సింగీతం శ్రీనివాసరావు

ప్రముఖ దర్శకుడు

సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు.[1] తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా.

సింగీతం శ్రీనివాసరావు
Telugufilmdirector SingeethamSrinivasRao.JPG
జననంసెప్టెంబరు 21, 1931
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
సుపరిచితుడుసినిమా దర్శకుడు
జీవిత భాగస్వామికల్యాణి[1]
తల్లిదండ్రులు
  • రామచంద్రరావు (తండ్రి)
  • శకుంతలాబాయి (తల్లి)

జీవిత విశేషాలుసవరించు

సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. కళాశాల రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాడు.[2] డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.

సినిమా రంగంసవరించు

కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డి చేతిక్రింద పనిచేశాడు. పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినపుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది.

1972లో సింగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారుగాని ఆర్ధికంగా విఫలమయ్యింది. 1975లో తీసిన 'జమీందారుగారి అమ్మాయి' ఆయన మొదటి విజయవంతమైన చిత్రం. కాని 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిచడమే గాక సంగీత పరంగా మంచి విజయం సాధించింది. ఆ కోవలోనే పంతులమ్మ విజయవంతమైంది. ఆ తరువాత సింగీతం విజయ పరంపర, ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి.

ముఖ్యంగా కమల్ హాసన్‌తో సింగీతం సొమ్మొకడిది సోకొకడిది సినిమాతో ఆరంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో మైఖేల్ మదన కామరాజు కథ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు ముఖ్యమైనవి.

సందేశాత్మకంగా తీసిన చిత్రాలలో తరం మారింది ముఖ్యమైంది. డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం అన్ని "భాషలలో" ప్రదర్శించారు. మయూరి సినిమాలో "సుధా చంద్రన్" చరిత్రను సున్నితంగా తెరకెక్కించాడు. తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులు మరచిపోతున్న జానపదచిత్రాలను గుర్తు చేశాడు. కన్నడంలో రాజకుమార్ ప్రధాన చిత్రాలలో 'శ్రావణబంతు' ఒకటి.

సంగీత దర్శకునిగాసవరించు

సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్ల సౌకర్యార్ధం 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు.

సినిమాల జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 కామత్, సుధీష్. "Robinhood is my hero: Singeetham Srinivasa Rao". thehindu.com. ది హిందూ. Retrieved 6 December 2016.
  2. "ఊహాశక్తికి పుస్తకమే మార్గం". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 30 September 2016.

వనరులు, బయటి లింకులుసవరించు