సంస్కృతాంధ్ర వ్యాకరణములు

ప్రపంచము పరమేశ్వరునిచే సృజింపబడిన నామ రూపాత్మకము అని అనుకొనినచో, అందు రూపవ్యవహారముకొరకు నామము ఆవశ్యకమని దానితోడనే నామము సృజింపబడినట్లు "నామరూపే వ్యాకరణాని" "సర్వాణి రూపణి విచిత్యధీరః, నామాని కృత్వా అభివదన్ యదాస్తే" అను శ్రుతి సమంవయమువలన దెలియుచున్నది. ఇట్టి నామము ధ్వని రూపమై సకల వ్యవహారములను నిర్వహింపదగియున్నది. దీనినే "భాష" అని అంటారు. భాష మొదట్లో ఏకరూపమై ప్రవర్తించుచు లోకము ఏకరూపముగా ప్రవర్తింపజేయుచు ఆయా భాషా విపరిణామ హేతువులంబట్టి వివిధముగా గాజొచ్చింది. కొంతకాలమునకు భాషను అర్ధము చేసుకొనుటకు, లోక వ్యవహారమును క్రమముగా నుంచుటకు జనులు చట్టములను ఏర్పరచిరి. దానికి కొన్ని నియమములను ఏర్పరచుకొనిరి. దీనినే వ్యాకరణమందురు. అది క్రమముగా భాషాశాసనము వలన శాస్త్రమైనది.

పైతీరున వెలువడిన భాషాశాస్త్రమునకు శాస్త్రకర్తల విజ్ఞానాతిశయముచే పెక్కుమంది ప్రయోజనములు కల్పించిరి. ఈ శాస్త్రము స్వల్ప వర్ణోచ్చారణ భేదముచే కల్గు అర్ధములను స్పష్టపరచి వాని వ్యత్యాసములను, పదప్రయోగములోని మూలభూతమగు అర్ధము వ్యుత్పత్యాది ప్రదర్శనముచే వెల్లడించుచు, భాషా స్వరూపము అచిరకాలములోనే సముఖముగ బుద్ధిగోచరమగునట్లు చేయుచు మిగుల ప్రయోజనము కలుగుచున్నదని పతంజలి మహాశయుడు తన మహా భాష్యము న తొలుత 'రక్షోహాగమలఘ్వసందేహాః ప్రయోజన' అని చెప్పినాడు. అందులో వ్యాకరణాధ్యయనము వలన కలుగు బాధలను మిగుల చిత్రముగా వర్ణించాడు. 'న చాంతరేణవ్యాకరణం లఘునోపాయేన శబ్దా శ్శక్యా విజ్ఞాతు' అని 'తే సురా హేలయో హేలయ ఇతి కుర్వంతః పరాబభూవుః, తస్మాద్బ్రాహ్మణేన న మ్లేచ్చిత వై, నాపభాషితవై, మ్లేచ్చోహవా ఏష యదపశబ్దః, మ్లేచ్చా మాభూమే త్యధ్యేయం వ్యాకరణ'.

వ్యాకరణమును రచించు పద్దతులు

మార్చు
  1. పదముల ప్రవృత్తి నిమిత్తముల వ్యక్తపరచుచు ప్రకృతి ప్రత్యయముల విమర్సించుచు కాల క్రమమున సహజముగ భాష పొందెడి విశేష భెదములను భాషా పరిణామ సృష్టిచే విమర్సించుచు వ్యాకృతి నొనరించుట.
  2. ఇది భాషకు సహజములగు పరిణామములను వ్యక్తపరచుచు భాషను సుగమముగ బోధించును. దీనియందు పాణినీయము అగ్రస్థానమందున్నది.
  3. కేవల ప్రాచీన వ్యాకరణముల ననుసరించి ప్రకృతి ప్రత్యయ విభాగమును మాత్రము సూచించు వ్యాకృతి నొనరించుట.
  4. ఇందు భాషాభ్యాసన మాత్రమే ప్రయోజనము. ఇందు ముగ్ధబోధాదీ వ్యాకరణములు చేరినవి.
  5. వ్యుత్పత్తి మాత్ర మొనరించి పదపదార్ధములను చెప్పు వ్యాకృతి నొనరించుట.
  6. ఇందు పద వుత్పత్తి మాత్రం ప్రదర్శకం అగుటచే ఇది భాషా సంగ్రహణమునకు భాషా విపరిణామ జ్ఞానమునకు నిరుపయుక్తమగుచున్నది. నిరుక్తాది ప్రాచీన వ్యాకృతులు చేరినవి.
  7. భాషాశాస్త్ర మాత్రము ననుసరించి ప్రకృతి ప్రత్యయ రూపములను తెలుపు వ్యాకరణమును రచించుట.

ఇది కేవలము భాషా విపరిణామమునే తెల్పుచు భాషాభ్యాసనమందు వుత్పత్తి అర్ధములను తెలుసుకొనుటకు బహు ప్రయోజనమొనర్చును. బ్రకృతమున నితరభాషా సహాయమున భాషా తత్వ విమర్సనమునకు చెందిన వాజ్మయ చరితములు చేరును.

వ్యాకరణముల ప్రాచీనత

మార్చు

వేదములలో ప్రధానమగు ఋగ్వేదము లోని కొన్ని భాగములందు వ్యాకరణ ప్రశాంసచేయబడుటచే అప్పటికే సంస్కృతభాషా రక్షణకొరకు మంత్రద్రష్ట లగు వ్యాకరణము కూడా అని ఊహింపవచ్చును. పతంజలి వ్రాసినట్లు 'చత్వారి శృంగా త్రయో స్వపాదా ద్వేశీర్షే సప్త హస్తాహో స్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాన్ ఆవివేశః' అను మంత్రమునకు ఆశబ్దశాస్త్రమగు అర్ధమే వేదపూరుషునిచే సంకల్పితమగుచో నాటికే వ్యాకరణములు సిద్ధములని చెప్పవచ్చును. వేదస్వరరక్షార్ధమై ప్రాతిశాఖ్యలెన్నియో నాటికి ఋషి ద్రష్టములగుట సత్యము.' చత్వారి పదజాతాని నా మాఖ్యాతో పసర్గ నిపాత భేదా' త్తను నిరుక్త వాక్యముల బట్టి కూడా వ్యాకరణములు అత్యంత ప్రాచీనములు అని చెప్పవచ్చును. భాషా సాధకములగు శబ్ద శాస్త్రములు పాణినికి పూర్వమే బయల్వెడినవి అనుటకు పాణినీయములో శాకల్య, శాకటాయన్, ఆచార్య, ఆపిశిలి, చాక్రవర్మ, గార్గ్య, కాశకృత్స్య్న, భారద్వాజ, స్ఫోటాయన మొదలుగు వారల నామములను పాణిని గ్రహించుటయే సాక్షి.

వ్యాకరణమున పాణినీయము ప్రాముఖ్యత

మార్చు

సంస్కృత వ్యాకరణము వెలసిన కాలములో ఒక వైపు ఋషులు వేదకర్మలను ప్రవర్తింపజేయుచు వేదములను పూజ్యితములుగా చూచుచుండిరి. సంస్కృత భాష వ్యవహారిక భాషగా ఉండెను. ఆనాడు సర్వ వ్యవహారములు సంస్కృత భాషయందే జరుగుటచే ఆభాష మహోత్కృష్టంబగు దశ నొందుచుండెను. ఇట్లు సర్వతోముఖ వ్యాప్తయగుచు విజృంభించు చుండిన ఈ భాష ఇక నిబద్ధము కానేరదేమో యని ఋషులు భయంపడి కృత ప్రయత్నులై కార్యసిద్ధి నునర్చిరి. అట్టి సమయాన పాణిని దైవసహాయముచే మహాగంభీరమగు సంస్కృత వ్యాకరణమును వ్రాయుటకు కృత నిశ్చయుడైనాడు. దీనినే అష్టాధ్యాయి అంటారు. దీనిలో దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు ఉన్నాయి. ఇందు పవిత్రముగా నెన్నబడు వైదిక భాష నొక హస్తమున సంస్కరించుచు వేరొక హస్తమున లౌకిక భాషను సంస్కరించు చున్నది. ఇందులో 600 వందల చిల్లర సూత్రములు వైదిక సంబందితమైనవి. ఈ మహా శాస్త్రమున కంతకును మహేశ్వర సూత్రములు అగు తొలి 14 సూత్రములు మూలభూతములగుచున్నవి.యధార్ధముగా చెప్పవలసి యున్నచో బాణినీయమంతయు ఈ 14 సూత్రములలోనే ఇమిడి యున్నది. ఇట్టి కృతిచే పాణిని తననాటి భాషని సంపూర్ణముగా సాధింప నెచ్చి కృతకృతార్ధుడాయెను. కాని ఆనాడది జీవద్భాష యగుటచేత పానిని అనంతరము భాష మరల పెరుగుచు, భాష యందు పెక్కు మార్పులు కల్గినవి. ఆసమయముననే కాత్యాయనుడు తన నాటి భాషను శోధించి శుద్ధముగ సంస్కరించెను. ఆసంస్కరణములు ఆనాటికి చెల్లినను కాలక్రమమున కొత్త భాషలు ఆర్భవించుటచే ఇవి మూల పడినవి. అపభ్రంశ భాషలయొక్క పదములు కొన్ని దేవభాషలో చేరినవి. అప్పుడు మరల పతంజలి మహాశయుడు భాషను జాగ్రత్తగా పరిశీలించి భాష్యంబును వ్రాసెను. ఇదియే సంస్కృత భాషకు తుది సంస్కరణము. కాలక్రమమున దేవభాష వ్యవహారమునుండి తొలగినది, అపభ్రంశములు కొన్ని ఈ స్థానమును ఆక్రమించుకొనెను.

