తమన్నా

సినీ నటి
(తమన్నా భాటియా నుండి దారిమార్పు చెందింది)

తమన్నా భాటియా (జ. 1989 డిసెంబరు 21) తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమల్లో నటించే ఓ భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. తమన్నా అని మాత్రమే పిలవబడే ఈమె ముఖ్యంగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది. తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. మూడూ విఫలమైనా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి.

తమన్నా
Tamannaah Bhatia attends the screening of Do Baaraa at the Indian Film Festival of Melbourne (cropped).jpg
తమన్నా 2022 లో
జననం
తమన్నా భాటియా

(1989-12-21) 1989 డిసెంబరు 21 (వయసు 33)
వృత్తినటి
రూపదర్శి
క్రియాశీల సంవత్సరాలు2005–ఇప్పటివరకు
ఎత్తు5' 6"[1]

ఆపై అయన్ (2009), కండేన్ కాదలై (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరం (2014) వంటి సినిమాల ద్వారా తమిళ్ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2009లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సాధించిన తమన్నా ఆపై ఊసరవెల్లి (2011), రచ్చ (2012), కెమెరామెన్ గంగతో రాంబాబు (2012), తడాఖా (2013) వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆపై హిమ్మత్‍వాలా చిత్రం ద్వారా తిరిగి హిందీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విఫలమైనా తమన్నాకి మరెన్నో హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.

వ్యక్తిగత జీవితంసవరించు

తమన్నా 1989 డిసెంబరు 21న ముంబైలో జన్మించింది.[2] తమన్నాది సింధీ కుటుంబం. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా. తన అన్నయ్య ఆనంద్ భాటియా మెడిసిన్ చదివాడు. చిన్నప్పట్నుంచి హీరోయిన్‌ కావాలనే తమన్నాకి ఉండేది. తన తల్లిదండ్రులు తననెప్పుడూ నిరుత్సాహపరచలేదు. దాంతో 13వ ఏటే సినీరంగ ప్రవేశం చేసింది తమన్నా. నటనపై తనకు గల ఆసక్తిని గమనించి తన తల్లిదండ్రులు తన పదో ఏటే తనను థియేటర్‌ ఆర్ట్స్‌లో చేర్పించారు. అలాగే డాన్సంటే తమన్నాకు చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. అందుకే డాన్స్‌కు సంబంధించి ట్రైనింగ్‌ కూడా తీసుకుంది.[3]

సినీజీవితంసవరించు

2005-2011 : తమిళ్, తెలుగులో గుర్తింపుసవరించు

చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో హిందీలో అడుగుపెట్టింది తమన్నా. ఆ సినిమాలో సమీర్ అఫ్తాబ్ సరసన కథానాయికగా నటించింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. అదే ఏడాది మంచు మనోజ్ కుమార్ సరసన దశరథ్ దర్శకత్వంలో శ్రీ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభించింది. భారీ ఓపెనింగ్స్ రాబట్టిన శ్రీ చివరికి ఫ్లాప్ అయ్యింది. 2006లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రవికృష్ణ సరసన కేడీ సినిమాతో అడుగుపెట్టింది. అందులో ఇలియానా మరో హీరోయిన్. పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్య కృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రను తమన్నా పోషించింది. ఆ సినిమా కూడా పరాజయం పాలయ్యింది. తెలుగులో అదే ఏడాది జాదూ అన్న పేరుతో ఈ సినిమాని అనువదించారు. తెలుగులో కూడా అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో ఎస్.జె. సూర్య సరసన శక్తి చిదంబరం దర్శకత్వంలో వ్యాబారి సినిమాలో నటించింది. ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమాలో తమన్నా నటనకు సానుకూల స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో వ్యాపారి పేరుతో అనువదించబడింది.[4] 2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తమన్నాకి నటిగా మంచి గుర్తింపును తెచ్చింది.[5] అదే ఏడాది బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో కళ్ళూరి సినిమాలో నటించిన తమన్నాకి తమిళనాట మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తెలుగులో కళాశాల పేరుతో విడుదలయ్యింది.[6] ఆ సినిమాలో తన నటనకు తమన్నా తన తొలి దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ తమిళ నటి నామినేషన్ అందుకుంది. 2008లో నేత్రు ఇంద్రు నాలై, నిన్న నేడు రేపు, రెడీ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించింది.

