ఉత్తరాయణం (మలయాళ సినిమా)

ఉత్తరాయణం 1974లో గణేష్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన మలయాళ చలనచిత్రం. ఈ సినిమాకు జి.అరవిందన్ దర్శకత్వం వహించాడు.

ఉత్తరాయణం
దర్శకత్వంజి.అరవిందన్
కథతికోడియాన్,
అరవిందన్
నిర్మాతపట్టతువిల్ల కరుణాకరన్
తారాగణంమోహన్ దాస్,
కున్హాండి,
బాలన్ కె.నాయర్,
అడూర్ బాసి,
నెల్లికుడి భాస్కరన్,
రవి,
సుకుమారన్,
నిలాంబూర్ బాలన్,
మల్ల్లిక,
రాధామణి
ఛాయాగ్రహణంరవివర్మ
సంగీతంఎం.బి.శ్రీనివాసన్
విడుదల తేదీ
1974 (1974)
దేశంభారతదేశం
భాషమలయాళం

నటీనటులు

మార్చు
  • డా.మోహన్‌దాస్ - రవి
  • కున్హాండి - కుమరన్ మాస్టారు
  • బాలన్ కె. నాయర్
  • అడూర్ బాసి
  • నెల్లికుడి భాస్కరన్
  • రవి
  • సుకుమారన్
  • నిలాంబుర్ బాలన్
  • మల్లికా సుకుమారన్
  • రాధామణి

సాంకేతికవర్గం

మార్చు
  • కథ: తికోడియాన్
  • చిత్రానువాదం: తికోడియాన్, జి.అరవిందన్
  • ఛాయాగ్రహణం: రవివర్మ
  • సంగీతం: ఎం.బి.శ్రీనివాసన్
  • కళ: నంబూద్రి
  • దర్శకత్వం: జి.అరవిందన్
  • నిర్మాత: పట్టతువిల్ల కరుణాకరన్

సినిమా కథ

మార్చు

అనగనగా చాలామంది యువకుల జీవితాలలో ఆ రోజు 'ఉద్యోగ పర్వ' దినం. ఆ రోజు ఇంటర్యూ తమను ఉద్దరిస్తుందనే నమ్మకంతో కొందరూ, 'ఏ ఇంటర్యూ చరిత్ర చూసినా పక్షపాత పరాయణత్వం' అనే నిరాశతో కొందరూ అక్కడ గుమిగూడారు. అయితే అనివార్య కారణాల వల్ల ఇంటర్యూ ప్రహసనం జరగలేదు. అందులో పాల్గొనడానికి వచ్చినవాళ్ళు ఏమి చెయ్యాలో పాలుపోక నిరాశతో, నిస్పృహతో, కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయారు.

రవి ఆ చాలామంది యువకులలో ఒకడు. తననూ, తాను ఉద్యోగం సంపాయించగలడనే నమ్మకాన్నీ నమ్ముకుని బతుకుతున్న తల్లికీ, అవ్వకూ ఏం చెప్పాలో తేల్చుకోకుండానే అతను సొంత ఊరు చేరుకున్నాడు.

ఆ ఊళ్ళో అతనిలాంటి యువకులకు ఒక మార్గదర్శి ఉన్నాడు. ఆయన - కుమరన్ మాస్టారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, విప్లవ వీరుడిగా దేశం కోసం పాటుపడిన ఆ ముసలాయన యువకులను చేరదీసి వాళ్ళకు ఉత్సాహం కలిగించి, దేశం బాగుపడాలంటే ఏం చెయ్యాలో తెలియజెప్పేవాడు. రవి తండ్రి గోవిందన్ కూడా ఆయనతో కలిసి విప్లవ కార్యక్రమంలో పాల్గొన్నవాడే.

