వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2020)

2020 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం
సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది.
(ఇంకా…)
2వ వారం
కె. జె. ఏసుదాసు
కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపధ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి మరియు సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు . అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు. అతను 1970 మరియు 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపధ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. అతను 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను కూడా అందుకున్నాడు.
(ఇంకా…)
3వ వారం
భూమి
సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది. భూమి, సౌరవ్యవస్థలో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది.
(ఇంకా…)
4వ వారం
మలిశెట్టి వెంకటరమణ
మలిశెట్టి వెంకటరమణ మానవతావాది. వృత్తి రీత్యా అతను కడప జిల్లా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను "పరమాత్మ సేవా ట్రస్టు"నడుతుపుతున్నాడు. "పరమాత్మ రమణ" గా అందరికీ సుపరిచితుడు. అతను 1965 జనవరి 22న లక్షుమమ్మ, సుబ్బన్న దంపతులకు జన్మించాడు. పోలీసు అధికారిగా పనిచేస్తున్న అతనికి అనాథలంటే వల్లమాలిన అభిమానం. అనాథలుగా చనిపోయిన వారికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఇలాంటి పనులు చేయడం ఈయన జీవితంలో భాగమైంది. ఇప్పటికి సుమారు558 దహన సంస్కారాలు నిర్వహించాడు. 1993లో కడపలో ఎవరూ లేని  ఓ వృద్ధురాలు మృతి చెందితే చలించిపోయిన అతను తానే దహన సంస్కారాలు చేశాడు. అక్కడి నుంచి అనాధలుగా  ఎవరు మృతిచెందినా తానే ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఖర్మకాండలు జరుపుతూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు కాశీకి వెళ్లి కార్యక్రమాన్ని జరపుతున్నాడు. కృష్ణా పుష్కరాల డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉన్న ఆయన ఉన్నతాధికారుల అనుమతితో శాస్త్రోక్తంగా ఇప్పటి వరకూ తాను అంత్యక్రియలు నిర్వహించిన 480 మందికి పిండ ప్రదానాలు పూర్తి చేశాడు.
(ఇంకా…)
5వ వారం
మానవ పరిణామం
మానవ పరిణామం అనేది శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ. ఇది ప్రైమేట్స్ పరిణామ చరిత్రతో, ప్రత్యేకించి హోమో జాతి పరిణామ చరిత్రతో మొదలై, హోమినిడ్ కుటుంబం లోనే గొప్ప జాతిగా హోమో సేపియన్స్ జాతి ఆవిర్భవించడానికి దారితీసింది. రెండు కాళ్ళపై నడక, భాష వంటి లక్షణాల అభివృద్ధి ఈ ప్రక్రియలో భాగం వీటితో పాటు, ఇతర హోమినిన్లతో జాత్యంతర సంతానోత్పత్తి వంటివి కూడా ఈ పరిణామ ప్రక్రియలో భాగమవడాన్ని బట్టి, మానవ పరిణామం సూటిగా ఒక సరళరేఖలో సాగినది కాదని, అదొక సాలె గూడు లాగా విస్తరించిందనీ తెలుస్తోంది. మానవ పరిణామాన్ని అధ్యయనం చెయ్యడంలో ఫిజికల్ ఆంత్రోపాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, పాలియోంటాలజీ, న్యూరోబయాలజీ, ఎథాలజీ, భాషాశాస్త్రం, ఎవల్యూషనరీ సైకాలజీ, పిండశాస్త్రం, జన్యుశాస్త్రం వంటి అనేక శాస్త్రాలు భాగం పంచుకున్నాయి. 8.5 కోట్ల సంవత్సరాల క్రితం, చివరి క్రెటేషియస్ పీరియడ్‌లో ప్రైమేట్స్, ఇతర క్షీరదాల నుండి వేరుపడ్డాయని జన్యు అధ్యయనాలు చూపుతున్నాయి. తొట్టతొలి శిలాజాలు మాత్రం 5.5 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోసీన్‌లో కనిపిస్తాయి.
(ఇంకా…)
6వ వారం
మహా ఘాత పరికల్పన
చంద్రుని పుట్టుకను వివరించే సిద్ధాంతమే మహా ఘాత పరికల్పన. మహా ఘాత పరికల్పన ప్రకారం, భూమిని శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి చంద్రుడు రూపుదిద్దుకుంది. ఈ ఘటనను బిగ్ స్ప్లాష్ అని, థీయా తాకిడి అనీ కూడా ఆంటారు. ఈ ఘటన 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత, హేడియన్ ఎరాలో జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును థీయా అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక, ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయనీ పేర్కొంది. ఈ మహా ఘాత పరికల్పనే చంద్రుడి పుట్టుకకు కారణమని ప్రస్తుతం ఎక్కువ మంది ఆమోదిస్తున్న సిద్ధాంతం. చంద్రుడి పుట్టుకకు మహా ఘాత పరికల్పనే కాకుండా మరి కొన్ని ఇతర పరికల్పనలు కూడా ఉన్నాయి. ఈ పరికల్పనలేవీ కూడా భూమి-చంద్రుల వ్యవస్థకు కోణీయ ద్రవ్యవేగం ఎక్కువగా ఎందుకుందో వివరించలేకపోయాయి.
(ఇంకా…)
7వ వారం
పిల్ట్‌డౌన్ మనిషి
పిల్ట్‌డౌన్ మనిషి ఒక పాలియో ఆంత్రోపోలాజికల్ మోసం. కొన్ని ఎముకల శకలాలను, అప్పటికి ఇంకా తెలియని తొలి మానవుడి శిలాజ అవశేషాలుగా చూపించిన బూటక కథనం ఇది. 1953 లో అది మోసం అని తేల్చారు. 2016 లో జరిపిన విస్తృతమైన శాస్త్రీయ సమీక్షలో, ఈ బూటక వ్యవహారానికి కారకుడు ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త చార్లెస్ డాసన్ అని తేలింది. 1912 లో వాలిడికి (తోక లేని కోతి), మనిషికీ మధ్య "తప్పిపోయిన లింకు"ను కనుగొన్నానని చార్లెస్ డాసన్ పేర్కొన్నాడు. 1912 ఫిబ్రవరిలో అతడు, నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని భూగర్భశాస్త్ర కీపర్ ఆర్థర్ స్మిత్ వుడ్‌వర్డ్‌ను సంప్రదించాడు. తూర్పు సస్సెక్స్‌లోని పిల్ట్‌డౌన్ సమీపంలో ఉన్న ప్లైస్టోసీన్ కాలపు కంకర పొరలో మానవుడి పుర్రె భాగం లాంటి దాన్ని కనుగొన్నానని చెప్పాడు. ఆ వేసవిలో, డాసన్, స్మిత్ వుడ్‌వర్డ్ ఈ ప్రదేశంలో మరిన్ని ఎముకలు, కళాకృతులను కనుగొన్నారు. అవన్నీ ఒకే వ్యక్తికి చెందినవిగా వాళ్ళు భావించారు. వీటిలో దవడ ఎముక, ఎక్కువ పుర్రె శకలాలు, దంతాల సమితి, ఆదిమ కాలపు పనిముట్లూ ఉన్నాయి. స్మిత్ వుడ్‌వర్డ్ పుర్రె శకలాలను పునర్నిర్మించాడు. అవి 5,00,000 సంవత్సరాల క్రితం నాటి మానవ పూర్వీకుడికి చెందినవని ప్రతిపాదించాడు.
(ఇంకా…)
8వ వారం
ప్లైస్టోసీన్
ప్లైస్టోసీన్ అనేది భౌగోళిక కాల మానంలో ఒక ఇపోక్. 25,80,000 సంవత్సరాల కిందటి నుండి, 11,700 సంవత్సరాల కిందటి వరకూ ఉన్న కాలమే, ప్లైస్టోసీన్. జనాంతికంగా దీన్ని మంచు యుగం అని కూడా పిలుస్తూంటారు. పదేపదే గ్లేసియేషన్లు ఏర్పడిన అత్యంత ఇటీవలి కాలమిది. ప్లైస్టోసీన్ ముగింపు, చివరి గ్లేసియల్ కాలపు ముగింపూ, పురావస్తు కాలమానం లోని పాతరాతియుగపు ముగింపూ అన్నీ ఒకే సమయంలో జరిగాయి. ప్లైస్టోసీన్, క్వాటర్నరీ పీరియడ్ లోని మొదటి ఇపోక్. సెనోజోయిక్ ఎరా లోని ఆరవ ఇపోక్. ICS కాలమానంలో, ప్లైస్టోసీన్‌ను నాలుగు దశలుగా లేదా ఏజ్‌లుగా విభజించారు. గెలాసియన్, కాలాబ్రియన్, మధ్య ప్లైస్టోసీన్ (అనధికారికంగా "చిబానియన్"), ఎగువ ప్లైస్టోసీన్ (అనధికారికంగా "టరాన్టియన్"). ఈ అంతర్జాతీయ విభజనతో పాటు, వివిధ ప్రాంతీయ విభజనలు కూడా వినియోగంలో ఉన్నాయి. 2009 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ వారు ధృవీకరించిన మార్పుకు ముందు, ప్లైస్టోసీన్‌కు అంతకు ముందరి ప్లయోసీన్‌కూ మధ్య కాల సరిహద్దుగా 18.06 లక్షల సంవత్సరాల క్రితాన్ని పరిగణించేవారు. ప్రస్తుతం ఇది 25.8 లక్షల సంవత్సరాల క్రితంగా ఉంది. పాతకాలపు ప్రచురణల్లో ఈ రెంటిలో ఏ పద్ధతి నైనా అనుసరించి ఉండవచ్చు.
