మనీ (సినిమా)
మనీ శివనాగేశ్వరరావు దర్శకత్వంలో, రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. జె. డి. చక్రవర్తి, చిన్నా కథానాయకులుగా, జయసుధ, పరేష్ రావెల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా రూత్ లెస్ పీపుల్ సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. సినిమా నిర్మాణం తర్వాత ఎంతమంది పంపిణీదారులకు ప్రివ్యూ వేసినా నచ్చకపోతూండడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఏదో విధంగా తుదకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి మనీ మనీ (1995), మనీ మనీ మోర్ మనీ (2011) సినిమాలు సీక్వెల్స్‌గా, "లవ్ కే లియే కుఛ్ బీ కరేగా" (2001) హిందీ రీమేక్‌గా వచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర బ్రాండ్ స్థాయికి ఎదిగింది. 1993 నంది పురస్కారాల్లో ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు (శివనాగేశ్వరరావు), ఉత్తమ హాస్య నటుడు (బ్రహ్మానందం) పురస్కారాలు మనీ సినిమాకు దక్కాయి.
మనీ (1993 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
నిర్మాణం | రామ్ గోపాల్ వర్మ |
తారాగణం | బ్రహ్మానందం జయసుధ పరేష్ రావల్ కోట శ్రీనివాసరావు జె.డి.చక్రవర్తి చిన్నా రేణుకా సహాని |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | వర్మ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
కథసవరించు
నిరుద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులు చక్రి (జె.డి.చక్రవర్తి), బోస్ (చిన్నా) తమ ఇంటి పక్క బంగాళాలో ఉండే కోటీశ్వరురాలు విజయ(జయసుధ)ని కిడ్నాప్ చేస్తారు. ఆమె ఆస్తి కోసం ఎప్పటి నుంచో ఆశిస్తున్న ఆమె భర్త సుబ్బారావు (పరేష్ రావల్) బయటకి ఆమె కిడ్నాప్ అయినందుకు బాధపడ్డా, లోలోపల అక్కడే చంపేయాలని ప్రయత్నాలు సాగిస్తాడు. దీంతో చక్రి, బోస్ కలిసి విజయను రక్షించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చివరకు విజయకు సుబ్బారావు నిజస్వరూపాన్ని తెలియబరచడంతో, ఆమె కంపెనీలోనే వారిద్దరికీ ఉద్యోగం వస్తుంది.
తారాగణంసవరించు
- జేడీ చక్రవర్తి - చక్రి
- చిన్నా - బోస్
- జయసుధ - విజయ
- పరేష్ రావల్ - సుబ్బారావు (విజయ భర్త)
- రేణుకా సహాని - రేణు (బోస్ ప్రేయసి)
- బ్రహ్మానందం - ఖాన్ దాదా
- కోట శ్రీనివాసరావు
- తనికెళ్ళ భరణి - మాణిక్యం
- శరత్ సక్సేనా - పోలీసు అధికారి
అభివృద్ధిసవరించు
13 ఏళ్ళుగా దర్శకత్వ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న శివనాగేశ్వరరావును రామ్‌గోపాల్ వర్మ తన మొదటి రెండు సినిమాలు శివ, క్షణక్షణం సినిమాలకు కో-డైరెక్టర్‌గా తీసుకున్నాడు. శివనాగేశ్వరరావు స్వయంగా సినిమా దర్శకత్వం వహిస్తానంటే రామ్‌గోపాల్ వర్మ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. కథ కోసం కొన్ని ఐడియాలు వర్మ చెప్పగా వాటిలోంచి శివనాగేశ్వరరావు హాలీవుడ్ సినిమా "రూత్ లెస్ పీపుల్" కథాంశం నచ్చి దాన్ని ఎంచుకున్నాడు.[1][lower-alpha 1]
అలా 1986లో విడుదలైన హాలీవుడ్ సినిమా "రూత్ లెస్ పీపుల్" ఆధారంగా మనీ సినిమా కథ, పాత్రలు అభివృద్ధి చేశారు. మనీ సినిమా రూపకల్పనలో కూడా రూత్ లెస్ పీపుల్ ప్రభావం చాలానే ఉందని సినీ విశ్లేషకుడు జీవన్ రెడ్డి పేర్కొన్నాడు. రూత్ లెస్ పీపుల్ సినిమాలోని ఒకే కథానాయకుని పాత్రని ఇందులో ఇద్దరుగా మార్చడం వంటి చిన్న మార్పులతో పాటు అందులో లేని ముఖ్యపాత్ర ఖాన్ దాదాను మనీలో ప్రవేశపెట్టారు.[3] మూలంతో సంబంధం లేని విధంగా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా తెలుగులో అభివృద్ధి చేశారు.[3]
