నేరెళ్ళ వేణుమాధవ్

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు

నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు.[2][3][4] వీరికి ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. మొదట్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు.[5] ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు.[6] 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.

నేరెళ్ళ వేణుమాధవ్
Nerella venumadhav.jpg
జననం
నేరెళ్ళ వేణుమాధవ్

(1932-12-28)1932 డిసెంబరు 28
వరంగల్ జిల్లా, తెలంగాణ
మరణం2018 జూన్ 19(2018-06-19) (వయసు 85)[1]
వరంగల్
ఇతర పేర్లుధ్వన్యనుకరణ సామ్రాట్
విద్యబి. ఎ, బి. యి. డి, బి.కామ్
వృత్తిమిమిక్రీ, వెంట్రిలాక్విజమ్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు
జీవిత భాగస్వామిశోభ
పిల్లలుశ్రీనాథ్, రాధాకృష్ణ (కుమారులు), లక్ష్మీ తులసి, వాసంతి (కుమార్తెలు)
తల్లిదండ్రులు
 • శ్రీహరి (తండ్రి)
 • శ్రీలక్ష్మి (తల్లి)
వెబ్‌సైటుhttp://www.nerellavenumadhav.com/

జీవిత సంగ్రహంసవరించు

వరంగల్ పట్టణం లోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఆరు భాషల్లో పండితుడు. వేణుమాధవ్ ఈయనకు పన్నెండో సంతానం. సాహిత్యంలో మంచి అభినివేశం ఉండడం వల్ల, ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్ధండులున్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. తన 8 వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి, రాఘవయ్య మాష్టారు గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతిలో చేరి బోల్తా ఉభాయిదా (పెద్ద బాలశిక్ష) చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్య గారిమీద అభిమానం పెంచుకున్నారు. నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. ఇవేకాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య గారలు నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం.

ఏవీవీ (ఆంధ్ర విద్యాభివర్ధిని) హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి గారి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పురస్కారాలు కూడా లభించాయి. హాస్యనాటకాలంటే ముందుండే వాడు. మిగతా గురువులు కందాళై శేషాచార్యులు గారు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు. 1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు గారు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. దానితో వీరు ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు గారు పరమానందభరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, ఇకనుండి నీకే అవసరం వచ్చినా నువ్వెవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్ ( బీ. పీ. ఆర్. విఠల్ గారు అనంతరకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు) అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు,స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. తెనాలి పట్టణంలోని అభ్యుదయ భావాలున్న స్వాతంత్ర్య సమరయోధులు కొల్లా కాశీవిశ్వనాధం, తయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం 3-2-1957 న జరిగింది. దీనికి సంధాన కర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసిం హారావు గారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనాథ్, రాధాకృష్ణ. ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీతులసి, వాసంతి.

వేణుమాధవ్ సినిమా, సాహిత్యం, కళలు లాంటి పలురంగాల ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.

నిర్వహించిన పదవులుసవరించు

వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ముఖ్యమైనవి.

 1. ఎం.ఎల్.సీ (1972-78)
 2. ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
 3. సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78)
 4. సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు
 5. దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94)
 6. టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96)
 7. రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96)
 8. ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75)
 9. రవీంద్రభారతి కమిటీ సభ్యుడు (1974-78)
 10. ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76)

వీరికి అంకితమిచ్చిన పుస్తకాలుసవరించు

 1. శివ పురాణం - కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
 2. నారాయణరెడ్డి నాటికలు - డా.సి.నారాయణరెడ్డి
 3. దేవతలెత్తిన పడగ, నాటకం - డా.పి.వి.రమణ
 4. జాతిరత్నాలు - ప్రొ.బి.వి.పట్టాభిరాం
 5. రక్తసంబంధాలు, నాటకం - కొడాలి గోపాలరావు.

విదేశీ యానంసవరించు

 1. ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
 2. సింగపూర్,మలేషియా - 1968
 3. పశ్చిమ జర్మనీ,ఇంగ్లండ్,ఫ్రాన్స్,అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
 4. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన - 1971
 5. సింగపూర్,మలేషియా - 1975
 6. అమెరికా, కెనెడా - 1976
 7. దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976
 8. సింగపూర్,మలేషియా - 1977
 9. అమెరికా, కెనెడా - 1982
 10. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987
 11. మారిషస్ - 1990

ఈయన ప్రదర్శనలు పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.

వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1977 లో "కళాప్రపూర్ణ ", జె.ఎన్.టి.యూ.సీ, 1987 లో,కాకతీయ విశ్వవిద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి. వీరి బిరుదులు - ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్,చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ,మున్నగునవి. వీరు 'నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఈ పురస్కారం పొందిన వారు - డా. కాశీభట్ల విశ్వనాథం (చిత్రలేఖనం 0 2002, ఎస్.కె.గౌడ్ (నాటకం) 2003, కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్య (వేద పండితులు) 2004, జమ్మలమడక కృష్ణమూర్తి (నాటకం) 2005, ఉల్లి రామచంద్రయ్య (హిందుస్తానీ సంగీతం) 2006, తిరుమలశెట్టి సీతాలత (నాటకం) 2007, జానీలీవర్ (మిమిక్రీ) 2008, కోవెల సుప్రసన్నాచార్య (సాహిత్యం) 2009, వి.హరికిషన్ (మిమిక్రీ) 2010, చుక్కా సత్తయ్య (ఒగ్గుకథ) 2011, వెలిదె హరిశంకర శాస్త్రి (హరికథ) & తణుకు రాజ్యం (నాటకం) 2012. వీరి పేరిట హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది.[7] తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. ధ్వన్యనుకరణకు ఇతని వలన తెలుగునాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది. 2001లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 1981లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి లభించింది. ఇతని శిష్యులలో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు హరికిషన్.

పురస్కారాలుసవరించు

 1. 1977  ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ  బిరుదు
 2. 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు
 3. 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు
 4. 1992 కాకతీయ  విశ్వవిద్యాలయం నుండి  గౌరవ డాక్టరేటు
 5. 1997 కనకాభిషేకం
 6. 1998 ఎన్ టి ఆర్ ఆత్మ గౌరవ పురస్కారం
 7. 2001 పద్మశ్రీ
 8. 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
 9. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది.[8][9][10]
 10. 2015 - తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వారి 83 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని "జీవన సాఫల్య పురస్కారాన్ని" హనుమకొండ వారి స్వగృహంలో తేది: 28 డిసెంబర్ 2015 న అందజేసింది

మరణంసవరించు

పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ 2018, జూన్ 19వ తేదీ మంగళవారంనాడు తమ 85వ యేట కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని స్వగృహంలో ఉదయం తుదిశ్వాస విడిచారు.

మూలాల జాబితాసవరించు

 1. "ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత". నమస్తే తెలంగాణ. Retrieved 19 June 2018.[permanent dead link]
 2. "మూగవోయిన వేయి గళాలు". eenadu.net. ఈనాడు. 20 June 2018. Archived from the original on 20 June 2018. Retrieved 20 June 2018.
 3. "ప్రతిధ్వనించిన ఖ్యాతి". eenadu.net. ఈనాడు. 20 June 2018. Archived from the original on 20 June 2018. Retrieved 20 June 2018.
 4. "వేణు గాత్రంలో వేల గళాలు". Eenadu.net. ఈనాడు. 20 June 2018. Archived from the original on 20 June 2018. Retrieved 20 June 2018.
 5. మిమిక్రీ, శ్రీనివాస్ (1 August 2018). "ఆయన ఓ అద్భుతం". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 2 September 2018. Retrieved 17 September 2018.
 6. "మూగబోయిన.. వేయి గొంతుక". Andhrajyothi. ఆంధ్రజ్యోతి. 20 June 2018. Retrieved 20 June 2018.
 7. http://www.freebase.com/view/guid/9202a8c04000641f8000000007694049[permanent dead link]
 8. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 19 June 2018. Retrieved 19 June 2018.
 9. ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 19 June 2018.[permanent dead link]
 10. మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 19 June 2018.[permanent dead link]

బయటి లింకులుసవరించు