ఎల్.వి.ప్రసాద్

సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత
(యల్.వీ.ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)

ఎల్.వి.ప్రసాద్ (జనవరి 17, 1908 - జూన్ 22, 1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

అక్కినేని లక్ష్మీవరప్రసాద్
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్
జననంజనవరి 17, 1908
ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామం
మరణంజూన్ 22, 1994
వృత్తితెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు
మతంహిందువు
భార్య / భర్తసౌందర్య మనోహరమ్మ
తండ్రిఅక్కినేని శ్రీరాములు
తల్లిబసవమ్మ
పురస్కారాలుదాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత

జననం, బాల్యం

మార్చు

అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు 1908 జనవరి 17న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు.

రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.

17 యేళ్ళ వయసులో 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకున్నాడు. వెనువెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టింది. ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక, ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేట్టు చేశాడు. 1930 లో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగించాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి బొంబాయి వెళ్ళాడు.[1]

సినిమా రంగము

మార్చు

ప్రసాద్ బొంబాయి (ముంబై) చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు 15 రుపాయల వేతనంతో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా పనిచేశారు. అచట ఇండియా పిక్చర్స్ అక్తర్ నవాజ్ తను నిర్మిస్తున్ననిశ్శబ్ద చిత్రం "స్టార్ ఆఫ్ ది ఈస్ట్"లో చిన్న పాత్ర ఇచ్చాడు. 1931 లో, అతను వీనస్ ఫిలిం కంపనీలో చేరాడు. భారతదేశం యొక్క మొదటి "టాకీ", ఆలం అరాలో నాలుగు చిన్నచిన్న పాత్రలలో నటించాడు. తరువాత ఇతర చిన్న పాత్రలు అనుసరించాయి.

ఇంపీరియల్ ఫిలింస్ సినిమాల ద్వారా ప్రసాద్ గారు హెచ్.యం. రెడ్డి ని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ "టాకీ" కాళిదాస్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తర్వాత తొలి తెలుగు "టాకీ" భక్త ప్రహ్లాదుడులో అవకాశమిచ్చాడు. అనుకోని ఒక అవకాశం ద్వారా ప్రసాద్ కు ఆలీ షా దర్శకత్వం వహిస్తున్న"కమర్-ఆల్-జమాన్" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని దొరికింది. తన పేరు ఉపయోగించడానికి చాలా పొడవుగా ఉందన్న కారణముగా అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు పేరు ఎల్వి ప్రసాద్ గా కుదించబడింది.

ఈ రెండు సినిమాలు విజయవంతం అయిన తరువాత ఏలూరు వెళ్ళి భార్యను తీసుకొని తిరిగి బొంబాయి వచ్చాడు, సినిమా అవకాశాలు లేక జీవనోపాధికి డ్రీము ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరారు. అప్పుడే హెచ్.యం. రెడ్డి తెలుగులో నిర్మింస్తున్న సతీ సావిత్రి సినిమాలో నటిస్తూ రాత్రి గేట్ కీపర్ పనిచేసారు.[2]

తంత్ర సుబ్రహ్మణ్యం తన "కష్ట జీవి" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిత్రం మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ప్రసాద్ కి మరి కొన్ని ఇతర చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సమయంలో పృథ్వీరాజ్ కపూర్ తో పరిచయం తో పృథ్వీ థియేటర్స్ అనే నాటక సమాజం లో చేరి శకుంతల, దీవార్ అనే నాటకాలలో నటించాడు. ఈ సమయంలోనే ప్రసాద్ తన మొదటి హిందీ సినిమా "శారద" లో హీరో గా నటిస్తున్న రాజ్ కపూర్ని కలుసుకున్నారు.

తరువాత విజయా మూవిటోన్‌ వారికోసం హిందీలో నిర్మించ తలపెట్టిన ‘సీతా స్వయంవర్‌’లో హెచ్‌.ఎం.రెడ్డి ప్రసాద్‌కు వేషం ఇప్పించారు. అయితే హెచ్‌.ఎం. రెడ్డికి విజయా మూవిటోన్‌ వారితో విభేదాలొచ్చి తప్పుకున్నా ప్రసాద్‌ మాత్రం ఆ సినిమాలో నటించి మన్నన పొంది అదే సంస్థకు ‘రిప్రజెంటేటివ్‌’గా పనిచేశారు. తరువాత ఆ కంపెనీ మూత పడడంతో ‘న్యూ ఎరా పిక్చర్స్‌’లో చేరి ‘మత్స్యగంధి’ సినిమాకు ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేశారు. ఆ సినిమా పూర్తవగానే ప్రసాద్‌ సమర్ధత తెలుసుకున్న రేణుకా పిక్చర్స్‌ వారు ‘స్త్రీ’ సినిమా నిర్మిస్తూ ప్రసాద్‌ని మేనేజరుగా నియమిస్తూ, అదనంగా అసిస్టెంట్‌ కెమెరామన్‌గా మరో బాధ్యత అప్పజెప్పారు.

మద్రాసు పయనం

మార్చు

1943 లో త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వం లో నిర్మిస్తున్న గృహ ప్రవేశం సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యతను నిర్వహించే అవకాశం వచ్చింది. పరిస్థితుల కారణంగా ఆ సినిమాకు దర్శకుడి గా, హీరోగా ఎంపికయ్యాడు. 1946 లో విడుదలైన గృహ ప్రవేశం నలభై లలో విజయవంతమైన అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. ఆ చిత్రం ఒక క్లాసిక్ గా ఎదిగింది.

ఈ సమయంలో గూడవల్లి రామబ్రహ్మం అనారోగ్యం కారణంగా వారి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పల్నాటి యుద్ధం పూర్తికావడంలో ఇబ్బందులు రాగా ప్రసాద్ దర్శకత్వ భాద్యతలు చేపట్టి దానిని పూర్తి చేసారు. 1947లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత 1948లో కె.యస్. ప్రకాశ రావు గారు "ద్రోహి" సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రతో పాటు దర్శకత్వం అప్పగించారు.

తరువాత 1949 లో మన దేశం చిత్రం ద్వారా ఒక చిన్న పాత్రలో, తెలుగు సినిమాలో ప్రఖ్యాత నటుడు ఎన్.టి.రామరావుని తన దర్శకత్వంలో పరిచయం చేశారు.

1950 లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విజయ పిక్చర్ వారు నిర్మించిన మొదటి చిత్రం షావుకారు విడుదలై రికార్డులు సృష్టించినది. అదే సంవత్సరంలో ఎన్.టి.రామరావు,అక్కినేని నాగేశ్వరరావు కలిసి సోదరులుగా నటించిన సంసారం తెలుగు సినిమా విడుదలై విజయం సాధించింది.

1955 లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన మిస్సమ్మ సినిమా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి.

‘తాయిల్లపిళ్ళై’ (1961), ‘ఇరువుర్‌ ఉళ్ళం’ (1963) అనే తమిళ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

హిందీ సినిమాలు

మార్చు

ఇలవేలుపు తెలుగు సినిమాను హిందీలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో మీనాకుమారి, రాజ్‌కపూర్ నాయకీనాయకులుగా శారద పేరుతో తొలిసారి నిర్మించి 1957లో విడుదల చేశారు.

1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ మిస్సమ్మ సినిమాని హిందీలోకి మిస్ మేరీ గా నిర్మించారు. మిస్ మేరీ చిత్రం ఎల్‌.వి.ప్రసాద్‌కి బాలీవుడ్‌లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది.[2]

1964 నాటి తెలుగు చిత్రం మూగమనసులు సినిమాని హిందీలో మిలన్ పేరిట ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎల్.వి.ప్రసాద్ పునర్నిర్మించగా, ప్రేక్షకాదరణ పొంది 175రోజులు పూర్తిచేసుకుంది.

1967 నాటి ఆడ పడుచు సినిమాను చోటే బెహన్ పేరుతో , 1964 నాటి సంతానం సినిమాను బేటీ బేటా పేరుతో తీసిన హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

నిర్మాతగా వ్యవహరిస్తూ తన ప్రధమ శిష్యుడైన తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘ససురాల్‌’ (1961-తెలుగులో ఇల్లరికం), ‘హమ్‌ రాహీ’ (1963- తెలుగులో ‘భార్యాభర్తలు’) వంటి హిందీ చిత్రాలను నిర్మించారు.

1966లో తెలుగులో వచ్చిన ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాను ‘దాదిమా’ పేరుతో, ‘బ్రతుకుతెరువు’ చిత్రాన్ని ‘జీనేకి రాహ్‌’ (1969) పేరుతో, ఎన్టీఆర్‌ చిత్రం ‘తల్లా పెళ్ళామా’ చిత్రాన్ని ‘బిదాయి’ (1974) పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు.

తెలుగు సినిమా ‘రాజూ-పేద’ చిత్రాన్ని ‘రాజా అవుర్‌ రంక్‌’ (1968) పేరుతో ప్రత్యగాత్మ దర్శకత్వంలో, ‘పునర్జన్మ’ చిత్రాన్ని ‘ఖిలోనా’ (1970 ) పేరుతో చందర్‌ వోహ్రా దర్శకత్వంలో నిర్మించారు.

చందర్‌ వోహ్రా దర్శకత్వంలో ‘ఉదార్‌ కా సిందూర్‌’ (1976), స్వీయ దర్శకత్వంలో ‘జయ్‌-విజయ్‌’ (1977- తెలుగులో ‘చిక్కడు-దొరకడు’), దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘ఏ కైసా ఇన్సాఫ్‌’ (1980-తెలుగులో ‘న్యాయం కావాలి’). కె. బాలచందర్‌ దర్శకత్వంలో ‘ఏక్‌ దూజే కేలియే’ (1981-తెలుగులో ‘మరోచరిత్ర’), చందర్‌ వోహ్రా దర్శకత్వంలో ‘మేరా ఘర్‌ మేరా బచ్చే’ (1985), క్రాంతికుమార్‌ దర్శకత్వంలో ‘స్వాతి’ (1986-తెలుగులో ‘స్వాతి’) చిత్రాలను నిర్మించారు.

ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాసు మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.[3] బెంగాలి, ఒరియా, మలయాళం భాషల్లో కూడా ప్రసాద్‌ కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. దర్శకుడిగా ప్రసాద్‌ చివరి సినిమా ‘జయ్‌-విజయ్‌’. అలాగే మూడు లఘుచిత్రాలను కూడా ప్రసాద్‌ నిర్మించారు.

ప్రసాద్‌ స్టూడియో

మార్చు

1955 ప్రాంతాల్లో ‘సంసారం’ చిత్రాన్ని నిర్మించిన రంగనాథదాస్‌ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి, ఆర్ధిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దాన్ని ఎల్‌.వి.ప్రసాద్‌ చేపట్టి ప్రసాద్‌ స్టూడియో ని నెలకొల్పారు. ప్రసాద్‌ రెండవ కుమారుడు రమేష్‌ అమెరికాలో విద్యనభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

హైదరాబాదులోప్రసాద్ ఫిలిం లేబొరేటరీ (ప్రాసెసింగ్‌ యూనిట్‌) స్థాపించి విదేశాలలో వున్న ఆధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. ఫిలిం అండ్‌ టెలివిజన్‌ అకాడమీ స్థాపించారు. ఎన్‌.టి.ఆర్‌ మార్గ్‌లో ప్రసాద్ మల్టిప్లెక్స్‌ సినిమాహాలు, మాల్‌ నిర్మించారు.

సమాజ సేవ

మార్చు

‘సర్వేంద్రియాణాం నయనం ప్రదానం’ అనే సూక్తికి అనుగుణంగా 1987లో బజారా హిల్స్‌లో ‘ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రి’ని నెలకొల్పారు. ప్రఖ్యాత నేత్ర వైద్యులు గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందిస్తున్నారు,

నటునిగా

మార్చు
  • స్టార్ ఆఫ్ ది ఈస్ట్ (Star of the east (Silent)) - అసంపూర్తి.
  • 1931 - ఆలం ఆరా - మొదటి హిందీ టాకీ సినిమా
  • 1931 - కాళిదాస్ - మొదటి తమిళ టాకీ సినిమా
  • 1931 - భక్తప్రహ్లాద - మొదటి తెలుగు టాకీ సినిమా
  • 1933 - సీతా స్వయంవర్ (హిందీ)
  • 1940 - బోండాం పెళ్ళి (తెలుగు)
  • 1940 - చదువుకున్న భార్య (తెలుగు)
  • 1941 - తెనాలి రామకృష్ణ
  • 1941 - సత్యమేవ జయతే (తెలుగు)
  • 1943 - గృహ ప్రవేశం (తెలుగు)
  • 1982 - రాజా పార్వాయి (తమిళం)

దర్శకునిగా తెలుగు సినిమాలు

మార్చు

పురస్కారాలు

మార్చు
  • 1979లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి చే ‘రాజా శాండో మెమోరియల్‌ అవార్డు’
  • 1980లో నాటి ఉపరాష్ట్రపతి ఎమ్.హిదయతుల్లా చే ‘ఉద్యోగ పత్ర’ అవార్డు
  • 1980 లో ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం వారిచే రఘుపతి వెంకయ్య అవార్డు.
  • 1982 లో భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  • 1982లో దక్షిణ భారత టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ వారి ‘రామనాథ్‌ అవార్డు’
  • 1983లో ఈనాడు సంస్థ నిర్వహించిన ‘సితార’ అవార్డుల ఉత్సవంలో ‘కళాతపస్వి’ బిరుదు ప్రదానం.
  • 1985 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ పురస్కారం.
  • 1987లో ఆంధ్రప్రదేశ్‌ కళా వేదిక ‘ఆంధ్రరత్న’ పురస్కారం.
  • 1992 లో ఫిలింఫెర్ సంస్థ చే జీవిత సాఫల్య పురస్కారం
  • 1991 లో డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం
  • రాష్ట్రపతి జ్ఞాని జైల్‌ సింగ్‌ చేతులమీదుగా ‘లైఫ్‌ టైమ్‌ కంట్రిబ్యూషన్‌’ అవార్డును అందుకున్నారు.
  • ఎల్.వి. ప్రసాదు స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారు 82 ఏళ్ళ వయస్సులో 1994 జూన్ 22న మరణిచారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఎల్.వి.కంటి ఆసుపత్రి వుండే రోడ్డుకుకు ‘ఎల్‌.వి.ప్రసాద్‌ మార్గ్‌’ అని పేరు పెట్టారు. జూబిలీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎల్వి ప్రసాద్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆచారం, షణ్ముఖచారి. చలన చిత్ర వర ప్రసాదం - యల్.వి. ప్రసాద్.
  2. 2.0 2.1 శ్రీనివాస భాను, ఒలేటి (2015). వెండితెర ప్రసాదం - ఎల్.వి. ప్రసాద్. Creative Links Publications.
  3. "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007.