తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

(పట్టాభిరామిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)

తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా అతను ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్, పఠాభి పన్‌చాంగం అనేవి అతను ప్రసిద్ధ రచనలు. అతను తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి
జననంతిక్కవరపు పఠాభిరామిరెడ్డి
1919 ఫిబ్రవరి 19
నెల్లూరు
మరణం2006 మే 6
బెంగళూరు
ఇతర పేర్లుపఠాభి
వృత్తిపీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యులు
ప్రసిద్ధితెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు
రాజకీయ పార్టీసోషలిస్టు పార్టీ
భార్య / భర్తస్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్
పిల్లలుకుమారుడు కోనారక్ మనోహర్ రెడ్డి,కూతురు నందనా ఇషిబిలియా రెడ్డి
తండ్రిరామిరెడ్డి.

జీవిత విశేషాలు

మార్చు

పఠాభి 1919 ఫిబ్రవరి 19నెల్లూరులో జన్మించాడు. తండ్రి తిక్కవరపు రామిరెడ్డి భూస్వామి, తల్లి సుదర్శనమ్మ. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు అయన బాల పఠాభికి ఒక అరటిపండు చేతిలో పెట్టాడు. గాంధీజీ స్ఫూర్తితో అంతా స్వాతంత్ర్య

సమరంలోకి దూకారు. రవీంద్రనాథ టాగూరు స్ఫూర్తితో పఠాభి [శాంతినికేతన్|శాంతినికేతన్‌]కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయం లో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం,సినిమాకళ మీద చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించి అచ్చువెశాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపు చట్టం ప్రకారం సైన్యంలో చేరితే మాంసాహారం తినక తప్పదని, తన శాకాహార నియమం వదులుకునేందుకు మనస్కరించక,ఆరునెలల సాహసోపేతమయిన సముద్రయాత్రచేసి,దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరాడు. మద్రాసులో ఉన్నపుడు 1947లో స్నేహలతా పావెల్‌ అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇది మతాంతర వివాహం. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. 1925 హేడెన్లో జన్మించిన స్నేహలతా పావెల్ పూర్తిపేరు స్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్. తల్లి లీలావతీ ఘోష్ బెంగాలీ మహిళ, తండ్రి జేమ్స్ ఎబనైజర్ తంగరాజ్ పావెల్ తమిళుడు. పట్టాభి ప్రేమించిన స్త్రీకోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుల్లో అతనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనా ఇసబెల్లా రెడ్డి కార్మిక న్యాయవాది,పారిశ్రామికవేత్త, సామాజిక సేవా కార్యకర్త. 1947లో మదరాసులో ఫోకస్ అనే ఆంగ్ల వారపత్రిక నెలకొల్పి 36 వారాలు వెలువరించాక నిలిచిపోయింది. దీనికి స్నేహలత ప్రచురణకర్తగా వ్యవహరించగా, టి.పి.ఉన్నికృష్ణన్ సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు.కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశాడు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో అతని భార్య స్నేహలత ఒక ప్రధానపాత్ర ధరించింది. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో మరణించాడు.

పఠాభి గురించి

మార్చు
  • పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యం, ఉల్లాసం సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది. - అని మహాకవి శ్రీశ్రీ అతనికి కితాబిచ్చాడు.
  • భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. - వెల్చేరు వారాయణరావు [1]
  • 1930-40ల మధ్య భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు ... భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. - రావి రంగారావు[2]
  • 2000 సంవత్సరానికి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి అవార్డును పఠాబికి ఇచ్చారు.
  • తెలుగులో ముద్రింపబడ్డ తొలి తెలుగు వచనకవితల సంపుటి "ఫిడేలు రాగాల డజన్"
  • 1973లో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం పఠాభి ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాలను పునర్ముద్రణ చేసింది.
  • మనసు ఫౌండేషన్, (బెంగుళూరు) పఠాభి శతజయంతి సందర్భంగా, 2019 ఫిబ్రవరి 19న "పఠాభి రచనలు-లభ్య సమగ్ర రచనల సంపుటం" ను నెల్లూరులో జరిగిన శతజయంతి సభలో విడుదల చేసింది. ఈ సంపుటానికి డాక్టర్ ఆర్.వి.సుందరం, కాళిదాసు పురుషోత్తం, పారా అశోక్ సంపాదకులు.

రచనలు

మార్చు
ఉదాహరణగా కొన్ని కవితలు

పఠాభి కథలు, వ్యాసాలు, ఇంగ్లీషు కవితలు, జాబులు, గణిత సమస్యలను సాధించేందుకు చేసిన కృషి, తదితరాలు పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటంలో చేర్చబడినవి.

నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగ దంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను...
అనుసరిస్తాను నవీన పంథా, కానీ
భావకవిన్ మాత్రము కాను నే
నహంభావకవిని.



మహానగరము మీద మబ్బుగమ్మి
గర్జిస్తున్నది
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల


క్రాస్వర్డు పజిల్ లాగున్న
నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం
ఏ మానవునిదోగదా!


వాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి

సినిమాలు

మార్చు

మూలాలు, వనరులు

మార్చు
  1. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ Archived 2015-07-07 at the Wayback Machine - "ఈమాట" అంతర్జా పత్రికలో వెల్చేరు నారాయణరావు వ్యాసం
  2. "శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం, విజయవాడ - ఇందులో "ఫిడేలు రాగాల డజన్" గురించిన వ్యాసం రావి రంగారావు రచించాడు. (రేడియో ఉపన్యాసం ముద్రించబడింది)

బయటి లింకులు

మార్చు
  1. ఈనాడు
  2. హిందూ పత్రిక Archived 2007-02-28 at the Wayback Machine
  3. హిందూలో వ్యాసం Archived 2007-01-11 at the Wayback Machine
  4. ఈమాట నివాళి
  5. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్
  6. మా లిఖ