా ఆధ్యాత్మిక విషయాలను బోధించడంతో పాటుగా సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, సేవాకార్యక్రమాలు చేపట్టడం వంటివి చేసేవారు. ఆకలితో వున్నవారికి ఆహారం, దాహంతో అలమటిస్తున్నవారికి నీరు, దుస్తులు లేనివారికి వస్త్రాలు, పేదలకు నాణ్యమైన విద్య, రోగులకు వైద్యం, తలదాచుకునేందుకు నివాసం, జంతువులకు రక్షణ, నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు ఆలంబన, పేద యువతీయువకులకు వివాహం జరగాలని ఆశించి, అందుకోసం జీవితమంతా కృషిచేశారు. భక్తులను ప్రోత్సహించి, వారి విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు, శరణాలయాలు, గోశాలలు, ఆస్పత్రులు, విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారు. వందలాది సేవాసంస్థలను, ట్రస్టులను నిర్మించిన బాబా తన కుటుంబసభ్యులను, బంధువులను ఆయా ట్రస్టుల్లోని పదవుల్లో నియమించకుండా సేవాభిలాష ఉన్న సహచరులనే ఎంపికచేసి నియమించడం విశేషం. జ్యోతీరావ్ ఫులే అనంతరం మహారాష్ట్రలో అత్యంత సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన వ్యక్తులలో గాడ్గే బాబా ఒకరు.

పరిశుభ్రతసవరించు

సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోని మురికిని, చెత్తను చీపురుతో శుభ్రపరిచేవారు. ఆయన పరిశుభ్రతకే తన జీవితాన్ని అంకితం చేసినవ్యక్తిగా పేరు పొందారు. తన భక్తులకు పరిశుభ్రత ద్వారానే భగవత్సేవ చేయమని ప్రబోధం చేసేవారు. కొన్నేళ్లు గడిచాకా గ్రామగ్రామాలలో అపరిశుభ్రతను రూపుమాపి, శుభ్రపరిచేందుకు చీపురు దండును నెలకొల్పాడు. బాబా స్థాపించిన చీపురుదండులో కృషిచేసినవారిలో ఎందరో తదనంతర కాలంలో రచయితలుగా, పత్రికా సంపాదకులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి ఆయన భావజాలానికి ప్రత్యక్ష పరోక్ష వ్యాప్తిని కల్పించారు. ఎక్కడ స్వచ్చత ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు అనేది గాడ్గే ప్రబోధించేవారు. గంగానది పూర్తి పరిశుభ్రతా మరియు దానిని కాలుష్య రహిత నదిగా చూడాలనేది ఆయన కల కూడా!

కులవివక్షపై పోరాటంసవరించు

బాబా కులవివక్షను, కులతత్త్వాన్నీ తీవ్రంగా వ్యతిరేకించేవారు. గాడ్గే బాబాను ఎవరైనా మీదే కులం అని ప్రశ్నిస్తే, నేను దళితుణ్ణని సమాధానం చెప్పేవారు. పండరిపూర్‌లో స్వామివారి ఉత్సవాలు వర్షాకాలంలో జరిగేవి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు దూరతీరాల నుంచి వచ్చి పాల్గొనే భక్తులతో క్షేత్రమంతా కిక్కిరిసిపోయేది. అప్పట్లో ఆలయ ప్రవేశార్హత లేక కేవలం ఆలయంపై వుండే కలిశాన్ని చూసేందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే దళిత కులస్తుల ఇక్కట్లు మరీ ఎక్కువగా వుండేవి. వారు విశ్రాంతి తీసుకునేందుకు, బసచేసేందుకు ఏర్పాట్లూ లేవు. వారి ఇబ్బందులను గమనించిన గాడ్గే బాబా భక్తులు, ప్రజల సహకారాలను అర్థించి అక్కడ చొక్క మేళా పేరుతో ఓ ధర్మశాల నిర్మించారు. దళిత భక్తుల కోసం కట్టించిన తొలి ధర్మశాలగా ఇది ప్రఖ్యాతి పొందింది.[1]

జంతు బలులకు వ్యతిరేకంగా పోరాటంసవరించు

బాబా తన పర్యటలనలో జంతుబలులను ఖండించేవారు. సంతానం కలిగినపుడు ఇచ్చే జంతుబలులను ఉద్దేశించి ఒక జీవి పుట్టుక సందర్భంగా ఇంకో జీవిని బలి ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించేవారు.