(ఇంకా…)
9వ వారం
ఆఫ్రికా నుండి హోమినిన్ల తొలి వలసలు
దస్త్రం:Homo habilis-2.JPG
పాత రాతియుగం మలి దశ నుండి మధ్య రాతియుగం తొలి నాళ్ళ వరకూ, అంటే సుమారు 21 లక్షల ఏళ్ళ క్రితానికి 2 లక్షల ఏళ్ళ క్రితానికీ మధ్యన, ఆఫ్రికా నుండి యురేషియా అంతటా పురాతన మానవుల (హోమో జాతి) విస్తరణలు జరిగాయి. ఈ విస్తరణ లన్నింటినీ కలిపి ఆప్రికా నుండి బయటకు -1 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 1) అని పిలుస్తారు. హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) యురేషియాలోకి విస్తరించిన ఘటన, ఇదీ వేరువేరు. హోమో సేపియన్ల విస్తరణ 2 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై ఉండవచ్చు. దాన్ని "ఆఫ్రికా నుండి బయటకు -2" (అవుట్ ఆఫ్ ఆఫ్రికా II) అని పిలుస్తారు). ఆఫ్రికా వెలుపల హోమో తొట్టతొలి ఉనికి 20 లక్షల సంవత్సరాల క్రితం నాడు జరిగింది. మధ్య చైనాలోని షాంగ్‌చెన్ వద్ద 21.2 లక్షల సంవత్సరాల నాడే మానవ ఉనికి ఉన్నట్లుగా 2018 లో చేసిన రాతి పనిముట్ల అధ్యయనం ద్వారా కనుగొన్నామని చెప్పుకొన్నారు. ఆఫ్రికా బయట లభించిన అత్యంత పురాతన మానవ అస్థిపంజర అవశేషాలు జార్జియా లోని ద్మానిసి లో (ద్మానిసి పుర్రె 4) లభించాయి. ఇవి 18 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. ఈ అవశేషాలను హోమో ఎరెక్టస్ జార్జికస్ అని వర్గీకరించారు.
(ఇంకా…)
10వ వారం
హిందూ కుష్
హిందూ కుష్ 800 కిలోమీటర్ల పొడవైన (500 మైళ్ళు) పర్వత శ్రేణి. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించి ఉంది. ఇది దాని కేంద్రం నుండి ఉత్తర పాకిస్తాన్, తజికిస్తాన్ వరకు విస్తరించి ఉంది. హిందూ కుష్ పదానికి పర్షియా భాషలో హిందూ హంతకులు లేదా హిందువుల హంతకుడు అని దీనికి అర్ధం. ఇది పామీరు పర్వతాలు, కారకోరం పర్వతశ్రేణితో కూడిన హిమాలయాల పశ్చిమ విస్తరణగా ఉంది. ఇది సింధు నది లోయ నుండి అము దర్యా (పురాతన ఆక్సస్) లోయ ఉత్తర ప్రాంతాలను విభజిస్తుంది. ఈ శ్రేణిలో మంచుతో కప్పబడిన అనేక శిఖరాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని ఖైబరు పఖ్తున్ఖ్వాలోని చిత్రాలు జిల్లాలో 7,708 మీటర్లు (25,289 అడుగులు) ఎత్తులో తిరిచు మీరు లేదా టెరిచ్మిరు వంటి హిమశిఖరాలు ఉన్నాయి. ఉత్తరాన, దాని ఈశాన్య సరిహద్దున చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు కలిసే ప్రదేశానికి సమీపంలో హిందూ కుష్ పామీరు పర్వతాలు ఉన్నాయి. తరువాత ఇది పాకిస్తాన్ గుండా నైరుతి దిశగా విస్తరించి పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళుతుంది. ఉత్తర హిందూ కుష్ తూర్పు కారకోరం శ్రేణితో విలీనం అవుతుంది. దాని దక్షిణ చివరలో ఇది కాబూల్ నదికి సమీపంలో ఉన్న స్పిన్ఘరు శ్రేణితో కలుస్తుంది..
(ఇంకా…)
11వ వారం
టెర్రాఫార్మింగ్
టెర్రాఫార్మింగ్ అనగా ఏదైనా గ్రహం లేదా సహజ ఉపగ్రహం లేదా వేరే ఏదైనా ఖగోళ వస్తువు యొక్క వాతావరణాన్ని, ఉష్ణోగ్రతలను, ఉపరితల పరిస్థితులను, పర్యావరణాన్నీ భూమిని పోలినట్లు ఉండేలా మార్చి, ఆ ఖగోళ వస్తువును భూమిపై ఉండే జీవులకు నివాస యోగ్యంగా ఉండేలా మార్చడం. తెలుగులో దీన్ని భూమి తయారీ అనవచ్చు. టెర్రాఫార్మింగ్ భావన వైజ్ఞానిక కల్పన, వాస్తవ శాస్త్రం రెండింటి నుండీ అభివృద్ధి చెందింది. ఈ పదాన్ని జాక్ విలియమ్సన్ 1942 లో ఆస్టౌండింగ్ సైన్స్ ఫిక్షన్, లో ప్రచురించిన సైన్స్-ఫిక్షన్ చిన్న కథ (" కొలిజన్ ఆర్బిట్ ") లో రూపొందించారు. కాని ఈ భావన అంతకు ముందే ఉండి ఉండవచ్చు. ఒక గ్రహపు పర్యావరణాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చగలిగినప్పటికీ, అక్కడ ఏ అడ్డంకులూ ఉండని భూమి లాంటి వాతావరణాన్ని సృష్టించగల సాధ్యాసాధ్యాలు ఇంకా ధృవీకరణ కాలేదు. సాధారణంగా టెర్రాఫార్మింగ్ చేసేందుకు అనువైన గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తూంటారు. గ్రహాన్ని వేడెక్కించి, దాని వాతావరణాన్ని మార్చడం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. నాసా ఈ అంశంపై గోష్ఠులు కూడా నిర్వహించింది.
(ఇంకా…)
12వ వారం
పాంపే
పాంపే ఒక ప్రాచీన రోమన్ నగరం. ఇటలీ లోని, కంపానియా ప్రాంతంలో నేపుల్స్ నగరం దగ్గరలోని ఆధునిక పాంపీ వద్ద ఉంది. సా.శ 79 లో విసూవియస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినపుడు దాని బూడిద కింద 4 నుండి 6 మీటర్ల లోతున సమాధి అయిపోయిన నగరం ఇది. దీనితో పాటు చుట్టుపక్కల ఉన్న హెర్క్యులేనియమ్ వంటి గ్రామాలు కూడా ఆ బూడిదలో సమాధై పోయాయి. బూడిదతో కప్పి ఉండటం చేత నగరం చాలావరకు నాశనం కాకుండా సురక్షితంగా ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడిన విశేషాలు, ఆనాటి రోమన్ ప్రజల జీవితాన్ని అసాధారణమైన వివరాలతో చూపిస్తున్నాయి. ఇది ఒక సంపన్న నగరం. ఇక్కడ చాలా చక్కని ప్రభుత్వ భవనాలు, విలాసవంతమైన ప్రైవేట్ ఇళ్ళు, విలాసవంతమైన అలంకరణలు, కళాకృతులూ ఉన్నాయి. తవ్వకాల తొలినాళ్లలో ఇవి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. చెక్క వస్తువులు, మానవ శరీరాల వంటి సేంద్రియ అవశేషాలు విస్ఫోటనం వెదజల్లిన బూడిదలో సమాధి అయిపోయాయి. తదనంతర కాలంలో అవి కృశించి నశించి పోయి అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను అచ్చులుగా వాడి అప్పటి ప్రజల ఆఖరి భీతావహ క్షణాలను పోత పోయవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు గ్రహించారు.
(ఇంకా…)
13వ వారం
ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికా మూలం
పాలియో ఆంత్రొపాలజీలో, ఆధునిక మానవుల భౌగోళిక మూలాన్ని, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల (హోమో సేపియన్స్) తొలి వలసలనూ వివరించే సిద్ధాంతాల్లో ప్రబలంగా ప్రాచుర్యంలో ఉన్నది, ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం. దీనిని "ఆఫ్రికా నుండి బయటకు 2" సిద్ధాంతం (OOA) అని, ఇటీవలి ఏకైక-మూలం పరికల్పన (RSOH) అనీ, పునస్థాపన పరికల్పన అనీ, ఇటీవలి ఆఫ్రికన్ మూలం మోడల్ (RAO) అని కూడా పిలుస్తారు. హోమో ఎరెక్టస్, ఆ తరువాత హోమో నియాండర్తాలెన్సిస్ లు ఆఫ్రికా నుండి చేసిన తొలి వలసలను ఇది అనుసరిస్తుంది. జీవ వర్గీకరణ కోణంలో హోమో సేపియన్లకు "ఒకే మూలం" ఉందని ఈ నమూనా ప్రతిపాదిస్తుంది. దీనికి సమాంతరంగా ఇతర ప్రాంతాలలో జరిగిన మానవ పరిణామాన్ని ఈ సిద్ధాంతం పట్టించుకోదు. కానీ హోమో సేపియన్స్‌కు ఐరోపా, ఆసియాల్లోని ప్రాచీన మానవులకూ మధ్య జరిగిన పరస్పర సమ్మేళనాలను మినహాయించ లేదు. హెచ్. సేపియన్లు 3,00,000 - 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా కొమ్ములో అభివృద్ధి చెందారు. ఆధునిక ఆఫ్రికా-యేతర జనాభా అంతా కూడా ఆ కాలం తరువాత ఆఫ్రికాను నుండి వెళ్ళిన వారేనని ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం నమూనా ప్రతిపాదిస్తోంది.