ప్రాచీన వ్యాకరణ ప్రవక్తలు

మార్చు

ఉపర్యుల్లిఖిత ప్రాతిశాఖ్యాది వైదిక వ్యాకరణ గ్రంథములలో 57 గురు వ్యాకరణ ప్రవక్తలగు ఆచార్యుల నామము లుపలబ్ధము లగుచున్నవి. పాణిని తన అష్ఠాధ్యాయిలో 10 మంది ప్రాచీనాచార్యుల నామములు వ్రాసియుండెను. వీరుగాక ప్రాచీన గంధములలో 13 మంది ఆచార్యులపేర్లు తెలుపబడినవి. పాణిని వలన మొత్తం 23 మంది ఆచార్యుల నామములు నిశ్చిత మగుచున్నవి. వారు -

(1) ఇంద్రుడు (2) వాయువు (3) భరద్వాజుడు (4) భాగురి (5) పౌష్కరపాది (6) చారాయణుడు (7) కాశకృత్స్నుడు (8) వైయాఘ్ర పద్ముడు (9) మాద్యందిని (10) రౌఢి

(11) శానకి (12) గౌతముడు (13) వ్యాడి (14) ఆపిశలి (15) కౌశ్యపుడు (16) గార్గ్యుడు (17) గాలవుడు (18) చాక్రవర్మణుడు (19) భార్ద్వాజుడు (20) శాకటాయనుడు

(21) శాకల్యుడు (22) సేనకుడు (23) స్ఫోటాయణుడు

ఇందులో చివరి 10 మంది నామములు పాణినీయాష్టకమున ఉల్లిఖితమై యున్నవి. మొదటి 13 మంది పాణిని కన్న ప్రాచీనలైయున్నను పాణినీయాష్టకమందు వీరి పేర్లు చర్చింపబడిలేవు. వీరిలో ఇంద్రుడు, భాగురి, కాశకృత్స్నుడు, పౌష్కరపాది, ఆపిశలి- ఈ 5 గురి గురించి మాత్రము అనేక ప్రాచీన గ్రంథములయందు తెలుపబడింది.

కొన్ని వ్యాకరణముల జాబితా

మార్చు

తెలుగు భాష-పుట్టుక

మార్చు

అంధా నామ గావః అత్ర చరంతి అను వ్యుత్పత్తి కలిగి ఈ యంధ్ర శబ్దముద్ధేశ్యమును బోధించు చున్నది. ఈ యంధ్రమే యాంధ్ర మైనది కావున వాజ్మయమున నంధ్రభాష, యాంధ్రభాష అను ద్వివిధ వ్యవహారము కనబడును. ఈదేశము దాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం నామక శివలింగ త్రయ మధ్యగత మగుటచేత త్రిలింగదేశము అను వ్యవహరింపబడుచున్నదని విన్నకోట పెద్దన చెప్పినాడు. ఈ పదము క్రమముగా వికృతమై తెలుంగు తెనుగు అని వ్యవహరింపబడింది. తెలుగు భాష అభివ్యక్తమైన కాలము మనకు సరిగ తెలియదు కాని ఇయ్యది వేదభాగములందు కీర్తింపబడుటుచే ప్రాచీనమైనదని చెప్పవచ్చును. తొలుత ఈ భాష యెట్లు వ్యవహరింపబడెనో గాని ఇప్పటికి నిలిచియున్న భాషను గమనించినచో కేవలము దేశ్య పదములతో కూడిన యాంధ్రభాష యెంతవరకు వ్యవహారము వలన్ చాల మార్పులు కలిగిననే సంశయము కలుగుకమానదు. అంత సంకుచిత రూపములతో కనబడే ఇప్పటి తెలుగు భాష ఆనాడు సర్వతోముఖవ్యాప్తమగు సంస్కృత భాషతోను, అటుపిమ్మట కొంతవరకు వ్యవహారములో నున్న ప్రాకృత భాషల తోడను మార్పు చెంది తన ఉనికిని స్థిరపరచుకొనెను. అందుచే ఆంధ్ర భాషయందు సంస్కృత ప్రాకృత పదములు అధికముగ కనబడును. ఆప్రవేశము కాలక్రమమున ఉచ్చారణ కృతమగు వర్ణలోపాగమాత్మకమగుచును, విభక్తి విరహిత ప్రకృతి పదములకు దేశభాషా ప్రత్యయ సంయోగ రూపమగుచును ద్వివిధముగ బయల్వెడలి యంధ్ర భాషకు వికృతి అను అభిధేయమును సంపాదించింది. ఇట్లు భాషాంతర సంబధము పొందిన తెలుగుభాష తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్య భేదముచే నాలుగు విధములగుచున్నది.