పట్నం నుంచి వచ్చిన రవి కుమరన్ మాస్టారు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆప్తుడు అచ్చు చావు బతుకులలో ఉన్నాడు. రవి, మాస్టారు వెళ్ళి అచ్చును చూసి వచ్చారు. మాస్టారు రవికి తాను, రవి తండ్రి గోవిందన్, అచ్చు యువకులుగా ఉన్నప్పుడు సాగించిన పోరాటాల గురించి చెప్పాడు. అప్పట్లో తమతోబాటు విప్లవవాదిగా ఉన్న గోపాలన్ తమ అందరినీమోసం చేసిన తీరు కూడా చెప్పాడు. అయితే ఆ గోపాలన్ క్రమంగా డబ్బు, పలుకుబడి సంపాయించి పెద్ద కాంట్రాక్టరు, వర్తక ప్రముఖుడు అయ్యాడనీ, స్వార్థం చూసుకోక దేశం కోసం పనిచేసిన అచ్చు వంటి వాళ్ళు మాత్రం ఏ ఆదరణా లేకుండా అలా కాలంతోబాటు కరిగిపోతున్నారనీ మాస్టారు రవికి చెప్పాడు.

అయితే గోపాలన్ అనుకుంటే రవికి ఉద్యోగం ఇవ్వగలడనే నమ్మకంతో మాస్టారు గోపాలన్‌కు ఒక ఉత్తరం వ్రాసి, అది రవికి ఇచ్చి పట్నం వెళ్ళమన్నాడు. రవికి ఏ మాత్రమూ ఇష్టం లేకున్నా చేసేదిలేక పట్నం బయలుదేరాడు.

పట్నం చేరుకున్న రవి ఒక పెద్ద హోటల్ గదిలో గోపాలన్‌ను కలుసుకున్నాడు. చూసీ చూడగానే గోపాలన్ కపట ప్రవర్తనను, దుర్మార్గాన్ని అర్థం చేసుకున్నాడు. అసహ్యంతో ఆ గది నుంచి బయట పడ్డాడు. హోటలు బయట అతని కాలేజీ స్నేహితుడు ప్రేమన్ కనిపించాడు. చదువుకునే రోజుల్లో రవి కాలేజీలో విద్యార్థి నాయకుడుగా ఉండేవాడు. ఆ అభిమానంతో ప్రేమన్ రవిని తన గదికి తీసుకుపోయాడు. మాటల మధ్య తమ కాలేజీ మిత్రుడు డేవిడ్ పెద్ద కార్మిక నాయకుడయ్యాడని తెలుసుకున్నాడు రవి.

ప్రేమన్, తాను ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపించినా, ఆ తెచ్చుకోలు సంతోషం ముసుగు వెనక నోరు విప్పి చెప్పుకోలేని దుఃఖం దాగి ఉందని రవి గ్రహించాడు.

మళ్ళీ ఊరు చేరుకున్న రవికి అచ్చు మరణవార్త తెలిసింది. కుమరన్ మాస్టారు శోకంతో కుమిలి పోతున్నాడు. రవికి బతుకు దుర్భరమనిపించింది. అతను ఇష్టం వచ్చినట్టు తిరిగాడు; ఆ విపరీత స్థితిలో తనకు ఆప్తురాలైన రాధ అనునయించినా అదేమీ పట్టనట్టు వెళ్ళిపోయాడు. తనలో తాను నిశ్శబ్దంగా కుమిలిపోతూ గడపసాగాడు అతను.

అలా కొన్నాళ్ళు గడిచాక, మరోసారి అతను పట్నం వెళ్ళాడు. ప్రేమన్ అతణ్ణి తనతోబాటు వచ్చి ఉండమని ఆహ్వానించాడు. పట్నంలో అతను డేవిడ్ కార్మికుల పేరు చెప్పి ఎలా సొంతలభం చూసుకుంటున్నాడో అర్థం చేసుకున్నాడు. విప్లవం పేరు చెప్పుకుని పొట్టపోసుకునే కుహనా విప్లవ వాది ప్రతాపన్ మాస్టారును కూడా అతను చూశాడు.

