గూడూరు సావిత్రి

(సావిత్రి గూడూరు (అవేటి) నుండి దారిమార్పు చెందింది)

గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందిన ఆవేటి సావిత్రి ప్రముఖ రంగస్థల నటీమణి.

గూడూరు సావిత్రి
గూడూరు సావిత్రి
జననం1942
కస్తూరిరాజుగారి పల్లె, కడప జిల్లా
మరణం2012
తండ్రినారాయణరావు
తల్లిఅంజనీదేవి

వీరు 1942 సంవత్సరము కడప జిల్లా, కస్తూరిరాజుగారి పల్లెలో అంజనీదేవి, నారాయణరావు దంపతులకు జన్మించారు. ఈమె నెల్లూరు జిల్లా, గూడూరు ప్రాంతంలో నివసించడం వల్ల గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందింది.[1]

రంగస్థల ప్రవేశం

మార్చు

రంగస్థల నటీమణిగా దాదాపు 60 సంవత్సరాలు అనుభవం గడించారు. సాయన ప్రకాశరావు వీరికి రంగస్థల గురువు. తన ఐదవ ఏట న్యూపూర్ణానంద డ్రమెటిక్ థియేటర్స్ – సురభి నాటక సమాజం ద్వారా ‘సత్య హరిశ్చంద్ర’ నాటకంలో ‘లోహిత్యాస్యుడు’ పాత్ర ద్వారా రంగస్థల నటజీవితానికి నాంది పలికారు.

నాటకాలు - పాత్రలు

మార్చు

బాల్య దశలోనే కనకతారలో కనకసేనుడు, తార, శ్రీకృష్ణ లీలలు ల్లో కృష్ణుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు, లవకుశ లో లవుడు, కుశుడు మొదలగు పాత్రలు ధరించారు. చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, ద్రౌపది, మండోదరి, శశిరేఖ, సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య, వాసవి, లీలావతి, చింతామణి, రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు. మరెన్నో సాంఘిక, చారిత్రక నాటకాల్లోనూ వైవిధ్యభరితమైన పాత్రలు ధరించిన ఈవిడ పురుషపాత్రలను కూడా పోషించి, తన నటనా వైద్యుష్యాన్ని వెల్లడించారు. కృష్ణుడు, రాముడు, సత్యవంతుడు, కార్యవర్థి, బిల్వమంగళుడు మొదలగు పురుష పాత్రలు ధరించారు.

సహా పాత్రధారులు

మార్చు

కె. రఘురామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, ఎ.వి.సుబ్బారావు, డి.వి. సుబ్బారావు, బండారు రామారావు, షణ్ముఖి ఆంజనేయ రాజు, బేతా రామచంద్రారావు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, చీమకుర్తి నాగేశ్వరరావు, అబ్బూరి వరప్రసాదరావు, వేమూరి గగ్గయ్య, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ఆచంట వెంకటరత్నం నాయుడు, వేమూరి రామయ్య, అమరావు సత్యనారాయణ, పొన్నాల రామసుబ్బారెడ్డి, వై. గోపాలరావు, మద్దాల రామారావు, రేబాల రమణ, కాగిత సుబ్బారావు మొదలగు నట ప్రముఖుల సరసన వారికి దీటుగా నటించి ప్రశంసలందుకున్నారు. ఈవిడ మూడుతరాల వారితో నటించిన ఘనతను పొందారు. వేటపాలెం డి.వి. సుబ్బారావుతో, వారి కుమారుడితో, మనవడు డి.వి. సుబ్బారావుతో ‘చంద్రమతి’గా సహస్రాధిక ప్రదర్శనలిచ్చారు.

అవార్డులు - సత్కారాలు

మార్చు

పలు పరిషత్తు పోటీలలో శతాధికంగా ‘ఉత్తమనటి’ బహుమతులందుకున్న ఈమె పైడి లక్ష్మయ్య అవార్డు, హంస అవార్డు, స్థానం నరసింహారావు అవార్డు, ఆం.ప్ర.. ప్రభుత్వం వారిచే కళారత్న అవార్డు, సినీనటి సావిత్రి అవార్డు, జమున అవార్డు, కృష్ణకుమారి అవార్డు, దక్షిణ మధ్య రైల్వేవారి లింకా అవార్డు మరెన్నో అవార్డులను పొందారు. విజయవాడ పురప్రముఖులచే కనకాభిషేకం, సువర్ణహస్త ఘంటా కంకణం, సాయికృష్ణ యాచేంద్ర – వెంకటగిరి వారిచే సువర్ణ హస్త ఘంటా కంకణం, నంద్యాల నంది పైపుల అధినేత ఎస్.పి.వై. రెడ్డి గారిచే బంగారు పతకం, పొదిలి పురప్రముఖులచే బంగారు పతకం, బీహార్ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, ఆంధ్రా గవర్నర్ కృష్ణకాంత్, ఆం.ప్ర. ముఖ్యమంత్రులు డా. ఎన్.టి. రామారావు, నారా చంద్రబాబునాయుడు తదితర రాజకీయ ప్రముఖుల చేతులమీదుగా సత్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు.

బిరుదులు

మార్చు

మహానటి, కళాతపస్విని, సరస నయానాభినేత్రి, అభినయ శారద, అభినవ శారద మొదలగు బిరుదులను పొందారు.[2]

ఇతర వివరాలు

మార్చు

డి.వి. సుబ్బారావు (వేటపాలెం) తో శతాధికంగా ‘సత్యహరిశ్చంద్ర’ నాటక ప్రదర్శనల్లో చంద్రమతిగా నటించడమేకాక, వారి కాంబినేషన్ లో గ్రామ్‌ఫోన్ రికార్డు కూడా ఇచ్చారు. అలాగే శ్రీకృష్ణతులాభారంలో పృథ్వి వెంకటేశ్వర్లు నారదుడిగా, ఈవిడ కృష్ణుడుగా గ్రామ్‌ఫోన్ రికార్డు, చీమకుర్తి నాగేశ్వరరావు హరిశ్చంద్రుడిగా, ఈవిడ చంద్రమతిగా సి.డి.లు వెలువడినాయి. ఆకాశవాణిలో ఎన్నో పౌరిణిక నాటకాల్లో నటించిన ఈవిడ టి.వి. సీరియల్స్, సినిమాల్లోనూ నటించారు.

మూలాలు

మార్చు
  1. "జీవిత రంగ స్థలం నుండి నిష్క్రమించిన మహానటి - తంగిరాల చక్రవర్తి, ప్రజాశక్తి, 19 ఫిబ్రవరి 2012". Archived from the original on 2012-02-20. Retrieved 2013-07-21.
  2. అందమైన ముఖకవళికలు.. ఆహ్లాదకర భావాలు - ఆంధ్రభూమి 02/02/2012[permanent dead link]
  • సావిత్రి గూడూరు (అవేటి), కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 116.