భైరవ ద్వీపం

1994 సినిమా

భైరవ ద్వీపం 1994 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం.[1] బాలకృష్ణ, రోజా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి రావి కొండలరావు కథ, మాటలు అందించాడు. మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రం 1994 లో మూడవ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది.[2]

భైరవ ద్వీపం
దస్త్రం:Bhairava Dweepam.jpg
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనరావి కొండలరావు (కథ, మాటలు)
కథసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతబి. వెంకట్రామరెడ్డి
నటవర్గంనందమూరి బాలకృష్ణ ,
రోజా
ఛాయాగ్రహణంకబీర్ లాల్
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1994 ఏప్రిల్ 14 (1994-04-14)
నిడివి
153 ని
భాషతెలుగు

కథసవరించు

చంద్రప్రభ వంశానికి చెందిన జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెను గర్భవతిగా చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకుని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకుని తాను కూడా ఆత్మార్పణకు సిద్ధ పడుతుంది. అది చూసిన జమదగ్ని మహర్షి ఒక పుష్పాన్ని సృష్టించి అది వాడిపోకుండా ఉన్నంత వరకు ఆమె కుమారుడు క్షేమంగా ఉంటాడని చెబుతాడు. దాంతో ఆమె సాంత్వన పొందుతుంది. తుఫాను లో తప్పిపోయిన బిడ్డ ఒక గిరిజన గూడానికి చేరతాడు. వారి నాయకుడు ఆ బిడ్డని కన్నకొడుకులా పెంచుతారు. ఆ బాబుకు విజయ్ అనే పేరు పెట్టుకుని ఒక వీరుడిలా తీర్చిదిద్దుతారు.

కొన్నాళ్ళకు విజయ్ తన స్నేహితుడు కొండన్నతో కలిసి జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రహ్మానంద భూపతి కూతురైన పద్మావతిని చూస్తారు. విజయ్ ఆమెను తొలిచూపులోనే అభిమానించడం మొదలుపెడతాడు. మరల ఒకసారి కూడా అంతఃపురంలోకి చొచ్చుకుని వెళ్ళి ఆమెతో మాట్లాడివస్తాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి పద్మావతి కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

విజయ సంస్థలో అంతకుముందు సింగీతం శ్రీనివాసరావు బృందావనం సినిమా తీసి విజయం సాధించి ఉన్నాడు. తాము అనుకున్న జానపద చిత్రానికి మరల ఆయననే దర్శకుడిగా నియమించింది విజయ సంస్థ. పాతాళభైరవి లాంటి జానపద కథ కన్నా మరికొన్ని మలుపులతో రచయిత రావి కొండలరావు కథ అల్లుకున్నాడు.[3]

నటీనటుల ఎంపికసవరించు

కథ విన్న వెంటనే తన తండ్రి నటించిన పాతాళ భైరవి లాంటి చిత్రం లాగా కథ, కథనం అనిపించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడు. కథా నాయికగా అప్పట్లో జోరుగా ఉన్న రోజాను తీసుకున్నారు. బాలకృష్ణ తల్లిగా కె. ఆర్. విజయ, తండ్రిగా విజయకుమార్, పెంపుడు తల్లిదండ్రులుగా రాధాకుమారి, భీమేశ్వరరావు, తమ్ముడిగా బాబు మోహన్, గురువుగా మిక్కిలినేని, యక్షిణిగా రంభను ఎంపిక చేసుకున్నారు. పద్మనాభం, సుత్తివేలు అతిథి పాత్రలకు ఎంపికయ్యారు. గిరిబాబు, శుభలేఖ సుధాకర్ హాస్యప్రధానమైన పాత్రలకు అనుకున్నారు. మరుగుజ్జు మనుష్యులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు, చిట్టిబాబును అనుకున్నారు.

అయితే భేతాళ మాంత్రికుడు పాత్రకు ఎస్. వి. రంగారావు లాంటి వారు అయితే బాగుండునని హిందీ నటులైన నానా పటేకర్, అమ్రిష్ పురి పేరును పరిశీలించారు. నిర్మాత వెంకట్రామిరెడ్డి వియత్నాం కాలనీ అనే మలయాళ సినిమా మద్రాసులో చూసి అందులో రాజకుమార్ అనే తెలుగు నటుడు ఈ పాత్రకు సరిపోగలడని అనిపించింది. ఆయనకు విజయ సంస్థ పేరు, రంగారావు పేరులోను రంగా ను, అసలు పేరు రాజాను కలిపి విజయ రంగరాజా అనే పేరుతో ప్రతినాయకుడిగా తమ సినిమాలో పరిచయం చేశారు నిర్మాతలు.[3]

చిత్రీకరణసవరించు

ఈ చిత్రానికి ఎస్. ఎస్. లాల్ కుమారుడైన కబీర్ లాల్ ను ఛాయాగ్రాహకుడిగా ఎంపిక చేశారు. కబీర్ లాల్ అంతకు మునుపే సింగీతం దర్శకత్వంలో ఆదిత్య 369 చిత్రానికి పనిచేసి ఉన్నాడు. 1993 జూన్ 5 న మద్రాసు వాహినీ స్టూడియోలో భారీగా నిర్మించిన సెట్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. ముహూర్తం షాట్ బాలకృష్ణ, రోజాల మీద చిత్రీకరించారు. రజనీకాంత్ క్లాప్ ఇవ్వగా, చిరంజీవి స్విచ్ ఆన్ చేశాడు. ఎన్. టి. రామారావు గౌరవ దర్శకత్వం వహించాడు. దీని తర్వాత రంభ, బాలకృష్ణల మీద నరుడా ఓ నరుడా ఏమి కోరిక అనే గీతాన్ని చిత్రీకరించారు.[3]

విడుదల, ఫలితంసవరించు

1994 ఏప్రిల్ 14 న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది.[3]

అవార్డులుసవరించు

పాటలుసవరించు

  1. ఎంత ఎంత వింత మోహమూ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. ఘాటైన నేటి నటన
  3. నరుడా ఓ నరుడా ఏమి కోరిక (గానం: ఎస్. జానకి)
  4. విరిసినదీ వసంతగానం (రచన: సింగీతం శ్రీనివాసరావు)
  5. అంబా శాంభవి భద్రరాజ తనయా (గానం: ఎస్. జానకి)
  6. శ్రీ తుంబుర నారద నాదామృతం (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలుసవరించు

  1. "'Bhairava Dweepam' - 5 pretty good classic movies that can be remade today". The Times of India. Retrieved 2020-05-25.
  2. "Andhra Pradesh State Film Awarda(1986-1996)". TELUGUCINEMA CHARITRA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-25.
  3. 3.0 3.1 3.2 3.3 "'భైరవద్వీపం' కోసం నానాపటేకర్, అమ్రిష్ పురి". www.eenadu.net. Retrieved 2020-10-31.