ఇవన్నీ చూసి ఆపుకోలేని కోపంతో, అణచుకోలేని శోకంతో రవి - సత్యాన్వేషణ చెయ్యడానికి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తన జీవితాశయం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించాడు రవి.

ఆ నిర్ణయంతోనే అతను తన తల్లిదగ్గరా, అవ్వదగ్గరా సెలవు తీసుకుని బయలుదేరాడు.

రవి తల్లి అతనికి తన భర్త విప్లవయోధుడిగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగి, చివరకు కన్నబిడ్డను చూడ్డానికి చీకటి చాటున వచ్చి పోలీసులచేత మరణించిన కథ గుర్తుచేసింది.

కాని రవి మనసు మార్చుకోలేదు. అతను అలాగే కుమరన్ మాస్టారు దగ్గర సెలవు తీసుకుంటున్నారు. సాయుధ విప్లవం లేవదియ్యాలనే ఊహతో వచ్చిన ఆ యువకులు మాస్టారును ఆశీర్వదించమని కోరారు. వాళ్ళు వెళ్ళాక, రవి మాస్టారుకు వీడ్కోలు చెప్పి బయలుదేరాడు.

దారిలో అతనికి రాధ కనిపించి తన పరీక్షలు ముగిసాయని చెప్పింది. రవి ఒక్క క్షణం ఆగి తాను ఎక్కడీకి ఎందుకు పోతున్నాడో ఆమెకు చెప్పలేకుండా 'అవును. పరీక్షలు ముగిశాయి' అని కదలి వెళ్ళిపోయాడు.

పట్నం పొలిమేరలు దాటి రవి కొండలలో కాలు మోపాడు. ఆ అడవిలో ఒక యూరోపియన్ స్వామీజీ రవితో ఆత్మ గురించీ, దాని బంధాల గురించీ ముచ్చటించాడు. రవి అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు.

అతనికి ఒక ముసలమ్మ చితుకులు ఒకచోట పేర్చి నిప్పు చేసి చలికాచుకుంటూ కనిపించింది. ఆమెకు నాగరికత అంటే ఏమిటో తెలియదు. కాని ఆ వయసులో కూడా సడలిపోని ఆత్మ విశ్వాసం ఉంది. రవి కూడా ఆమెతోబాటు చలి కాచుకున్నాడు. ఉన్నట్టుండి అతనికి తన సమస్యలన్నీ తీరిపోయాయనిపించింది. అతను చిరునవ్వు నవ్వి తనకు కుమరన్ మాస్టరు ఇచ్చిన ముసుగును అగ్నికి ఆహుతి చేశాడు. అక్కడ ముసుగులూ, తెరలూ అవసరం కావు. ప్రతి విషయమూ స్పష్టమైనదే; పరిశుభ్రమైనదే; అక్కడ ఆచ్చాదనల ప్రమేయం కూడా లేదు. అక్కడ ప్రకృతీ, మానవత కలిసి ఒకే తీరుగా ప్రకాశించాయి.

రవి (సూర్యుడు) నవ్వాడు.

ఉత్తరాయణం ప్రారంభమైంది.[1]

పురస్కారాలు

మార్చు

ఈ సినిమా పలు పురస్కారాలను పొందింది. వాటిలో కొన్ని :

కేరళ రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలు
  • ఉత్తమ చిత్రం (పూర్తిగా కేరళలో నిర్మించబడిన చిత్రం)
  • ఉత్తమ దర్శకుడు - జి. అరవిందన్
  • ఉత్తమ స్క్రీన్ ప్లే - తికోడియాన్, జి.అరవిందన్
  • ఉత్తమ ఫోటోగ్రఫీ (బ్లాక్ అండ్ వైట్) - ఎం.రవివర్మ
  • ద్వితీయ ఉత్తమ నటుడు - బాలన్ కె.నాయర్
  • ఉత్తమ కళాదర్శకుడు - నంబూద్రి
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (1 November 1975). "ఉత్తరాయణం". విజయచిత్ర. 10 (5): 40–41.

బయటి లింకులు

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు