వికీపీడియా:తెలుగు వికీపీడియా 16 సంవత్సరాలు - అనుభవాలు, అభిప్రాయాలు
2019 డిసెంబరు 10 తో తెలుగు వికీపీడియా విజ్ఞాన వినిమయ సేవ 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. దీనికి సహకరించి, ఆదరించిన చదువరులు, సంపాదకులు మరియు ఇతరత్రా సేవ చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ పేజీ లో మీ అనుభవాలు (తెలుగువికీతో పరిచయం, ఏవిధంగా ఉపయోగపడింది), అభిప్రాయాలు (అభివృద్ధి చేయవలసినవి, మీరు స్వంతంగా కృషిచేయదలచినవి) ఈ పేజీలో చివరిగా కొత్త వరుసలో '*' మొదటి అక్షరంగా ప్రారంభించి రాసి మీ పేరు, తేది లేక వికీసంతకం చేర్చండి.
క
మార్చు- 2006 లో మా ఊరు ఖమ్మం గురించి వెతుకుతుంటే తెలుగు వికీపీడియాలో మాఊరి పేజీ కనిపించింది , ఇందులో నాకు తెలిసిన సమాచారం చేర్చాను . ఆ తరువాత ఇక్కడ ఎంతో మంది మిత్రులను పొందాను ! Kasyap (చర్చ) 06:45, 12 డిసెంబరు 2019 (UTC)
వ
మార్చు- తెలుగు వికీపీడియా అనేది ఉన్నాదనే సంగతి చాల మందికి తెలియదు. శోధన యంత్రం యొక్క "వెతుకు పెట్టె" లో ఒక కీలక పదం పెట్టి వెతికినప్పుడు దానికి సంబంధించిన సమాచారం తెలుగు వికీపీడియాలో ఉంటే అది కూడా "సమాధానాల పట్టిక" లో కనిపించేలా చెయ్యగలిగితే వికీపీడియా ఉపయోగం బాగా పెరుగుతుందని నా అభిప్రాయం Vemurione (చర్చ) 17:54, 13 డిసెంబరు 2019 (UTC)
అ
మార్చు- తెలుగు వికీపీడియాతోనా పరిచయం గురించి నా వాడుకరిపేజీలో ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పైన క్రియాశీలక అనుబంధం వుంది, ఎంతో మంది దేశ విదేశ మిత్రులతో కృషి చేయడం ఆనందాన్నిచ్చింది. అయితే తెలుగు వికీపీడియా ప్రస్తుత స్థితి, భవిష్యత్ పై నా ఆలోచనలు ఈ సందర్భంగా పంచుకోవటం సముచితం అనిపిస్తుంది. వికీపీడియా గణాంకాలను ( ఉదాహరణకు 2016 నుండి పేజీవీక్షణలు ,2016 సెప్టెంబర్ వరకు పేజీవీక్షణలు ) పరిశీలించితే చదువరుల పరంగా, సంపాదకులపరంగా, విషయ పరంగా 2007 2019 మధ్య గణనీయమైన పెరుగుదల ఏమీ లేదు.
-
పాతకాలపు పేజీవీక్షణలు 200712-201608
-
పేజీవీక్షణలు 201601-201911
-
క్రియాశీలక సంపాదకులు 200101-201901
వ్యక్తిగతంగా, సంస్థాగతంగా ఎన్ని రకాల పనులు చేపట్టినా వికీపీడీయా కృషిలో గణనీయమైన అభివృద్ధిలేదు. కనీస క్రియాశీలక సభ్యుల సంఖ్య పెరగకుండా, సమిష్టి కృషి మెరుగుకాకుండా వికీపీడియా విషయ నాణ్యత అభివృద్ధి చెందదు. ఇటీవల కాలంలో జరిగిన కృషి చూస్తే స్వచ్ఛందంగా చేసే కృషి కంటే పోటీల ద్వారా కృషి జరగడం, దానివలన తెవికీ సముదాయానికి అంత ఉపయోగం లేదనిపిస్తుంది. కనీసం చేసిన పనిని సమీక్షించి దానినుండి నేర్చుకుని ముందుకృషి మరింత మెరుగుగా చేయటానికి కృషి చేసే వారు తక్కువే. ప్రస్తుత సమాజంలో తెలుగు భాష ప్రాధాన్యత నానాటికి క్షీణిస్తున్నది. ఉదాహరణకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమం తొలగించడం తెలుగు భాషాభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది.అందువలన ఇంకొక 7 సంవత్సరాలలో తెలుగు మాధ్యమంగా చదువుకుంటున్నవారే వుండరు. అందువలన తెలుగు వికీపీడియా ని అభివృద్ధిచేసేవారు తగ్గిపోతారు. ఇంకొకపక్క కృత్రిమ మేథ తదితర సాంకేతికలతో ఆంగ్లంనుండి అవసరమైతే తక్షణం మెరుగుగా అనువాదం చేయగల శక్తి మరింత పెరుగుతుంది. కావున ఇంకొక 16 సంవత్సరాలకు నేరుగా తెలుగు లో రాసిన వ్యాసాల ప్రాధాన్యం తగ్గిపోయి, ఆంగ్లం నుండి తక్షణ అనువాదమయ్యే వ్యాసాల ప్రాధాన్యం పెరుగుతుంది. నా ఆలోచనలు చాలామందికి నకారాత్మకంగా అనిపించవచ్చు కాని నా దృష్టిలో అవి వాస్తవికతకు దగ్గరగా వున్నాయనిపిస్తుంది. నేను చెప్పినట్లు జరగకపోతే మరింతగా సంతోషించేవాడిని నేనే అవుతాను. --అర్జున (చర్చ) 04:59, 14 డిసెంబరు 2019 (UTC)
ప
మార్చు- నేను తెవికీతో నా అనుబంధం వేరెక్కడైనా రాసి ఇక్కడే లింకు అప్‌డేట్ చేస్తాను కానీ ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన విషయం ఒకటుంది. 2016 జనవరి నాటికీ ఈనాటికి ఎన్ని యూనిక్ డివైజులు (అంటే ఒక్కో లాప్‌టాప్, మొబైల్ వగైరాలు) మన తెవికీని సందర్శిస్తున్నాయన్న దానిపై తేడా చూస్తే మన కళ్ళు చెదిరిపోతాయి. 2016 జనవరిలో నెలకు రెండు లక్షల యూనిక్ డివైజులు మన తెవికీని సందర్శించేవి. 2019లో ఎన్నీ అంటే 23 లక్షలా 35 వేలు. రెండు లక్షలెక్కడా? 23 లక్షలు ఎక్కడా? దాదాపు 943 శాతం పెరుగుదల అట. (2007 డేటా మనవద్ద ఉందనుకుని భ్రమించకూడదు, 2016 వరకూ పేజీ వ్యూలు లెక్కించేప్పుడు మనుషులు, బాట్లు కలిపికొట్టి లెక్కించేవారు. దాని వల్ల ఆ డేటా అంతా అత్యుక్తి, అతిశయోక్తి. కాబట్టి 2016తో మాత్రమే పోల్చగలం. ఒకటే ముక్కలో చెప్పేదేమిటంటే 2009లోనో, 2007లోనో యూనిక్ డివైజులు పరిశీలిస్తే 2016 కన్నా ఎక్కువగా ఉంటాయనుకోవడం కుదర్దు.) అలానే 2016 జనవరిలో 29 లక్షల వీక్షణలు ఉండేవి మన తెవికీకి. ఇటీవల 92 లక్షల పైచిలుకు పేజీ వీక్షణలు ఉన్నాయి. అంటే మూడు రెట్లు పెరుగుదల. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు అంతర్జాలం చవకగా దొరికి తెలుగు చదివేవారందరూ ఇంటర్నెట్‌లో ఉండడం. మన తెలుగు ఒక్కటే కాదు, భారతీయ భాషల ఇంటర్నెట్ వాడుకరుల్లో 90 శాతం మంది తమ మాతృభాషల్లోనే కంటెంట్ చదువుతున్నారని, కోరుకుంటున్నారని గూగుల్ ఘోషిస్తోంది. అలానే, తెలుగు అంతర్జాలంలో అనూహ్యమైన స్థాయిలో బలపడుతోంది. తెవికీ వ్యాసాల చదువరులు పెరిగిన స్థాయిలో తెవికీలో (రాసే) వాడుకరులు పెరగకపోవడానికి కారణం ఒక్కటే. మొబైల్ వాడుకరులకు ఎడిటింగ్ మద్దతు సరిగా లేకపోవడం (లక్షాతొంభై సమస్యలున్నాయి మొబైల్ దిద్దుబాట్ల విషయంలో, నేను స్వయంగా ప్రయత్నించి తెలుసుకున్నాను). కాబట్టి, అదొక్కటీ పరిష్కరించుకున్నా భవిష్యత్తు బంగారం. అనవసరమైన శంకలకు సమయం కాదు. సమస్యలను అధిగమిస్తూ ముందుకుపోవాల్సిన సమయం ఇది. పదహారేళ్ళ ప్రాయంలోని మన తెవికీ చేయగల పని ఎంతో ఉంది. ఇందుకు మనం కృత్రిమమైన నిరాశా నిస్పృహలు తెచ్చిపెట్టుకోకుండా మన వ్యూహాలకు పదునుపెట్టుకుని ముందుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను. సదా భాషాసేవలో --పవన్ సంతోష్ (చర్చ) 10:37, 14 డిసెంబరు 2019 (UTC)
చ
మార్చు- చదువరి: నేను 2005 లో తెలుగు వికీపీడియాలో చేరాను. మూడేళ్ళ పాటు చురుగ్గానే రాసాను. 2007 నుండి 2015 వరకూ దాదాపుగా రాయలేదు. మళ్ళీ 2016 లో మొదలుపెట్టి ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాను. నా అనుభవాలు, అభిప్రాయాలు:
- 2005 లో చేరి మూడేళ్ళ పాటు రాసానన్న మాటే గానీ, ఎనిమిదేళ్ళ ఎడం తరవాత, 2016 లో తిరిగొచ్చేసరికి అంతా కొత్తకొత్తగా ఉండేది. 2007 లో వైజాసత్య, కాసుబాబు వంటి చురుకైన వాడుకరులు (అసలు వీళ్లను ఉద్యమకారులు అనాలి) ఉండేవారు. 2016 లో వాళ్ళు లేరు. పవన్ సంతోష్, చంద్రకాంతరావు, విశ్వనాథ్, రాజశేఖర్, స్వరలాసిక లాంటి కొత్తవాళ్లు (నాకు కొత్త) తగిలారు. అప్పుడు ఇప్పుడూ ఉన్నవాళ్ళలో సుజాత, రవిచంద్ర, రహ్మనుద్దీన్, అర్జున, మొదలైన వారు ఉన్నారు. 2016 నుండి ఇప్పటి వరకు జరుగుతున్నది చూస్తే నాకు సంతృప్తిగా లేకపోయినా సంతోషంగా మాత్రం ఉంది. 2016 లో తెవికీ నాణ్యత పెరిగింది. అయితే నాణ్యత ఇంకా నాసిగానే ఉంది. (దీన్నిబట్టి 2007 లో నాణ్యత ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.) వాడుకరులు పెరిగారు. చురుగ్గా రాసేవారు మాత్రం పెద్దగా పెరగలేదు. నేను బాగా రాస్తున్నాను, ఇది నా ఘనతే అనే స్వాతిశయం 2016 లో కొంత, కొందరిలో, కనబడింది. 2007 లో అది ఉండేది కాదు. 2016 లో కొద్దిమంది వాడుకరుల్లో దిద్దుబాట్ల సంఖ్య పట్ల మోజు ఎక్కువగా ఉంది. బహిరంగంగా కాకపోయినా దాని నేపథ్యంలో కొన్నిసార్లు చర్చలు కూడా జరిగేవి. అయితే చాలామందిలో దాని పట్ల యావ లేకపోవడం విశేషం. చర్చల్లో దూకుడు ఉండేది. తిట్లు ఉండేవి. ప్రస్తుతం, అంటే 2019 లో అవి తగ్గాయి.
- నాకు చాలా అసంతృప్తి కలిగిస్తున్నవివి:
- భాషాదోషాలు: భాషలో అక్షరదోషాలుంటే సరిదిద్దుకోవచ్చు. అసలు రాసే వాక్యాలు అర్థం పర్థం లేనివైతే, ఒక పేరా అంతా చదివాక కూడా ఏం చదివామో అర్థం కాకపోతే.., ఆ వ్యాసానికి విలువ ఏముంది? అది ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నెపాన్ని యాంత్రిక అనువాదంపై తోసేస్తే కుదరదు గదా. యాంత్రికానువాదాన్ని కొంచెం కూడా సరిచెయ్యకుండా, ఉన్నదున్నట్టుగా అడ్దగోలు భాషతో ప్రచురిస్తే ప్రయోజనం ఏంటి? తేరగా, పెద్దగా శ్రమ లేకుండా వ్యాసం రాసెయ్యొచ్చు, మన పేరిట ఒక వ్యాసం పడి ఉంటది అనే యావ తప్పితే మరోటి కనబడ్డం లేదు నాకు. ఇలాంటి తప్పుడు వ్యాసాలు వందల్లో ప్రచురించి పారేసేందుకు పోటీలు కూడా పెట్టుకుంటున్నారంట కొందరు. తెవికీ మొత్తాన్నీ ఒక ప్రయోగశాలగా మారుస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యల పట్ల, దురాలోచనల పట్లా మిగతా వాడుకరులంతా గొంతెత్తాలి.
- చర్చలు జరక్కపోవడం: నిర్మాణాత్మకమైన చర్చలే వికీపీడియాను సరిగ్గా నడిపించే సాధనాలు. కానీ, అనుభవశాలురైన వాడుకరులు కొందరు చర్చల్లో పాల్గొనకపోవడం నాకో పెద్ద అసంతృప్తి. ఇది తెవికీలో ఉన్న పెద్ద లోపాల్లో ఒకటి. తమ ప్రస్తుత దృక్పథాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకూ, వాళ్ళ ఆలోచనల అవసరం తెవికీకీ ఉందని నా ఉద్దేశం.
- ఈమధ్య దాకా చురుగ్గా ఉన్న కొందరు వాడుకరులు - ఎందుకు తగ్గించారో తెలియదు గానీ, కొంత నిదానించారు. వాళ్ళు తిరిగి రావాల్సిన, చురుగ్గా రాయాల్సిన అవసరం ఉంది. కొన్ని ఉదాహరణలు: మీనా గాయత్రి, చంద్రకాంతరావు, విశ్వనాథ్, రాజశేఖర్, స్వరలాసిక, భాస్కరనాయుడు, జెవిఆర్కె ప్రసాద్..
- ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు, తెవికీ అభివృద్ధికి దోహదపడేవి కొన్నున్నై..
- అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి పెరగడం: ట్విట్టరు, ఫేసుబుక్కుల్లో తెలుగు వాడకం పెరుగుతోంది. మొబైల్లో తెలుగు రాయవీలవడం ఒక ముఖ్య కారణం కావచ్చు. దీని ప్రభావం తెవికీ మీద ఉండవచ్చు. సందర్శకుల సంఖ్య పెరగడంలో ఇది కనిపిస్తోంది. చదివేవాళ్ళను రాసేవాళ్ళుగా మార్చుకోగలితే, వ్యాసాల సంఖ్య పెరుగుతుంది.
- ఐఐఐటీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమం: వాళ్ళ ప్రాజెక్టు గురించి బయటికి చెబుతున్నంత వరకు బాగానే ఉంది. వాళ్ళు ఆ బాటలోంచి పక్కకు జరక్కుండా, చెప్పినట్టుగానే ముందుకు పోతే, తెవికీకి ప్రయోజనం కలుగుతుంది.
- ప్రస్తుత తెవికీ వాడుకరులం చెయ్యాల్సినవి
- ఒక "తెలుగు వికీపీడియా యూజర్ గ్రూపు"ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ గ్రూపు ద్వారా క్రమపద్ధతిలో కలవడం, వికీకి దోహదపడే కార్యక్రమాలు చేసుకోవడం, వికీమీడియా ఫౌండేషను వద్ద తెలుగు వికీపీడియాకు ప్రాతినిధ్యం వహించి, తద్వారా తెవికీ పురోభివృద్ధికి కృషిచెయ్యడం వంటి లక్ష్యాలతో ఈ గ్రూపు పనిచెయ్యాలి.
- కుక్కుట శాస్త్రం అనే తెలుగు వికీపీడియా వ్యాసానికి ఎందుకు అన్నేసి హిట్లుంటున్నాయో నాకు అంతుబట్టేది కాదు. ఇవ్వాళ (2019 డిసెంబరు 15 న) కశ్యప్ గారు కారణమేంటో చెప్పాక నాకు చాలా ఉత్సాహం కలిగింది. కోడి పందేలు వేసేవాళ్ళు ఈ పేజీని చూస్తూ ఉంటారంట! సామాన్య జనానికి ఉపయోగపడే వ్యాసానికి, అందునా అది తెలుగులో ఉంటే, దానికి మంచి విలువ ఉంటుందని నాకు అర్థమైంది. దాని కనుగుణంగా మనం, వివిధ వర్గాల వారికి (ఉదా: వ్యవసాయదారులు, పదో తరగతి పిల్లలు, చిరుద్యోగులు, చిరువ్యాపారులు..) రోజువారీ పనుల్లో పనికొచ్చే వ్యాసాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనిపిస్తోంది.
వి
మార్చు- విశ్వనాధ్..నేను 2006 అక్టోబర్ వికీని చూసాను. బ్లాగర్ల చర్చల్లో ఎక్కడో వికీ పరిచయం జరిగింది. అప్పడు అనామక వాడుకరిగా రాయడం నేర్చుకున్నాను.. తదనంతరం వాడుకరిగా మారడం జరిగింది. వైజాసత్య, కాసుబాబు (కాజ సుధాకర్ బాబు), మాటలబాబు( తదుపరి ఈయన బ్లాగేశ్వరుడుగా మారారు), చదువరి(శిరీష్), ప్రదీప్ మొదలగు వాడుకరులు నాకు సహకారం అందించారు, నేను కొన్ని తెలుగు సంసృతీ పరమైన వీరతాడు, గండపెడేరము వంటి లోగోలు చేసి బహుమతులుగా అందించేవాడిని (వైజాసత్య, చదువరి గార్లకు కూడా సెప్టెంబర్ 2007లో మొదటి సారిగా గండపెండేరము బహుమతిగా అందించాను). నాకు మొదట్లో సొంత కంప్యూటర్ లేక, నెట్ సెంటర్ నుండి సమయం ఉన్నపుడు రాస్తూ, లేనపుడు కేవలం పరిశీలిస్తూ వచ్చేవాడిని. తదుపరి సొంతకంప్యూటర్ ఏర్పాటు అయినాక ఎక్కువగా రాసాను. ఇక వికీలో ఉండే ఆరోగ్యకరమైన వాతావరణం వలన మంచి స్నేహితులు కొందరు దగ్గరైనారు. నాకు తరచుగా చర్చల్లో పాల్గొనడం ఇష్టం. వికీలో కొత్త వాడుకరులను చేర్చడం, వారికి శిక్షణ ఇచ్చి వారిచే వ్యాసాలలను రాయించడం నాకు బాగా అనిపిస్తుంది. సమిష్టి కృషి ద్వారానే వికీలో పురోగతి, సభ్యుల మద్య సమన్వయం, స్నేహభావాలు ఉంటాయని నమ్ముతాను. వికీలో సులభంగా ఎడిటింగ్ చేయడం కోసం చేర్చే కొన్ని ఉపకరణాల విషయంలో, సైట్ ఇంటర్స్పేష్ విషయంలో నాకు అసంతృప్తి ఉంది. దాని వలన కొత్త వాడుకరులు,(విద్యార్ధులు, రిటైర్ అయిన వయసు వారు) కన్‌ప్యూజ్ అవుతున్నారని తెలుసుకున్నాను. స్థిరవాడుకరుల కృషి వ్యాసాలు, మార్పులలో కాక కొత్త వాడుకరులను ప్రోత్సహించి, వారి ద్వారా వికీలో మార్పులను పెంచడం ద్వారానే వికీ చైతన్యమవుతుందనుకుంటాను. B.K.Viswanadh (చర్చ) 08:25, 16 డిసెంబరు 2019 (UTC)
