సరస్వతి
సరస్వతీ దేవి | |
![]() | |
చదువుల తల్లి | |
దేవనాగరి: | सरस्वती |
తెలుగు: | సరస్వతీ దేవి |
వాహనం: | హంస, నెమలి |
హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి (Saraswati, सरस्वती) చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.
స్వరూపంసవరించు
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉటకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".
పరాశక్తి, జ్ఞాన ప్రదాతసవరించు
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.[1]
- జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాథలు
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.[1]
పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.[1]
ఆలయాలుసవరించు
తెలంగాణసవరించు
ఆదిలాబాదు జిల్లాలోని బాసర (Basara) పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. వర్గల్ సర్వస్వుతీ దేవాలయం హైదరాబాదుకు సుమారు 48 కి.మీ. దూరం లోగల వర్గల్ లోని ఈఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండలంలోని అడ్లూరు గ్రామంలో ఉన్న సరస్వతీ ఆలయం ఎంతో ప్రాముఖ్యత గలది.హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే దారిలో నకిరేకల్ నుండి ఎడమవైపు12 కి.మీల దూరంలో ఈ ఆలయము ఉంటుంది.
జమ్మూ & కాశ్మీర్సవరించు
కాశ్మీర్ [2] లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాశ్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాశ్మీర మండల వాసిని" అన్న ప్రార్థన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కథనం. దేశమంతటినుండి పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.
ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు (8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706). అంతకంటె ముందు కాలం గ్రంథం "శారదా మహాత్యం "లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది. ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి. శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. 10వ శతాబ్దంలో 'అల్ బెరూని' కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు.
కర్ణాటకసవరించు
శృంగేరి:కర్ణాటక లోని శృంగేరిలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్ఠింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు.
తమిళనాడుసవరించు
కూతనూర్:తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ ఊరు మైలాదుతురై - తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కథ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు. కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.
రాజస్థాన్సవరించు
పిలానీ:రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. 'బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్' ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది. ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది.
ఇంకాసవరించు
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ" అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి ఉంది.
క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తర ప్రదేశ్‌లో మధుర సమీపంలోని 'ఖజ్జాలీటీలా'లో లభించింది. గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు. అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడ వంశ రాజుల తన నాణెములపై సరస్వతీ దేవి రూపమును ముద్రించాడు. క్రీ.శ. 10వ శతాబ్దంలో ఒడిషా (ఖచ్చింగ్) లో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది. పాల వంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్‌తోష్) మ్యూజియంలోను భద్రపరచబడ్డాయి. ఇంకా వివిధ మ్యూజియంలలో సరస్వతి శిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది. క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీ దేవి విగ్రహాలున్నాయి.
పేర్లుసవరించు
అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు
- భారతి
- సరస్వతి
- శారద
- హంస వాహిని
- జగత్ ఖ్యాతి
- వాగీశ్వర
- కౌమారి
- బ్రహ్మ చారిణి
- బుద్ధి ధాత్రి
- వరదాయిని
- క్షుద్ర ఘంట
- భువనేశ్వరి
ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి. ఇంకా వివిధ సందర్భాలలో చెప్పబడిన కొన్ని నామములు - అనుష్టుప్, ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, శారదా, శ్రీః, సావిత్రీ - అన్న నామాలు వాడబడినాయి.
అచ్చ తెలుగులో వివిధ కవులు వాడిన సంబోధనలు -
- అంచ తత్తడి చెలియ, తూటిగానపు తేజీగల బోటి (హంస వాహిని)
- కలన తపసి తల్లి (నారదుని తల్లి)
- చదువుల తల్లి, చదువుల వెలది
- తల వాకిటను మెలగు చెలువ, పలుకు చెలి (వాగ్రూప)
- నలువ రాణి, వెన్నుని కొడుకు రాణి (బ్రహ్మకు భార్య)
- పొత్తము ముత్తో (పుస్తక రూపిణి)
- మినుకు జేడియ (విద్యుద్రూపిణి)
- లచ్చి కోడలు (లక్ష్మీ దేవికి కోడలు)
- వెల్ల ముత్తైదువ (తెల్లని రూపము గలది)
గ్రంథాలూ, పురాణాలూసవరించు
ప్రార్థనలు, స్తోత్రాలుసవరించు
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.
- తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
- యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో
- భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
- ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
పెక్కు సంస్కృత ప్రార్థనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో గురువునూ, వినాయకునీ, తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ గనుక సరస్వతి స్తుతులు చాలా ఉండవచ్చును. వాటిలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.
- శ్రీ సరస్వతీ నిత్యపూజా విధానము
- శ్రీ సరస్వతీ కవచం
- శ్రీ మహాసరస్వతీ ధ్యానం
- పుస్తక పూజ (అక్షరాభ్యాసం)
- శ్రీ సరస్వతీ ప్రార్థన
- శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
- శ్రీ సరస్వతీ సహస్ర నామావళి
- శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి
- శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం
- శ్రీ సరస్వతీ స్తోత్రము (అగస్త్య ప్రోక్తం)
- శ్రీ సరస్వతీ సూక్తము
- శ్రీ సరస్వతీ గాయత్రి
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 [ పరాశక్తి రూపమే సరస్వతి - రచన: డా. యల్లాప్రగడ మల్లికార్జునరావు - ఈనాడు వ్యాసం]
- ↑ http://www.koausa.org/KoshSam/sharda1.html Archived 2007-12-10 at the Wayback Machine లో వ్యాసం Sarada Temple in Kashmir - by P.N.K. Bamzai - Koshur Samachar
బయటి లింకులుసవరించు
- "సరస్వతీ వైభవమ్" - సంకలనం "కొడగండ్ల వెంకటేశ్వర శర్మ" (మెదక్ జిల్లా, దొమ్మాట గ్రామం) - ఇది విపులమైన సంకలనం. సరస్వతీ దేవికి సంబంధించిన కథలు, గాథలు, స్తుతులు, రచనలు, వ్యాసాలు రచయిత ఇందులో సంకలనం చేశాడు.
- Sarasvati Puja celebration at Siddhachalam, NJ (North America)- Sunday, May27 2007
- Basar Saraswathi temple in Andhra Pradesh
- Goddess Saraswati Mantra
- Goddess Saraswati
- Saraswati, Goddess of Learning
- Contemplation of Saraswati - The Flowing Waters of Divine Poetry
- Goddess Saraswati Prayer for Kids
- Weekly podcast on Vedic Chanting and Vedic Mythology with stories from the Puranas
- Saraswati Puja celebration at Edison, NJ (North America)
- Sarasvati Sindhu Civilization: Home Page
- Saraswati Puja for Children (ISBN 1-877795-31-3) by Swami Satyananda Saraswati, Devi Mandir.
- Coexisting Contemporary Civilizations: Arabo-Mulsim, Bharati, Chinese, and Western By Guy Ankerl. Geneva: INUPRESS, 2000, ISBN 2-88155-004-5.