చెంగల్వ పూదండ (నాటిక)

చెంగల్వ పూదండ తెలుగు భాష ఔన్నత్యాన్నీ, ఆవశ్యకతనూ చాటిచెప్పే సాంఘీక నాటిక. ఈ నాటికను శిష్ట్లా చంద్రశేఖర్‌ రచించగా శ్రీ కళానికేతన్, హైదరాబాదు సమర్పణలో నటుడు దర్శకుడైన వెంకట్ గోవాడ దర్శకత్వం వహించాడు.[1]

చెంగల్వ పూదండ
రచయితశిష్ట్లా చంద్రశేఖర్‌
దర్శకుడువెంకట్ గోవాడ
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘిక నాటిక
నిర్వహణశ్రీ కళానికేతన్, హైదరాబాదు

పరభాషా వ్యామోహంలో మాతృభాషను మరవొద్దని సున్నితంగా చెప్పిన నాటిక ఇది. శ్రీధర్ ఒక స్కూల్ నడిపిస్తుంటాడు. సరిగ్గా ఇంగ్లీషురాని అతని భార్య గౌరి కూడా అదే స్కూల్ లో పనిచేస్తూ ఉంటుంది. శ్రీధర్ తండ్రి విశ్వంభరశాస్త్రి. తెలుగు పండితుడు. రిటైర్ అయ్యాడు. ఆయనకి తెలుగుభాషపై ఎనలేని మక్కువ. లావణ్య శ్రీధర్ గౌరిల కూతురు. శాస్త్రిగారికి మనవరాలంటే చాలా ఇష్టం. అలాగే ఆ పాపకి కూడా తాతంటే ఇష్టం.ఆయన ముందే శ్రీధర్, అతని భార్య తెలుగుని కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు. స్కూల్ లో తెలుగు మాధ్యమం తీసేయాలని ప్రయత్నిస్తారు. తెలుగు మాష్టార్ని ఉద్యోగంనుండి తీసేస్తారు. ఆ విషయంలో శాస్త్రికి కొడుకూ కోడలితో వాగ్వాదం జరుగుతుంది. అలా తీసేసిన తెలుగు మాష్టారు మాధవ ఒకప్పటి శాస్త్రిగారి శిష్యుడు. అందుకే శాస్త్రిగారు అతనికి ఆ ఇంట్లోనే తన పెన్షన్ డబ్బునుంచే జీతం ఇస్తూ తెలుగు భాషా సేవకై సహాయంగా నియమించుకుంటాడు. ఇది కొడుకూకోడళ్ళకి నచ్చదు. స్కూల్ లో టీచర్, తల్లీ లావణ్యను ఇంగ్లీష్ లోనే మాట్లాడమని కొట్టడంవలన ఏడుస్తూ తాతయ్యదగ్గరికి వస్తుంది. కథ చెప్పమంటుంది. అప్పుడాయన తెలుగు భాషా పరిరక్షణకు తోడ్పడిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కథ చెబుతాడు. ఆనాడు బ్రౌన్ తెలుగు భాషోధ్ధరణకు పూనుకున్న వైనం కళ్ళకుకట్టినట్లు వేదికపై కనిపిస్తుంది. తెలుగు భాషామతల్లి దీనంగా బ్రౌన్ ని అర్ధించడం లావణ్యకనులకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్రౌన్ తన సంపాదనంతా తెలుగు భాషోధ్ధరణకు ధారపోయడం, వేమన వంటి గొప్ప కవుల రచనలను తాళపత్రాలలో శోధించి వాటన్నింటినీ పదిలంచేయించడం వంటి దృశ్యాలుంటాయి. ఇవన్నీ తెలుసుకున్న లావణ్య తాతయ్యతో ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. తరువాతి సందర్భంలో కొడుకూ కోడళ్ళు శాస్త్రిగారికి దూషించడం, ఆ నేపధ్యంలో ఆయన మనవరాలితో శ్రీశ్రీ, దాశరథుల జీవిత కథలను కంటికి కనిపించేలా చెప్పడం జరుగుతాయి. ఇంతలో వచ్చిన పోస్ట్ చూశి గౌరి కూతురిని ముద్దాడుతూ తీసుకెళ్తుంది. ఆ తరువాత ఓ పెద్ద స్కూల్ వార్షికోత్సవసభలో మంత్రిగారొస్తున్న హడావుడి. ఆ సభలో మంత్రిగారు కూడా తెలుగుభాష గొప్పదనం గూర్చి మాట్లాడడం జరుగుతుంది. అక్కడే రాష్ట్రస్థాయి తెలుగు వ్యాసరచనపోటీలో ప్రథమ బహుమతి పొందిన లావణ్యకి మంత్రిగారు బహుమతి ఇవ్వబోవడం జరుగుతుంది. బహుమతి తీసుకోవడానికి ముందే కొన్ని కరపత్రాలను లావణ్య జనానికి పంచుతుంది. జనం కరపత్ర విషయాలు నిజమేనా అని అడుగుతారు. అవును. ఇంట్లో జరిగిన విషయాలన్నీ కరపత్రంగా రాసి పంచానని ఒప్పుకుంటుంది. అప్పుడు మంత్రి అడుగగా తెలుగు భాషకు పట్టినగతి ఎంతో దైన్యంగా చెప్తుంది. అమ్మభాషకే నోచుకోవట్లేదని, తెలుగు మాట్లాడితే స్కూల్ లో కొడుతున్నారని చెప్తుంది. "పులుల్నీ, సింహాల్నీ తయారు చేసిన తెలుగు జాతి ఇవాళ కుక్కల్నీ, పిల్లుల్నీ తయారుచేస్తోంది." "గుర్తుంచుకోండి. మూడేళ్ళకి మీరు మమ్మల్ని హాస్టల్లో వేస్తే, ముప్పైఏళ్ళొచ్చేసరికి మేం మిమ్మల్ని వృద్దాశ్రమంలో చేరుస్తాం" అంటూ తెలుగు భాష ఔన్నత్యం, ఆవశ్యకతలనూ తెలియజేసి తనకు ఈ బహుమతి రావడానికఅ తాతయ్యే కారణమని చెప్తుంది.ఇదంతా గమనించిన శ్రీధర్, గౌరిల పశ్చాత్తాపం, శాస్త్రి, లావణ్యల సత్కారంతోపాటు "కమ్మనైన తెలుగుభాష కలనైనా మానొద్దు అమ్మపాలకమ్మదనం, మాతృభాషమరవొద్దు" అనే నినాదంతో నాటిక ముగుస్తుంది.