(ఇంకా…)
14వ వారం
కనువూరు విష్ణురెడ్డి
కనువూరు విష్ణురెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. 22 బెల్ట్ ఆస్టరాయిడ్లను, ఆరు బైనరీ ఆస్టరాయిడ్లనూ కనుగొన్న శాస్త్రవేత్త. వేరే శాస్త్రవేత్త కనుగొన్న ఒక గ్రహ శకలానికి "8068 విష్ణురెడ్డి" అని పెట్టిన గౌరవాన్ని పొందిన శాస్త్రవేత్త. తాను కనిపెట్టిన ఒక గ్రహ శకలానికి "భారత్ 78118" అని పేరుపెట్టారు. ఆయన ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన 1999 నుండి అవిరామంగా గ్రహశకలాల యావత్తు సమాచారాన్ని వివిధ వనరుల ద్వారా సేకరించడం ప్రారంభించి, దాదాపు ఆరువేల పేజీల సమాచారాన్ని ప్రోగుచేసారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఇదే అభిరుచి, జిజ్ఞాస ఉన్న వారితో పరిచయం పెంచుకొని వారి సహాయ సహకారాలతో పరిశోధనలు చేసారు. వేల డాలర్లు ఖరీదు ఉన్న పాత టెలిస్కోపును కొనుక్కోలేని ఈయనకు ఇంటర్నెట్ స్నేహితులు స్వంత ఖర్చుతో పంపించారు. ఇంతలో అమెరికాలో అంరర్జాతీయ స్థాయిలో ఖగోళ పరిశోధనలకు సంబంధించిన వర్క్ షాపులో పాల్గొనడానికి "యాహూ" ఇంటర్నెట్ స్నేహితులు సహాయం అందించగా 2002 ఏప్రిల్ లో వర్క్ షాపులో పాల్గొని ఖగోళ శాస్త్రంలో తనకు తెలియని నూతన గవాక్షాలను ఆవిష్కరించుకున్నారు.
మరింతగా తెలుసుకోండి.
15వ వారం
జ్యోతీరావ్ ఫులే
జోతిబా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత. అతను కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. అతను అంతరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను మరియు అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు.
(ఇంకా…)
16వ వారం
న్యాయపతి రాఘవరావు
న్యాయపతి రాఘవరావు (ఏప్రిల్ 13, 1905 - ఫిబ్రవరి 24, 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. 1905వ సంవత్సరం ఏప్రిల్ 13 న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణిలో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. ఆ రోజుల్లో బీ.బీ.సీ లోని పిల్ల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ రేడియో చిన్న పిల్లల కొరకు రేడియో ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణస్యం తీసుకుంది. మద్రాసు రేడియోలో పిల్లల కార్య క్రమాలను దుర్గాభాయ్ దేశముఖ్ నిర్వహించేవారు. 1933 లో రాఘవ రావు, కామేశ్వరి జంటకు ఆ అవకాశం వరించింది. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందారు. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు.
(ఇంకా…)
17వ వారం
నారా చంద్రబాబునాయుడు
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి 1వ ముఖ్యమంత్రి. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి అనేక పురస్కారాలు పొందాడు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు.
(ఇంకా…)
18వ వారం
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది అంతరిక్షంలో ఉండి పనిచేసే టెలిస్కోపు. దీన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ కు వారసురాలిగా రూపకల్పన చేసారు. జేమ్స్ వెబ్ లో హబుల్ కంటే మెరుగైన పరారుణ రిజల్యూషన్, సున్నితత్వం ఉన్నాయి. విశ్వంలో తొలి గెలాక్సీలు ఏర్పడడం వంటి కొన్ని సుదూర సంఘటనలను, వస్తువులనూ పరిశీలించడంతో సహా ఖగోళ శాస్త్రానికీ, విశ్వం ఆవిర్భావానికీ సంబంధించిన రంగాలలో విస్తృతమైన పరిశోధనలు దీని ద్వారా చెయ్యవచ్చు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడం, బయటి గ్రహాలను, నోవాలనూ నేరుగా పరిశీలించడం మొదలైనవి జేమ్స్ వెబ్ ద్వారా కలిగే ఇతర ప్రయోజనాలు. జేమ్స్ వెబ్ ప్రాథమిక దర్పణాన్ని ఆప్టికల్ టెలిస్కోప్ ఎలిమెంట్ అంటారు. ఇది బెరీలియంతో తయారు చేసి, బంగారు పూత పూసిన 18 షట్కోణ ఫలకాలతో కూడుకున్న పెద్ద దర్పణం. దీని వ్యాసం 6.5 మీటర్లు. 2.4 మీటర్ల హబుల్ టెలిస్కోపు దర్పణం కంటే ఇది చాలా పెద్దది. హబుల్, సమీప అతినీలలోహిత, దృగ్గోచర, పరారుణ (0.1 నుండి 1 μm) వర్ణపటం లోని వికిరణాన్ని గమనిస్తుంది. జేమ్స్ వెబ్ ఇంకా తక్కువ పౌన:పున్యం (ఫ్రీక్వెన్సీ) లో, దీర్ఘ-తరంగదైర్ఘ్యం గల దృగ్గోచర కాంతి నుండి మధ్య-పరారుణ (0.6 నుండి 28.3 μm) వరకు గమనిస్తుంది.
(ఇంకా…)
19వ వారం
చిలికా సరస్సు
చిలికా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఇది దయా నది ముఖద్వారం వద్ద, ఒడిశా రాష్ట్రం లోని పూరి, ఖుర్దా, గంజాం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 1,100 చ.కి.మీ. పైచిలుకు ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. ది న్యూ కాలెడోనియన్ బారియర్ రీఫ్ తరువాత, ప్రపంచం లోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఇది రెండవది . దీన్ని తాత్కాలికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. వలస పక్షులకు భారత ఉపఖండంలో చిలికా అతిపెద్ద శీతాకాల స్థావరం. అంతరించి పోతున్న అనేక జాతుల మొక్కలు, జంతువులకు ఈ సరస్సు నిలయం. ఈ సరస్సు, పెద్ద ఎత్తున మత్స్య వనరులతో కూడుకుని ఉన్న పర్యావరణ వ్యవస్థ. దీని తీరం లోను, ద్వీపాల్లోనూ ఉన్న 132 గ్రామాల లోని 1,50,000 పైచిలుకు మత్స్యకారులకు ఇది జీవిక నిస్తోంది. వలస కాలంలో గరిష్ఠంగా 160 కి పైగా జాతుల పక్షులు ఈ సరస్సులోకి చేరతాయి. కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, అరల్ సీ ల నుండి,రష్యాలోని ఇతర మారుమూల ప్రాంతాల నుండీ, కజాకస్తాన్ కిర్గిజ్ స్టెప్పీలు, మధ్య, ఆగ్నేయాసియాల నుండి, లడఖ్, హిమాలయాల నుండీ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.
(ఇంకా…)
20వ వారం
ఆవశ్యక నూనె
ఆవశ్యక నూనెలు అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాలనుండి అనగా ఆకులు, వేర్లు, కాండాల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, పళ్ల పైనున్న తొక్కలు వంటి వాటిలో లభించును. అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు. వీటిని నూనెలని వ్యవహరించినను వీటిలో కొవ్వు ఆమ్లాలు వుండవు. ఆవశ్యక నూనెలు జలవికర్షణ లక్షణం కలిగి, నూనెలలో, హైడ్రొకార్బను ద్రావణులలో కరుగు లక్షణాలు కలిగి వుండును. ఆవశ్యక నూనె లన్నియు సువాసన కలిగిన నూనెలే. ప్రతి ఆవశ్యక నూనె తనకంటూ ఇక ప్రత్యేక వాసన కలిగి వుండును. ఆవశ్యక నూనెలలో ఒకటి రెండు మినగా యించి మిగతా నూనెలన్నియు తక్కువ బాష్పికరణ/మరుగు ఉష్ణోగ్రత వున్న నూనెలే.తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు ద్రవాలను ఒలటైలులు అంటారు. ఆవశ్యకనూనెలను మొక్కల/చెట్ల యొక్క ఎసెన్సు లు అని కూడా అంటారు. ఆవశ్యక నూనెలు సువాసన భరితాలు కావటం వలన అనాదిగా వీటిని సువాసన/సుగంధ ద్రవ్యాలు/నూనెలుగా, సౌందర్య లేపనాలలో/నూనెలలో విరివిగా వాడెవారు.
(ఇంకా…)
21వ వారం
గ్రీన్‌హౌస్ వాయువు
గ్రీన్‌హౌస్ వాయువు ఉష్ణ పరారుణ పరిధి లోపల వికిరణశక్తిని గ్రహించి, విడుదల చెయ్యగల వాయువు. గ్రీన్‌హౌస్ వాయువులు గ్రహాలపై గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కలిగిస్తాయి. భూ వాతావరణంలో ప్రాథమిక గ్రీన్‌హౌస్ వాయువులు నీటి ఆవిరి (H2O), కార్బన్ డయాక్సైడ్ (CO2), మీథేన్ (CH4), నైట్రస్ ఆక్సైడ్ (N2O), ఓజోన్ (O3) లు. గ్రీన్‌హౌస్ వాయువులు లేకపోతే, భూ ఉపరితలపు సగటు ఉష్ణోగ్రత ఇప్పుడున్న 15oC కాకుండా, -18oC ఉండి ఉండేది. శుక్రుడు, అంగారకుడు, టైటన్ ల వాతావరణాలలో కూడా గ్రీన్‌హౌస్ వాయువులు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి (1750 ప్రాంతాల్లో) మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరుగుతూ వచ్చింది. 1750 లో 280 పిపిఎమ్ ఉన్న సాంద్రత 2019 లో 415 పిపిఎమ్ వరకు, 45%, పెరిగింది. ఇంత అధిక స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ఎప్పుడో 30 లక్షల సంవత్సరాల క్రితం ఉండేది. ఆ తరువాత ఎప్పుడూ ఇంత ఎక్కువ స్థాయిలో లేదు కార్బన్ చక్రంలో ఉండే వివిధ ప్రకృతి సహజ "సింక్‌లు" ఈ ఉద్గారాలలో సగానికి పైగా పీల్చేసుకున్నప్పటికీ ఈ పెరుగుదల సంభవించింది. మానవజనిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో ఎక్కువ భాగం శిలాజ ఇంధనాలను దహనం చెయ్యడం వలన వచ్చినదే. వాటిలో ముఖ్యమైనవి: బొగ్గు, చమురు, సహజ వాయువు.
(ఇంకా…)
22వ వారం
తులసీదాసు
గోస్వామి తులసీదాసు గొప్ప కవి. అతను ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్ (ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో జన్మించాడు . తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు . హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకనిగా నిలిచాడు. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి, సమాజంలో విశేష ప్రభావం చూపాయి. దీని కారణంగా రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం, పాపులర్ సంగీతం, టెలివిజన్ సీరియళ్ళు అనేకం విలసిల్లాయి.. ఈయన శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి. అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్‌ చాలీసాను కూడా రచించాడు. అతను వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.