2009లో ధనుష్ సరసన పడికతవాన్ సినిమాలో నటించింది తమన్నా. ఆ సినిమాలో తమన్నా రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్ట్ కూతురు, తెలుగమ్మాయి ఐన గాయత్రి రెడ్డి పాత్రను పోషించింది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఏడాది కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించింది. అందులో సిద్దార్థ్ కథానాయకుడు. తండ్రి అంటే ఎనలేని గౌరవం, ప్రేమతో పాటు కొంత కోపిష్టి స్వభావం ఉండే గీత సుబ్రమణ్యం పాత్రలో తమన్నా నటనకు మంచి స్పందన లభించింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది.[7] ఆ సినిమాలో తన నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ తెలుగు నటి అవార్డుకు నామినేషన్ పొందింది. కానీ ఆ తర్వాత గాంధీ కృష్ణ దర్శకత్వం వహించిన ఆనంద తాండవం సినిమాతో తమన్నా భారీ పరాజయాన్ని చవిచూసింది. దాని తెలుగు అనువాదం కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ ఆపై కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య సరసన నటించిన అయన్ సినిమా సంచలన విజయం సాధించింది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా నటనకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో వీడోక్కడే పేరుతో విడుదలయ్యింది. వీడొక్కడే కూడా అయన్ లాగే పెద్ద హిట్ అయ్యింది.[8][9] 2009లో తమన్నా నటించిన చివరి చిత్రం కండేన్ కాదలై. జబ్ వీ మెట్ సినిమా తమిళ్ రీమేక్ ఐన ఈ సినిమాలో భరత్ హీరో. హిందీలో కరీనా కపూర్ నటించిన పాత్రలో తమన్నా నటించింది. తన నటనకు విమర్శకులు సానుకూలంగా స్పందించారు. ఆ సినిమా థియేటర్ల దగ్గర బాగానే ఆడింది. 2011లో ఈ సినిమా ప్రియా ప్రియతమా అనే పేరుతో తెలుగులోకి అనువదించబడింది.[10] 2010లో తమన్నా కార్తి సరసన ఎన్. లింగుసామి తెరకెక్కించిన పయ్యా సినిమాలో నటించింది. ఇష్టం లేని పెళ్ళిని తప్పించుకుని ముంబైలోని తన తాత ఇంటికి వెళ్ళే ఒక మామూలు అమ్మాయి పాత్రలో తమన్నా నటనకు విమర్శకులు సానుకూలంగా స్పందించారు. అదే ఏడాది ఈ సినిమా తెలుగులో ఆవారా పేరుతో అనువదించబడింది. ఆవారా విజయం సాధించడంతో కార్తి, తమన్నా, యువన్ శంకర్ రాజాలకు మంచి గుర్తింపు లభించింది.[11] ఆ తర్వాత విజయ్ సరసన సుర, జయం రవి సరసన తిలాలంగడి సినిమాల్లో తమన్నా నటించింది. రెండూ పరాజయం పాలయ్యినా తమన్నా తమిళ్ సినీ పరిశ్రమలో ఒక పెద్ద తారగా ఎదిగింది.

2011లో తమన్నా నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 5 సినిమాల్లో కథానాయికగా నటించగా ఒక్క కో సినిమాలో మాత్రం ఒక పాటలో కనిపించింది. అదే కో సినిమా తెలుగులో రంగం పేరుతో అనువదించబడి సంచలన విజయం సాధించింది. 2011లో కథానాయికగా తమన్నా తొలి చిత్రం కార్తి సరసన శివ దర్శకత్వంలో సిరుతై. విక్రమార్కుడు తమిళ్ రీమేక్ అయిన ఈ సినిమాలో అనుష్క నటించిన పాత్రను తను పోషించింది.[12] విమర్శకుల నుంచి పెద్దగా మెప్పుపొందని తమన్నా ఆ సినిమాతో మాత్రం పెద్ద హిట్ అందుకుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. అందులో బావ బాలుపై ఎంతో ప్రేమను దాచుకుని రెండు సార్లు అతన్ని బాధపెట్టాక అతని మనసును గెలుచుకునే మహాలక్ష్మి పాత్రలో నటించింది. సంచలన విజయం సాధించిన ఆ సినిమా తమన్నాకు విమర్శకులు, ప్రేక్షకుల మెప్పును సంపాదించి పెట్టింది.[13][14] దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ తెలుగు నటి అవార్డుకు నామినేషన్ పొందిన తమన్నా మరెన్నో పెద్ద అవార్డులను అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన వి. వి. వినాయక్ దర్శకత్వంలో బద్రీనాథ్ సినిమాలో నటించింది. ఆస్తికురాలి నుంచి నాస్తికురాలిగా తనని మార్చిన యోధుడితో ప్రేమలో పడే అలకనంద పాత్రలో తమన్నా నటించింది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన గ్లామర్ ప్రదర్శనకు మంచి స్పోందన లభించింది.[14] బద్రీనాథ్ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత హరి దర్శకత్వంలో ధనుష్ సరసన వేంగై సినిమాలో నటించింది. సినిమా ఫ్లాప్ అయినా తన నటనకు మంచి స్పందన లభించింది. అదే సినిమా అనతికాలంలో సింహపుత్రుడు పేరుతో తెలుగులో విడుదలయ్యింది.[15] సింహపుత్రుడు కూడా ఫ్లాప్ అయ్యింది. 2011లో తమన్నా నటించిన చివరి సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూనియర్ ఎంటిఆర్ సరసన ఊసరవెల్లి. అందులో తమన్నా పోషించిన నిహారిక పాత్రలో తన నటనకు విమర్శకులు, ప్రేక్షకుల మెప్పును పొందింది.[14] ఈ సినిమా కూడా ఓ మోస్తరుగా ఆడింది.

2012-ఇప్పటివరకూ : తెలుగులో విజయం, హిందీలో పరాజయంసవరించు

2012లో తమన్నా రాం చరణ్ తేజ సరసన రచ్చ సినిమాలో నటించింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో తమన్నా నటన, అందచందాలు, వానా వానా వెల్లువాయే రీమిక్స్ పాటలో తన డాన్సుకు సానుకూల స్పందన లభించింది. ఈ సినిమాలో తన నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ తెలుగు నటి అవార్డుకు నామినేషన్ సంపాదించిన తమన్నా మరెన్నో అవార్డ్లకు నామినేషన్లు రాబట్టగలిగింది. రచ్చ విజయంతో తమన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఒకానొక దశలో రచ్చ రాం చరణ్ నటన వల్ల మాత్రమే కాకుండా తమన్నా అందాల ప్రదర్శన వల్ల కూడా ఆడిందని వార్తలొచ్చాయి.[16] ఆ తర్వాత రామ్ సరసన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే...ప్రేమంట!, ప్రభాస్ సరసన రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ సినిమాల్లో నటించింది. రెండు సినిమాలూ ఫ్లాప్ అయినా తమన్నా నటనకు, అందాల ప్రదర్శనకు, డాన్సుకు మంచి స్పందన లభించింది. ఆ సంవత్సరంలో చివరగా పవన్ కళ్యాణ్ సరసన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించింది. మగరాయుడులాంటి న్యూస్ రిపోర్టర్, కెమెరావుమన్ గంగ పాత్రలో తమన్నా నటించింది. ఆ సినిమా తమన్నాకు నటిగా మంచి గుర్తింపుని ఇవ్వడమే కాక ఒక సంచలన విజయంగా నిలిచింది.[17]

2013 సంవత్సరంలో తమన్నా తొలి సినిమా అజయ్ దేవగణ్ సరసన సాజిద్ ఖాన్ దర్శకత్వంలో హిమ్మత్‍వాలా. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నటించిన ఊరికి మొనగాడు సినిమాని అప్పట్లో కె. రాఘవేంద్రరావు జితేంద్ర, శ్రీదేవిలతో హిమ్మత్‍వాలా పేరుతో తెరకెక్కించారు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాన్ని 2013లో సాజిద్ ఖాన్ రీమేక్ చేసారు. ఆ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా భారీ పరాజయాన్ని నమోదు చేసుకుంది. తమన్నాకి కూడా విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన లభించింది.[18] ఆ తర్వాత తమన్నా కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో తడాఖా సినిమాలో నటించింది. ఈ సినిమా ఎన్. లింగుసామి దర్శకత్వం వహించిన తమిళ్ సినిమా వెట్టైకి రీమేక్. నాగ చైతన్య, సునీల్, ఆండ్రియా జెరెమియా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో తమన్నా అందాల ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. తడాఖా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.[19] మూడేళ్ళ విరామం తర్వాత 2014లో శివ దర్శకత్వంలో వీరం అనే తమిళ్ సినిమాలో నటించింది. అందులో అజిత్ కుమార్ కథానాయకుడు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరం తమిళనాట సంచలన విజయం సాధించింది.[20] అదే సినిమా తెలుగులో వీరుడొక్కడే పేరుతో అనువదించబడింది. వీరుడొక్కడే కూడా హిట్ అయ్యింది.[21] ఆ తర్వాత సాజిద్ ఖాన్ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్ సరసన హమ్షకల్స్ సినిమాలో నటించింది. భారీ ప్రచారం చేసాక ఎన్నో అంచనాలతో విడుదలైన హమ్షకల్స్ భారీపరాజయంగా నిలిచింది. తమన్నా నటన, హావభావాలకు కూడా విమర్శకులు ప్రతికూలంగా స్పందించారు.[22]

ఆ తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమైన అల్లుడు శీను సినిమాలో "లబ్బర్ బొమ్మ" పాటలో నర్తించింది. తన కెరియర్లో ఇదే తన మొదటి ఐటెం సాంగ్.[23][24] తన డాన్స్, అందాల ప్రదర్శన ద్వారా తమన్నా విమర్శకుల మెప్పును పొందింది. హిందీలో సాజిద్-ఫర్హాద్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన ఎంటర్టెయిన్మెంట్ సినిమాలో నటించింది.[25] తన గతచిత్రం హమ్షకల్స్ మీద అన్నిరకాలుగా పర్వాలేదని అనిపుంచుకున్న ఈ సినిమా కూడా తమన్నాకి మరో పరాజయం అందించింది.[26]

ప్రస్తుతం తమన్నా శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ఆగడు సినిమాలో నటిస్తోంది. అందులో తమన్నా స్వీట్ షాప్ ఓనరుగా నటిస్తోంది.[27] మరోపక్క ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి సరసన బాహుబలి సినిమాలో యువరాణి అవంతిక పాత్రను పోషిస్తోంది.[28] ఇవే కాక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ సరసన కిక్ సినిమా కొనసాగింపులో నటించేందుకు ఒప్పుకుంది.[29] తమిళంలో ఆర్య సరసన బాస్ ఎంగిర భాస్కరన్ (తెలుగులో నేనే అంబాని పేరుతో అనువదించబడింది) సినిమా కొనసాగింపులో నటించేందుకు ఒప్పుకుంది.[30] బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రథమ కథానాయికగా నటిస్తోంది.[31][32]

నటన శైలిసవరించు

తమన్నా నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ప్రఖ్యాతి గాంచింది. తెలుగులో హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి వంటి సినిమాల్లో తన పాత్రలకి, తన నటనకి విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభించింది. 2010లో తమన్నాని తమిళనాడు ప్రభుత్వం సినీరంగంలో తన సేవలకు కలైమామణి పురస్కారంతో సత్కరించింది.[33] తనతో కలిసి పనిచేసిన తారలు తన గురించి ఎప్పుడూ సానుకూలంగానే స్పందించారు. నేటి వరకూ తమన్నా ఉత్తమ నటి విభాగంలో 5 అవార్డులు గెలుచుకుంది. అదే విభాగంలో 11 అవార్డ్ నామినేషన్లను అందుకుంది. నటన మాత్రమే కాకుండా సినిమాల్లో తన నడుము, నాభి ప్రదర్శనకు తమన్నా ప్రసిద్ధి చెందింది. ఎన్నో సినిమాల్లో తన నడుము, నాభి ప్రదర్శించడానికి తమన్నా వెనుకాడలేదు.[34][35][36][37][38][39][40][41][42][43][44][45] డాన్సులో చిన్నప్పటి నుంచీ శిక్షణ పొందిన తమన్నా సినిమాల్లో బాగా డాన్స్ చేస్తుందని విమర్శకుల అభిప్రాయం.

నటించిన చిత్రాలుసవరించు

వెబ్‌ సిరీస్‌సవరించు

తమన్నా‘ఆహా’ ఓటీటీలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్ లో నటించింది. ఈ వెబ్‌ సిరీస్ ఏప్రిల్ 9న 2021న విడులలైంది.

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

 1. "Tamanna Bhatia - Actress". Nilacharal.com. 1995-12-21. Archived from the original on 2014-02-27. Retrieved 2012-10-09.
 2. "మిల్కీ బ్యూటీ తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు". వన్ఇండియా. December 21, 2011. Retrieved April 27, 2014.[permanent dead link]
 3. "తను నన్ను ఇష్టపడటం నా అదృష్టం: తమన్నా". వెబ్ దునియా. July 7, 2011. Retrieved April 27, 2014.
 4. "డబ్బింగ్ కార్యక్రమాల్లో "వ్యాపారి"". వెబ్ దునియా. May 21, 2009. Retrieved April 26, 2014.
 5. "ఇంకా బ్లాక్ లో హ్యాపీ డేస్ టికెట్లు". వన్ఇండియా. December 9, 2007. Retrieved April 26, 2014.
 6. "తెలుగులో వస్తున్న 'కళాశాల'". రేడియో ఖుషి. December 4, 2008. Retrieved April 26, 2014.[permanent dead link]
 7. "రాబోయే రెండు నెలల్లో రఫ్ఫాడించబోతున్న హీరోయిన్ తమన్నా". తెలుగువాహిని. October 24, 2012. Archived from the original on 2014-01-27. Retrieved April 26, 2014.
 8. "సూర్య, తమన్నా జంటగా "వీడొక్కడే"". వెబ్ దునియా. March 3, 2009. Retrieved April 26, 2014.
 9. "అత్తారింటికి దొంగదారి!!". సాక్షి. September 23, 2013. Retrieved April 26, 2014.
 10. "దాసరిని పిలిచినందుకు భలే శాస్త్రి జరిగింది". వన్ఇండియా. August 28, 2011. Retrieved April 26, 2014.[permanent dead link]
 11. "మరోసారి "ఆవారా" కాంబినేషన్లో..." చిత్రమండలి. April 19, 2014. Archived from the original on 2014-04-21. Retrieved April 26, 2014.
 12. "తమన్నాలాంటి భార్య కావాలి!". సినీవినోదం. January 8, 2011. Archived from the original on 2012-03-05. Retrieved April 26, 2014.
 13. "నాగచైతన్య 100% లవ్ 64 సెంటర్లలో 50 రోజులు". తెలుగువన్. June 23, 2011. Retrieved April 26, 2014.
 14. 14.0 14.1 14.2 "2011 స్పెషల్ అంటున్న తమన్నా". ఇండియాగ్లిట్స్. December 2, 2011. Retrieved April 26, 2014.
 15. "ధనుష్ 'సింహపుత్రుడు'". ఇండియాగ్లిట్స్. February 7, 2012. Retrieved April 26, 2014.
 16. "తండ్రుల తహ తహ!". తెలుగువన్. June 14, 2013. Retrieved April 26, 2014.
 17. ""కెమెరామెన్ గంగతో రాంబాబు"క్లైమాక్స్ నిజం కానుందా?". వన్ఇండియా. March 10, 2014. Retrieved April 26, 2014.
 18. "ఫట్ మన్న తమన్నా బాలీవుడ్ చిత్రం హిమ్మత్ వాలా". తెలుగువన్. March 30, 2013. Retrieved April 26, 2014.
 19. "హిట్ దిశగా 'తడాఖా'". ఏపీహెరాల్డ్. May 1, 2013. Retrieved April 26, 2014.
 20. "మరోసారి పోలీస్ గెటప్". సాక్షి. March 9, 2014. Retrieved April 26, 2014.
 21. "'వీరుడొక్కడే' సక్సెస్ మీట్." ఇండియాగ్లిట్స్. March 24, 2014. Retrieved April 26, 2014.
 22. "మళ్లీ నిరాశే!". సాక్షి. June 23, 2014. Retrieved July 30, 2014.
 23. "తమన్నా ఐటెం సాంగ్?". సాక్షి. April 1, 2014. Retrieved April 27, 2014.
 24. "లబ్బర్ బొమ్మ - అల్లుడు శ్రీను లో తమన్నా ఐటెం సాంగ్". టాలీవుడ్ టైమ్స్. June 29, 2014. Archived from the original on 2014-08-12. Retrieved July 30, 2014.
 25. "అగ్రస్థానం కాపాడుకునే ఆరాటం". ఆంధ్రప్రభ. January 30, 2014. Retrieved April 27, 2014.[permanent dead link]
 26. "ఇదీ.. పాయే." తొలివెలుగు. August 11, 2014. Archived from the original on 2014-08-14. Retrieved August 27, 2014.
 27. "రామోజీ ఫిలిం సిటీలో ఆగడు". 123తెలుగు.కామ్. March 22, 2014. Retrieved April 26, 2014.
 28. "'బాహుబలి'లో తమన్నా". ఇండియాగ్లిట్స్. December 30, 2013. Retrieved April 27, 2014.
 29. "రవితేజ సరసన తమన్నా ఖరారు". వన్ఇండియా. March 21, 2014. Retrieved April 27, 2014.
 30. "సీక్వెల్ లో మిల్కీబ్యూటీ". ఇండియాగ్లిట్స్. April 8, 2014. Retrieved April 27, 2014.
 31. "అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్". సాక్షి. August 26, 2014. Retrieved August 27, 2014.
 32. "Nithiin Tamannaah starrer Maestro to release on this date, watch the sneak peek here!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-30. Retrieved 2021-08-31.{{cite web}}: CS1 maint: url-status (link)
 33. "అనుష్క, తమన్నాలకు 'కలైమామణి' అవార్డు". విశాలాంధ్ర. February 3, 2011. Archived from the original on 2016-03-04. Retrieved April 27, 2014.
 34. "'రెబల్‌'లో... మతి పోగొడుతున్న తమన్నా...!". వన్ఇండియా. September 1, 2012. Retrieved April 27, 2014.[permanent dead link]
 35. "రెబల్"లో తమన్నా నడుము కింది ఎక్స్‌క్లూజివ్ స్టిల్సట...!!". వెబ్ దునియా. September 24, 2012. Retrieved April 27, 2014.
 36. "తమన్నా బొడ్డు అందాలకే ప్రేక్షకుడు సొంగ కార్చుకుంటాడా?". వెబ్ దునియా. September 29, 2012. Retrieved April 27, 2014.
 37. "బొడ్డు అందాలు ఆరబోస్తే సరిపోతుందా ?". తెలుగువిశేష్.కామ్. October 1, 2012. Retrieved April 27, 2014.
 38. "'హిమ్మత్‌వాలా'లో శ్రీదేవిని మించిన తమన్నా గ్లామర్!". వెబ్ దునియా. March 28, 2013. Retrieved April 27, 2014.
 39. "'తడాఖా'లో రెచ్చిపోయిన తమన్నా". తెలుగువన్. April 22, 2013. Retrieved April 27, 2014.
 40. "అదీ తమన్నా 'తడాఖా' (హాట్ గా రెచ్చిపోయిన ఫోటోలు)". వన్ఇండియా. April 23, 2013. Retrieved April 27, 2014.[permanent dead link]
 41. "హాట్‌ అండ్‌ స్పైసీ: గరిమ నాభి ఎక్స్‌ట్రార్డనరీ". గల్ట్.కామ్. May 7, 2013. Retrieved April 27, 2014.
 42. "బికినీ వేయలేదు... కానీ". చిత్రమండలి.కామ్. April 30, 2014. Archived from the original on 2014-05-03. Retrieved May 17, 2014.
 43. "హాట్‌ హాట్‌ తమన్నా పిచ్చెత్తిస్తోంది!". గల్ట్.కామ్. April 30, 2014. Archived from the original on 2014-05-03. Retrieved May 17, 2014.
 44. "రెడ్‌ హాట్‌ తమన్నా". గల్ట్.కామ్. May 17, 2014. Archived from the original on 2014-05-18. Retrieved May 17, 2014.
 45. "తమన్నా ఇంత హాట్ గా..బోల్డ్ గానా? (ఫొటో)". వన్ఇండియా. July 30, 2014. Retrieved July 30, 2014.

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తమన్నా&oldid=3897444" నుండి వెలికితీశారు