రంజని తెలుగు సాహితీ సమితి
రంజని తెలుగు సాహితి సమితి తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న లాబాపేక్ష లేని సాహితీ సంస్థ. ఇధి 1961 లో ప్రారంభమైంది. హైదరాబాదులోని అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీసులోని ఉద్యోగులు మాత్రమే దీనిలో సభ్యులైనా సాహితీ సేవలో మాత్రం సాహితీమిత్రులందరినీ కలుపుకుంటుంది. ఈ సంస్థ పుస్తక / పత్రికా ప్రచురణ, సాహితీ కార్యక్రమాల నిర్వహణ, వచన కవితలు, పద్యకవితలు, కథల పోటీల నిర్వహణ, యువ సాహితీ వేత్తలకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను చేస్తుంది. 1961 సెప్టెంబరు 22న రచయితల సభ ఏర్పాటు చేసి “ రంజని ” ఆవిర్భావానికి నాంది పలికారు. ఆ రోజు ఇసుకపల్లి దక్షిణామూర్తి సమావేశకర్తగా పదకొండు మందిసభ్యుల సంఘం ఏర్పడింది.
రకం | సాహిత్యం |
---|---|
స్థాపించిన తేదీ | 1961 సెప్టెంబరు 22 |
ప్రధాన కార్యాలయం |
|
కేంద్రీకరణ | సాహిత్యం |
మిషన్ | దాతృత్వం |
పద్ధతులు | పురస్కారాలు |
ఆదర్శ వాక్యం | చుట్టూ ఆవరించిన చీకటిని నిందించకు ! దీపం చిన్నదైనా సరే వెలిగించు ! |
నేపథ్యం
మార్చు"మీ చుట్టూ ఉన్న చీకటిని శపించవద్దు, ఒక దీపం ఎంత చిన్నదైనా వెలిగించండి." ఈ సాంప్రదాయ సామెత ప్రకారం 1961 లో హైదరాబాద్‌లోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేస్తున్నకొంతమంది ఉద్యోగులకు ఈ ఆలోచన వచ్చింది. వారు తెలుగు సాహిత్య రంగం అభివృద్ధి ధ్యేయంగా కొన్ని వారాల వ్యవధిలో రచయితల సమావేశం ఏర్పాటు చేసారు. "రంజని" పేరిట కొత్త సాహిత్య సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 1961లో వెలిగించిన చిన్న దీపం ఇప్పుడు సాహితీ సౌరభాలను వెదజల్లుతూ ఉంది.
ఇది తన కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌లోని అకౌంటెంట్స్ జనరల్ కార్యాలయాల అధికారులను, ఉద్యోగులను అలరించడమే కాదు, తెలుగు గురించి భారతీయ తనిఖీ, లెక్కల శాఖ (ఐఏ & ఏడీ) అధికారులలో అవగాహన కల్పించింది. ఈ సంస్థ తన కార్యకలాపాల ద్వారా వేలాదిమంది కవులు, రచయితలు, సాహిత్య ప్రేమికులను మానసికంగా ప్రేరేపించింది; సమావేశాలు, చర్చలు ఏర్పాటు చేసి సాహిత్య పోకడల నాణ్యతను పెంచింది; కార్యాలయంలోని రచయితలు, కవుల ద్వారా వేదికను విస్తరించింది; చేపట్టిన కార్యకలాపాలన్నింటిలో నాణ్యతా ప్రమాణాలను అమలు చేసింది. పోటీలను నిర్వహించి అవార్డులను ప్రకటించి యోగ్యత కలిగినవారికి అవార్డులు అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించింది.[1]
పురస్కారాలు
మార్చుప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా దేశవ్యాప్త పోటీలు నిర్వహించి అవార్డులు ప్రకటిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి:
- రంజని - కుందుర్తి అవార్డు (కుందుర్తి ఆంజనేయులు పేరిట వచన కవితల పోటీలు - 1980 నుంచి)
- రంజని - విశ్వనాథ అవార్డు (విశ్వనాథ సత్యనారాయణ పద్య కవితల పోటీలు)
- రంజని - నందివాడ భీమారావు అవార్డు ( కథలు పోటీలు)
- రంజని - రాయప్రోలు రామకృష్ణయ్య అవార్డు (కథల పోటీలు)
ప్రచురణలు