నిర్మాణం, విడుదలసవరించు
సినిమాను 55 లక్షల రూపాయల బడ్జెట్‌లో తెలుగు, హిందీ భాషల్లో సమాంతరంగా నిర్మించారు. పూర్తయ్యాకా సినిమాను విడుదల చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చూసిన పంపిణీదారులకు ఎవరికీ సినిమా నచ్చకపోతూండడంతో అన్నపూర్ణ స్టూడియోకి చెందిన ప్రివ్యూ థియేటర్‌లో 50 రోజుల పాటు సినిమాను ప్రివ్యూ వేసి చూపించాల్సి వచ్చింది. దర్శకుడు శివనాగేశ్వరరావు "ఒక దశలో మేము ఈ సినిమా ఎప్పటికీ విడుదల కాదేమో అనుకున్నాము" అని చెప్పాడు. ఆ ఇబ్బందులు అధిగమించి సినిమా ఎట్టకేలకు విడుదలైంది.[1]
స్పందనసవరించు
సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిర్మాణ వ్యయానికి ఐదారు రెట్లు రూ.3 కోట్లు వసూలు చేసింది.[1] ఈ విజయం అనంతరం దీనికి సీక్వెల్స్ వచ్చాయి.[3] దీనికి కొనసాగింపుగా 1995లో వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలోనే శివనాగేశ్వరరావు దర్శకునిగా మనీ మనీ సినిమా, దానికి కొనసాగింపుగా 2011లో జె.డి.చక్రవర్తి నిర్మాణ దర్శకత్వంలో మనీ మనీ మోర్ మనీ సినిమా తీశారు.[4] మనీ సినిమాని 2001లో "లవ్ కే లియే కుఛ్ భీ కరేగా" అన్న సినిమా పునర్నిర్మాణం చేశారు.[5]
అప్పటికి తెలుగు సినిమాల్లో కనిపించని కొత్త తరహా హాస్యాన్ని అందించిన సినిమాగా దీన్ని విమర్శకులు ఆదరించారు. పంచ్‌డైలాగులు, వన్ లైనర్ల ఆధారంగా సాగే హాస్యానికి భిన్నంగా హాస్యాన్ని పుట్టించగల సన్నివేశాన్ని తయారుచేసి డైలాగుల బలంతో కాక సన్నివేశాల బలంతో నవ్వించగలగడం విమర్శకులను ఆకట్టుకుంది. మనీలో కోట శ్రీనివాసరావు పాత్ర పెళ్ళిచేసుకోవద్దని అనుచరుడికి సలహా ఇస్తూ మాట్లాడే సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకుని కంచిభొట్ల శ్రీనివాస్ - సెటప్ మీదే సన్నివేశం సాగిపోతూ, భూతద్దం పట్టుకు వెతికిచూసినా పంచ్ లైన్ లేని దృశ్యమనీ - "సెన్సిబిలిటీ అన్న ఉదాహరణకు తెలుగు సినిమాలో ఇంతకు మించిన నిదర్శనం దొరకబోదు." అని విశ్లేషించాడు.[6]
ప్రాచుర్యం, పురస్కారాలుసవరించు
ఈ సినిమాలో బ్రహ్మానందం నటించిన ఖాన్ దాదా పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మనీ సినిమా విజయానికే కాక తదనంతరం సీక్వెల్స్ నిర్మాణానికి కూడా ఖాన్ దాదా పాత్ర కీలకమైన ఆకర్షణగా నిలిచింది.[7] సీరియస్‌గా ప్రవర్తిస్తూ హాస్యాన్ని పండించే ఖాన్ దాదా పాత్ర బ్రహ్మానందం కెరీర్‌లోని మేలిమలుపుల్లో ఒకటిగా నిలిచి,[8] ఉత్తమ హాస్య నటుడిగా తొలి నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
- నంది పురస్కారాలు
పాటలుసవరించు
మనీ సినిమాకు శ్రీ సంగీత దర్శకత్వం వహించాడు.[9] "చక్రవర్తికి వీధి భిక్షగత్తెకీ", "లేచిందే లేడికి పరుగు" పాటలు రెండూ ఎం. ఎం. కీరవాణి స్వరపరిచాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాలో పాటలన్నీ రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, మనో, తదితరులు పాటలు పాడారు.[10] ఈ సినిమాలోని "వారేవా ఏమి ఫేసు", "భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ", "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ" పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి.[4] వీటిలో పెళ్ళి చేసుకుంటే మగాడికి వచ్చే కష్టాల గురించి వచ్చే "భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ" పాట, మగాళ్ళు పెళ్ళి గురించి సరదాగా వాపోయే సందర్భాల్లో తప్పక గుర్తువచ్చే పాటగా నిలిచిపోయింది.[11][12] ఈ పాట పదేళ్ళకొకటి వచ్చే మంచి సరదా పాటల్లో ఒకటిగా పేరొందింది.[13] వారెవా ఏమి ఫేసు పాట మరోవైపు సినిమా స్టార్‌డమ్‌పై వ్యంగ్యోక్తిగా ప్రేక్షకుల మాటల్లో నిలిచింది.[14]
- చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ
- వారేవా ఏమి ఫేసు
- భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ
- లేచిందే లేడికి పరుగు
- అనగనగనగనగా అననే లేదింకా
- పాడు కబురు వినగానే
నోట్స్సవరించు
- ↑ సాధారణంగా హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టడమో, ప్రేరణ పొంది అభివృద్ధి చేయడమో చేసి తీసిన తెలుగు సినిమాల విషయంలో ఆ విషయం బహిరంగంగా ఒప్పుకోవడం అరుదు. రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో కానీ, దర్శకత్వంలో కానీ తీసిన సినిమాల విషయంలో ఇలాంటి విషయాలు ఇంటర్వ్యూల్లో చెప్పడం మొదలుపెట్టారు. మనీ కథాంశం చాలా వరకూ తీసుకున్నది రూత్ లెస్ పీపుల్ నుంచి అని దర్శకుడు నేరుగా పలు సందర్భాల్లో ఆ విషయం చెప్పాడు. కానీ సినిమా క్రెడిట్స్‌లో మాత్రం ఆ వివరం ఉండదు.[2]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 "Siva Nageswara Rao - Telugu Cinema interview - Telugu film director". www.idlebrain.com. Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.
- ↑ మనీ (యూట్యూబ్). 00:01 నుంచి 00:49 వరకూ గల క్రెడిట్స్.
- ↑ 3.0 3.1 3.2 బి., జీవన్ రెడ్డి (29 November 2015). "మనీ కాపీయే కానీ". సాక్షి. ఆ సీన్.. ఈ సీన్.
- ↑ 4.0 4.1 "జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో మనీ మనీ మోర్ మనీ". telugu.webdunia.com. Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.
- ↑ లవ్ కే లియే కుఛ్ భీ కరేగా ఐఎండీబీ పేజీ
- ↑ కంచిభొట్ల, శ్రీనివాస్. "తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది!". ఈమాట. Archived from the original on 21 జనవరి 2019. Retrieved 15 January 2019.
- ↑ రాసు, ఛత్రపతి యాదవ్ (5 October 2018). "Space of Culture and Brand in Sequel of Telugu Films: A Qualitative Study". In Management Association, Information Resources (ed.). Brand Culture and Identity: Concepts, Methodologies, Tools, and Applications: Concepts, Methodologies, Tools, and Applications (in English). IGI Global. p. 916. ISBN 978-1-5225-7117-9.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Narasimham, M. l (22 August 2011). "It's a mad mad comedy". The Hindu (in Indian English). Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-11-24. Retrieved 2019-01-15.
- ↑ "క్యాసెట్ కవర్". Archived from the original on 2018-12-09. Retrieved 2019-01-15.
- ↑ "సోదరా.. షాదీయే బెటర్". విజయక్రాంతి. Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.
- ↑ "ఆచారితో అమెరికా యాత్ర". నమస్తే తెలంగాణ. 18 March 2017.
- ↑ కె.వి.ఎస్., రామారావు (2013). "సినిమా పాటలు – నవ్వులాటలు". తానా. ఈమాట. Retrieved 15 January 2019.
- ↑ "వారెవా.. ఏమి ఫేసు!". www.andhrajyothy.com. 16 April 2015. Retrieved 15 January 2019.[permanent dead link]