(ఇంకా…)
23వ వారం
కుమారజీవుడు
కుమారజీవుడు మధ్య ఆసియా నగర రాజ్యమైన కూచా లో జన్మించిన బౌద్ధ సన్యాసి. మహాయాన బౌద్ద పండితుడు. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకడు. ఇతని తల్లి జీవిక కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన భారతీయ బ్రాహ్మణుడు. జన్మతః భారతీయుడు కానప్పటికి భారతీయ మూలాలను కలిగివున్న కుమారజీవుడు బాల్యం నుండే అత్యంత ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. తన తొమ్మిదవ సంవత్సరం నుండే తల్లితో కలసి దేశాలు పర్యటిస్తూ, కాశ్మీర్, కాష్గర్, కూచా లలో బౌద్ధ సిద్ధాంతాలు అభ్యసించాడు. తొలుత సర్వాస్థివాద (హీనయానం) శాఖను అనుసరించినప్పటికి తరువాత మహాయాన బౌద్ధం లోకి మారాడు. ఇరవై సంవత్సరాల వయసు వచ్చేనాటికి మధ్య ఆసియాలో అత్యంత ప్రముఖ బౌద్ధ సన్యాసిగా, అఖండ మేధో సంపన్నుడుగా పేరుగాంచాడు. మధ్య ఆసియా నుండే కాక, తూర్పు ఆసియా, చైనా దేశాలనుండి బొద్ద బిక్షువులు బోధనల కోసం, జ్ఞాన సముపార్జనకోసం ఇతని వద్దకు వచ్చేవారు. అయితే దురదృష్టవశాత్తూ చైనా దేశపు అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయి 17 సంవత్సరాలు పాటు యుద్ద ఖైదీగా బందీలో ఉన్నాడు. చివరకు విడుదలై క్రీ.శ 401 లో ఉత్తర చైనా రాజధాని ‘చాంగన్’ లో స్థిరపడ్డాడు.
(ఇంకా…)
24వ వారం
పారిశ్రామిక విప్లవం
పారిశ్రామిక విప్లవం అనగ సుమారు 1760 నుండి 1820 - 1840 మధ్య కాలం వరకు ఐరోపా అమెరికాల్లో కొత్త ఉత్పాదక ప్రక్రియల దిశగా జరిగిన పరివర్తన. ప్రస్తుతం దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అని కూడా పిలుస్తున్నారు. ఈ పరివర్తనలో చేతి ఉత్పత్తి పద్ధతుల నుండి యంత్రాలకు మళ్లడం, కొత్త రసాయనాల తయారీ, ఇనుము ఉత్పత్తి ప్రక్రియలు, ఆవిరి శక్తి, నీటి శక్తి ల వినియోగం, యంత్ర పరికరాల అభివృద్ధి, యాంత్రిక కర్మాగార వ్యవస్థలు ఈ పరివర్తనలో భాగం. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల రేటులో అపూర్వమైన పెరుగుదలకు దారితీసింది. ఉపాధి, ఉత్పత్తి విలువల పరంగాను, పెట్టుబడి పరంగానూ పారిశ్రామిక విప్లవంలో వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించిన మొట్టమొదటి పరిశ్రమ, వస్త్రం. పారిశ్రామిక విప్లవం గ్రేట్ బ్రిటన్లో ప్రారంభమైంది. అప్పట్లో జరిగిన సాంకేతిక ఆవిష్కరణలు అనేకం బ్రిటన్‌లో జరిగినవే. 18 వ శతాబ్దం మధ్య నాటికి, బ్రిటన్ ప్రపంచం లోని ప్రముఖ వాణిజ్య దేశంగా ఉండేది. ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యాన్ని ఉత్తర అమెరికా, కరేబియన్‌ లోని వలస రాజ్యాలతోను, భారత ఉపఖండం లోని సైనిక, రాజకీయ ఆధిపత్యంతోనూ (ముఖ్యంగా తొలి-పారిశ్రామిక మొఘల్‌తో బెంగాల్, ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాల ద్వారా), బ్రిటన్ నియంత్రిస్తూ ఉండేది.
(ఇంకా…)
25వ వారం
నక్షత్రము
నక్షత్రాలు చీకటి రాత్రి, జనావాసాలకి దూరంగా, మబ్బులు లేని ఆకాశంలోకి తలెత్తి చూస్తే ముఖ్మల్ గుడ్డ మీద వెదజల్లిన వజ్రాలలా, మిలమిల మెరుస్తూ ఆకాశం నిండా కనిపిస్తాయి. నగ్న నయనాలకి సుమారు 4,000 నక్షత్రాలు కనిపించవచ్చు. దుర్భిణితో చూస్తే వేలకి వేలు, లెక్కపెట్టడానికి వీలులేనన్ని, కనిపిస్తాయి. నిజానికి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మిగిలిన నక్షత్రాలతో పోల్చి చూసినప్పుడు సూర్యుడు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం కాబట్టి కైవారంలో పెద్ద బింబంలా కనిపిస్తాడు, అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు మనకి కనబడే నక్షత్రాలన్నీ చెల్లాచెదురుగా, యాదృచ్ఛికంగా, వెదజల్లినట్లు కాకుండా, గుంపులు గుంపులుగా, గుర్తుపట్టడానికి వీలయిన ఆకారాలు ఉన్నట్లు, కనిపిస్తాయి. ఇలాంటి గుంపులకి మన పూర్వులు పెట్టిన పేర్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి: ఒరాయన్‌ లేదా మృగవ్యాధుడు, సప్త మహర్షిలు, వగైరా. మరికొన్ని నక్షత్రాల గుంపులకి మనందరికీ పరిచయమైన పేర్లు ఉన్నాయి: మేషం, వృషభం, మిధునం, కర్కాటకం,..., మీనం. ఈ పన్నెండు నక్షత్రాల గుంపుల ప్రత్యేకత ఏమిటంటే - భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఏడాదిలో, భూమి నుండి ఆకాశం లోకి సూర్యుడి వైపు చూస్తూన్నప్పుడు, ఒకొక్క నెలలో ఒకొక్క గుంపు (లేదా రాసి) సూర్యుడి వెనుకనున్న నేపథ్యంలో ఉంటుంది.
(ఇంకా…)
26వ వారం
సీసము
సీసము మూలకాల ఆవర్తన పట్టికలో 14 వ సముహమునకు చెందిన మూలకం. 14 వ సమూహాన్ని కార్బను సముదాయం అనికూడా అంటారు. ఈ మూలకం పరమాణు సంఖ్య 82. సీసము యొక్క సంకేతం Pb. సీసమును లాటిన్ లో "ప్లంబం" అంటారు. పదములోని మొదటి, 5వ ఆక్షరాన్నికలిపి Pb అని ఈ మూలకం యొక్క సంకేత ఆక్షరంగా నిర్ణయించారు. ఆవర్తన పట్టికలో దీని స్థానం థాలియంకు బిస్మత్కు మధ్యన ఉంటుంది. సీసమును చాలా యేళ్ళుగా మనిషి ఉపయోగిస్తూ వచ్చాడు. సీసము మానవునిచే కొన్ని వేలఏండ్లుగా వాడబడుచున్నది. అంతేకాదు ముడి ఖనిజం నుండి కరగించి వేరు చెయ్యడం కూడా సులభం. ప్రస్తుతం టర్కీ అని పిలవబడే ఒకప్పటి కాటల్ హోయుక్ లో క్రీ.పూ.6400నాటి సీసపు పూసలను కనుగొన్నారు.గ్రీకులు స్రీ.శ.650 నాటికే భారీప్రమాణంలో సీసము మూడుఖనిజాన్ని త్రవ్వితియ్యడమే కాకుండ, దానినుండి తెల్లసీసాన్ని ఉత్పత్తి చేసేవారు.200వేల సంవత్సరాలకు పైగా దీనిని రంగులపరిశ్రమలో విరివిగా వాడెవారు.తొలి కంచుకాలంలో సీసమును ఆంటిమొని, ఆర్సెనిక్ కలిపి ఉపయోగించేవారు.17 వ శతాబ్ది వరకు తగరానికి సీసానికి వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేక పొయ్యేవారు. రెండింటిని ఒకటిగానే భావించేవారు. సీసాన్ని ప్లంబం నిగ్రం, తగరాన్ని ప్లంబం కాండిడం అని పిలిచేవారు.
(ఇంకా…)
27వ వారం
ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్
ఇగ్నాజ్ ఫిలిప్ప్ సెమ్మెల్‌వెయిస్ హంగేరియన్ వైద్యుడు, శాస్త్రవేత్త, అతనిని ఆంటీసెప్టిక్ విధానాల ప్రారంభ మార్గదర్శకుడిగా పిలుస్తారు. చేతులు కడుక్కోవడం వల్ల కలిగే వైద్య ప్రయోజనాలను కనుగొన్న మొట్టమొదటి వ్యక్తిగా విస్తృతంగా నివేదించబడింది. ప్రసూతి క్లినిక్‌లలో చేతిపై రోగ క్రిమి నిర్మూలనం ద్వారా ప్యూర్పెరల్ జ్వరం (దీనిని "చైల్డ్ బెడ్ ఫీవర్" అని కూడా పిలుస్తారు) తీవ్రంగా తగ్గించవచ్చని సెమ్మెల్విస్ కనుగొన్నాడు. అందువల్ల అతను "తల్లుల రక్షకుడు" గా వర్ణించబడ్డాడు. 19 వ శతాబ్దం మధ్యలో ఆసుపత్రులలో ప్యూర్పెరల్ జ్వరం సాధారణం, తరచుగా ప్రాణాంతకం. 1847 లో వియన్నా జనరల్ హాస్పిటల్ మొదటి ప్రసూతి క్లినిక్‌లో పనిచేస్తున్నప్పుడు " క్లోరినేటెడ్ సున్నం ద్రావణం" తో చేతులు కడుక్కోవడం సెమెల్వీస్ ప్రతిపాదించాడు. ఇక్కడ వైద్యుల వార్డులలో మరణాలు మంత్రసాని వార్డుల మరణాల కంటే మూడు రెట్లు ఎక్కువ. అతను ఎటియాలజీ, కాన్సెప్ట్ మరియు ప్రొఫిలాక్సిస్ ఆఫ్ చైల్డ్బెడ్ ఫీవర్ లో తన పరిశోధనలను తెలియజేస్తూ పుస్తకాన్ని ప్రచురించాడు. అతని ఆలోచనలను వైద్య సంఘం తిరస్కరించింది. సెమ్మెల్వీస్ తన పరిశోధనలకు ఆమోదయోగ్యమైన శాస్త్రీయ వివరణ ఇవ్వలేదు. కొంతమంది వైద్యులు చేతులు కడుక్కోవాలన్న అతని సూచనతో మనస్తాపం చెంది, అతనిని ఎగతాళి చేశారు.
(ఇంకా…)
28వ వారం
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తెలుగు కవి, సినీ గేయ రచయిత. సుమారు 600కి పైగా పాటలు రాశాడు. తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు. పేరడీలు పాటలు రాయడంలో ప్రసిద్ధుడు. తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద పాటలు రాశాడు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. తెలంగాణా విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాశాడు. జొన్న విత్తుల రాసిన గీతాన్ని వందేమాతరం శ్రీనివాస్‌ గానం చేశాడు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. జొన్నవిత్తుల స్వస్థలం విజయవాడ. వారిది పేద కుటుంబం. తండ్రి ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆయన పౌరాణిక నాటకాల్లో పాల్గొనేవాడు. సుమారు మూడువేల పౌరాణిక నాటకాలు వేశారాయన. ఆయన తాత గారికి ఆంధ్ర గంధర్వ అనే బిరుదుండేది. అమ్మవైపు మేనమామ వరసయ్యే దైత గోపాలం సినిమాల్లో పాటలు రాసేవాడు. ఈయనకు ముందు తల్లికి ముగ్గురు పిల్లలు పురిట్లోనే చనిపోయారు.
(ఇంకా…)
29వ వారం
భాభా అణు పరిశోధనా కేంద్రం
బాబా అణు పరిశోధనా కేంద్రం భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణుపరిశోధన సంస్థ. ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి.అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కొరకు ఉపయోగించడానికి ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విద్యుదుత్పత్తి కోసం, వాడుకోవడమే BARC ప్రధాన ఉద్దేశం. రియాక్టర్ల సైద్ధాంతిక రూపకల్పన, కంప్యూటరీకరించిన మోడలింగ్, అనుకరణ, ప్రమాద విశ్లేషణ, కొత్త రియాక్టర్లు, కొత్త ఇంధన పదార్థాల అభివృద్ధి, పరీక్ష మొదలైన అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఇది నిర్వహిస్తుంది. వాడేసిన ఇంధనాన్ని ప్రాసెసింగ్ చెయ్యడం, అణు వ్యర్థాలను సురక్షితంగా పారవేయడంపై కూడా ఇది పరిశోధన చేస్తుంది. పరిశ్రమలు, ఔషధం, వ్యవసాయం మొదలైన వాటిలో ఐసోటోపులను వాడడం దాని ఇతర పరిశోధనాంశాలు. BARC దేశవ్యాప్తంగా అనేక పరిశోధన రియాక్టర్లను నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వం 1954 జనవరి 3 న అణు పరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్, ట్రాంబే అనే సంస్థను స్థాపించింది. దీని ముఖ్య ఉద్దేశం వివిధ సంస్థల్లో అణు రియాక్టర్లు, వాటి సాంకేతిక పరిజ్ఞానం పైన పనిచేస్తున్న శాస్త్రవేత్తల కృషినంతటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం.
(ఇంకా…)
30వ వారం
మెటల్ ఆర్కు వెల్డింగు
మెటల్ ఆర్కు వెల్డింగు అనగా ఒక సన్నని నిడుపాటి లోహకడ్దిని ఎలక్ట్రోడుగా, పూరక లోహంగా ఉపయోగించి, ఆర్కు వలన ఏర్పడిన ఉష్ణోగ్రతతో పూరకలోహాన్ని, లోహాల రెండు అంచులను కరగించి అతుకు ప్రక్రియ. రష్యాకు చెందిన విజ్ఞానశాస్త్రవేత్త వసిలె పెట్రొవ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక సజీవ విద్యుత్తు వలయంలో ఏనోడు (ధనధ్రువము), కాథోడు (ఋణధ్రువము) ల మధ్య ఆర్కును (తేజోవంతమైన ఉష్ణకాంతి వలయము) ను ఏర్పరచినప్పుడు ఉత్పన్నమగు ఉష్ణం నుండి లోహాలను కరగించివచ్చునని, రెండు లోహాల అంచులను ఏకీకృతంగా (coalescence) అతుకవచ్చుననేది ఆయన ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతమును సాకారం చేస్తూ 1881-82లో రష్యాకు చెందిన మరోశాస్త్రవేత్త నికొలై బెనర్డొస్ రాగి తొడుగు కలిగిన కర్బనపు కడ్దిని కాథోడుగా నుపయోగించి లోహాలాంచులను కరగించి అతికి, మొదటి ఆర్కు వెల్డింగ్ విధానమును ప్రపంచానికి అందించాడు. అటు తరువాత ఈ విధనానికన్న మెరుగైన ఆర్కు వెల్డింగు విధానమైన, లోహకడ్డిని ఎలక్ట్రోడుగా ఉపయోగించి లోహాలను అతుకు మెటల్ ఆర్కు వెల్డింగు ను 1888లో రష్యాకు చెందిన నికొలై స్లావ్యనోవ్ , అమెరికాకు చెందినా సి.ఎల్.కోఫిన్ (1890) కనుగొన్నారు. ఈ వెల్డించు విధానములో ఏకాంతర, ఏక ముఖ విద్య్త్తుత్తు నుపయోగించి వెల్డిగు చెయ్యవచ్చును.
(ఇంకా…)
31వ వారం
ప్రఫుల్ల చంద్ర రాయ్
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ బెంగాళీ విద్యావేత్త, ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, చరిత్రకారుడు, పారిశ్రామికవేత, పరోపకారి. బెంగాలీ జాతీయవాదిగా అతను రసాయనశాస్త్రంలో మొట్టమొదటి భారతీయ పరిశోధనా పాఠశాలను స్థాపించాడు. భారతదేశంలో రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డాడు. అతని జీవితం, పరిశోధనలను ఐరోపా వెలుపల మొట్టమొదటి రసాయనశాస్త్ర మైలురాయిగా ఫలకంతో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సత్కరించింది. భారతదేశపు మొట్టమొదటి ఔషథ సంస్థ బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ను అతను స్థాపించాడు. అతను ఎ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ ఫ్రమ్ ది ఎర్లీస్ట్ టైమ్స్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ సిక్స్‌టీంత్ సెంచరీ (1902) అనే గ్రంథాన్ని రచించాడు. భారతీయుల విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసాడు. అతను భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెప్పేవాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న అతను జీవితాంతం బ్రహ్మచారిగా కొనసాగాడు. అతను సాధారణ బ్రహ్మ సమాజంతో సన్నిహితంగా సంబంధం కలిగి ఉండేవాడు.
(ఇంకా…)
32వ వారం
రాజేంద్ర సింగ్
డా. రాజేంద్ర సింగ్ (జ. 1959 ఆగస్టు 6) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు, సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పిలుస్తారు. తన కృషికిగాను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. 1975లో ప్రభుత్వేతర సంస్థ "తరుణ్ భారత్ సంఘ్" ను స్థాపించాడు. రాజస్థాన్‌ లో మంచి నీటి నిర్వహణలో విశేష కృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నాడు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌ లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించాడు. వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు అభివృద్ధి చెందాయి. అతను వర్షపు నీటిని నిల్వచేసేట్యాంకులు, చెక్ డ్యాం లను ఉపయోగించి నీటిని సంరక్షించే విధానాలను అవలంబిస్తాడు. 1985లో ఒక గ్రామం నుండి ప్రారంభించి ఈ సంస్థ 8600 జోహాద్‌లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వచేసింది. అతను చేసిన ఈ విధానాల వల్ల రాజస్థాన్ లో అర్వారి, రూపారెల్, సర్సా, భగాని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి.
(ఇంకా…)
33వ వారం
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం. దీన్ని 1914 ఏప్రిల్ 10 న విజయవాడలో స్థాపించారు. ప్రజలలో అక్షరాస్యత, జ్ఞానం, అవగాహనలను వ్యాప్తి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఈ సంఘం ఉద్భవించింది. గ్రంథాలయోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈ సంఘం మొదట నుండి పనిచేస్తోంది. విజయవాడ (పూర్వపు బెజవాడ) లోని రామామోహన ప్రజా గ్రంథాలయం వారు "ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లైబ్రరీ ఆర్గనైజర్స్" ను 1914 ఏప్రిల్ 10 న నిర్వహించారు. అదే రోజున నిర్వహించబడిన ఆంధ్ర గ్రంథాలయ సమావేశ ఫలితంగా ఆంధ్ర గ్రంథాలయోద్యమం ఇంకా ఆంధ్రప్రదేశ్ గ్రంథ భండాగార సంఘం (అసోసియేషన్ ఆఫ్ లైబ్రరీస్ ఆఫ్ ఆంధ్ర ఏరియా) ఉనికిలోకి వచ్చాయి. అయ్యంకి వెంకటరమణయ్య, సూరి వెంకట నరసింహ శాస్త్రి ఈ సంఘాన్ని ప్రారంభించారు. ఈ మహాసభలోనే, సంఘపు మొదటి అధ్యక్షుడిగా దీవాన్ బహదూర్ మోచర్ల రామచంద్రరావు పంతులు, మొదటి కార్యదర్శులుగా, అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావు ఎన్నికయ్యారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు దీనికి అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా ఆయన వెలువరించిన సందేశ గీతాన్ని అయ్యంకి వెంకటరమణయ్య 'గ్రంథాలయ వేదం'గా అభివర్ణించారు. పూర్తి అక్ష్యరాశ్యత సాధించడము కొరకు కృషి చేయుట, రాష్ట్రంలో ప్రతి మూలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయుట, ప్రజలకు ఉచితంగా సమాచారం అందించుట, ప్రజలలో చదివే అలవాటును పెంపొందించడం, గ్రంథాలయాలను ఆధునీకరించుట మొదలగునవి ఈ సంఘ లక్ష్యాలు
(ఇంకా…)
34వ వారం
రోనాల్డ్ రాస్
సర్ రోనాల్డ్ రాస్ బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతను మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. 1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని ఋజువైంది. ఈ వ్యాధిని ఎదుర్కొనే పద్ధతికి పునాది వేసింది. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక కవితలు రాసాడు, అనేక నవలలను ప్రచురించాడు. పాటలను స్వరకల్పన చేసాడు. ఆయన కళాభిలాషి, గణిత శాస్త్రవేత్త కూడా. భారతీయ వైద్య సేవలో 25 సంవత్సరాలు పనిచేశాడు. తన సేవలోనే అతను సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు. భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లో అధ్యాపకునిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు ఆ సంస్థలో ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసరుగా, చైర్మను గా కొనసాగాడు. 1926 లో అతను రాస్ ఇన్‌స్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు. ఇది అతని రచనలను గౌరవించటానికి స్థాపించబడింది. ఆయన చనిపోయే వరకు అక్కడే పనిచేశాడు.