మార్చుఎప్పటికప్పుడు ఉత్తమసాహిత్యాన్ని క్రోడీకరించి తరుచూ సంకలనాలు, గ్రంథాలు, పుస్తకాల రూపంలో విడుదల చేస్తూ ఉంటుంది. రంజని ప్రచురణల్లో ముఖ్యమైనవి:
- బహుమతి కథ -2 (2013 సంవత్సరంలో రంజని - నందివాడ భీమారావు, రంజని - రాయప్రోలు రామకృష్ణయ్య కథల పోటీల్లో బహమతి పొందిన కథల సంకలనం)
- స్వర్ణ రంజని (రంజనికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా 73 కథానికల సంకలనం)
- పాటల పూదోట వేటూరి (సినిమా కవి వేటూరి సుందర రామమూర్తి స్మృతి సంకలనం)
- బహుమతి కథ (2008-09 సంవత్సరాల్లో నందివాడ భీమారావు కథల పోటీల్లో బహమతి పొందిన కథల సంకలనం)
- కదిలే మబ్బులు - కదలని కొండలు (నందివాడ భీమారావు - శ్యామల ఆత్మకథ)
- వెండి వెలుగులు (రంజని కుందుర్తి అవార్డుకు పాతికేళ్లు నిండిన సందర్భంగా ప్రత్యేక వ్యాసాల సంకలనం, 2008 లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- సినిమా చూద్దాం రండి (75 సంవత్సరాల తెలుగు సినిమా ప్రభావం మీద 59 వ్యాసాల సంకలనం)
- ఒక నులి వెచ్చని స్పర్శ (2004-07 సంవత్సరాల్లో రంజని - కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- శేషేంద్ర శిఖరం (గుంటూరు శేషేంద్ర శర్మ పై వ్యాసాల సంకలనం)
- జానపద సాహిత్యం - మానవతా దృక్పథం
- స్పృహ (2001-03 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- నచ్చిన కథ (రంజని సభ్యుల కథల సంకలనం)
- మా ఊరు (స్వంత ఊరి మీద వివిధ కవులు రాసిన కవితల సంకలనం)
- కిరణం (1997-2000 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- నివాళి (వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు మీద వ్యాస సంకలనం)
- అమ్మ (స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా అమ్మ మీద వివిధ కవులు రాసిన 118 కవితల సంకలనం)
- ఆకాంక్ష (1994-96 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- గమనం (1991-93 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- మంచి కథ (41 కథల సంకలనం)
- ముప్పయ్ కవితలు (1989-90 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- విశ్వకవిత (అనువాద కవితల బృహత్ సంకలనం - 19 భారతీయ భాషలు, 40 ప్రపంచ భాషల్లోని కవితల అనువాదాలతో పాటు తెలుగు కవితల సంకలనం)
- తోరణం (నందివాడ భీమారావు రచనలు)
- రజత రంజని (వందేళ్ల తెలుగు సాహిత్యాన్ని సమగ్రంగా సమీక్షిస్తూ నలభై మంది రచయితలు రాసిన విశిష్ట వ్యాస సంకలనం - రంజని రజతోత్సవ కానుక)
- గొంతులు చిగిర్చాయి (1984-88 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
- రంజని - శ్రీశ్రీ ప్రత్యేక సంచిక (శ్రీశ్రీ పై సమగ్ర సంకలనం)
- కథాయజ్ఞం (కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథపై ప్రచురించిన వ్యాసాల సంకలనం)
- కథా రంజని (ప్రముఖలు కథల సంకలనం)
- చలం, కొడవటిగంటి కుటుంబరావులపై ప్రత్యేక సంచిక
- పానుగుంటి లక్ష్మీ నరసింహారావు పై వ్రత్యేక సంచిక
రంజని వేదిక మీద భారతీయ ప్రముఖులు
మార్చు50 ఏళ్లకు పైగా రంజని చరిత్రలో ఎందరో సాహితీ వేత్తలు, కవులు, విమర్శకులు, కథారచయితలు, ఉపన్యాసకులు, కులపతులు, సంగీత విశారదులు, జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు ఉన్నారు.