తెలుగు వ్యాకరణము

మార్చు

తెలుగు వ్యవహారిక భాషగా నున్న తొలిదశలో జనులు చిన్నచిన్న పద్యములను, పాటలను పాడుచుండిరి. గొప్ప వాజ్మయము నన్నయకు పూర్వము మనకు లభ్యము కానప్పటికిని యద్ధమల్లుని శాసనము బట్టి కొంత వాజ్మయము ఉన్నదని మాత్రము చెప్పుటకు అవకాశము ఉంది. ఇట్లు యుద్ధమల్లుడు నాటికే అభివృద్ధి నొందిన ఈ తెలుగు భాషకు సంస్కారము ఆవశ్యక మాయెను. ఆకారణమున కొందరు పండితులు కొంతకొంత భాషను సంస్కరించుటకు బయల్వెడినట్లు హేమ చంద్రాది మునిభిః కథితం చాంధ్రలక్షణ అను వాక్యముల వలన తెలియుచున్నది. ఇంతే కాదు చింతామణి కూడా కేచిత్, శాస్తారః, కవిభల్లటైః మొదలగు శబ్దములచే కూడా తెలియును. అదియుగాక ఆనాడు భాషను సంస్కరించుటకు కొన్ని పరిషత్తులు నేటికాలమునకు వలె నునట్లు నన్నయ మహా భారతం లోని సభాశబ్ద పునఃపునః ప్రయోగముచే వ్యక్తమగుచున్నది. అందుచే నన్నయ ఇటు భారతమును రచించి యటు చింతామణి యను భాషాశాసనమును వ్రసియుండొచ్చునని కొందరి అభిప్రాయము.

చింతామణి

ఇది 89 ఆర్యవృత్తములతో భాషను సాధించింది. అప్పటికో కొప్పగా వ్యవహారములోనున్న తెలుగు భాషను ఇంత సులువుగా ఈ చింతామణి ఎట్లు సాధింప గల్గినదని సందేహింప వలదు, చింతామణి సంస్కృత వ్యాకరణము వలె భాషనంతను సమగ్రముగ సంస్కరింప తలపెట్టలేదు. ఇది కేవలము కావ్య భాషను మాత్రము అనగా రసాభివ్యంజక శబ్ద సమూహమును సాధించుటకు ప్రయత్నిచెను. కావుననే తొలుత విశ్వ శ్రేయః కావ్య మని కావ్యము ప్రయోజనమును తెలిపిరి. ఇది కావ్య భాషకు వ్యాకరణముగ తెలుపవచ్చును.

అష్టాధ్యాయికి కాత్యాయన వచనముల వలె అసంపూర్ణమగు చింతామణికి కొన్ని కారిక లను అధర్వణుడు రచించి లోపములను తీర్చుటకు ప్రయత్నించాడు. ఇతడు శిష్ట ప్రయోగ సాధనమే ప్రధాన లక్ష్యముగా కలవాడగుటచే, చింతామణి యందలి సిద్ధిర్లోకా ద్దృశ్యా అను మూలసూత్రమును ప్రమాణముగా గొని ప్రయోగః శరణం కవేః, కవిసమ్మతేః, నిదానం తత్ర సద్వచః, తద్వివేకః ప్రయోగైక శరణం స్యా అను మొదలగు పదములచే దాని అభిప్రాయమును విశదపరచెను. ఇతడు కవి ప్రయోగములందు మిక్కిలి గౌరవము కలవాడని స్పష్టమగును.

కావ్యాలంకారచూడామణి

కావ్యాలంకారచూడామణిని విన్నకోట పెద్దన కవి రచించెను. ఇదులో ఈతడు భాషాభాగము చేయుటలో 5 రీతులను తెలిపుచు దేశ్యమును సహజాంధ్ర దేశ్య భవమనియు, దేశ్యభవమనియు రెండు విధముల చెప్పినాడు. ఇప్పుడు వ్య్వవహారములో నున్న, 'గంతలు గుండలు, దోసాలు, వేసాలు వేదాలు' మున్నగు రూపములను గ్రామ్యములకు ఉదహరించాడు.

ఆంధ్రభాషాభూషణము

ఇది చింతామణి తరువాత వెలసిన వ్యాకరణ గ్రంథముగా చెప్పుచుందురు.

బాలవ్యాకరణం

బాలవ్యాకరణం అప్పకవి విరచితము.

మూలాలు

మార్చు

[1]

  1. 1941 భారతి సంచిక-వ్యాస కర్త శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి