భారతీయ జనసంఘ్

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ
(జనసంఘ్ నుండి దారిమార్పు చెందింది)

సంక్షిప్తంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.

1968 నుండి 1973 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి
ప్రముఖ జనసంఘ నేతలలో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ

ప్రారంభం

మార్చు

1951 అక్టోబర్ 21న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా దీపం గుర్తు లభించింది. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోక్‌సభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించింది. 1967 తరువాత ఈ పార్టీ బలపడింది.

హిందూ జాతీయ వాదం

మార్చు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. 1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్తు ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.

కూటమి

మార్చు

1967లో ఈ పార్టీ భారతీయ క్రాంతి దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీలతో కలిసి సంయుక్త విధాయక్ దళ్ కూటమిని ఏర్పాటుచేసింది.

దేశంలో అత్యవసర పరిస్థితి కాలం

మార్చు

1975లో దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. 1977లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్‌తో పాటు భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించింది. మురార్జీ దేశాయ్ నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఘ్ నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.

జనసంఘ్ అధ్యక్షులు (కాలక్రమంలో)

మార్చు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

మార్చు

జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో 1980 లోక్‌సభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీకు తొలి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1989 తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టినాడు.

ప్రముఖ జనసంఘ్ నాయకులు

మార్చు
శ్యాంప్రసాద్ ముఖర్జీ
1901, జూన్ 6న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953న మరణించేవరకు కొనసాగినాడు.
అటల్ బిహారీ వాజపేయి
1924లో గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి 1968 నుండి 1973 వరకు జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రిత్వశాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.
లాల్ కృష్ణ అద్వానీ
1927లో కరాచిలో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. మహాత్మా గాంధీ హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భారతీయ జనతా పార్టీలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అధ్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.
ఆచార్య బలరాజ్ మధోక్

1940లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి 1942లో ప్రచారక్‌గా వెళ్లారు. జమ్మూకశ్మీర్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి ఒక దశలో షేక్ అబ్దుల్లా ప్రయత్నించాడు. జమ్మూలో ప్రజాపరిషత్ స్థాపకులలో ఒకరైన ఆయన 1949లో ఢిల్లీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ప్రారంభించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి, వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1951లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీలో జరిపిన మొదటి సదస్సుకు కన్వీనర్‌గా ఉన్నారు. జనసంఘ్‌కు విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక భూమికను ఏర్పరచడం కోసం ప్రయత్నించారు. పార్టీ మొదటి ఎన్నికల ప్రణాళికను ఆయన తయారుచేశారు. రెండుసార్లు ఢిల్లీనుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసంఘ్ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో 35 స్థానాలు గెలుచుకొని వివిధ రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగింది.

పి.వి.ఎన్.రాజు
ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ భారతీయ జనసంఘ్ నేతలలో ఒకడైన పి.ఎన్.వి.రాజు 1973 నుండి 1976 వరకు జనసంఘ్ రాష్ట్ర శాఖను అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అత్యవసర పరిస్థితి కాలంలో 18 నెలలు జైలు జీవితం గడిపిన రాజు మే 15, 2008 న మరణించాడు.[1]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. హిందూ దినపత్రిక, తేది మే 16, 2008