(ఇంకా…)
35వ వారం

ఆంటోనీ లావోయిజర్

ఆంటోనీ-లారెంట్ఆం డి లావోయిజర్ (ఆంటోనీ లావోయిజర్) (1743 ఆగస్టు 26 - 1794 మే 8) ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. రసాయన శాస్త్రంలో అతను చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను "ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు. అతను "హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ" , "హిస్టరీ ఆఫ్ బయాలజీ" గ్రంధాల రచనతో మంచి గుర్తింపు పొందాడు. దహన చర్యలను గురించి అధ్యయనం చేసాడు. పదార్థాల భౌతిక స్థితులకు సంబంధం లేకుండా క్రియాజనకాల, క్రియాజన్యాల ద్రవ్యరాశులను ఖచ్చితంగా లెక్కించగలిగాడు. తన పరిశీలనల ఆధారంగా ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. దహన క్రియలో ఆక్సిజన్ పాత్రను ఆవిష్కరించడం ద్వారా ప్రసిద్ధుడైనాడు. ఆక్సిజన్ కు 1778లో, హైడ్రోజన్ కు 1783 లలో నామకరణం చేసింది ఈయనే. మెట్రిక్ వ్యవస్థ నిర్మాణంలో సహాయపడ్డాడు. మొదటిసారి విస్తృతమైన మూలకాల జాబితాలను రాసాడు. ఇది రసాయన పదార్థాల నామీకరణ విధానానికి దోహదపడింది. సిలికాన్ మూలక ఉనికిని 1787లో అంచనా వేసాడు. సల్ఫర్ (గంధకం) ఒక మూలకమని మొదటిసారి తెలియజేసాడు. పదార్థం దాని స్థితిలోనూ, ఆకారంలో మార్పు వచ్చినప్పటికీ దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదని నిరూపించాడు. ఆయన పారిస్ నగరంలో ఉన్నత వర్గానికి చెందిన సంపన్న కుటుంబంలో ఆగష్టు 26, 1743 న జన్మించాడు. అతని తండ్రి పారిస్ పార్లమెంటులో న్యాయవాదిగా ఉండేవాడు. అతనికి ఐదు సంవత్సరాల వయసులో తన తల్లి మరణించింది. పారిస్ విశ్వవిద్యాలయం లోని కాలేజ్ డెస్ క్వారె లో పాఠశాల తన 11వయేట 1754లో విద్యను ప్రారంభించాడు.


(ఇంకా…)

36వ వారం
కల్నల్‌ సాండర్స్‌
కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ అమెరికన్ వ్యాపారవేత్త, ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి కెంటుకీ ఫ్రైడ్ చికెన్(KFC) ను స్థాపించాడు. తరువాత కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా, చిహ్నంగా పనిచేశాడు. అతని పేరు, చిత్రం ఇప్పటికీ కె.ఎఫ్.సి సంస్థకు చిహ్నాలుగా ఉన్నాయి. "కల్నల్" అనే బిరుదు గౌరవప్రదమైనది - కెంటుకీ కల్నల్ అనేది సైనిక హోదా కాదు. సాండర్స్ తన ప్రారంభ జీవితంలో ఆవిరి యంత్రాలకు బొగ్గులు వేసే ఉద్యోగంలో, ఇన్సూరెన్స్ అమ్మకం దారుగా, ఇంధనాన్ని నింపే కేంద్రంలో పనివాడిగా అనేక ఉద్యోగాలను చేసాడు. అతను ఆర్థిక మాధ్యం సమయంలో కెంటుకీలోని నార్త్ కార్బిన్‌లోని రోడ్డు ప్రక్కన రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వేయించిన చికెన్ అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో సాండర్స్ తన "సీక్రెట్ రెసిపీ" (రహస్య వంటకం) ను, ప్రెజర్ ఫ్రైయర్‌లో చికెన్ వంటలకు పేటెంటు హక్కులు పొంది వాటిని అభివృద్ధి చేశాడు. సాండర్స్ రెస్టారెంట్ రంగంలో ఫ్రాంఛైజింగ్ (గొలుసుకట్టు దుకాణాలు) భావన సామర్థ్యాన్ని గుర్తించాడు. మొదటి KFC ఫ్రాంచైజ్ 1952 లో ఉటా లోని సౌత్ సాల్ట్ లేక్‌లో ప్రారంభించబడింది. తన అసలు రెస్టారెంట్ మూసివేసిన తరువాత, తన వేయించిన చికెన్‌ను దేశవ్యాప్తంగా ఫ్రాంఛైజ్ చేయడానికి పూర్తి సమయం కేటాయించాడు.
(ఇంకా…)
37వ వారం
బాబ్రీ మసీదు కూల్చివేత
బాబ్రీ మసీదు కూల్చివేత 1992 డిసెంబరు 6న జరిగింది. ఇదిఅయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి బాబ్రీ మసీదును కూల్చివేసారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో, ఉత్తర ప్రదేశ్‌, అయోధ్య నగరంలోని 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదు, వారి లక్ష్యంగా మారింది. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి ఈ సంఘటనకు నేపథ్యం. హిందూ విశ్వాసాల ప్రకారం, అయోధ్య నగరం శ్రీరాముడి జన్మస్థలం. 16 వ శతాబ్దంలో మొఘల్ జనరల్ మీర్ బాకి, కొంతమంది హిందువులు రాముడి జన్మస్థలం అని భావించే ప్రదేశంలో బాబ్రీ మసీదు అనే పేరుతో ఒక మసీదును నిర్మించాడు. ఈ మసీదును, గతంలో ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలం లోనే నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 1980 వ దశకంలో, విశ్వ హిందూ పరిషత్ (విహింప) ఈ ప్రదేశంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ (భాజపా) దానికి రాజకీయంగా గొంతు కలిపింది.
(ఇంకా…)
38వ వారం
సోడియం హైడ్రాక్సైడ్
సోడియం హైడ్రాక్సైడ్ సాధారణంగా క్షారజలం, కాస్టిక్ సోడాగా మనకు సుపరిచితం. ఇది అకర్బన సమ్మేళనం. దీని ఫార్ములా NaOH. ఇది ఘన రూపంలో ఉన్న అయానిక సమ్మేళనం. దీనిలో సోడియం Na+ కాటయాన్లు , హైడ్రాక్సైడ్ OH- ఆనయాన్లు ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ అత్యంత దాహక క్షారం, క్షార ద్రావణం. ఇది సాధారణ పరిసర ఉష్ణోగ్రతలలో ప్రోటీన్లను కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఇది తీవ్రమైన రసాయన కాలిన గాయాలకు కారణం కావచ్చు. ఇది నీటిలో కరుగుతుంది. 12.3 నుండి 61.8 °C వరకు ఉష్ణోగ్రత వద్ద నీటితో స్పటికీకరణం చెంది NaOH·H
2
O
అనే మోనో హైడ్రైడ్ ఏర్పరుస్తుంది. వాణిజ్య పరంగా లభ్యమవుతున్న "సోడియం హైడ్రాక్సైడ్" సాధారణంగా మోనో హైడ్రేట్. ప్రచురించిన సమాచారం ప్రకారం దీనికి బదులుగా అన్‌హైడ్రస్ సమ్మేళనము (నీటి అణువులను తొలగించిన సమ్మేళనం) NaOH ను ఉపయోగిస్తున్నారు. సరళమైన హైడ్రాక్సైడ్లలో ఒకటిగా, రసాయన శాస్త్రం అభ్యసించే విద్యార్థులకు పిహెచ్ స్కేల్‌ను ప్రదర్శించడానికి తటస్థ నీరు, ఆమ్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు దీనిని తరచుగా ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ అనేక పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. దీనిని కర్ర గుజ్జు, కాగితం, వస్త్రాలు, తాగునీరు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో, డ్రెయిన్ క్లీనర్‌గా ఉపయోగిస్తారు. 2004 లో ప్రపంచవ్యాప్త ఉత్పత్తి సుమారు 60 మిలియన్ టన్నులు కాగా, డిమాండ్ 51 మిలియన్ టన్నులు.