జ్ఞానపీఠ్ పొందిన మన విశ్వనాథ సత్యనారాయణ, ఆచార్య సి.నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజలు రంజని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా అప్పటి ఫస్ట్ లేడీ శ్రీమతి వి.వి.గిరి, సచ్చిదానంద రౌత్రాయ్ (ఒడియా), జయకాంతన్ (తమిళం), హరీంధ్రనాథ్ చటోపాధ్యయ (బెంగాలీ, ఆంగ్లం), హరిభజన్ సింగ్ (పంజాబీ), దేవవ్రత్ దాస్ (అసోమీ) రంజని వేదికనుంచి ప్రసంగించారు.
ఇక తెలుగువారిలో రంజని వేదిక మీద ఆసీనులు కాని ప్రముఖ సాహితీవేత్తలు ఎవరూలేరు. నాటి చెళ్లపిళ్ల వారి నుంచి నేటి భారవి వరకు.....
ప్రముఖ రంజని సభ్యులు
మార్చుతెలుగు సాహిత్య వైభవానికి, వికాసానికి తోడ్పడుతున్న ఎంతో మంది పెద్దలు రంజని సభ్యులే.
పరుచూరి వెంకటేశ్వరరావు, మల్లాది వెంకట కృష్ణమూర్తి, శంకరమంచి పార్థసారథి, సహవాసి (జె.ఉమామహేశ్వరరావు), ఆశారాజు, ఎమ్మెస్సార్ మూర్తి, పమ్మి వీరభద్రరావు, డి.ప్రభాకర్, వారాల కృష్ణమూర్తి, పాలకోడేటి సత్యనారాయణరావు, ఇసుకపల్లి దక్షిణామూర్తి, కె.కె.మీనన్, తుంగతుర్తి విశ్వనాథం, బి.కె.ఎల్.ఎన్. ఆచార్య, నంధివాడ భీమారావు, మహంకాళి వెంకటరావు, కాళహస్తి రామకృష్ణ, గిడుగు రాజేశ్వరరావు, గుమ్మా ప్రసన్నకుమార్, సింగరాజు నాగలక్ష్మి, చీకోలు సుందరయ్య, జాస్తి రమాదేవి, నడిమింటి జగ్గారావు, నందిరాజు పద్మలతా జయరాం.............
రంజని ఇతర కార్యక్రమాలు
మార్చుఏటేటా పుస్తకాల ఆవిష్కరణ, సాహిత్య సభలు, సమావేశాలతో పాటు రంజని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారులకు, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్డుమెంట్ ఉద్యోగులకు తెలుగు బోధిస్తుంది. సభ్యుల పుస్తకాల ప్రచురణకోసం ఆర్థిక సాయం చేయడం, వారి పుస్తకాలను రంజని తరఫున ప్రచురిస్తుంది.
రంజని మిత్ర సంస్థలు
మార్చుతెలంగాణ రాష్ట్ర భాష-సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, తెలుగు సాహిత్య అకాడమీ, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ పత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఉదయం, నవ్య, నేటినిజం పత్రికలు.
మూలాలు
మార్చు- ↑ "RANJANI Telugu Sahithi Samithi - PDF Free Download". docplayer.net. Retrieved 2020-09-09.
వనరులు
మార్చు- బహుమతి కథ - 2 గ్రంథంలో రంజని పుట్టుపూర్వోత్తరాలు