యడవల్లి సూర్యనారాయణ
యడవల్లి సూర్యనారాయణ ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. మైలవరం బాలభారతీ సమాజంలో నాయక పాత్రధారి.

జననం సవరించు
అయిన 1888లో గుంటూరు లో జన్మించాడు.
విద్య సవరించు
మెట్రిక్యులేషన్ వరకు గుంటూరులోనే చదువుకోవడం వల్ల ఇంగ్లీషులో అభినివేశం ఏర్పడింది. పండితవంశంలో జన్మించడం వల్ల సంస్కృతాంధ్ర విషయాలలో పట్టుసాధించాడు. సంస్కృత నాటక అనువాదాలు ప్రదర్శించేటపుడు తెలుగు పద్యంతోపాటు మూల సంస్కృత శ్లోకం కూడా పాడడానికి ఒరవడి పెట్టింది ఈయనే. విద్యార్థి దశలోనే మృదుమధురంగా పాడుతూ, విద్యార్థి సోదరులను ఆకర్షించగలిగాడు. హరిప్రసాదరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం ల నట, సాహిత్య, సంగీత ప్రభావం ఈయన మీద పడింది.
రంగస్థల ప్రస్థానం సవరించు
ఈయన 1912లో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. దీనిని 1915 వరకు నడిపాడు. కపిలవాయి రామనాధశాస్త్రికి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే.[1] 1913లో విజయవాడలో గయోపాఖ్యానం పంచమాంకం ప్రదర్శన పోటీలలో అర్జునుడు పాత్రకు ద్వితీయ బహుమతి గెల్చుకోవడంతో ఈయన కీర్తి గుంటూరు సరిహద్దులు దాటి మైలవరం రాజా దృష్టిలో పడింది. రాజా ఆహ్వానం మేరకు మైలవరం కంపెనీలో చేరి వివిధ పాత్రలలో నటించడంతో ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. మైలవరం కంపెనీగా ప్రసిద్ధి చెందిన బాల భారతీ నాటక సంఘం మైలవరం నుండి విజయవాడకు మారిన తర్వాత యడవల్లి సూర్యనారాయణ అందులో కథానాయకుడిగా చేరాడు. అక్కడే ఉప్పులూరి సంజీవరావు, దైతా గోపాలం మొదలైనవారితో కలిసిపనిచేశాడు. హరిప్రసాదరావు ధరించిన పాత్రలనే ఎక్కువగా నటించి పేరు పొందాడు.
ఈయన నాటక లక్షణ పండితుడు. దాక్షిణాత్య ఔత్తరాహిక సంగీత బాణీలలో నిష్ణాతుడు. అనేకమంది యువనటులను తీరచిదిద్దిన నాట్యాచార్యుడు. నటనే జీవితంగా భావించడమే కాక వృత్తిగా స్వీకరించి, నటులకు అసమాన గౌరవం తెచ్చిపెట్టిన కళారాధకుడు.
ఈయన సత్యవంతుడు, దుష్యంతుడు, దుర్యోధనుడు పాత్రలు ధరిస్తున్నాడంటే నాటుగు రోజుల ముందుగానే టికెట్లు అమ్ముడుపోయేవి. నటుడి సామర్ధ్యానికి గీటురాయిగా పరిణమించిన మయసభలో దుర్యోధనుని దృశ్యం ఈయన రాయించుకున్నదే. సత్యవంతుడిగా ‘పోయేనయ్యో ననుబాసి...’ మొదలయిన పాటలు ఆనాటి శ్రోతల చెవులలో నేటికీ గింగురుమంటూంటాయి. మైలవరం కంపెనీ దెబ్బతిన్న తర్వాత ఏలూరు మోతే కంపెనీలో చేరి కొంతకాలం నటించాడు.
పృథ్వీరాజు వేషంలో నిజం గుర్రం ఉక్కి వచ్చి, సంయుక్త వేషధారిని గుర్రం మీద కూర్చోపెట్టుకొని నిష్క్రమించేవారు. ఇదంతా క్షణంలో జరిగిపోయేది. సత్యవంతుడి వేషానికి ఈయనకు వెండి గొడ్డలి, వెండితాడు బహుబతిగా లభించాయి. విజయనగరంలో రత్నఖచిత కిరీటం, వెండి కత్తి బహుకరించారు. బంగారు పతకాలు, సన్మానాలు చాలా జరిగాయి. 1932 ప్రాంతంలో సినిమారంగంలోకి ప్రవేశించి దుష్యంతుడు, రావణుడు పాత్రలలో నటించి మెప్పుపొందాడు.
నటించిన పాత్రలు సవరించు
సత్యవంతుడు, యముడు, అర్జునుడు (గయోపాఖ్యానం), శ్రీ కృష్ణుడు (తులాభారం), దుర్యోధనుడు, సారంగధరుడు, దుష్యంతుడు, వత్సరాజు, పృథ్వీరాజు, నలుడు, విజయరామరాజు, శ్రీరాముడు, రామదాసు.
మరణం సవరించు
యడవల్లి సూర్యనారాయణ 1939లో మరణించారు.
చిత్రమాలిక సవరించు
మూలాలు సవరించు
- ↑ Sundaram Learns By Kodavatiganti Kutumba Rao పేజీ.229
- యడవల్లి సూర్యనారాయణ, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 668.