(ఇంకా…)
39వ వారం
సితార (సినిమా)
సితార, పూర్ణోదయా మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో, సుమన్, భానుప్రియ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలనచిత్రం. ఒకప్పుడు గొప్పగా వెలిగి ఆరిపోయిన రాజాస్థానాలలో ఒక ఆస్థాన యజమాని చెల్లెలు సితార (భానుప్రియ). ఆమెను గొప్ప జమీందారుకు ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు ఆమె అన్న. ఆ సంస్థానానికి పగటి వేషగాళ్ళుగా వచ్చిన వారిలో ఒక వ్యక్తిని (సుమన్) ప్రేమిస్తుంది సితార. కాని అతడితో పెళ్ళి మాత్రం సాధ్యపడదు. తదనంతర కాలంలో ఆమె గొప్ప నటి అవుతుంది. ఆఖరున ఆమెను అతడు కలవడంతో కథ సుఖాంతమవుతుంది. మంచు పల్లకి సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తాను రాసుకున్న మహల్లో కోకిల అనే నవలను కొద్దిపాటి మార్పులతో రూపొందించిన సితార ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది. వెన్నెల్లో గోదారి అందం పాటకు గాను ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమా విజయం వంశీ కెరీర్ ని కూడా నిలబెట్టింది. పాటలు గొప్పగా తీస్తాడన్న పేరు వచ్చింది. ఇళయరాజాతో వంశీ పనిచేసిన తొలిచిత్రం ఇది. ఈ సినిమాతో వారిద్దరి అనుబంధం బలపడి ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు. వంశీ-ఇళయరాజా కాంబినేషన్లో అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల మొదలైన 11 సినిమాలు వచ్చాయి. ఎన్నో పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. గోదావరి పట్ల వంశీకి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలా చోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణలో వంశీ మార్కును చూడవచ్చు.
(ఇంకా…)
40వ వారం
లాహిరి మహాశయులు
శ్యామ చరణ్ లాహిరి భారతదేశానికి చెందిన యోగీశ్వరుడు, గురువు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. ఆయన యోగిరాజ్, కాశీ బాబాగా సుపరిచితుడు. ఆయన 1861 లో మహావతార్ బాబాజీ నుండి యోగంలో ఒక భాగమైన క్రియా యోగను నేర్చుకున్నాడు. మహాశయ అనే సంస్కృత ఆధ్యాత్మిక పదానికి విశాల మనస్తత్వం అని అర్థం. అతను భారతీయ యోగులలో విలక్షణమైనవాడు. గృహస్థునిగా వివాహం చేసుకొని కుటుంబాన్ని పెంచడం, బ్రిటిష్ భారత ప్రభుత్వ మిలటరీ ఇంజనీరింగ్ విభాగానికి అకౌంటెంట్‌గా పనిచేసాడు. లాహిరి తన కుటుంబంతో కలిసి ఆలయంలో లేదా ఆశ్రమంలో కాకుండా వారణాసిలో నివసించాడు. అతను 19 వ శతాబ్దపు హిందూ మతవాదులలో గణనీయమైన ఖ్యాతిని పొందాడు. 1946 లో శ్రీ యుక్తేశ్వర్ గిరి శిష్యుడైన పరమహంస యోగానంద రాసిన పుస్తకం "ఒక యోగి ఆత్మ కథ" ద్వారా అతను పశ్చిమ దేశాలలో గురించ బడ్డాడు. ఈయన యుక్తేశ్వర్ గిరికి గురువు. నానాటికీ ఉనికి కోల్పోతున్న క్రియా యోగా సాధనను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయడానికి లాహిరి మహాశయుని మహావతార్ బాబాజీ ఎన్నుకున్నారని యోగానంద తన పుస్తకంలో రాశాడు. అందుకని, యోగానంద అతన్ని యోగా అవతారం గా భావించాడు.
(ఇంకా…)
41వ వారం
ఇమ్రాన్ ఖాన్ నియాజి
ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజి పాకిస్తానుకు 22 వ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చైర్మన్. రాజకీయాల్లోకి రాకముందు, ఖాన్ అంతర్జాతీయ క్రికెటరు, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్. అతడి నేతృత్వంలో పాకిస్తాన్ 1992 క్రికెట్ ప్రపంచ కప్‌ సాధించింది. ఖాన్ 1952 లో లాహోర్లో ఒక పష్తూన్ కుటుంబంలో జన్మించాడు. 1975 లో ఆక్స్‌ఫర్డ్ లోని కేబుల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. 1971 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఖాన్ 1992 వరకు ఆడాడు.1982, 1992 మధ్య జట్టు కెప్టెన్‌గా పనిచేశాడు. క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. ఈ పోటీలో ఇదే పాకిస్తాన్ యొక్క మొదటి, ఏకైక విజయం. పాకిస్తాన్ యొక్క అత్యుత్తమ ఆల్ రౌండ్ ఆటగాడిగా పరిగణించబడుతున్న ఖాన్ టెస్ట్ క్రికెట్లో 3,807 పరుగులు తీసాడు, 362 వికెట్లు తీసుకున్నాడు. పదవీ విరమణ చేసిన తరువాత, అతను తన యవ్వనంలో ఉండగా బాల్ ట్యాంపరింగ్‌ చేసానని ఒప్పుకున్నాడు. దేశీయ లీగ్ కోచ్‌గా పనిచేశాడు. ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరాడు.
(ఇంకా…)
42వ వారం
మహారాష్ట్ర
మహారాష్ట్ర భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది. మహారాష్ట్రి అనే ప్రాకృత పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు. అయితే ఈ విశ్లేక్షణలకు బలమైన ఆధారాలు లేవు. మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు మహారాష్ట్రి అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి ముంబాయి నగరానికి ఉత్తరాన ఉన్న సోపార రేవు పట్టణంనుండి కొచ్చి (భారతదేశం) తోను, తూర్పు ఆఫ్రికా, మెసపొటేమియా లతోను వర్తక సంబంధాలుండేవి.
(ఇంకా…)
43వ వారం
టిగ్ వెల్డింగు
టిగ్ అనేది టంగ్‍స్టన్ ఇనెర్ట్ గ్యాసు వెల్డింగు కు సంక్షిప్త ఆంగ్లపదము. టంగ్‍స్టన్ లోహకడ్డీని ఆర్కును సృష్టించు ఎలక్ట్రోడుగా వినియోగిస్తూ, వెల్డింగు సమయంలో అతుకబడు లోహాభాగాలు ఆక్సీకరణకు లోనుకాకుండా నిరోధించుటకు ఆర్గాను లేదా హీలియము వంటి జడవాయువులను వినియోగించు వెల్డింగు ప్రక్రియ. ఈ వెల్డింగు ప్రక్రియను జి.టి.ఎ.డబ్లూ అని కూడా వ్యవహరిస్తారు. ఈ వెల్డింగు విధానం ఒక విధంగా అభివృద్ధిపరచిన కార్బను ఆర్కువెల్డింగు విధానమని చెప్పవచ్చును. కార్బను ఆర్కువెల్డింగు విధానంలో కర్బనపు కడ్డీని ఆర్కు కల్గించు ఎలక్ట్రోడుగా వాడి, లోహాలను అతుకుటకు ప్రత్యేకంగా పూరక లోహ కడ్డీని వాడినట్లే, టిగ్ వెల్డింగులో కూడా టంగస్టన్ లోహకడ్డీని ఆర్కు ఏర్పరచుటకు మాత్రమే వాడి, లోహాలను ప్రత్యేకంగా మరో లోహాపూరక కడ్డీతో అతికిస్తారు. టిగ్ వెల్డింగులో లోహపూరక కడ్డీపై ఎటువంటి స్రావకము వుండదు. టిగ్ వెల్డింగును కూడా కార్బను ఆర్కువెల్డింగు వలె ఏకముఖ విద్యుత్తు (డి.సి) ను వినియోగిస్తారు. టిగ్ వెల్డింగులో పూరకలోహక కడ్డీలు మెటల్ ఆర్కువెల్డింగు ఎలక్ట్రొడుల వలె నిర్ధిష్టమైన పొడవు వుంటాయి. టిగ్ వెల్డింగులోనిఎలక్టొడుగా వాడు టంగ్‌స్టన్ ద్రవీభవన ఉష్ణోగ్రత చాలాఎక్కువ (3422 0C).అందుచే వెల్డింగుసమయంలో టంగ్‌స్టను ఎలక్ట్రొడు అరుగుదల చాలాతక్కువ. అందుచే టంగ్‌స్టను ఎలక్ట్రోడు అరగని/ నాన్‌ కంజ్యూమబుల్ ఎలక్ట్రోడు. అయితే చాలాకాలం వాడిన తరువాత కొద్దిమేర అరుగుదల వుంటుంది.
(ఇంకా…)
44వ వారం
ఐజాక్ మెరిట్ సింగర్
ఐజాక్ మెరిట్ సింగర్ (అక్టోబరు 27, 1811 - జూలై 23, 1875) అమెరికన్ ఆవిష్కర్త, నటుడు, పారిశ్రామిక వేత్త. అతను మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరణ అయిన కుట్టు మిషనును ఆవిష్కరించాడు. అతను సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే కుట్టుమిషన్ లపై పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు. 1839 లో సింగర్ రాళ్ళను డ్రిల్లింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టి దానిపై పేటెంటును పొందాడు. ఈ పేటెంటు హక్కును ఇల్లినాయ్ & మిషిగన్ కెనాల్ కంపెనీకి రెండువేల డాలర్లకు అమ్మాడు. అలా సమకూరిన డబ్బుతో తన నట జీవితాన్ని తిరిగి కొనసాగించాలని అనుకున్నాడు. అతను తన ఆశయం కోసం ఒక నట వర్గాన్ని ప్రోగుచేసుకొని దేశమంతా పర్యటన ప్రారంభించాడు. ఈ బృందానికి "మెరిట్ ప్లేయర్స్" అనే పేరుపెట్టాడు. బృందం యొక్క ప్రదర్శనలలో సింగర్ "ఐసాక్ మెరిట్" అనే పేరుతో పాల్గొనేవాడు. అతని సరసన ఆ బృందంలో "మేరీ అన్న్" "మిసెస్ మెరిట్"గా ప్రదర్శనలిచ్చేది.
(ఇంకా…)
45వ వారం
టబు
టబు హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థిరపడిన సినిమా నటి. ఈమె నటి ఫరాహ్ చెల్లెలు, నటి దివ్యభారతి స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయమై తర్వాత కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. ఈమె అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి జమాల్ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్ టీచర్. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెంట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు అవుతారు.1980లోనే కెమెరా ముందుకెళ్లింది. బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు హమ్ నే జవాన్ లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకొంది.
