డి.వి.నరసరాజు

(దత్త వెంకట నరసరాజు నుండి దారిమార్పు చెందింది)

డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 - ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.

దాట్ల వెంకట నరసరాజు
డి.వి.నరసరాజు
జననందాట్ల వెంకట నరసరాజు
జూలై 15, 1920
ముత్యాలంపాడు
మరణంఆగష్టు 28, 2006
హైదరాబాదు
ఇతర పేర్లుడి.వి.నరసరాజు
ప్రసిద్ధిహేతువాది , తెలుగు సినిమా రచయితలు
మతంహిందూ
పిల్లలుఒక కూతురు

1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు.[1] ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.

నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.[2] ఈ ఇల్లు అమ్మబడును, వాపసు నాటకం రాశాడు.[3]

నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లోపాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.[4] గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.

2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.[5] ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య శిరీష నరసరాజు మనవరాలే.

సినిమా దర్శకుడిగా

మార్చు

సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు ఉషాకిరణ్ మూవీస్ వారి 'కారు దిద్దిన కాపురం' డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ఎవరు దర్శకుడు? అని. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత 'అబ్బే' అన్నారట. తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు అక్కడికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి ఉన్నారు. రావి కొండలరావు వెళ్లి అడిగారు షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను అన్నారాయన. హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు. అప్పుడే, పైన చెప్పిన విషయం చెప్పారు.

సినిమాలు

మార్చు
కథ లేదా మాటల రచయితగా
  1. మనసు మమత (1990)
  2. కారు దిద్దిన కాపురం (1986) దర్శకుడు కూడాను
  3. వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
  4. యుగంధర్ (1979)
  5. యమగోల (1975)
  6. అమ్మ మనసు (1974)
  7. ఇద్దరు అమ్మాయిలు (1972)
  8. మూగనోము (1969)
  9. బాంధవ్యాలు (1968)
  10. భక్తప్రహ్లాద (1967)
  11. చదరంగం (1967)
  12. గృహలక్ష్మి (1967)
  13. రామ్ ఔర్ శ్యామ్ (1967) కథ, స్క్రీన్ ప్లే
  14. రంగుల రాట్నం (1966)
  15. నాదీ ఆడజన్మే (1965)
  16. రాముడు భీముడు (1964)
  17. గుండమ్మ కథ (1962)
  18. మన్ మౌజీ (1962)
  19. మోహినీ రుక్మాంగద (1962)
  20. రేణుకాదేవి మహాత్మ్యం (1960)
  21. రాజమకుటం (1959)
  22. దొంగరాముడు (1955)
  23. పెద్దమనుషులు (1954)

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Film writer D.V. Narasa Raju dead - The Hindu Aug 29, 2006". Archived from the original on 2008-11-18. Retrieved 2013-07-15.
  2. రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013
  3. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  4. "Natakam at Andhra Natakam". Archived from the original on 2010-04-19. Retrieved 2013-07-15.
  5. "Writer D.V.Narasa Raju is no more". Archived from the original on 2009-08-08. Retrieved 2013-07-15.