విద్యాసేవసవరించు

విద్యాభ్యాసమే సమాజంలోని మూఢత్వానికి, వెనకబాటుతనానికి విరుగుడు కాగలదని నమ్మే బాబా తన భక్తులిచ్చిన విరాళాలను వినియోగించి అనేక పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించారు. వందకు పైగా పాఠశాలలను ఆయన నెలకొల్పారు.

రోగులకు, ఆర్తులకుసవరించు

ఇళ్ళులేని, ఆధారంలేని వృద్ధులను ఆదరించేందుకు వృద్ధాశ్రమాలు నిర్మించారు. సమాజం నుంచే కాకుండా అత్యంత సన్నిహితుల నుంచి కూడా దూరమై దారునమైన వివక్షను అనుభవిస్తున్న కుష్ఠురోగులకు సేవచేసేందుకు గాడ్గే బాబా కుష్ఠురోగులకు సేవాశాలలు నిర్మించి వారికి సేవాకార్యకలాపాలు చేపట్టారు.

వ్యవసనాలపై పోరాటంసవరించు

చిన్నతనంలోనే తండ్రిని తాగుడు కారణంగా పోగొట్టుకున్న గాడ్గే బాబాపై వ్యసనాలపై వ్యతిరేకత జీవితాంతం కొనసాగింది. తన కీర్తనల ద్వారా మద్యపానం, ధూమపానం, జూదం వంటి దుర్వ్యసనాలకు వ్యతిరేకంగా చైతన్యాన్ని ప్రజల్లో వ్యాపింపజేశారు. తాగుడు వ్యసనం కుటుంబాల ఆర్థిక స్థితిని, వ్యక్తి ఆరోగ్యస్థితిని, మానసికస్థితిని ఎలా దెబ్బతీస్తుందో మనస్సుకు హత్తుకునేలా వివరించేవారు. తాగి ఇంటికి వస్తే తండ్రినైనా కొట్టి మాన్పించమని ఆయన ప్రబోధం.