(ఇంకా…)
46వ వారం
జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం
జవాహర్ లాల్ నెహ్రూ భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. 1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితంలో 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్‌ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు. ముస్లిం నియోజకవర్గాల్లోనూ, ముస్లిం జనాధిక్యత ఉన్న కొన్ని ప్రావిన్సుల్లోనూ లీగ్ స్పష్టమైన విజయంతో భారతీయ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాబట్టుకోగలిగినంత రాబట్టుకునేందుకు అటు రాజకీయాలను, ఇటు మత హింసను వాడుకోసాగాడు.
(ఇంకా…)
47వ వారం
చుక్కా రామయ్య
చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు. జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది. ఇతను 1925, నవంబర్ 20 న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. రామయ్యకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు.రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, ఎం.ఎస్.సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు. జనగామ జిల్లా జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు.
(ఇంకా…)
48వ వారం
అమోల్ పాలేకర్
అమోల్ పాలేకర్ హిందీ సినిమా నటుడు, దర్శకుడు. హిందీ, మరాఠీ సినిమా నిర్మాత. పాలేకర్ ముంబాయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో లలిత కళలను అభ్యసించాడు. అతను చిత్రకారుడిగా తన కళాత్మక వృత్తిని ప్రారంభించాడు. చిత్ర కళాకారునిగా ఏడు చిత్రకళా ప్రదర్శనలు, గ్రూపు ప్రదర్శనలు చేపట్టాడు. నాటక ప్రదర్శనలలో చురుకుగా పాల్గొనే పాలేకర్ మరాఠీ, హిందీలలో 1967 వరకూ అనేక ప్రదర్శనలను రూపొందించి నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించాడు. అనేక ప్రదర్శనలలో పాల్గొన్నాడు. దీని ద్వారా గుర్తింపు పొంది తద్వారా హిందీ చిత్రపరిశ్రమకు ఆహ్వానించబడ్డాడు. నటుడిగా 1970 దశకంలో హిందీ చిత్రరంగంలో గుర్తింపు పొందాడు. అనేక మంచి చిత్రాలు రూపొందించాడు. హిందీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ తదితర భాషా సినిమా రంగాలలో ఆయన నటించాడు. సినీ జీవితంలో ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారంతో పాటుగా ఆరు రాష్ట్ర పురస్కారాలను ఉత్తమ నటుడిగా అందుకొన్నాడు. ఇక దర్శకుడిగా ఆయన అనేక సున్నిత కథాంశాలను తెరకెక్కించాడు. భారతీయ సాహిత్యం నుండి అనేక కథలను, మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను తెరకెక్కించాడు.
(ఇంకా…)
49వ వారం
పాబ్లో ఎస్కోబార్
పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు (కింగ్ ఆఫ్ కొకైన్) అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందాడు. 1990ల్లో ఏటా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు, తద్వారా అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు. కొలంబియా ప్రాంతంలోని రియోనెగ్రోలో జన్మించిన ఎస్కోబార్, సమీపంలోని మెడెలిన్‌లో పెరిగాడు. యూనివర్శిడాడ్ ఆటోనామా లాటినో అమెరికనా ఆఫ్ మెడెలిన్‌లో కొద్దికాలం పాటు చదువుకున్నా, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేశాడు; నేర కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించి క్రమేపీ తప్పుడు బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టిక్కెట్లూ అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనంలోనూ పాల్గొన్నాడు. 1970ల్లో పలువురు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు.
(ఇంకా…)
50వ వారం
నీటి కాలుష్యం
నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చెయ్యడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భజలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు, తగినంతగా శుద్ధి చేయని మురుగునీటిని సహజ జలాల్లోకి విడుదల చేయడం జల పర్యావరణ వ్యవస్థల క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఈ నీటిపి ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటిపారుదల కొరకు ఉపయోగించవచ్చు . ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వ్యాధులకూ నీటి కాలుష్యం ప్రధాన కారణం. సముద్ర కాలుష్యం, పోషకాల కాలుష్యం నీటి కాలుష్యంలోని ఉపసమితులు. నీటి కాలుష్యానికి కారణమయ్యే మూలాలు ఒక్క చోటనే (ఏకమూలం) ఉండవచ్చు, లేదా పలు చోట్ల ఉండే మూలాలూ (అనేక మూలాలు) కావచ్చు. వరద నీటి కాలువ, మురుగునీటి శుద్ధి కర్మాగారం లేదా వాగు వంటివి ఏక మూల కాలుష్య కారకాలు. వ్యవసాయ మురుగు నీరు వంటివి అనేక మూలాలు కలిగినవి. కాలుష్యం అనేది కాలక్రమంలో జరిగే సంచిత ప్రభావం యొక్క ఫలితం. కలుషితమైన నీటి వనరులలో నివసించే లేదా ఆ నీటిని గ్రహించే మొక్కలు, జీవులు అన్నీ ప్రభావితమవుతాయి.
(ఇంకా…)
51వ వారం
పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు
పాకిస్తాన్ 1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంతకు ముందు ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. వేదకాలం నుండి ఇక్కడ హిందూమతం విలసిల్లుతోంది. ముల్తాన్ ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని గాంధారం వద్ద వికసించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య 1.3% మాత్రమే ఉన్నా ఇక్కడ హైందవ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించించే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. హింగ్లజ్ మాత, హింగ్లజ్ దేవి లేదా హింగుళాదేవి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇది బలూచిస్తాన్ జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో నెలకొని ఉంది. ఈ ఆలయం హింగోల్ నదీతీరంలోని ఒక కొండగుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నానీమందిరంగా పిలుస్తారు. ప్రతియేటా ఏప్రిల్ మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు ఈ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కుబడులు చెల్లించుకుంటారు. స్థానికి ముస్లీములు ఈ దేవతను బీబీ నానీగా కొలుస్తారు. ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు.
(ఇంకా…)
52వ వారం
మార్లిన్ డీట్రిచ్
మార్లిన్ డీట్రిచ్ జర్మన్-అమెరికన్ నటి, గాయని. 1910ల నుంచి 1980ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పటికప్పుడు తనని తాను పునర్ అన్వేషించుకుంటూ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకునేది. 1920ల్లో మార్లిన్ బెర్లిన్‌లో రంగస్థలంపైనా, నిశ్శబ్ద చిత్రాల్లోనూ నటించింది. ద బ్లూ ఏంజెల్ (1930)లో లోలా-లోలా పాత్రలో ఆమె నటన ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యం, పారామౌంట్ పిక్చర్స్‌తో ఒప్పందాన్ని సంపాదించిపెట్టింది. మొరాక్ (1930), షాంఘై ఎక్స్‌ప్రెస్ (1932), డిజైర్ (1936) వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. తన ఆకర్షణీయమైన రూపాన్ని, ఆకట్టుకునే శైలిని ఆధారం చేసుకుని ఆ దశలోకెల్లా అతిఎక్కువ సంపాదన కలిగిన నటిగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్నాళ్ళూ అమెరికా వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన తారగా ఆమె అత్యున్నత స్థానంలో నిలిచేవుంది. అడపాదడపా సినిమాల్లో నటించినా 1950ల నుంచి 1970ల వరకూ డీట్రిచ్ తన సమయాన్ని ప్రపంచం అంతా తిరుగుతూ లైవ్-షోల్లో ప్రదర్శనలు చేయడంతో గడిపింది. యుద్ధ సమయంలో జర్మన్, ఫ్రెంచ్ ప్రవాసులకు ఇళ్ళు నిర్మించడం, ఆర్థిక సహకారాన్ని అందించడం, తుదకు అమెరికన్ పౌరసత్వం ఇవ్వాలని ప్రచారం చేయడం వంటి పనులతో డీట్రిచ్ మానవతావాదిగా పేరొందింది.
(ఇంకా…)
53వ వారం
బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి
బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి ఒకే ఏనుగు దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది. ఈ ఏనుగు దంతం ప్రదర్శనశాలకు వితరణగా లభించింది. దాదాపు ఐదు అడుగుల పొడవు ఉన్న ఈ ఏనుగు దంతపు కళాకృతిపై బుద్ధుని జీవితానికి సంబంధించిన 43 ఘట్టాలను చెక్కారు. దీనిని 20వ శతాబ్ది తొలినాళ్లలో ఢిల్లీ ప్రాంతానికి చెందిన కళాకారుడు తయారుచేసినట్టు భావిస్తున్నారు. పొడవైన, పూర్తి ఏనుగు దంతాలను చెక్కేందుకు ఉపయోగించడం 18, 19 శతాబ్దాలలోని భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ శైలి బర్మాలో కాక మళ్ళీ ఢిల్లీప్రాంతాల్లోనే ప్రాచుర్యం పొందింది. ఇలాంటి పూర్తి ఏనుగు దంతాల కళాకృతులు కాంగోకు చెందిన ఐవరీ కోస్టు ప్రాంతంలో, బెనిన్లోనూ కనిపిస్తాయి. ఐతే అవి ఆఫ్రికన్ ఏనుగుల దంతాలతో చేసినవి కావడం భేదం. ఏనుగుదంతాలు చెక్కి కళాకృతులు తయారుచేసే కళ భారతదేశంలో చాలా ప్రాచీనతరమైనది. కాళిదాసు రాసిన మేఘదూతంలోకూడా ఈ కళ గురించిన వివరాలు దొరుకుతాయి. లభ్యమవుతున్న పురాతన ఏనుగు దంతం కళాకృతుల్లో తక్షశిలలో దొరికిన క్రీ.శ.2వ శతాబ్దానికి చెందిన దంతపు దువ్వెన ఉంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండి, కళకు మహారాజుల పోషణ లభించిన అస్సాం, మైసూర్‌ ప్రాంతాల్లో ఏనుగు దంతాలను చెక్కే కళ పరిఢవిల్లింది.
(ఇంకా…)

ఇవి కూడా చూడండి

మార్చు