పూల రంగడు (1967 సినిమా)

1967 తెలుగు సినిమా

పూలరంగడు, 1967లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అక్కినేనిని మేటి కథానాయకునిగా నిలబెట్టిన ఈ సినిమా అన్న చెళ్ళెళ్ళ అనుభందంతో సాగుతుంది. చెల్లెలి కోసం కష్టించే అన్నగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.

పూల రంగడు
(1967 తెలుగు సినిమా)

గడ్డి కోసే పిల్లకు గవన్నేరు మొగుడు కావాలా? ఏం కాకూడదా?
(బాపు చిత్రంతో వెలువడిన ప్రకటన)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి. మధుసూదనరావు
కథ ఎ.జె. క్రోనిన్ (నవల) "Beyond This Place" ఆధారంగా
ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (రంగారావు),
జమున,
విజయనిర్మల (పద్మ),
చిత్తూరు నాగయ్య (వీరయ్య),
గుమ్మడి వెంకటేశ్వరరావు (చలపతి),
అల్లు రామలింగయ్య (ధర్మారావు),
శోభన్ బాబు (డా. ప్రసాద్),
చలం,
సూర్యకాంతం,
పద్మనాభం,
గీతాంజలి,
భాను ప్రకాష్ (పురుషోత్తం)
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
సంభాషణలు రంగనాయకమ్మ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు , ఈ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, జమున, శోభన్ బాబు , విజయ నిర్మల నటించారు.ఈచిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.కథ ఎ.జె.క్రోనిన్( నవల) బేయోండ్ థిస్ ప్లేస్ ఆధారంగా ముళ్లపూడి వెంకటరమణ రచన చేసాడు.

కథ మార్చు

పూలరంగడు అనబడే రంగడు (అక్కినేని) కష్టాలను పువ్వుల్లాగా భరిస్తూ ఉంటాడు. అతని తండ్రి వీరయ్య (చిత్తూరు నాగయ్య) ఒక మిల్లులో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. పురుషోత్తం అనే భాగస్వామి హత్యానేరం అన్యాయంగా వీరయ్యమీద పడుతుంది. ఫలితంగా వీరయ్య జైలుకు వెళతాడు. వీరయ్య కొడుకు రంగడు కష్టించి తన చెల్లెలు పద్మ (విజయ నిర్మల) ను చదివిస్తాడు. ఆమె ప్రసాద్ అనే డాక్టరును పెళ్ళి చేసుకొంటుంది. ఆ ప్రసాద్ పురుషోత్తం కొడుకు. తన తండ్రిని చంపిన వీరయ్య కూతురే ఆమె అని తెలిసి ప్రసాద్ తన భార్యను వదిలేస్తాడు.

ప్రసాదుకు ఈ సంగతి చెప్పిన వ్యక్తిని తన్ని రంగడు జైలుకు వెళతాడు. అక్కడ రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకొంటాడు. తన తండ్రి నిర్దోషి అని తెలుసుకొంటాడు. బయటికి వచ్చిన తరువాత ఇతర మిల్లు భాగస్వాములను నమ్మించి అసలు సంగతి రాబడతాడు. వారి గుట్టు బయటపెట్టి తన తండ్రిని విడిపిస్తాడు. తను ప్రేమించిన వెంకటలక్ష్మి (జమున)ని కూడా పెళ్ళి చేసుకొంటాడు.

తారాగణం మార్చు

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

సాధారణంగా సినిమా కథ రాసుకుని దానికి అనుగుణంగా పేరును పెట్టుకోవడం జరిగే రోజులవి. అయితే ఈ సినిమా విషయంలో పూర్తి రివర్సులో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఇమేజ్ కి తగ్గ పేరు- పూలరంగడు అనుకుని, ఆపైన కథ రాయమని రచయితను పెట్టుకున్నారు. ముళ్లపూడి వెంకటరమణ సినిమాకి కథని అభివృద్ధి చేయడం ప్రారంభించాకా ఆయనకీ, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకీ వచ్చిన విభేదాల వల్ల దీనితో పాటుగా ఆదుర్తితో ఉన్న నాలుగైదు చిత్రాలను వదిలేశారు. ఎవరెంత వారించినా, బతిమాలినా వినకుండా మద్రాసు నుంచి విజయవాడ మారిపోయి పత్రికలో పనిచేయడం ప్రారంభించారు.ఆపైన గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కథారచన సాగించారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి హైదరాబాద్ ఆలిండియా రేడియోకు బదిలీ అయ్యారు. ఆపైన ఆ కథ మీద అప్పటికి బలిపీఠం నవలతో ప్రఖ్యాతిచెందిన ముప్పాళ్ళ రంగనాయకమ్మ కూడా పనిచేశారు.
ఇంత జరిగినా కథ ఓ కొలిక్కి రాకపోతూండడంతో మళ్ళీ స్క్రిప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ చేతికి వచ్చింది. ఆదుర్తిని, ఆయన సినిమాను వదిలేసి పత్రికలో పనికి విజయవాడ వెళ్ళగానే పి.పుల్లయ్య ఒప్పించి ప్రాణమిత్రులు సినిమాకి రాయించుకున్నారు. మళ్ళీ ఆదుర్తితో పనిచేయాలని, ఈ సినిమా కథ పూర్తిచేయాలని పిలిస్తే ముళ్లపూడి వెంకటరమణ అప్పటికి వారిద్దరి మధ్య వచ్చిన స్పర్థలు దృష్టిలో ఉంచుకుని కలసిపనిచేయడం కష్టమని క్షమించమన్నారు. రమణకు తొలినుంచీ ఆప్తుడైన అక్కినేని నాగేశ్వరరావు, నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు చెందిన వాసు వంటివారు ఫోన్ చేసి పిలవగా మొహమాటం కొద్దీ ఈ కథ మీద పనిచేసేందుకు అంగీకరించారు, అయితే మద్రాసు వచ్చిపనిచేయలేమన్నారు. దాంతో కథాచర్చల కోసం అందరూ విజయవాడ వచ్చారు.
అప్పటికి కథలో చాలా భాగం వివిధ రచయితలు, రచయిత్రలు రాయగా తీయడం పోగా, క్లైమాక్స్ మరికొంత ఇతర భాగాలు మిగిలాయి. విజయవాడ రైల్వేస్టేషన్ రెస్టురూముల్లోనే కథాచర్చలు సాగాయి. చివరకి క్లైమాక్స్ రాసేందుకు ముళ్ళపూడి వెంకటరమణ ప్రఖ్యాతమైన పంచతంత్రం కథల్లోని మిత్రభేదం స్వీకరించారు. సంజీవకుడు, పింగళకుడు అనే ఎద్దు, సింహం స్నేహితులు కాగా వారి మధ్య కరకట దమనకులనే నక్కలు భేదాలు సృష్టించి, శత్రువులై సింహమే ఎద్దును చంపేలా ప్రేరేపిస్తారు. ఈ అంశాన్ని స్వీకరించి కథానాయకుడు విలన్ల మధ్య విభేదాలు సృష్టించి తన చేతికి మట్టి అంటకుండా వారిలో వారే కొట్టుకుచచ్చేలా క్లైమాక్స్ రాయడంతో చివరకి కథ పూర్తయ్యింది.[1]

నటీనటుల ఎంపిక మార్చు

పూలరంగడు టైటిల్ నాగేశ్వరరావు ఇమేజిని దృష్టిలో పెట్టుకుని పెట్టారు, ఆ టైటిల్ పెట్టాకే దానికి అనుగుణంగా కథ రాశారు. మొత్తానికి అలా సినిమాలో టైటిల్ కన్నా ముందు నుంచే అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా నిర్ణయమైపోయినట్టన్న మాట. ఈ చిత్రంలో అక్కినేనికి చెల్లెలుగా విజయనిర్మల, బావగా శోభన్ బాబులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర కథానాయక జమున అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కథానాయకిగా ఎన్నిక చేసారు. గుమ్మడి వెంకటేశ్వరరావు, చిత్తూరు నాగయ్య, అల్లు రామలింగయ్య లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.

విడుదల మార్చు

ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నారు. ఆస్తిపరులు, సుడిగుండాలు, వసంతసేన, ప్రాణ మిత్రులు లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది ఆయన ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టే సినిమా పేరును బట్టి కథ రాయించడం, అదీ రకరకాల రచయితలు మారి మారి స్క్రిప్ట్ ఏమారిపోవడం వంటివి జరిగాయి. చివరకు చిత్రీకరణ ప్రారంభమై సాగుతున్నా క్లైమాక్స్, ఇతర ముఖ్యసన్నివేశాలు రాసుకోని స్థితి ఉంది. అయితే సినిమా విడుదలయ్యాకా మాత్రం బాగా జనాదరణ పొందింది. అప్పటికి వరుస ఫ్లాపులతో సతమతమౌతున్న నాగేశ్వరరావు స్వంత నిర్మాణం, పంపిణీలో తీసిన పూలరంగడు భారీ విజయం పొందడంతో కెరీర్ గాడిన పడింది.

పాటలు మార్చు

సినిమాలో అక్కినేని, నాగయ్య తండ్రీకొడుకులుగా నటించారు. వారు జైల్లో కలుస్తారు, ఖైదీలతో కలసి చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి పి.వి.నరసింహారావును సంప్రదిస్తే ఆయన చంచల్ గూడ, ముషీరాబాద్ జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.[2]

ఈ చిత్రంలో 'నీ జిలుగు పైట నీడలోన నిలువనీ' అనే ఒక పాటను కలరులో తీయటం విశేషం. ఆ రకంగా రంగుల చిత్రానికి అన్నపూర్ణ వారు తెర తీసారు. అలాగే ఈ చిత్రంలో ప్రజాదరణ పొందిన పాటలతో పాటు ఒక బుర్రకథ కూడా ఉంటుంది.[3]

పాట రచయిత సంగీతం గాయకులు
చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, కె.బి.కె.మోహన్ రాజు
చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే చెడిపోదువురా ఒరేఒరే కొసరాజు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, నాగయ్య
నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా కొసరాజు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
నీ జిలుగుపైట నీడలోన నిలువనీ నన్ను నిలువనీ సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
మిసమిసలాడే చినదానా, ముసిముసినవ్వుల నెరజాణా సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి దాశరథి కృష్ణమాచార్య సాలూరి రాజేశ్వరరావు పి.సుశీల

వినరా భారత వీర సోదరా (బుర్ర కథ) ఘంటసాల, సుశీల, రచన:కొసరాజు

ఎయ్యేరా సిన్నొడా ఎయెరా , రచన: కొసరాజు, గానం. పి సుశీల

సిగ్గెందుకె పిల్లా సిగ్గెందుకే , రచన: కొసరాజు గానం.మాధవపెద్ది సత్యం, బి.వసంత .

మూలాలు మార్చు

  1. ముళ్ళపూడి, వెంకటరమణ (జూలై 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  3. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి. ఘంటసాల గనామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.