దండుమల్కాపూర్ హరిత పారిశ్రామిక పార్కు
దండుమల్కాపూర్ హరిత పారిశ్రామిక పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మునుగోడు సమీపంలోని దండుమల్కాపూర్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన హరిత పారిశ్రామిక పార్కు.[1] ఆసియాలోనే అతిపెద్ద ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక పార్కుగా గుర్తింపు పొందిన ఈ పార్కు 2019 నవంబరు 1న ప్రారంభించబడింది.[2] కాలుష్యం లేకుండా 542 ఎకరాల్లో సకల సౌకర్యాలతో ఈ హరిత పారిశ్రామిక పార్కు ఏర్పాటుచేయబడింది. 2022 నాటికి ఈ పార్కులో దాదాపు 50 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించబడగా, ఇక్కడి పరిశ్రమల్లో సుమారు 3 వేలమంది ఉపాధి పొందుతున్నారు.[3]
దండుమల్కాపూర్ హరిత పారిశ్రామిక పార్కు | |
---|---|
రకం | పారిశ్రామిక పార్కు |
స్థానం | దండుమల్కాపూర్, మునుగోడు, నల్గొండ జిల్లా, తెలంగాణ |
విస్తీర్ణం | 542 ఎకరాలు |
Opened | 2019 నవంబరు 1 |
నిర్వహిస్తుంది | తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, తెలంగాణ ప్రభుత్వం |
ఏర్పాటు
మార్చుహైదరాబాద్ నగరానికే పరిమితమైన పారిశ్రామిక ప్రగతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకి విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయబడ్డాయి. అందులో భాగంగా దండుమల్కాపూర్‌లో ఒక హరిత పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయబడింది. ఇక్కడ పూర్తిస్థాయిలో కంపెనీలు ఏర్పాటైతే అతిపెద్ద పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ హైవే పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పార్కు వరకు గుట్టలను తొలిచి విశాలమైన రోడ్డు నిర్మించారు.
542 ఎకరాల పార్కులో దాదాపు 589 పరిశ్రమలు ఏర్పాటు చేయబడుతున్నాయి. 1,985 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 35 వేల మందికి ఉపాధి కల్పించబడనుంది. విద్యుత్తు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 236 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా 50 వేల మొక్కల పెంపకం కూడా జరుగుతోంది.[4]
ప్రారంభం
మార్చు2019 నవంబరు 1న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ పార్కును ప్రారంభించి, పార్కుకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించాడు. అనంతరం పరిశ్రమల అవసరాల కోసం ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మల్యే సునీతా మహేందర్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారలు పాల్గొన్నారు.[5]
2023 జూన్ 6న మరో 51 పరిశ్రమలను మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.
ఉత్పత్తి
మార్చుఇక్కడ గనులు తవ్వే యంత్రాలు-వాటి పరికరాలు, బ్రిక్స్-టైల్స్ వంటి నిర్మాణ సామగ్రి, డ్రిల్లింగ్‌కు సంబంధించిన పరికరాలు, ప్యాకేజింగ్‌కు సంబంధించిన ముడి పదార్థాలు, యంత్రాలు, మౌల్డింగ్ ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరిశ్రమలు, సోలార్, బయో ఫెర్టిలైజర్స్, నిర్మాణ సామగ్రి, ప్రింటింగ్, యంత్రాలు, సోడా మిషన్ మేకింగ్, చాక్లెట్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, కుర్‌కురే తదితర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్లాస్టిక్ వస్తువులు, మిల్క్ క్యాన్లు, కేబుల్స్, ఆటోమేటిక్ రైస్ గ్రేడింగ్, ప్లాస్టిక్ ప్యాకింగ్ మెటీరియల్ వంటివి ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఇక్కడి ఉత్పత్తులు అమెరికా, ఆఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, గల్ఫ్, న్యూజీలాండ్ మొదలైన దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.[6]
ఉపాధి
మార్చుఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు వల్ల దండుమల్కాపూర్, తూప్రాన్‌పేట, బాటసింగారం, దండుమైలారం, కొయ్యలగూడెం, చౌటుప్పల్, పీపలపాడు, సంస్థాన్ నారాయణపురం, లకారం వంటి గ్రామాలలోని స్థానికంగా ఉన్న వారితోపాటు ఇతర జిల్లాల ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
టౌన్‌షిప్
మార్చుదేశంలోనే తొలిసారి అమలుపరిచే ‘వాక్ టు వర్క్’ విధానంలో ఇక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు 194 ఎకరాల్లో సమీకృత నివాస సముదాయం (ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్)తోపాటు వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు.
ఇతర వివరాలు
మార్చురాబోవుకాలంలో 1,863 ఎకరాలలో ఈ పార్కును విస్తరించనున్నారు.అందుకోసం మరో 231 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, మరో 106 ఎకరాల్లో బొమ్మల తయారీ పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. మిగతా పరిశ్రమలన్నీ అందుబాటులోకి వస్తే మొత్తంగా 1.32 లక్షల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.[7]
మూలాలు
మార్చు- ↑ "KTR to inaugurate MSME Park on November 1". The New Indian Express. 2019-10-29. Archived from the original on 2019-10-30. Retrieved 2023-08-02.
- ↑ "KTR inaugurates TIF-MSME Green Industrial Park". BusinessLine (in ఇంగ్లీష్). 2019-11-01. Archived from the original on 2019-11-02. Retrieved 2023-08-02.
- ↑ "కాలుష్య పరిశ్రమలకు పుల్‌స్టాప్.. దండు మల్కాపూర్‌లో ఆసియాలోనే అతిపెద్ద హరిత పారిశ్రామిక పార్కు". magazine.telangana.gov.in. 2022-11-01. Archived from the original on 2023-08-02. Retrieved 2023-08-02.
- ↑ telugu, NT News (2022-10-21). "మునుగోడుకు మహర్దశ.. దండు మల్కాపూర్‌లో హరిత పారిశ్రామిక పార్కు". www.ntnews.com. Archived from the original on 2022-10-21. Retrieved 2023-08-02.
- ↑ Talari, Yadedya (2019-11-01). "Other states are ready to implement our policies, says KTR". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-16. Retrieved 2023-08-02.
- ↑ telugu, NT News (2023-06-05). "Minister KTR | ఉన్న ఊళ్లోనే ఉద్యోగం.. 35వేల మందికి కొలువు.. రేపు దండు మల్కాపూర్‌లో 51 పరిశ్రమలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-06. Retrieved 2023-08-02.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2023-06-05 suggested (help) - ↑ "Spl Story: దండుమల్కాపూర్ లో ఇండస్ట్రియల్ కారిడార్.. ఉపాధికి డోకా లేదంటున్న మునుగోడు ప్రజలు". Prabha News. 2022-10-21. Archived from the original on 2022-10-21. Retrieved 2023-08-02.