నోబెల్ బహుమతి పొందిన భారతీయులు

'జననములో, మృత్యువులో, ఈ లోకంలో, ఇతర లోకాలలో ఎక్కడెక్కడ నువ్వు నన్ను తిప్పినా.. నా అనంత పథచారివి నువ్వే నంటూ సున్నిత భావపరంపరతో ఆర్ద్రమైన, ప్రేమాస్పదమైన అజరామర భక్తిని చిలకరించినందుకు టాగోర్‌ను నోబెల్ పురస్కారం వరించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఆయనే.

నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ టాగూరు

కీలమైన కాంతి ధర్మాన్ని ఒడిసిపట్టినందుకు చంద్రశేఖర వెంకట రామన్ (సి.వి.రామన్) నోబెల్ అందుకున్నాడు. కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద ఫోటాన్లు ఎంతగా పరివ్యాప్తమవుతాయన్న దానిని బట్టి ఆయా పదార్ధాల ధర్మాలను గ్రహించవచ్చన్న రామన్ ప్రతిపాదన భౌతికశాస్త్రంలో కొత్తద్వారాలు తెరుస్తూ 'రామన్ ఎఫెక్ట్' పేరు మీద చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆధునిక లేజర్ల నుంచి రేడియేషన్ వినియోగం వరకూ ఎన్నింటికో ఇదే భూమిక. శాస్త్ర (సైన్స్‌) రంగంలో నోబెల్ సాధించిన తొలి శ్వేతజాతీయేతరుడు మన రామనే!

జన్యువుల ఆవిష్కారమే అమోఘమనుకుంటే, ఆ జన్యువుల్లో జీవసంకేతాలు ఏ క్రమంలో ఎలా ఉంటున్నాయో విశ్లేషించి చూపటం, కీలకమైన ప్రోటీను సమ్మేళనాలు వాటి పాత్ర ఏమిటో గుర్తించటం ద్వారా హరగోబింద ఖొరానా వైద్యరంగంలో నోబెల్ అందుకున్నాడు. జీవులన్నింటిలో జన్యుపరమైన జీవభాష మూడుమూడు న్యూక్లియోటైడ్‌ల సమ్మేళనంగా ఉంటుందని నిరూపించటం ద్వారా కృత్రిమ జన్యువుల రూపకల్పనకు, జన్యు పరిశోధనల విస్తరణకు తెరతీశాడు.

అల్బేనియాలో జన్మించి, భారత గడ్డను తన సేవా కేంద్రంగా ఎంచుకున్న మానవాళి మాతృమూర్తి మదర్ టెరెసా.. పేదలు, బాధా సర్పద్రష్టులకు ప్రేమాస్పద సేవలందించటం ద్వారా ప్రపంచ శాంతిని ప్రోది చేశారని నోబెల్ కమిటీ ఆమెను ప్రస్తుతించింది. ప్రపంచ వ్యాప్తంగా 'సొసైటీ ఆఫ్ మిషనరీస్' ఏర్పాటు చెయ్యటం ద్వారా ఆమె ప్రకృతి వైపరీత్యాల్లో మానవాళి పునరావాసానికి అసమానమైన సేవ చేసింది. వ్యసన పీడితుల నుంచి ఎయిడ్స్ బాధితుల వరకూ సకల మానవాళికీ తోడునిలిచింది.

  • 5. సుబ్రమణియం చంద్రశేఖర్ 1983. భౌతిక శాస్త్రం

నక్షాత్రాల పుట్టుక, పరిణామాలపై సరికొత్త కాంతిని ప్రసరింపజేసినందుకు సుబ్రమణియం చంద్రశేఖర్‌ను నోబెల్ పురస్కారం వరించింది. సి.వి.రామన్ సోదరుడి కుమారుడైన చంద్ర శేఖర్ ఖగోళభౌతిక శాస్త్రంలో 'చంద్రశేఖర్ లిమిట్' పేరుతో ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఓ నక్షత్రం ఎంత ద్రవ్యరాశిని తగ్గితే/దాటితే కృష్ణబిలంలో కలిసిపోతుందో ఆ పరిమితిని లెక్కించటం ఆయన ఘనత. నాసా ఒక వేధశాలకు ఆయన పేరు పెట్టింది.

సంప్రదాయ అర్థశాస్త్రం తరతరాలుగా విస్మరిస్తూ వచ్చిన 'జన సంక్షేమం' పైకి అందరి దృష్టీ మళ్లేలా చెయ్యటం అమర్త్య సేన్ ఘనత. సామాజిక కార్యాచరణకు వ్యక్తి సంక్షేమమే మౌలికమన్న భావనను తోసిపుచ్చుతూ, సామాజిక సంక్షేమాన్ని బలంగా ప్రతిపాదించి, ఈ ఆధునిక కాలంలో 'అభివృద్ధి' దిశను మార్చటం ద్వారా అమర్త్యసేన్ ఐరాస కార్యాచరణను కూడా ప్రభావితం చెయ్యగలిగాడు. ఆర్థిక సంస్కరణలకు ముందు విద్య, వైద్యం, ఆహార లభ్యత వంటివి సంస్కరించినప్పుడే నిజమైన ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు గుర్తించేలా నొక్కి చెప్పటం సేన్ విశిష్ట కృషి.

