డా. వెంకట్‌ గోవాడ తెలుగు నాటకరంగంలో యువ నాటక దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇంటర్మీడియట్‌ బోర్డులోడిప్యూటీ సెక్రెటరీ/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూనే రంగస్థలంపై నటిస్తున్నాడు. థియేటర్‌ ఆర్ట్స్‌లో పిజి డిప్లొమో చేశారు.[1]

డా. వెంకట్ గోవాడ
జననం (1972-04-01) 1972 ఏప్రిల్ 1 (వయసు 51)
వృత్తిఇంటర్మీడియట్‌ బోర్డులో డిప్యూటీ సెక్రెటరీ/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగస్థల నటులు, దర్శకులు, నిర్మాత
ఎత్తు5.8 1/2
జీవిత భాగస్వామిరాధ
పిల్లలుఇద్దరు కమార్తెలు (డా. గీతిక, డా. హారిక)
తల్లిదండ్రులు
 • శ్రీరామమూర్తి (తండ్రి)
 • మల్లేశ్వరి (తల్లి)

జననం - విద్యాభ్యాసం - ఉద్యోగం మార్చు

వెంకట్ గోవాడ ఏప్రిల్ 1, 1972 శ్రీరామమూర్తి, మల్లేశ్వరి దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. వీరు బి.కామ్ తరువాత ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి లను హిందీ భాషలో చేశారు. అందునా పిహెచ్.డిలో తనకిష్టమైన నాటక పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఉప కార్యదర్శి (డిప్యూటీ సెక్రెటరీ)/పరిపాలనా అధికారి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) గా పనిచేస్తున్నారు.

వివాహం - సంతానం మార్చు

1996 ఏప్రిల్ 11న రాధతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ డాక్టర్లుగా స్థిరపడ్డారు. (డా. గీతిక, డా. హారిక).

రంగస్థల ప్రవేశం మార్చు

కళాశాల పరిధిలో, కార్యాలయంలో కొన్ని చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ క్షమయా ధరిత్రి ఈయన మొదటి నాటకం. అంతకుముందు తన ఉద్యోగ మిత్రులతో కలిసి కొన్ని నాటకాలు వేసిన అనుభవం వీరికి పనికివచ్చింది. ఇప్పటిదాకా 124 నాటకాలు వేశారు. దాదాపు 800 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో సాంఘిక నాటికలు, నాటకాలతో పాటు పద్య నాటకాలూ ఉన్నాయి. పునాది 44 ప్రదర్శనలు, రాజగృహప్రవేశం 26 ప్రదర్శనలు, తెలుగు మహాసభల సందర్భంగా రాయించిన చెంగల్వపూదండ 24 ప్రదర్శనలు జరిగాయి. హిందీలోనూ కొన్ని నాటికల్లో నటించారు.

వెంకట్‌ గోవాడ కొంతమంది మిత్రులతో కలిసి 2013లో ‘‘గోవాడ క్రియేషన్స్‌’’ ప్రారంభించారు.[2]

నాటికలు - నాటకాలు మార్చు

తెలుగు

 • అహంబ్రహ్మ
 • సరిహద్దు
 • చిత్తగించవలెను
 • యాజ్ఞసేని ఆత్మకథ
 • కోదండపాణి
 • చెంగల్వ పూదండ
 • గురుబ్రహ్మ
 • ఇది అహల్యకథ కాదు
 • పునాది
 • పడమటిగాలి
 • రాజిగాడు రాజయ్యాడు
 • వాఘిరా
 • మిస్సింగ్ ఫైల్
 • పట్టపురాణి తలపోటు
 • అశోకం
 • అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
 • ధన ధన ధనదాహం
 • యథారాజా తథాప్రజా
 • డా. పరలోకం ఫైవ్ స్టార్ హోటల్
 • కొమరం భీం
 • వెంగమాంబ (నటన)
 • రచ్చబండ (దర్శకత్వం)
 • యజ్ఞం (దర్శకత్వం)
 • శ్రమణకం (దర్శకత్వం)
 • ఆకాశదేవర
 • మనసు చెక్కిన శిల్పం (దర్శకత్వం)
 • ప్రతాపరుద్రమ (నటన)
 • అన్నట్టు మనం మనుషులం కదూ (దర్శకత్వం)
 • స్వార్ధం (దర్శకత్వం)
 • ఎర్రకలువ (నటన, దర్శకత్వం)

హిందీ

 • అంతరాల్
 • సూర్యకి అంతిమ్ కిరణ్ సే పహ్లి కిరణ్ తక్
 • మహాభారత్ కి ఏక్ సాంజా
 • జూతే
 • కహానీ ఏక్ సఫర్ కి

సీరియళ్లు - సినిమాలు మార్చు

సీరియళ్లు - ఆత్మీయులు ఈయన మొదటి సీరియల్‌. 1999 నుంచి ఇప్పటి వరకు 38 టివి సీరియళ్లలో నటించారు. ఆడదే ఆధారం (ఈటీవి), క్రాంతి రేఖ (డి‌డి), ఆత్మీయులు (డి‌డి), జీవనసంధ్య (డి‌డి), సీతారామపురం అగ్రహారం (డి‌డి), ఊహలపల్లకి (డి‌డి), పెళ్ళినాటి ప్రమాణాలు (జీతెలుగు), నాగాస్త్రం (ఈటీవి), అర్చన (జెమిని), కాలచక్రం (డిడి), సంసారం...సాగరం (డిడి), అలౌకిక (ఈటీవి), అనురాగం (డిడి), ఘర్షణ (ఈటీవి), విధి (ఈటీవి), ఆడదే ఆధారం (ఈటీవీ), అలా మొదలైంది (ఈటీవీ), పున్నాగ (జీతెలుగు), అంబేద్కర్ (డిడి), స్వర్ణఖడ్గం (ఈటీవి), నేను శైలజ (ఈటీవీ ప్లస్), నెం.1 కోడలు (జీ తెలుగు), మిఠాయి కొట్టు చిట్టెమ్మ (జీ తెలుగు) వంటి ధారావాహికల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు .

సినిమాలు - మేఘం, పవన్‌ సుబ్బలక్ష్మి ప్రేమించుకున్నారట, గ్రేట్‌ లవర్‌, స్టూడెంట్‌ స్టార్‌, జై బోలో తెలంగాణా, మండోదరి, బొమ్మల రామారం, జయదేవ్, ఐ‌ఐ‌టి కృష్ణమూర్తి, ఆశ (ఎన్కౌంటర్), కృష్ణ ఘట్టం వంటి సినిమాలలో నటించారు.

రంగస్థల గురువులు మార్చు

నాటకరంగంలో ఉద్దండులైన 28 మంది దర్శకుల వద్ద పనిచేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో పిజి డిప్లొమో ఇన్‌ యాక్టింగ్‌ చేస్తున్నప్పుడు అక్కడ థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతిగా ఉన్న, ప్రముఖ దర్శకులు డి.ఎస్.ఎన్. మూర్తి, ఆచార్య భిక్షు, చాట్ల శ్రీరాములు, ఎంజి ప్రసాద్‌, బిపి ప్రసాదరావు, తల్లావజ్ఝుల సుందరం, డాక్టర్‌ భాస్కర్‌ శివాల్కర్, గుంటూరు శాస్త్రి, పాటిబండ్ల ఆనందరావు, ఎస్.ఎం. బాషా, తులసి బాలకృష్ణ, భరద్వాజ, రమణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేశారు.

అవార్డులు - పురస్కారాలు మార్చు

 1. దుర్గి వెంకటేశ్వర్లు రంగస్థల పురస్కారం (కోమలి కళాసమితి, నల్లగొండ. 2011)
 2. గరికపాటి రాజారావు రంగస్థల పురస్కారం (యువకళావాహిని, హైదరాబాద్. 2015)
 3. వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (వి.ఎన్.ఆర్. ట్రస్ట్, హైదరాబాద్. 2017, జనవరి 5)[3]
 4. కందుకూరి పురస్కారం - 2107 (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ, 2017)[4][5]
 5. టంగుటూరి ప్రకాశం పురస్కారం - 2017 (గురుప్రసాద్ కల్చరల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్
 6. బుల్లితెర 2017 ప్రత్యేక జ్యూరీ అవార్డ్ (అంబేద్కర్ పాత్ర - అంబేద్కర్ ధారావాహిక)[6]
 7. చాట్ల శ్రీరాములు రంగస్థల పురస్కారం (2018), శంకరం వేదిక, హైదరాబాద్
 8. అంబేద్కర్ అవార్డ్ (2019), కళానిలయం, హైదరాబాద్
 9. బళ్ళారి రాఘవ రాష్ట్రస్థాయి పురస్కారం (2022), లలిత కళా పరిషత్, అనంతపురము
 10. నంది అవార్డు - ఉత్తమ నటుడు (ఎర్రకలువ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది నాటక పరిషత్తు - 2022)

అంబేద్కర్ పాత్ర గురించి మార్చు

ఇరవై అయిదు ఏళ్ల క్రితం చిన్నపాత్రతో నాటకాలు వేయడం ప్రారంభించిన ఈయనకు నటుడిగా అద్భుతమైన అవకాశాలు లభించాయి. రాజగృహప్రవేశంలో అంబేద్కర్‌, పడమటిగాలిలో రాంకోటు, రాజిగాడు రాజయ్యాడులో రాజిగాడు, కొమరంబీమ్ లో కొమరం భీమ్, వెంగమాంబలో వెంకటేశ్వరస్వామి పాత్రలు ప్రేక్షకలు మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు...ఆ నాటకం రాసిన తరువాత ఏడేళ్లపాటు అంబేద్కర్‌ పాత్రధారి కోసం అన్వేషించి ఆ పాత్రకు వెంకట్ సరిపోతారని పసిగట్టి ఆయనకు ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం 15 - 20 రోజుల పాటు అంబేద్కర్‌ అంబేద్కర్‌ నడక, చూపులు, శరీర భాష, వ్యక్తిత్వం గురించి లోతుగా అధ్యయనం చేశారు.

అంబేద్కర్‌ పాత్ర వెంకట్ జీవితాన్ని మలుపు తిప్పింది. అమలాపురంలో పది వేల మంది ప్రేక్షకుల సమక్షంలో, రెండు ఎల్‌సిడి స్క్రీన్లు ఏర్పాటు చేసి నాటకం ప్రదర్శించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటకాన్ని ప్రదర్శిస్తే పది నిమిషాలు చూడటానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య రెండు గంటలపాటు కదలకుండా కూర్చుండిపోయారు. నాటకం పూర్తయ్యాక ఆలింగనం చేసుకుని...‘అంబేద్కర్‌ను నేరుగా చూడలేకపోయా... కానీ ఇప్పుడు వెంకట్ ని ఆ పాత్రలో చూస్తుంటే అంబేద్కరే వెంకటా....లేక వెంకటే అంబేడ్కరా అన్న మాటలు వెంకట్ గోవాడ జీవితంలో మరువలేనివి. ఆ ప్రశంస వెయ్యి నందుల సమానం అని వెంకట్ అన్నారు.

త్రిపాత్రాభినయం మార్చు

కేవలం రెండు మూడు పాత్రలుండే నాటకాలు చేసే స్థితులలో, వెంకట్ గోవాడ చేసే ప్రతి నాటకమూ రెండు పదులకు తగ్గకుండా వందమంది వరకూ టీమ్ ఉండేలా ఉంటాయి.

రాజిగాడు రాజయ్యాడు నాటకానికి నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు గంటలకుపైగా సాగే నాటకంలో హీరో పాత్ర పోషిస్తూ, 60 మందికిపైగా నటీనటులను, సాంకేతిక బృందాన్ని సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామువంటిదే. శ్రీకాకుళం సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే 'రాజిగాడు'కు దర్శకత్వం వహించడం కోసం అక్కడికెళ్లి, కట్టుబొట్టు, యాసభాషలను అధ్యయనం చేశారు. నాటకం రిహార్సల్స్‌ చేసేటప్పుడు శ్రీకాకుళం యాస తెలిసినవారిని పిలిపించుకుని నేర్చుకున్నారు.

ఇలా చాలా నాటకాలకు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానో లేక నిర్మాతగానో రెండోవ భాధ్యతనూ, కొద్ది సమయాలలో మూడు బాధ్యతలనూ అలవోకగా నిర్వర్తించిన ఘనత తెలుగు నాటకరంగంలో వెంకట్ గోవాడ సొంతం.

చిత్రమాలిక మార్చు

మూలములు మార్చు

 1. ప్రజాశక్తి. "'మళ్లీ వెలిగే స్టేజి వస్తుంది`". Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 25 April 2017.
 2. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "తెలుగు నాటకానికి ఆదరణ తగ్గలేదు". Retrieved 25 April 2017.[permanent dead link]
 3. నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Archived from the original on 19 ఏప్రిల్ 2023. Retrieved 17 January 2017.
 4. "నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి". www.andhrabhoomi.net. 2017-04-17. Archived from the original on 2017-04-21. Retrieved 2021-12-14.
 5. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ. "కందుకూరి పురస్కారం 2017". www.apsftvtdc.in. Retrieved 20 July 2017.[permanent dead link]
 6. గోవాడ వెంకట్ బుల్లితెర 2017 ప్రత్యేక జ్యూరీ అవార్డ్, ఈనాడు, తెనాలి, 28.11.2017.

ఇతర లంకెలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.