ప్రదర్శన వివరాలు

మార్చు

బహుమతుల వివరాలు

మార్చు
  • 2013 అజో విభో కందాళం ఫౌండేషన్ అనంతపురం (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు)
  • 2013 నంది నాటకోత్సవాలు, విజయనగరం (ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
  • 2013 పాలకొల్లు కళాపరిషత్తు, పాలకొల్లు (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 ద్రాక్షారామ నాటక కళాపరిషత్తు, ద్రాక్షారామం(ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 రంగస్థలి, నర్సరావుపేట (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 కోన ప్రభాకరరావు పరిషత్తు, బాపట్ల (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ ప్రశంసా నటి, ఉత్తమ ప్రశంసా నటుడు)
  • 2013 అభినయ నాటక పరిషత్తు (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ రచన)
  • 2013 సి.ర్.సి. కాటన్ కళాపరిషత్తు, (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు)
  • 2013 ఏ.ఎస్. రాజా నాటకోత్సవాలు, విశాఖ (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం)[5]
  • 2013 శ్రీకారం రోటరీ కళాపరిషత్తు, మార్టూరు (ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ తృతీయ ప్రదర్శన)
  • 2013 వి.ఎస్.ఎన్.మూర్తి కళాపరిషత్తు, రాయవరం (ఉత్తమ ఆహార్యం)
  • 2013 ప్రగతి కళామండలి, సతేనపల్లి (ఉత్తమ రచన, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం)
  • 2013 నాగార్జున కళాపరిషత్తు, కొండపల్లి (ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ బాల నటి)
  • 2013 కళావాణి, నాగులపాలెం (ఉత్తమ రచన, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
  • 2013 మార్కండేయ నాటక కళాపరిషత్తు, తాటిపర్తి (ఉత్తమ బాలనటి )
  • 2013 బి.హెచ్.ఈ.ఎల్., హైదరాబాద్ (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటి, ఉత్తమ జ్యూరీ నటుడు)

మూలాలు

మార్చు
  1. నవతెలంగాణ, హైదరాబాదు (12 September 2015). "అక్కినేని నాటక పోటీలు ప్రారంభం". NavaTelangana. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.
  2. అలరించిన 'చెంగల్వ పూదండ' నాటిక, విశాలాంధ్ర, గుంటూరు, 28 డిసెంబరు 2014, పుట.7
  3. నమస్తే తెలంగాణ (13 September 2015). "పోటాపోటీగా నాటికలు". Archived from the original on 14 సెప్టెంబరు 2015. Retrieved 16 April 2020.
  4. ప్రజాశక్తి, జిల్లాలు (22 July 2015). "4 నుంచి ఆహ్వాన నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.
  5. ఆంధ్రభూమి, జిల్లాలు (14 April 2013). "'దిక్సూచి'కి ఉత్తమ ప్రదర్శన బహుమతి". isonymic2.rssing.com. Archived from the original on 16 ఏప్రిల్ 2013. Retrieved 16 ఏప్రిల్ 2020.