ప్రభావంసవరించు

 
సంత్ గాడ్గే మహరాజ్‌తో బి.ఆర్.అంబేద్కర్

మహారాష్ట్ర సమాజంపైన ఆయన సామాజిక బోధనల ప్రభావం ఉంది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు బి.ఆర్.అంబేద్కర్ గాడ్గే బాబా కార్యకలాపాలకు, వ్యక్తిత్వానికి, భావజాలానికి ప్రభావితులై ఆయన గురువుగా సంబోధించేవారు. అంబేద్కర్ మతం మార్చుకుందామని భావిస్తున్న సమయంలో తాను అభిమానించే గాడ్గే బాబాను సలహాకోరారు. నేను చదువుకున్నవాడిని కాను, నీవే ధర్మాల మర్మాలు ఆలోచించగలిగినవాడివి. నిన్ను లక్షలమంది అనుసరిస్తారు కాబట్టి హిందూమతానికి హానికలగకుండా మాత్రం చూడు అని సలహా ఇచ్చారు బాబా.[1] మహాత్మా గాంధీ సైతం ఆయన భావాలకు, ఆచరణకు ముగ్ధుడై బాబాను సందర్శించాలని భావించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు బి.జి.ఖేర్ స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహారాష్ట్రలో పర్యటిస్తున్న మహాత్మా గాంధీకి గాడ్గే కార్యకలాపాల గురించి వివరించగా ఆయనను కలవాలన్న కోరిక వ్యక్తపరిచారు. కొద్ది సంవత్సరాల తర్వాత గాడ్గే బాబా గాంధీజీ సేవాశ్రమానికి దగ్గరలోని వార్ధాకు విచ్చేసిన సమయంలో వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించి కలిశారు. గాంధీజీని కలిసినప్పుడు వారిద్దరూ సమాజంలోని అవిద్యను, అంటరానితనాన్ని, దుర్వ్యసనాలను రూపమాపడం వంటి విషయాలపై చర్చించారు. అలానే అప్పటికే గాడ్గే బాబా ఆయా విషయాలలో చేసిన విశేషమైన కృషిని తెలుసుకున్న గాంధీ వారిని మెచ్చుకున్నారు.[2] మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బి.జి.ఖేర్, నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన పంజావ్ రావు, బాబూరావ్ పాటిల్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ జి.డి.తపసే, పాత్రికేయులు అనంత్ హరిగద్రే, ప్రబోంధాకర్ థాకరే, మరాఠా రచయిత పి.కె.ఆత్రే(ఆయన ప్రముఖ మరాఠా రాజకీయనేత బాల్ థాకరే తండ్రి), జి.ఎన్.దండేకర్ సహా ఎందరో ప్రముఖులు ఆయన శిష్యులు. వారందరూ ఆయన ప్రారంభించిన చీపురు దండులో సభ్యులుగా పనిచేసినవారే.[2]

ఆయన సంఘంలోని సంస్కరణల కోసం కృషిచేసిన పలువురు సాధువుల నుంచి స్ఫూర్తి పొందారు. చొక్కమేళ అనే దళిత సాధువును అభిమానించే గాడ్గే బాబా ఆయన పేరుమీదుగానే తాను దళితుల కొరకు నిర్మింపజేసిన ధర్మశాల పేరుపెట్టారు. గాడ్గే మహరాజ్‌కు ఆయన సమకాలికులైన మెహర్ బాబాపై చాలా గౌరవాభిమానాలుండేవి. ఆయనను స్వయంగా తన కుష్ఠురోగుల ఆశ్రమానికి ఆహ్వానించి ఇద్దరూ కలిసి రోగులకు స్నానాలు చేయించారు.[1] గాడ్గే మహరాజ్ సమకాలికుడు, ఆయన తర్వాతి తరపు సంఘసంస్కర్త అయిన తుక్డోజీ మహరాజ్‌తో కూడా సత్సంబంధాలు నెరపారు.

ప్రాచుర్యం-గౌరవాలుసవరించు

 
1999లో తపాలాశాఖ విడుదల చేసిన సంత్ గాడ్గే బాబా తపాలా బిళ్ళ

గాడ్గే బాబా జీవించివున్నప్పుడు, మరణానంతరం కూడా ఆయన కృషికి వివిధ రూపాల్లో గౌరవం లభిస్తూనేవుంది.

మరణంసవరించు

1956 డిసెంబరు 20న అమరావతి వెళుతుండగా పేధీ నదీతీరాన వలగావ్ దగ్గర తనువు చాలించారు.[5]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 సాంబశివరావు, మల్లంపల్లి (22 ఫిబ్రవరి 2015). "'స్వచ్ఛ' బాబా". ఆదివారం ఆంధ్రజ్యోతి.
  2. 2.0 2.1 "సమతా రుషి". సూర్య. సూర్య. 23 ఫిబ్రవరి 2014. Retrieved 22 February 2015.[permanent dead link]
  3. "About us". sant gadge baba amaravati university-official website. sant gadge baba amaravati university. Retrieved 22 February 2015.
  4. "SAINT GADGE BABA AND GRAM SWACHATA ABHIYAN". ఇండియన్ సానిటేషన్ పోర్టల్. Archived from the original on 7 అక్టోబర్ 2014. Retrieved 22 February 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-02-24.