- విశ్వనాధ్ గారూ, మీరు, రాజశేఖర్ గారూ 2007 కు ముందు వికీలో లేరని నేను పొరబడ్డాను. సవరించినందుకు ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 08:38, 17 డిసెంబరు 2019 (UTC)
చం
మార్చు- నేను తెవికీ సభ్యుడిగా చేరి సుమారు పుష్కరకాలం అయింది. అప్పటికే నాకు తెవికీ గురించి పూర్తిగా తెలుసు. దిద్దుబాట్లు చేయకున్ననూ తెవికీలో సభ్యుడిగా చేరడానికి ముందే పలు విషయాలు తెలుసుకున్నాను. నేను సభ్యుడిగా చేరేనాటికి తెవికీ వయస్సు నాలుగేళ్ళ పసిపాప. అప్పటికే వైజాసత్య, కాసుబాబు, దేవా, ప్రదీప్, బ్లాగేశ్వరుడు తదితరుల కృషి బాగా ఉండేది. త్వరలోనే నేనూ తెవికీలో వారితో కలిసిపోయాను, నిర్వాహకుడిగానూ అయ్యాను. తెవికీ ప్రారంభానికి ముందే నాకు విజ్ఞానసర్వసం చేయాలనే ఉత్సుకత ఉండేది. అది ఒక్కరితో సాధ్యం కాదని తెలిసి తెవికీలో చేరాను. తెలుగువారికి ఉపయుక్తం అయ్యేటట్లుగా తెవికీని ఒక బృహత్తర విజ్ఞానసర్వస్వం రూపొందించాలనే కాంక్ష ప్రారంభంలో చాలా బలంగా ఉండేది. అన్నట్లు 2009 వరకు కూడా తెవికీలో బాగా కృషిచేశాను కూడా. ఆ కాలంలో తెవికీని ప్రభావితం చేసిన సభ్యులలో నేనూ ఒకడిగా చెప్పుకోడానికి సంతోషిస్తాను. మీకు తెలుసా? వర్తమాన విషయాలు శీర్షికలు నిర్వహించడమే కాకుండా పలు నాణ్యమైన వ్యాసాలు చేర్చాను. వర్తమాన విషయాలు శీర్శిక అప్పట్లో పాఠకాదరణ కూడా పొందింది. కాని ఆ తర్వాత వచ్చిన కొందరు సభ్యులు వల్లనూ, జరిగిన పరిణామాల వల్లనూ ఉత్సాహం తగ్గిపోయింది. పాఠకులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వ్యాసాలు రూపొందించాలనే నా ప్రయత్నాలకు విఘాతం కలిగింది. క్రమక్రమంగా గణాంకాలకు మాత్రమే ప్రాధాన్యం పెరగడం, గణాంకాలను దృష్టిలో ఉంచుకొనే వారికి ప్రాధాన్యత లభించడం నాకు రుచించలేదు. ఒకానొక దశలో ఇదే విషయంపై కీలక సభ్యులతో నాకు పెద్దచర్చలు జరిగేవి. సంక్షిప్తంగా మరియు మధురంగా ఉండే వ్యాసాలు, ఎప్పటికప్పుడు తాజాకరణ చేస్తూ తెలుగువారికి, తెలుగు ప్రాంతానికి ఉపయోగపడే సుమారు 2 లక్షలు వ్యాసాలు తెవికీకి సరిపోతాయని అంచనా వేశాను. ఆంగ్లవికీతో పోటీపడి వ్యాసాల సంఖ్యను పెంచుకోవడం, ఆంగ్లవికీలో ఉన్న పెద్ద వ్యాసాలను, మనకు ఏ మాత్రం సంబంధం లేని విషయ వ్యాసాలను కూడా మక్కికి మక్కి అనువాదం చేయడాన్ని నేను వ్యతిరేకించాను. 2009-10లో కొంత కృషి తగ్గించిననూ మళ్ళీ 2010-11లో కొంతవరకు వ్యాసాల అభివృద్ధికి ప్రయత్నించాను. ఆ తర్వాత వ్యాసాలలో పనిచేయడం తగ్గించిననూ ఇతరుల రచనలు పరిశీలించడం, సూచనలు చేయడం (ప్రతిఫలంగా చివాట్లు కూడా ఎదుర్కొనడం), ప్రధాన చర్చలలో పాల్గొనడం తదితర పనులలో భాగస్వామ్యం అయ్యాను. ఒకప్పుడు ఎలాంటి సమావేశాలు లేకుండా కేవలం తెవికీ చర్చల ద్వారానే సంభాషించుకొనేవాళ్లము. సభలు, సమావేశాల వల్ల ముఖపరిచయాలు పెరిగిననూ తెవికీకి అంతగా ప్రయోజనం జరుగలేదన్న సంగతి వాస్తవమే. నేను ప్రారంభం నుంచి ఏ సభ్యుడితోనూ సంబంధాలు పెట్టుకోలేను. కనీసం సెల్‌ఫోన్ ద్వారా కూడా ఎవరినీ సంప్రదించలేను. ఏ సభలు, సమావేశానికి కూడా హాజరు కాలేను. ఎవరి గురించి ప్రత్యక్ష సంబంధం లేదు కాబట్టి చర్చలలో విషయంపై మినహా ఏ సభ్యుడివైపు మొగ్గుచూపక ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలను. కొందరు సీనియర్ సభ్యులు కూడా పొరపాట్లపై పొరపాట్లు చేయడం, నిర్వాహకులు ఉదాసీనంగా ఉండటం వల్ల తెవికీకి నష్టం జరిగింది. కొందరు సీనియర్ సభ్యులు కూడా గణాంకాలకు, గణాంకాల వైపు దృష్టిసారించే సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా తెవికీకి నష్టం జరిగింది. ఉద్దేశపూర్వక చిన్న మరియు సునాయాస దిద్దుబాట్లుపై గతంలో చాలా చర్చలు జరిగాయి. తెవికీ అభివృద్ధి చెందాలంటే పాఠకులను దృష్టిలో ఉంచుకోవాలి. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల మరియు చవక అంతర్జాలం మూలానా అందరి అరచేతుల్లోనే వీక్షించడానికి అనువుగా ఉన్ననూ చెప్పుకోదగ్గ హిట్లు కాకపోవడానికి కారణాలు అనేకం. ప్రజలు సోషల్ మీడియాకు ఇస్తున్న ప్రాధాన్యత విజ్ఞానానికి ఇవ్వడం లేదు. విజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా తెవికీకి ఇవ్వడం లేదు. తెవికీలో నాణ్యమైన వ్యాసాల కొరతే కాకుండా తాజాకరణ లేకుండుట దీనికి ప్రధానం కారణం. తెవికీ సభ్యులు కూడా కొత్త వ్యాసాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇదివరకే ఉన్న వ్యాసాలలో తాజాకరణకు ఇవ్వడం లేదు. ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తాజాకరణ ఉండుట తప్పనిసరి. ఇక మళ్ళీ నా విషయానికి వస్తే కొన్ని చర్చలు మినహా గత 2-3 సం.ల నుంచి తెవికీలో నా కృషి దాదాపుగా లేదనే చెప్పవచ్చు. అయినా తెవికీలో మళ్ళీ కృషి చేయాలనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. పరిస్థితులు అనుకూలించి తెవికీ ప్రగతి పథంలో పయనించడానికి కొద్దిగా మార్గం ఏర్పడితే తెవికీని లక్ష్యం వైపు పయనింపజేయడానికి నావంతు కృషి చేయాలని ఉంది. ఆ అవకాశం త్వరలోనే రావాలని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:31, 16 డిసెంబరు 2019 (UTC)
య
మార్చు- వికీపీడియా ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటివరకు ఎందరో మహానుభావుల నిర్విరామ కృషితో తెలుగు వికీపీడియా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్బంగా లోగడ కృషి చేసిన, ప్రస్తుతం చేయుచున్న గౌరవ వికీపీడియన్లు అందరికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
- ప్రస్తుత కాలంలో విశ్రాంతి జీవితం గడుపుచున్నతోటి మిత్రులు,ఇతరులు రిటైరైన తరువాత కాలక్షేపం ఏమిటి అని అడిగినప్పడు,నేను వారితో తెలుగు వికీపీడియా అంటే తెలుసా అని అడిగినప్పుడు వాళ్లకు తెలిసినా, తెలియక పోయినా తెలుసు అని చెప్పిన తరువాత,దానిలో పని చేస్తాను అని చెప్పగానే, వెంటనే ఏమైనా ఇస్తారా అనే ప్రశ్న వేసే వాళ్లు ఉన్నారు.అది వాళ్ల తప్పుకాదు.మానవ సహజం.అలాంటి ఈ రోజుల్లో ఉచిత సర్వీసు చేస్తున్న తోటి వికీపీడియన్లు అందరికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, నా అనుభవాలు, అభిప్రాయాలు కొంచం భాధ,కొంచం భయం, కొంచం గర్వం, కొంచం సంతోషంతో మీ ముందు ఉంచుతున్నాను. నేను చెప్పేవి కొద్దిగా కఠినంగా అనిపించవచ్చు.కానీ అన్నీ వాస్తవాలని నేను బావిస్తున్నాను.ఏవ్వరినీ నొప్పించాలనికాదని మనవి.
- ముందుగా నేను వికీపీడియాలో ఆరంగేట్రం ఎలా అయ్యానంటే 2012 లో సరిగా ఇదే నెలలో డిశెంబరు 16న ఎందుకో మా ఊరిపేరు పొనుగుపాడును గూగులమ్మలో వెతకగా తెలుగు వికీపీడియాలో పొనుగుపాడు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామము అనే ఏక వాక్యంతో మండలంలోని గ్రామాలు మూస తగిలించిన పేజీ కనపడింది.ఆ పేజీలో గ్రామంలో పురాతన కాలంనాటి శివాలయాలు రెండు, ఆంజనేయస్వామి గుడి, రామాలయం కలిగివున్నవి అనే వాక్యంతో నా తొలి అడుగు పడింది.తిరిగి మా గ్రామ పేజీలో 2016 నవంబరు 29న రెండుసార్లు గ్రామానికి సంభందించిన సమాచారం కూర్పు చేసాను. 2017 మార్చి నుండి తరుచూ ఇంకొకటి ఏది ముట్టుకోకుండా మాగ్రామ వ్యాసం పేజీలో తరుచూ సవరణలు చేస్తూ ఉండగా 2017 అక్టోబరులో పవన్ సంతోష్ గారు మీరు మీ గ్రామం వరకే పనిచేస్తారా?లేక మా దగ్గర గ్రామాలకు సంభందించిన ప్రాజెక్టు పని ఉంది చేస్తారా అని మెయిల్ ద్వారా సంప్రదించారు.దానికి గ్రామాలు పని అంటే నాకు ఇష్టమే చేస్తాను అని తెలుపగా ఆవిధంగా భారత జనగణన డేటాను పేజీలో చేర్చే ప్రాజెక్టు పనిలో భాగంగా నాకు కొంత పని అప్పగించినప్పటినుండి పూర్తికాలపు వికీపీడియనుగా పనిచేస్తున్నాను.ఈ పని చేయుటలో నాకు విసుగు అనేది ఇంతవరకు అనిపించలేదు.
- మనం కొన్నిటికి మార్గదర్శకాలు రాసుకుంటున్నాం. కానీ వాటి ప్రకారం ఎవరు అనుసరించటలేదని నాఅభిప్రాయం. ముఖ్యంగా ఏక వచనం ఉపయోగించుటలో, అనువాదాలు చేసేటపుడు, ‘మరియు’ 'యొక్క' అనే పదాల విషయంలో, ‘ము’ తో అంతమయ్యే పదాల విషయంలో ఇలాంటి కొన్ని మనం ఆచరించుటలేదనేది నా అభిప్రాయం. కొత్త వాడకరికి చెప్పటానికి మాత్రమే ఉపయోగపెడుతున్నాం.
- కొంతమంది వాడుకరులు ఏకవ్యాక్యంతో వ్యాసాలు సృష్టించి, ఏళ్ల తరబడి ఆ వ్యాసం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవటం ఎంతవరకు సబబు?
- వ్యాసం సృష్టింపు చేస్తున్నాం.కనీసం ఆవ్యాసానికి సంబంధించిన మీడియా పైల్ ఏమైనా ఉన్నదా అనే పరిశీలన జరిగి, మీడియా పైల్స్ ఉంటే ఎక్కించుట జరుగుటలేదు.వీటిమీద అంత సమయస్పూర్తి లేదనేది నాకనిపిస్తుంది.
- ఒక వ్యాసంలో సవరణలు చేసేటప్పుడు ఆ వ్యాసంలో చేయవలసిన సవరణలు అక్షర దోషాలు గానీ, ఇతరత్రా సవరణలుగానీ ఆ వ్యాసం మొదటి నుండి చివరి వరకు పరిశీలించి సవరణ చేయకుండా ఒకటి, రెండు నైస్ సవరణలుకు మాత్రమే పరిమితం అవుతున్నట్లు నాకనిపిస్తుంది.
- ఏదైనా ఒక ప్రాజెక్టు పని మొదలు పెట్టినప్పుడు మొదట చూపించినంత ఊత్సాహం,ఆ కార్యక్రమం పూర్తిగా గట్టెక్కేవరకు ఉండుటలేదనిపిస్తుంది.
- నా దృష్టిలో ఏన్ని వ్యాసాల సృష్టించామనేది కాదు.సృష్టించిన వ్యాసాలు స్వేచ్చా విజ్ఞానానికి ఉపయోగపడేవిధంగా ఉన్నాయా అనేదే ముఖ్యం అని నేను భావిస్తున్నాను.
- వికీపీడియాను పరిశీలించి సరియైన చర్యలు గైకొనే చురుకైన నిర్వహకులు కొరతగా ఉన్నారని నేను అనుకుంటున్నాను.
- నేను నిర్వహకుడు అయిన తరువాత గమనించినదానినిబట్టి కొద్దిపాటి అక్షర తేడాలతో వ్యాసాలు,వర్గాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు గమనించాను.వీటిని సమయస్పూర్తితో ప్రత్వేకంగా చురుకైన వాడుకరుల బృందం సమన్వయంతో పరిశీలించి తగిన చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే వికీపీడియా ద్వారా అందించే విజ్ఞాన సర్వస్వమునకు అర్థం చేకూరిద్దని నేను అనుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:57, 18 డిసెంబరు 2019 (UTC)
ప్ర
మార్చుతెలుగు పై వికీపీడియా పై నాకు చాలా ప్రేమ ... నాకు నచ్చిన వారి గురించి తెలిసిన వారి గురించి గూగుల్ లో వెతికే ప్రతి సారీ ఇంగ్లీష్ లో తెలుగు లో వచ్చిన సమాచారంతో వికీపీడియా లోనుండి సమాచారం వచ్చిందని సమాచారమంతా ఎవరు ఇందులో చేరవేస్తున్నారనేది మొదట్లో తెలిసేది కాదు తర్వాత విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా రాయొచ్చు అని అర్థమైంది అలా ఆంగ్ల వికీపీడియాలో 2009లో చేరాను అయ్యాను తెలుగులో 2014లో చేరాను Palagiri గారు స్వాగతం పలికారు. .. నా మొదటి గురువు గారూ పవన్ సంతోష్ సార్. .. వైజాసత్య గారు ... చంద్ర కాంతారావు గారు ... కే.వెంకటరమణ గారు ... అర్జున గారు Palagiri ... నాకు వెన్నుపూస లా ఉండగా అలాంటి మహానుభావులను చాలా ఇబ్బందులకు గురి చేసి వారి ద్వారా నేను ఎన్నో నియమ నిబంధనలు నేర్చుకొని కొన్ని సుమారు ఒక 40 పేజీలు రాయగలిగాను. వారందరూ నాకు గురువులు గా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారందరినీ ఏదో ఒక వేదిక మీద కలుసుకొని మాట్లాడాలి అనేది నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. గతంలో సమావేశాలు నిర్వహించేవారు సమావేశం ఎప్పుడు జరుగుతుందని 2014 నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను ఇంత వరకు అలాంటి అవకాసం దొరకడం లేదు వీలుంటే జరిపించాలని కోరిక ...ప్రభాకర్ గౌడ్ నోముల 11:21, 22 డిసెంబరు 2019 (UTC)
శ
మార్చుపదహారేళ్ళ వయసు, పడి పడి లేచే మనసు అని ఒక సినిమాలో పాట! బాగా రాసేవారు నెమ్మదించడం, నెమ్మదించినవారు మరల మొదలు పెట్టటం ఈ పాటను నాకు స్ఫురింపజేసింది.
2009 ప్రారంభంలో తెవికీపీడియనుగా బుడి బుడి అడుగులు వేసిన నాకు, కాసుబాబు గారు సహాయం చేస్తూడేవారు. సినిమాలు, హైదరాబాదు, రాయలసీమ, ఫ్యాషన్ కు సంబంధించి అనేక వ్యాసాలు రాసాను. బెంగుళూరు బదిలీ అయ్యి అర్జున రావు గారిని కలిసి కొన్ని మెళకువలను నేర్చుకొన్నాను. ఫ్రీవేర్ అయిన ఇంక్స్కేప్ గురించి తెలుసుకొన్నాను. స్థానికంగా కొన్ని సమావేశాలు నిర్వహించాను. తెవికీ దశమవార్షికోత్సవానికి తెవికీ లో అత్యధిక కృషిచేసిన మొదటి 10 వాడుకర్లలో నేను కూడా ఒకడిని కావటం, నాకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. కేవీఆర్ గారు నా వ్యాసాలకు సొబగులు అద్దేవారు. అనేక వాడుకరి పెట్టెలను చేశాను. ఫోటోగ్రఫీ, ఫిలిం ఫోటోగ్రఫీ వంటి వ్యాసాలు సృష్టించాను. వికీసోర్సు/వికీబుక్స్ లో సర్వదర్శన సంగ్రహం ప్రారంభించాను. అందులో ఇంకా చాలా పని మిగిలిపోయి ఉంది.
ఈ లోపు నేను కో లివ్ లో నివాసం ఉండటం, ఇక్కడి సౌకర్యాలు తెవికీ వాడుకర్లు ఉపయోగించుకొనవచ్చని కోరటం, ఆ అవకాశాన్ని తెవికీ అందిపుచ్చుకొని, 16వ వార్షికోత్సవాన్ని ఇక్కడ జరపడం, మన లో కొంత కిక్ ఇచ్చిందని నా వ్యక్తిగత అభిప్రాయం.
సాంకేతిక ఉద్యోగం కావటం, పాత సాంకేతికత మరుగున పడి కొత్తది రావటం, అది నేర్చుకోవడం లో నేను నిమగ్నం కావటం మూలాన ప్రస్తుతం తెవికీకి అంత సమయం వెచ్చించలేకపోతున్నాను. కానీ ఇది తాత్కాలితమే. మరో మూడు నెలల తర్వాత అదే రక్తం, అదే పౌరుషం అని చూపించాలని కోరుకొంటున్నాను.
వ్యక్తిగతంగా/వికీ పరంగా ఏ వాడుకరితోను నాకు పొరపొచ్చాలు/భేధాభిప్రాయాలు లేవు. ఇదివరకు చెప్పినట్టుగానే, రాజకీయాలు/ఆధిపత్య పోర్లు నాకు రావు, తెలియవు. రాయడం మాత్రమే వచ్చు. కావున నాకు తెవికీ లో ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి. అందరం కలిసి మెలిసి, తెవికీకి మన వంతు కృషిని అందించాలనే నా తపన.
జై హింద్!! - శశి (చర్చ) 11:25, 23 డిసెంబరు 2019 (UTC)