'మన శరీరం యావత్తూ కణనిర్మితం! ప్రతి కణంలోనూ కేంద్రకం, అందులో మన శారీరక గమనాన్ని నిర్దేశించే సంకేతం 'డీఎన్ఏ' ఉంటాయి. మన స్వరూపం నుంచి ప్రవర్తన నైజం వరకూ, సకల అంశాలూ ఈ డీఎన్ఏ లోనే నిబిడీకృతమై ఉంటాయి. అయితే ఇది వట్టి పొడిపొడి అక్షరాల బీజం మాత్రమే! దీనికి జీవం ఉండదు. దీనికి జీవాన్ని తెచ్చిపెట్టేవే రైబోజోమ్‌లు! డీఎన్ఏ లో ఉండే సూత్రాలు, సంకేతాలకు అనుగుణంగా రైబోజోమ్‌లే ప్రోటీన్లను తయారు చేస్తాయి. ఈ ప్రోటీన్లే మన జీవానికి మూలం. శరీరమంతా ఆక్సిజన్‌ను మోసుకుపోయే హిమోగ్లోబిన్ నుంచి రోగ కారకాలను ఎదుర్కొనే యాంటీబాడీలు, ఇన్సులిన్ వంటి కీలక హార్మోన్లు, చక్కెరలను నియంత్రించే ఎంజైమ్‌ల వంటివన్నీ.. ప్రోటీన్లే! మన శరీరంలో ఇటువంటి ప్రోటీన్లు వేలు, లక్షలు ఉంటాయి. ఇవి రూపం నుంచి పనితీరు వరకూ అన్నీ భిన్నంగానే ఉంటాయి. రసాయనికంగా మన శరీరాన్ని, జీవాన్ని నియంత్రించేది ఈ ప్రోటీన్లే! ఈ కీలకమైన ప్రోటీన్లను తయారుచేసే రైబోజోమ్‌లు ఎలా ఉంటాయి? వాటి ఆకృతి ఏమిటి? కణస్థాయిలో వాటి పని తీరు ఏమిటన్నది నోబెల్ విజేతలైన వెంకటరామన్, స్టీట్జ్, యోనత్‌లు సవివరంగా ఆవిష్కరించారు. ఎక్స్-రే స్ఫటికచిత్రాల ఆధారంగా రైబోజోమ్ నిర్మాణం యావత్తూ, దీనిలో లక్షలాది అణువుల నిర్మాణంతో సహా మొత్తం వీరు ఆవిష్కరించారు. డీఎన్ఏ లోని కీలక సంకేతాలను ఈ రైబోజోమ్‌లు జీవంగా ఎలా మలుస్తున్నాయన్నది విశదీకరించారు. ఈ ఆవిష్కారం జీవ రసాయన శాస్త్రంలోనే కాదు, ఆధునిక వైద్యరంగం లోనూ, వ్యాధులను ఎదుర్కొనటంలో కూడా కొత్త ద్వారాలను తెరుస్తోంది. అందుకే దీనికీ అత్యున్నత పురస్కారం! ఉపయోగం: కొత్తతరం యాంటీబయాటిక్స్‌ను చాలా వరకూ ఈ రైబోజోమ్‌లను ఆధారంగా చేసుకునే రూపొందిస్తున్నారు. చాలారకాల యాంటీబయాటిక్స్.. బ్యాక్టీరియా తదితర సూక్ష్మక్రిముల్లోని రైబోజోమ్‌ల పనితీరును అడ్డుకోవటం ద్వారానే పనిచేస్తాయి. రైబోజోమ్‌ల పనితీరు నిలిచిపోతే, బ్యాక్టీరియా బతకలేదు. అందుకే కొత్తతరం యాంటీబయాటిక్స్ అన్నీ కూడా రైబోజోమ్ లక్ష్యంగానే రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెరిగిపోతూ.. మొండి సూక్ష్మక్రిముల నుంచి మానవాళి పెనుముప్పును ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో.. కొత్తతరం యాంటీబయాటిక్స్ ఆవిష్కారానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని పరిశోధనా ప్రపంచం భావిస్తోంది.

భారత్ తో నోబెల్ గ్రహీతల బంధాలుసవరించు

  • ఆంగ్ల రచయిత, సాహిత్యంలో 2001 నోబెల్ గ్రహీత వి.ఎస్ నైపాల్ ట్రినిడాడ్‌లో పుట్టి, బ్రిటన్‌లో పెరిగినా భారతీయ సంతతివాడే.
  • పర్యావరణంపై ఐరాస అంతర్‌ ప్రభుత్వ ప్యానల్ సభ్యుడిగా మన దేశానికి చెందిన ఆర్.కె.పచౌరీ నోబెల్‌ శాంతి బహుమతిని అల్‌గోరెతో పంచుకున్నాడు.
  • 1907లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ బ్రిటన్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ 1865లో ముంబాయిలో జన్మించాడు.
  • సికిందరాబాదు లో మలేరియాపై పరిశోధనలు సాగించిన రోనాల్డ్ రాస్ (బ్రిటన్ పౌరుడు).. ఉత్తరాఖండ్‌లో జన్మించాడు. 1902లో వైద్యంలో నోబెల్ అందుకున్నాడు.

మూలాలుసవరించు


వెలుపలి లంకెలుసవరించు